[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]
రక్తం ఎప్పటికీ రక్తమే.,!
నేపథ్యం:
[dropcap]హిం[/dropcap]దీలోఈ కవిత పేరు –‘ఖూన్ ఫిర్ భీ ఖూన్ హై.,టపకేగా తో జమ్ జాయేగా!!’
1960లో బెల్జియన్ కాలనీ నుండి స్వతంత్ర దేశానికి కాంగో పరివర్తనం ఆఫ్రికాలో పెద్ద డీకొలనైజేషన్ ఉద్యమ నేపథ్యంలో జరిగింది. నిరంకుశ బెల్జియం నుంచి కాంగో విడిపోయి స్వాతంత్ర్యాన్ని పొందింది. ఆఫ్రికాలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన కాంగోకి విముక్తి చిహ్నముగా పెట్రీస్ లుముంబా మారాడు. కానీ 1961లో బెల్జియన్ తిరుగుబాటుదారులచే హత్య చేయబడ్డాడు. స్వతంత్ర కాంగోకి ఎన్నికైన తొలి ప్రధాన మంత్రి లుముంబా. స్వతంత్ర డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొదటి ప్రధాని అయిన కొన్ని నెలల తరువాత జరిగిన సైనిక తిరుగుబాటులో లుముంబాను జనవరి 17, 1961 లో బెల్జియం ఫైరింగ్ స్క్వాడ్ ఉరి తీసి హత్య చేసింది.
కాంగో ప్రజల న్యాయమైన ప్రజాస్వామిక హక్కుల కోసం అమరుడైన లుముంబా పోరాటం,త్యాగం ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. ప్రగతిశీల రచయిత, హిందీ కవి అయిన సాహిర్ లుథియాన్విని కూడా లుముంబా హత్య కలిచివేసింది. ఆ కలతలోనే.,దుఃఖంలోనే ఆయన హత్యను ఖండిస్తూ ‘రక్తం ఆఖరికి రక్తమే.,’ అనే కవిత రాసారు సాహిర్. లముంబా వంటి ఉద్యమకారులు కార్చిన రక్తం వృథా పోదు, అది దావాలనంగా మారి నియంతలను, నమ్మక ద్రోహులను దహించి వేస్తుంది అంటూ ఆక్రోశంతో పాటు ఆశతో అమరుడు లుముంబా త్యాగం గురించి కవిత రాస్తారు సాహిర్ లుథియాన్వి.
లుముంబా గురించి జవహర్లాల్ నెహ్రూ కూడా ఇలా వ్యాఖ్యానించారు”అమరుడైన ఒక లుముంబా., బతికి ఉన్న లుముంబా కంటే కూడా చాలా శక్తివంతుడై ఉంటాడు.” అంటూ లుముంబా వదిలివెళ్లిన ఆశయాలను జాతి వివక్ష,అణిచివేత లను ఎదుర్కొంటున్న ఆఫ్రికా ప్రజలు అందుకోవడం గురించి ఆశావాహ దృక్పథంతో మాట్లాడతారు నెహ్రూ.
పేట్రీస్ లుముంబాను సాహిర్ ప్రియంగా తలుచుకుంటూ రాసిన ఉర్దూ కవిత తెలుగు అనువాదం మీ కోసం.
రక్తం ఎప్పటికీ రక్తమే.,!
నిరంకుశత్వాన్ని యోధులు
ధిక్కరిస్తారు.
వీరుల విప్లవాన్ని.,
నియంతలు అణిచివేస్తారు.
అణిచివేత., ఎప్పటికీ అణిచివేతనే…!
అయితే.,నియంతకు తెలియనిది ఏమిటంటే.,
అణిచివేసే కొద్దీ అది అంతమై తీరుతుంది అని!
రక్తం కూడా ఆఖరికి రక్తమే., గాయం నుంచి చిందే కొద్దీ., గడ్డ కట్టి పోతుంది.
రక్తం ఎక్కడ చిందిందని కాదు!
రక్తం.,
ఎడారిలో., హంతకుల చేతులపైన.,
న్యాయ శిఖరం మీద.,
సంకెళ్లతో బంధించబడ్డ యోధుడి పాదాల పైన,.
