[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]
నిన్ను విషాదంగా చూసాక..!
[dropcap]ఏ[/dropcap] గాయాలు చేసిన బాధలో ఉన్నావో గానీ ..
చాలా రోజుల నుంచి నిన్ను ఉదాసీనంగానే చూస్తున్నాను .
లోకంలోని అన్నింటినీ గొప్ప తపనతో చూస్తావుకదా నువ్వు .,
ఏవీ., ఏమయ్యాయి ఆ చంచలత్వం., మధురమైన చిరునవ్వు., ముద్దులొలికే నీ మాటలు?
మౌనంలో హృదయంలోని కలవరపాటుని దాచేసుకుని.,
నీకు నువ్వే రహస్యాన్ని మోసే విగ్రహంగా మారిపోయావు.
సరే.,నా ఆశ అడుగంటిందంటావా., అడుగంటనీ.,!
ఆశదేముంది చెప్పు.,?
అదొక బరువైన ప్రేమ భావన తప్ప మరింకేమీ కాదు .
విషాదంలో మునిగి పోయిన నా జీవితాన్ని చూసి ప్రియా నువ్వు దుఃఖించకు
ఈ జీవన విషాదమే శ్వాసగా మారింది మరిక బాధ పడకు.
నీ ప్రేమికుల మీద కొంచెం దయ చూపించు.,
అయితే అందరూ.,
నీకు నమ్మకంగా ఉంటారు అనేది ఒట్టి వంచన తప్ప మరేమీ కాదు.
అది యవ్వనపు వాంఛ , మోహమూ తప్ప మరేమీ కాదు.
నువ్వు నా ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నావన్న ఆరోపణ చేయనులే.,
నీ మీద తీవ్రమైన మోహమే నన్ను నాశనం చేసింది., నువ్వు కాదు!
నా ప్రేమలో కాలుతూనే.,ఈ లోకాన్ని చూసి వెరుస్తున్నావు
కానీ., ఈ లోకమెంత విచిత్రమైనదో నాకు తెలుసు.
ఇక్కడ జీవనేచ్ఛ ముసుగులో మృత్యువు దాక్కుంటుంది
సున్నితమైన ధ్వన్యాలంకరణల వెనుక కర్ణకఠోరత్వం వినిపిస్తుంది .
ఒకటి చెప్పనా.,
నీ వియోగపు బాధ నాకు ఎంతమాత్రమూ లేదు.,
ఎందుకంటావా .,నా ఊహల లోకంలో ప్రతి క్షణం నువ్వు నాకెంత దగ్గరగా ఉంటావో నీకేం తెలుసు?
నిన్నిక కలవద్దని చెప్పావు సరే కలవనులే.
కానీ.,ముందిది చెప్పు నువ్వింత విషాదంగా ఎందుకున్నావు మరి?
నిన్ను చూడాలని తపించే నన్ను చూసి కోపం తెచ్చుకోకు ప్రేయసీ
నీకు తెలియదూ నువ్వు నా జీవన శ్వాసవని?
చింతించకు ప్రేయసీ., నాదేముంది దుఃఖంలో ఏదో ఇలా బతికేస్తాను
కానీ ఖుదా కోసమైనా మన వియోగ విషాదానికి నువ్వు మాత్రం బందీవి కాకు!
అసలు ఏమైందని నిన్ను నా దునియా నుంచి లాక్కున్నారు ఈ క్రూరులు?
అయినా., ఒక్కసారి ఆలోచించు ఈ లోకంలో ఎవరు మాత్రం ఎవరికి దక్కారనిలే?
విషాదం మాత్రమే మిగిలిన నా యవ్వన కాలం మీద ఒట్టు.,
ప్రేయసీ., దిగులు పడకు నేను ఖుషీ గానే ఉన్నానులే.
నీ పాదాలమీద పెట్టిన నా ప్రణయ పుష్పాలని నిర్దయగా తిరస్కరించు ఫరవాలేదు !
నేను నా ఆత్మలో ప్రతిష్ఠించుకున్న ప్రతీ కోరికనీ తుడిచేసుకుంటాను.,
కానీ నిన్ను తలుచుకున్నంత మాత్రాన్నే ఉప్పొంగే సంతోషాన్ని మాత్రం వదులుకోలేను
మరణించనైనా మరణిస్తాను కానీ నిన్ను మరిచిపోయే దౌర్భాగ్యాన్ని మాత్రం భరాయించలేను!
నీ బాధ నుంచి విముక్తమయ్యే స్వేచ్ఛ కూడా లేదా నాకు?
అయితే ఒకటి గుర్తు పెట్టుకో.,
నాకు నీ దుఃఖమే కాదు.,
లోకంలో., నేను మాత్రమే పట్టించుకోవాల్సిన మానవ విషాదాలు మరెన్నో ఉన్నాయి.
ధనవంతుల ఆకాశహర్మ్యాల నీడల్లోంచి మొలిచిన గుడిసెల్లో.,
దారిద్య్రంలో మునిగి తేలే ఈ అభాగ్యుల సంగతి ఎవరికి పట్టిందని?
ఆ ఇళ్లల్లోంచి వినిపించే బీదరికపు ఆకలి కేకలు.,
కొద్ది మానవత్వం కోసం చాచే వారి చేతులు.,
అన్నార్తుల నిట్టూర్పులూ వినిపించట్లేదా ప్రేయసీ?
నీకేం తెలుసు ?
కార్ఖానాల్లోని లోహపు కణ, కణ ధ్వనులలో .,
లక్షలాది కార్మికుల ఆర్తనాదాలు నిశ్శబ్దంలోకి సమాధి అవుతుంటాయి
ధనవంతుల మోహల్లాల్లో కనిపించే రంగు రంగుల చీరల మెరుపుల ధగ ధగలు.,
మరోపక్క., గుడిసెల్లో శవాల మీద కప్పే గుడ్డకి కూడా నోచుకోని శవాలు.,
ఇంతకీ నేను చెప్పేదేమంటే.,
నీ వియోగపు దుఃఖమే నాకు ముఖ్యం కాదు మరి
ఏమంటావు ప్రేయసీ ?
ఈ తారురోడ్డు పైన హడావిడిగా తిరిగే ఖరీదైన కార్ల రణగొణ ధ్వనులు
రైలు పట్టాలపైన పడి ఉన్న బక్కచిక్కిన బీద పిల్లలు
వీధి వీధిలో కాసులకి అమ్ముడుపోతున్న నా అక్క చెల్లెళ్ళ యవ్వనం
నవ్వుతున్న వాళ్ళ కళ్ళల్లో చిప్పిల్లుతున్న విషాదం
ఈ మానవ యుద్ధంలో.,
నా దేశపు యవ్వనమంతా ఎట్లా కొనబడుతుందో
కనిపించలేదా ప్రేయసీ.,
మాట మాటకీ న్యాయమే ఖైదు అవుతుందిక్కడ
నిస్సహాయ., నిరంకుశ బానిసత్వపు కాలం ఇది.
నా జీవితానికి ఈ దుఃఖం చాలదనా ప్రేయసీ.,
నీ బాధతో కూడా నా మనసులో మరింత శోకం వంపుతావు ఎందుకని?
ఎప్పుడైనా., ఎక్కడైనా నా నిస్సహాయ కోపపు చూపులు నీకు తగిలితే అలగకు ప్రేయసీ.,
అయినా మన మధ్య అసలు ప్రేమ ఎప్పుడైనా వాడిపోతుందా.,
అదెప్పటికీ పరిమళించే తాజా కుసుమం కదూ.,
చూడు., చూడు.,
ఇప్పుడే నువ్వు నా వైపు ప్రేమగా చూశావు మరి!
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి