మేనమామ

0
3

[శ్రీ కళాధర్ రచించిన ‘మేనమామ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]దివారం వస్తుందంటే చాలు శనివారం సాయంత్రానికే నా మేనమామ సైకిల్‍తో తయారుగా ఉంటాడు. మా ఊరికి కొద్ది పాటి దూరమే. మూడు మైళ్ళు ఉంటుంది. తనతో తీసుకువెళ్తాడు. అక్కడ నేను ఆడిందే ఆట, పాడిందే పాట. అక్కడ నాకు స్నేహితులున్నారు. నా మేనమామ ఇల్లు పెంకుటిల్లే కాని పల్లెటూరయ్యేసరికి ఇంటి చుట్టూ కావలసినంత స్థలం. ఇల్లు అంత చిన్నదేం కాదు. మా అమ్మ కూడా ఆ ఊళ్ళోనే పుట్టి పెరిగింది. ఇక ఆదివారం మొత్తం పొలం వెంట, తోటల వెంట, గడ్డివాముల్లో, ఇసుక దిబ్బల్లో ఆడుతూ ఉండేదాన్ని. మా మామయ్య ఆ రోజు కోడి కోసి కూర వండించి తయారుగా ఉంచి నా కోసం ఊరంతా నేనెక్కడున్నానో వెతుకుతూ ఉంటాడు. ఇది నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. మాట వరసకి ఒక్క మాటనడే. అత్త కూడా చాలా మంచిది. ఆడపిల్ల పనులన్నీ నేర్చుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, పెద్దదానివి అవుతున్నావు అని చెబుతూ ఉండేది.

మామయ్యకు ఇంకా పిల్లలు పుట్టలేదు. వాళ్ళూ పిల్లల కోసం చాలా దావఖానాలు తిరిగారు. కాని ఇప్పటి వరకు సంతానం కలుగలేదు. వాళ్ళకి పిల్లలంటే మహా ఇష్టం, కానీ ఆ దేవుడు ఒంటికన్నుతో చూస్తున్నాడు. మా అమ్మ “ఒరేయ్ తమ్మూడూ! మీ వల్లే రా దానికి పొగరెక్కువవుతోంది. ఏమన్నా అంటే చాలు, నేను మామయ్య దగ్గరుండి చదువుకుంటాను అంటుందే కాని, చెప్పిన పని మాత్రం చేయదు. కాస్త మీ ఆవిడకైనా చెప్పి, కొంచం భయం చెప్పియ్యరా” అంటూ ఉండేది. కానీ మామయ్య “పోనీలే అక్కా, చిన్న పిల్ల. నాలుగు రోజులైతే దానికే తెలిసొస్తుంది” అనేవాడు కానీ, నన్ను ఒక్క మాట కూడా అనేవాడు కాదు. మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు. మా అమ్మ కూలీ పనులు అవీ చేస్తుంది. ఇంటి దగ్గర నుంచి మా అమ్మకొచ్చిన పొలం మామయ్య చేసి వడ్లు పట్టించి సరిపడా బియ్యం వేస్తూ ఉంటాడు. కాలం అయినా కాకపోయినా, ధాన్యం మాత్రం తప్పకుండా పంపిస్తాడు. మా అమ్మతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు – “ఎందుకక్కా, ఇన్ని బాధలు? నీవు మన ఊరొచ్చి మన ఇంట్లోనే ఉండొచ్చు కదా, నీకంతగా తిని కూర్చొని తినడం ఇష్టం లేకపోతే అక్కడే ఏవో పొలం పనులు చేసుకోవచ్చు కదా?” అని. దానికి మా అమ్మ – “ఇది మా అత్తగారి ఊరు. ఇది మా ఆయనతో కలిసి ఉన్న ఇల్లు. దీన్ని వదిలి రాలేనురా. అయినా దూరం ఉంటేనే రక్త సంబంధం గట్టిగా ఉంటుంది, ప్రేమలు పెరుగుతాయి. దగ్గరైతే ఇప్పుడున్నట్లుగా ఉండదు కదరా” అంటూ ఉండేది. మామయ్య ఇంటికి ఎప్పుడో పండక్కో పబ్బానికో వచ్చేదే కాని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు అమ్మ. మామయ్య నన్ను మహారాణిలా చూసుకునేవాడు. నేను ఏదైనా అడిగితే దాన్ని ఎలా అయినా తీసుకొచ్చి పెట్టేవాడు.

అలా కాలాలు తెలియని రోజులతో గడిచిపోతూ ఉండగా, ఒక పండక్కి మా అమ్మా నేను మా మేనమామ ఊరెళ్ళాం. మా అత్త తరఫు వాళ్ళు కూడా కొందరు పండక్కి వచ్చారు. అందరు భోజనాలు ముగించుకుని ముచ్చట్లు పెడుతూ ఉన్నారు.

చుట్టాల్లో ఒకావిడ మా అత్తతో “ఏంటే, ఉన్నదంతా మేనకోడలికే పెడుతున్నారా, కాస్త ఏమైనా వెనకేసుకుంటున్నారా?” అని అందట. అందుకు మా అత్త “దానికి పెడితే ఏంటి, మా అమ్మాయే కదా” అందట. అది విన్న మా అమ్మ అపార్థం చేసుకొని వాళ్ళ తమ్ముడితో, నీ భార్య నలుగురిలో ఇలా అందిరా అని చెప్పింది. మామయ్య, “తప్పేముదే అక్కా దాంట్లో” అన్నాడు. “అంటే మీ సొమ్ము మొత్తం నా బిడ్డకే పెడుతున్నారా? మీ డబ్బంతా మాకే ధారపోశారా” అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడి పెద్ద గొడవ చేయడమే కాకుండా, “మళ్ళీ నీ మొహం చూడను, నీ గడప తొక్కను” అని శపథం చేసి వచ్చింది. ఒక చిన్న మాట వల్ల ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఇప్పుడు మా మామయ్యకూ మాకూ మాటల్లేవు. వాళ్ళు కొద్ది రోజులు పంతానికి పోయారు. కానీ నాపై ఉన్న ప్రేమతో కాస్త తగ్గి మామయ్య మా ఇంటి వైపుకు వచ్చినా మా అమ్మ అసహ్యించుకుంటూ ఉండేది. మామయ్య నాతో మాట్లాడడం కొరకు నా బడి దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి నాకేవైనా కొనిపెట్టి వెళ్ళేవాడు.

ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిన రోజులను చాలా చూశాను. ఒక రోజు మా అత్తయ్య నన్ను చూడాలనుకుంది. నన్ను తీసుకెళ్ళటానికి ఒక శనివారం సాయంత్రం బడి దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బడి ముగిసాకా, అత్త చూడాలంటోంది అని చెప్పి తనతో పాటు నన్ను తీసుకువెళతానని చెప్పి నాతోటి స్నేహితురాలితో కబురు పంపించాడు మా అమ్మకి.

ఆ రోజు మా మామయ్య ఇంటికి వెళుతూ ఉంటే – ఎన్నో సార్లు వెళ్ళా మామయ్య ఇంటికి- కానీ ఈ సారి వెళ్తుంటే మాత్రం చాలా దూరంగా ఉందనిపించింది. మామయ్య మొహంలో, కంఠంలో అప్పటి ఆనందం లేదు. ఏదో పోగొట్టుకున్నవాడిలా ఉన్నాడు. అలా ఇల్లు చేరగానే మా అత్త నా కోసం ఎదురు చూస్తూ ఉంది. నేను వెళ్ళగానే గట్టిగా హత్తుకుని ముద్దాడుతూ ఉంది. ఇంట్లోకి ఇలా తీసుకువెళుతోందో లేదో – మా అమ్మ అప్పుడే నన్ను తీసుకురమ్మని చెప్పి ఒక వ్యక్తిని పంపించింది. ఇంట్లోకి వెళ్ళకుండానే, భయంతో, “మళ్ళీ వస్తా మామయ్యా” అని చెప్పి వచ్చిన వ్యక్తితో ఇంటికొచ్చేసా. ఇంట్లో మా అమ్మ చాలా కోపంగా ఉంది. ఆ రోజు నన్ను చితకబాదింది.  చాలా సేపు ఏడుస్తూ ఉన్నాను. కానీ అక్కడ మామయ్య, అత్తయ్య ఎంతగా బాధపడుతున్నారో. వాళ్ళకి అమ్మ నన్ను ఏమంటుందో అన్న భయమే ఉంటుంది.

అలా మామయ్యకు మాకు మధ్య రోజులు వారాలుగా, వారాలు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా మారిపోయాయి. నేను పెద్దదాన్నైపోయాను. మామయ్య ఎప్పుడో ఒకసారి వచ్చి చాటుగా నన్ను కలిసి మాట్లాడి వెళుతూ ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే మా అమ్మ నా పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంది. దాని కోసం పెళ్ళి సంబంధాలు వెతకడం ప్రారంభించింది. చాలా మంది చెప్పారు, “ఎందుకమ్మా, మీ తమ్ముడున్నాడు కదా, అతని ఈ బాధ్యత అప్పగిస్తే చాలా మంచి సంబంధం చూసి చేస్తాడు” అని. అలా ఎందరన్నా కూడా పంతానికి పోయి ఎవరి మాటా వినేది కాదు. ఈ విషయం మామయ్యకి తెలిసి మా అమ్మకి తెలియకుండా కొన్ని సంబంధాలు మా ఇంటికి పంపించాడు. అవి మా మామయ్య ద్వారా వచ్చాయని తెలిసి ఒక్క సంబంధం కూడా ఖాయం చేయకుండా పంపించింది. ఒక రోజు ఒక మధ్యవర్తి ద్వారా ఒక సంబంధం వచ్చింది.

“అబ్బాయి మంచివాడు, చూడ్డానికి బాగా ఉంటాడు, పెద్దగా చదువుకోకున్నా అమ్మాయిని బాగా చూసుకుంటాడు, కార్పెంటర్  పని చేస్తాడు. మీకు తగ్గ సంబంధం. పెద్ద సంబంధాల వైపు చూస్తే లక్షలకు లక్షలు ధారపోయాలి. అంత స్తోమత మీకు లేదు. ఈ సంబంధమైతే మీకు సరిపోతుంది” అని మధ్యవర్తి చెప్పాడు. అమ్మ కూడా “సరే, అబ్బాయిని చూసొద్దాం మొదలు” అంది. ఈ విషయం ఒక రోజు మామయ్యకు కబురు పంపా. మామయ్య అమ్మకి తెలియకుండా అబ్బాయి గురించి తెలుసుకున్నాడు. అబ్బాయి తాగుబోతు, ఇంట్లో వాళ్ళు అంత మంచివాళ్లు కాదంట. ఇల్లు ఉందట. పని చేస్తేనే గాని గడవని ఇల్లు. చేసిన పనిలో సగం తాగుడికే సరిపోతుందట అబ్బాయికి. అబ్బాయి వాళ్ళు  చెల్లి పెళ్ళి చేసేసారంట – ఈ విషయం నాతో చెప్పాడు మా మామయ్య. అదే విషయాన్ని అమ్మకి చెప్పాను. “నేను అబ్బాయిని చూసొచ్చుకుని  నీ సంగతి, నీకీ విషయం చెప్పిన వాడి సంగతి చెపుతా” అంది.

అమ్మ మధ్యవర్తి అబ్బాయిని చూడడానికి వాళ్ళూరు వెళ్ళారు. మా అమ్మకు చెప్పేవాళ్ళూ, చేసేవాళ్ళూ లేరు. అక్కడ మధ్యవర్తి మాయలో పడి వాళ్ళ పై పై మెరుగులకి, వాళ్ళ మర్యాదలకి సంబరపడిపోయి – నేను అబ్బాయిని చూడకుండానే సంబంధం ఇష్టమని చెప్పేసింది. తరువాత వాళ్ళు రావడం, నన్ను చూసి వెళ్ళడం, మిగతా కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. నాకీ సంబంధం ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా మామయ్య ఈ సమస్య నుంచి ఎలాగైనా నన్ను గట్టెకిస్తాడన్న నమ్మకం నాకుంది. ఒకరోజు మామయ్యకు అన్ని విషయాలు చెప్పా. సరేనని అమ్మ మాట్లాడకున్నా, మా ఇంటికి వచ్చి – మా అమ్మ ముందు అబ్బాయి గురించి మొత్తం చెప్పేశాడు. “నువ్వు పంతానికి పోయి, కట్నకానుకలకు భయపడి ఈ సంబంధం చేస్తే దాని జీవితం నాశననవుతుంది” అని గట్టిగా వాదించాడు. అయినా మా అమ్మ పంతం వీడలేదు. నేను అమ్మతో చెప్పా – “నాకీ పెళ్ళి ఇష్టం లేదు, నేను చేసుకోను” అని. కానీ నేను ఆ పెళ్ళి చేసుకోకపోతే చస్తానని బెదిరించింది. అంతే కాకుండా మామయ్యను అత్తయ్యను నానా మాటలు తిట్టింది. మామయ్య వల్లే నేను ఇలా తయారయ్యాననీ, వాళ్ళ మాటలు వినే నేను ఇలా మాట్లాడుతున్నాననీ తిట్టసాగింది. మామయ్య అమ్మ కాళ్ళు కూడా పట్టుకున్నాడు, కానీ తన మనసు కరుగలేదు. చకచకా పెళ్ళి పనులు పూర్తవుతున్నాయి. మామయ్య ఇంటి దగ్గర తనకు రావల్సిన పొలం అమ్మేసింది అమ్మ.

ఇక్కడ ఇల్లు తనఖా పెట్టి ఒప్పుకున్న కట్నకానుకలు తయారు చేసింది. పెళ్ళి పత్రికలు ముద్రించడం అయిపోయింది. తొలి పత్రిక మామయ్యకు ఇస్తుందనుకున్నా, కాని ఇవ్వలేదు. తొలి పత్రికే కాదు, మామయ్యకు చుట్టపుచూపుగా కూడా మాట చెప్పలేదు. దాని వెనకా వేరొక కారణం ఉందని తెలిసింది. మామయ్య ఈ పెళ్ళికి అంగీకరించలేదని, తనపై నిందలు మోపాడని అబ్బాయికి మధ్యవర్తి ద్వారా తెలిసిందంట, మామయ్యను పెళ్ళికి ఆహ్వానిస్తే, పెళ్ళి మధ్యలో వదులుకుంటానని అమ్మతో చెప్పాడంట. దాంతో పత్రిక ఇవ్వలేదు.

అమ్మ ఒక్కర్తే పెళ్ళి పనులన్నీ చూసుకుంటోంది. ఎవరు ఖర్చులకని ఎంత అడిగితే అంత ఇస్తోంది. అడిగే వాళ్ళు లేరని తెలిసి కొందరు బంధువులు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టించారు. సమయం గిర్రున తిరిగింది. నా పెళ్ళి జరిగిపోయిన రోజయింది. అత్తవారింట్లో అడుగుపెట్టాను. కొద్ది రోజుల వరకు ఆయన బాగానే ఉన్నాడు. మంచిగానే చూసుకున్నాడు. అ సందర్భంలో – ఈయన మంచివాడే కదా, మామయ్య ఏంటి అలా చెప్పాడు అని అనుకునే దాన్ని. అమ్మ కూడా రెండు మూడు సార్లు వచ్చి నన్ను చూసి వెళ్ళింది. అక్కడ అమ్మ ఒక్కర్తీ ఉండాలి. ఆమెను పలకరించేవాళ్ళే కరువు. అయినా ఆమెకు భారం తగ్గింది అనుకునేదాన్ని.

కొద్ది రోజులు గడిచాకా గానీ తెలియలేదు ఆయన నిజస్వరూపం. ఆయనొక పచ్చి తాగుబోతు. నాతో కాపురం చేయడం కోసం నాలుగు రోజులు అలా నటించాడు. రోజు తాగి రావడం, ఇంట్లో గొడవ పెట్టుకోవడం, పెళ్ళికి అడ్డుపడ్డాడని మామయ్యను నానా మాటలు తిట్టడం. ఆయనకు ఎదురు మాట్లాడే ధైర్యం నాకు లేకపోయింది. మామయ్య చెప్పిన మాటలు నిజమని అప్పుడు తెలిసింది. ఒక రోజు అమ్మ నన్ను చూడ్డానికి ఇంటికి వచ్చింది. ఆ రోజు ఆయన గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఆ రోజే అమ్మ ఆయనను నిలదీసింది. కానీ ఆయనకు మా అమ్మపై కోపం పెరిగిందే కానీ ఆయన ప్రవర్తనలో మార్పు లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఉన్న డబ్బంతా ఆయన జల్సాలకి ఖర్చయిపోయింది. ఆయన ప్రవర్తనని ప్రశ్నించే వాళ్ళే లేరు. ఆయన తల్లిదండ్రులు బరువు తగ్గిందే అనుకున్నారే గానీ ఒక అమ్మాయి జీవితం నాశనమవుతుందని అనుకోలేదు. ఇది ఎంత వరకూ న్యాయమో వారికే తెలియాలి.

అమ్మ పంతం వీడి మామయ్య దగ్గరకు వెళ్ళిందంట. ఏడుస్తూ మామయ్య చేతులు పట్టుకుని తన తప్పులని క్షమించమని కోరి జరిగిన విషయమంతా చెప్పిందంట. అప్పటికే ఇక్కడ జరుగుతున్న విషయాలను తెలిసిన వ్యక్తుల ద్వారా మామయ్య తెలుసుకుంటున్నాడంట. తెలిసినా కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడంట.

అదే మామయ్యతో మనస్పర్థలు రాకుంటే నా జీవితం ఇలాగుండేది కాదేమో! మామయ్యను తీసుకుని అమ్మ మా ఇంటికి వస్తుందంట, ఆయన ప్రవర్తన గురించి అడగడానికి. తెలిసిన వ్యక్తి ద్వారా నాకు తెలిసింది. ఏం చేసినా ఆయన ప్రవర్తనలో మార్పు వస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఇల్లు గడవటం కష్టమవ్వడంతో నేను ఏదైనా పని కోసం వెతుక్కుంటున్నా. చుట్టుప్రక్కల వాళ్ళక్కూడా చెప్పి ఉంచా. మామయ్య, అమ్మ ఒక రోజు మా ఇంటికి రానే వచ్చారు.

మామయ్యని చూసి చాలా రోజులైంది. తొలిసారిగా వచ్చిన ఆయనకి ఏదైనా చేసిపెడదాం అంటే ఇంట్లో ఏమీ లేవు. మామయ్యే బయటికి వెళ్ళి కొన్ని సరుకులు కొనుక్కొచ్చాడు. వాళ్ళొచ్చారన్న ఆనందం నాకుంది, కానీ వాళ్ళు మాత్రం నన్ను చూస్తూ మనసులో చెప్పలేనంత బాధపడుతున్నారు. వాళ్ళ కళ్ళని చూస్తే అది అర్థమైపోతుంది. భోజనాలు చేసిన తరువాత ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. మామయ్య అడిగాడు, “అబ్బాయి ఎప్పుడొస్తాడు?” అని. ఏం చెప్పను? ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో ఎవరికి తెలుసు? తాగేసి ఏ రాత్రో వచ్చినప్పుడు కొడతాడు. “వస్తాడు మామయ్యా, చీకటైపోతుంది” అని చెప్పాను.

చాలా చీకటైపోయిది. ఇంకా ఆయన ఇల్లు చేరలేదు. నాకు కంగారు గానే ఉంది. మామయ్యే రోడ్డు దాకా వెళ్ళి చూసొచ్చాడు, కానీ కనిపించలేదు. మళ్ళీ ఇంటికి తిరిగొచ్చాడు. ఇంతలో ఒక అబ్బాయి హడావిడిగా వచ్చి  – మా ఆయనకి లారీ తగిలింది, బాగా తాగి రోడ్డు మీద నుంచి వస్తూ ఉంటే జరిగింది – అని చెప్పి వెళ్ళాడు. నేను అమ్మా, భోరున ఏడుస్తూ జరిగిన ఘటనా స్థలానికి వెళ్ళాం. బాగా రక్తం కారిపోతోంది. స్పృహలో లేడు. దావఖానాకు తీసుకెళ్ళాం.

తెల్లవారు జామున డాక్టర్లు వచ్చి చెప్పారు – ఆయన చనిపోయాడని. చేసేదేమీ లేకపోయిందని.

పెళ్ళయిన కొత్తలో మేనమామ తన ఇంటికి తీసుకెళ్ళి బట్టలు పెడతాడు. కాని ఇలా విధవరాలైనంక తన ఇంటికి తీసుకెళ్ళాల్సి వచ్చింది. నన్ను ఈ స్థితిలో చూసి అమ్మ తన వల్లే నాకీ గతి పట్టిందని మనోవ్యాధికి గురై, కొద్ది కాలానికే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది.

అప్పటి నుంచి మౌనం నా స్నేహమైంది. బాధలే నా బంధువులైపోయాయి. మామయ్యా, అత్తా నన్ను చూసి ఏడ్చని రోజు లేదు. కాలం గడిచిపోతోంది. ఒకప్పుడు ఆకలైతున్నా – ఆటల్లో పడి తినకుంటే మామయ్యే భోజనం తినమని నాకు తినిపించేవాడు. ఇప్పుడు తినమని బ్రతిమలాడుతున్నాడు కానీ నాకు ఆకలి లేదు.

మామయ్య నాకు మళ్ళీ పెళ్ళి సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. నా జీవితం ఇలాగే ముగిసిపోవడం ఇష్టం లేని మామయ్య తనకున్న పొలాన్ని, పాతకాలపు ఇంటిని అమ్మేసి రెండో సంబంధం అనే మచ్చ కనిపించకుండా ఘనంగా నాకు పెళ్ళి చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here