కసాయి కత్తి మీద.,
హంతకుల చేతుల మీద.,
రక్త సిక్త గాయాలతో నిండిపోయిన అమరుల దేహాలమీద చిందినా సరే.,
ఆఖరికి ఘనీభవించాల్సిందే.,!ఎందుకంటే., అది రక్తం కాబట్టి.
రక్తం., రక్తమే కదా మరి.,?
లక్షల మంది శత్రువులు చీకటిలో దొంగ దాడి చేయాలనుకున్నా సరే.,
రక్తం ఆ హంతకుల జాడ చెప్పే తీరుతుంది.
ఎందుకంటే.,
రక్తం., రక్తమే..!
చూస్తూఉండు మరి.,
ఎర్రని వీరుడి రక్తం.,
ఫలించని వాళ్ళ అణిచివేతల మీదుగా వడి వడిగా పారుతూ.,
చీకటి ముసుగులతో
పన్నే కుట్రల పరదాలను తొలగిస్తూ,.
ఉద్యమకారుడి చేతులమీద
చుక్కలు చుక్కలుగా రాలిన రక్తం., రుధిర దీపాలుగా., అంగారాలుగా వెలుగుతుంది!
ఫో., ఇప్పుడే చెప్పు.
నిస్సహాయుల మీద
జులుం చేస్తూ., తత్వం బోధించే ఆ టక్కరి ఇమాముకి చెప్పు..,
అట్లాగే.,
పదవీ లాలసతో .,
శాసనసభల్లో సిగ్గవిడిచి కొలువు దీరిన ఆ నమ్మక ద్రోహులకు,
రక్తం వెర్రిదే కాదు ఒక ఉన్మాది కూడా అని చెప్పు ఫో.,!
వేలాడే వాళ్ళ పొడవు చేతుల బుష్ కోటుల మీద,. తిరుగు బాటుదారుల రక్తం
ఒక్కసారిగా భళ్లుమని కుమ్మరించి నట్లే పడగలదని చెప్పు!
అరె., రక్తం అంటే ఏమనుకున్నావు.,?
రక్తం దావానలం లాంటిది సుమా.,!
బీద జనులకు అందకుండా నువ్వు దాచుకున్న వరి నూర్పిళ్ల మీద చిమ్మి.,
దాన్ని భగ భగా మండించ గలదని చెప్పు.
ఇక.,
యోధులను అణిచివేయడానికి నువ్వు
వధ్యశిలను వాడుకుంటే.,
దాహంతో నువ్వు కోరుకున్న యోధుల రక్తం వీధుల్లోకి ప్రవహిస్తుంది.
ఎందుకంటే.,
రక్తం ఎప్పటికీ రక్తమే.,!
రక్తం ఏ రూపంలో కైనా మారగలదు..,!
వీధుల్లోకి ప్రవహించే
రక్తం నిప్పు రవ్వలుగా., నినాదాలుగా., నిన్ను గురి చూసి విసిరే రాయిగా., మారిపొగలదు.
ఒక్కసారి రక్తం ప్రవహించిందంటే.,
నీ బోయనెట్స్ కూడా పనికి రావు.!
గుర్తు పెట్టుకో., ఒకసారి ఎత్తిన వీరుడి శిరస్సు.,
ఈ దురన్యాయాల వడగళ్లు మీద పడ్డా తల దించదు గాక దించదు!
ఎందుకంటే.,
ఆది నుంచి అంతం దాకా., అణిచివేత., అణిచివేతనే!
ధిక్కారం., ధిక్కారమే!
రక్తం., రక్తమే! ఎప్పటికైనా సరే రక్తం రక్తమే!
అంతేనా.,విను!
రక్తం రూపం అనేకం.,!
వీరుడి రక్తం గురించి తక్కువ అంచనా వేయకు సుమా.,
ఎందుకంటే.,
రక్తం రక్తమే!
ఆది నుంచి అంతం దాకా.,
రక్తం ప్రభావం అనంతం., అజేయం!!
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి