[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box]
నా గీతాలు ..! (హిందీలో మూల కవిత పేరు ‘మేరె గీత్!’)
[dropcap]దే[/dropcap]శదిమ్మర్ల లాంటి నా తిరుగుమోతు పాటలు వింటున్న లోకం..
బహుశా నాకు ప్రేమ గీతాలంటే ద్వేషం అనుకుంటుంది.
అవును మరి..
నాకు యుద్ధం.. సంఘర్షణ లోనే శాంతి..ప్రేమా దొరుకుతాయి
నా తిరుగుబాటు బుద్ధికి, రక్తం చిందించే కథలతోనే స్నేహం మరి.
నాదైన ప్రపంచంలో ప్రేమ గీతాలు నృత్యం చేసేంత సమయం లేదు
నా దిఖార గీతమే నా ప్రియురాలు!
అయినా కానీ ..ఒక్కో సారి అనిపిస్తుంది.. ఎవరైనా నా ఏకాంతపు రాత్రుళ్ళల్లో ..
చుక్కల్ని చూస్తూ..ఉండి..ఉండి దుఃఖించే నాలోకి .. చూస్తే ఎంత బాగుంటుంది?
ఆ క్షణాల్లో.. నా హృదయపు లోతుల్లో..
మరిచిపోయాననుకున్న సంఘటనల జ్ఞాపకాలు
తీవ్రమైన నొప్పితో మెలి తిరిగిపోతుంటాయి.
అసలు ఎవరికైనా అర్థం అవుతాయా అవి?
అయినా సరే..
కలలో నైనా గానీ.. ఎవరైనా మగతగా జోగుతున్న నా స్వఫ్నాలను నిద్ర లేపినా..,
మెలకువలో మాత్రం నా జీవితాన్ని.. మృత్యువు ముంగిట్లోనే కనుక్కుంటాను
ఎందుకంటే ..నేను కవిని..
ఈ అభాగ్యజీవుల గొంతుకని ..
నా గీతాలు వాళ్ళవి కాక ..వాళ్ళ కోసం కాక
ఇంకెవ్వరికోసం చెప్పు మరి?
నా చుట్టూ తిరుగుతూ..
నన్ను తడిమే చురుకైన మోహపు చూపుల పైన నాకు మక్కువ ఎందుకు ఉండదు చెప్పు?
ఆ మధురమైన ప్రణయ గీతాలకు నా హృదయం ఎప్పుడూ శత్రువు కాదు
కానీ ..ఒక్క ప్రేమనే కాదు
నాకు మనుషుల నొప్పిని గ్రహించే శక్తిని కూడా ఆ అల్లానే ఇచ్చాడు మరి.
నా లక్ష్యం కేవలం అగ్ని జ్వాలలని సృష్టించడం మాత్రమే అనుకున్నావా?
కాదు .. నేను నవ యువకుడిని..! నాలో నిత్యం తుఫానులు కంపిస్తుంటాయి.
నా మాటల్లో..పాటల్లో మెతకతనానికి తావే లేదు! ఉరుముల్లా గర్జించే
నా దిఖార గీతాల అర్థం ఎప్పుడూ ఒక్కటే ..!
ఆకలితో చనిపోయే రైతుల్ని చూసినప్పుడు..
దారిద్ర్యంతో అల్లల్లాడే దీనుల, బీద అసహాయుల కళ్ళల్లో ఆక్రోశం చూసినప్పుడు..
కుళ్ళి, కుళ్ళి ఏడ్చే ఆ సున్నితమైన మనుషుల్ని చూసినప్పుడు..
నిరుద్యోగంలో తల్లడిల్లుతున్న నవ యువకుల స్వాభిమానం చూసినప్పుడు..
వాళ్ళు అల్లాకి చేసే ప్రార్థనలు వింటున్నప్పుడు..
వాళ్ళ వొంటి మీది పిగిలిపోయి వేలాడుతున్న గుడ్డ పేలికలను చూసినప్పుడు..
అవే కళ్ళతో సెహేన్ షా రాజమందిరాల్లో
బలిసిపోయిన ఖజానాలు చూసినప్పుడు ..
పొంగిపొర్లుతున్న మధుపాత్రలను.. తినలేక చెత్తకుప్పల్లోకి విసిరేస్తున్న రొట్టె ముక్కలను చూసినప్పుడు ..
మరిక నా హృదయం .. దేదీప్యమానంగా శాండియర్లతో వెలిగిపోయే.. సంతోషానందాల కేరింతలతో ఉప్పొంగిపోతూ..
పరవశంతో ప్రణయ గీతాలు పాడే కవులతో నిండిపోయిన మెహెఫిల్ ల్లో ఎలా కలుస్తుంది చెప్పు?
నిరుపేదల ఆకలి చూపులు నన్ను వెంటాడుతున్నంత వరకూ..
నువ్వు నన్ను ప్రేమ గీతం పాడమని కోరుకున్నా.. నేను కావాలనుకున్నా కానీ ఒట్టి ఊహా లోకపు ప్రేమ గీతాలు మాత్రం పాడలేను!
నాకు ప్రేమ అన్నా. . ప్రేమ గీతాలు అన్నా పగ లేదు.
నా పాటలు నీ లాంటి వాళ్ళ కోసం కాదు
నేను పాడలేను క్షమించు!.
మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి