[dropcap]శ్రీ[/dropcap]రామనవమి తరువాతి వారం. రోజు కచ్చితంగా జ్ఞాపకం లేదు కానీ, ఎందుకో మావారు గుడికి వెళ్ళొద్దామంటే వారాంతం కాకపోయినా త్వరగా తయారయ్యాను మా పిల్ల ఆన్‌లైన్ క్లాసుల తర్వాత. సాయంత్రం 5.30కంతా మేము సిద్ధమని మా శ్రీవారికి తెలిసేలా ఆయన ముందు ముగ్గురమూ నిలబడేసరికి ఇక ఆయన కూడా అరగంట లోపు తయారుగా ఉన్నారు. బయలుదేరిన సమయానికి ఇంకా వెలుతురు ఉండటంతో కంట్రీ సైడ్ బాగా ఆస్వాదిస్తూ సాగింది మా ప్రయాణం. గంటకు పైగా ఉన్న ప్రయాణ సమయంలో అక్కడక్కడా కనిపిస్తున్న పూలు, పండ్ల తోటల మధ్యలో నుండి వెళ్తూ ఉంటే పొద్దుటి నుండీ ఆ యంత్రాలను చూసి అలవాటైన కళ్ళకు పచ్చదనాన్ని చూసి ప్రాణం లేచొచ్చినట్లైంది. ఎంతైనా ప్రకృతి అమ్మలాంటిది, బలమైంది.
గుడిలో దర్శనం అయింతరువాత అక్కడేదో బెంగాలీ వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుందని తెలిసి అక్కడ కొంచెంసేపు గడిపి ఇక తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. చిక్కబడ్డ చీకట్లో కారు లైట్లతో జాగ్రత్తగా దారిని చూసుకుంటూ నడుపుతున్నా, అసలే ఒక వాహనం మాత్రమే వెళ్ళగలిగేంత దారీ, చుట్టూ చూద్దామన్నా ఎలాంటి కట్టడాలూ కనిపించడం లేదు.కొంత దూరం వెళ్ళాక దారికి అటూ ఇటూ దూరంగా అక్కడక్కడా తప్ప కనిపించని ఫాం హౌసెస్.
ఫ్రీవే మీదకు వెళ్ళడానికింకా 30 నిముషాల సమయం చూపిస్తూంది జిపిఎస్. మలుపులతో ఉన్న దారి, డ్రోన్‌తో పైనుండి చూస్తే కారు తప్ప ఇంకేమీ కనిపించడంలేదన్నట్టుగా ఉంది. సరే ఇక ఫ్రీవే మీద ప్రయాణం మొదలయింది అనుకుని పది నిముషాలైనా కాలేదు. నా పరిస్థితి పెనం మీద నుంచి కుంపట్లో పడినట్టుంది. డ్రైవర్ సీటులో కూర్చుని ఆపోజిట్ అద్దంలో తల తిప్పి చూస్తే మెరుపు వేగంతో మాయమవుతున్నారు ఎవరో. ప్యాసింజర్ వైపున్న సీటులో కూర్చుని అద్దంలో చూసినా అదే పరిస్థితి. అసలే గంటకు 70 మైళ్ళ వేగంతో కారు దూసుకుపోతూ ఉంది, మిగతా వాహనాలన్నీ అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తూ, నన్ను దాటేస్తూ, హాంక్ చేస్తూ వెళ్తున్నారన్న ధ్యాస, మధ్యలో ఈ ముసుగు వీరుడు, మిన్నల్ మురళి లాగా వెంటాడటం, వరుసగా గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు రావడం, వీటన్నిటి మధ్యా నాలోని ఈ చక్రధారికి చిన్న ఏకాగ్రతాలోపం.
దారికి రెండువైపులా చెట్లు బాగానే ఉన్నా, ఆ చెట్లు కొంచెం పలుచగా ఉన్న స్థలంలో షరా మామూలుగా వెంట పడుతున్న మిన్నల్ మురళి. ఏవిటీ, ఈ వేగవంతమైన రహదారి మధ్యలో ఇలా ఎవరు పరిగెడుతున్నారో అర్థం కాక బుర్ర గోక్కోవడానికి చెయ్యి స్టీరింగు మీద నుండి తియ్యలేని పరిస్థితి. జిపిఎస్ సలహా ప్రకారం దక్షిణానికి తిరిగాక ఈసారి కుడిచేతి వైపు నుండీ పరిగెడుతూ నన్ను వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రయాణం త్వరగా పూర్తయితే బాగుండు, ఇంటికి చేరుకోవాలన్న తపన అంతకంతకూ పెరిగిపోతుంది. ఎగ్జిట్ తీసుకుని ఇంటికి వెళ్తున్నంతసేపూ ఇదే ఆలోచన, ఎవరికైనా ఏదైనా ఇవ్వకుండా మర్చిపోయానా, లేక వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, అయితే కనిపించకుండా ఈ దాగుడుమూతలు ఎందుకు. లక్ష ప్రశ్నలు బుర్రలో. ఇంత ఆలోచనలో కూడా బ్యాలన్స్‌డ్‌గా డ్రైవ్ చేస్తున్నందుకు భర్త అభినందించారు తరువాత. ఇంటి ముందు కారు ఆపాక గుర్తుకు వచ్చింది ఆరోజు పౌర్ణమి అనీ, ఆ వెంబడించిన ఆయన ఆకాశం నుండి తొంగి చూసి ఆల్రెడీ ఉదయించిన సమయమంతా ప్రయాణం వల్ల పక్కనే ఉన్నట్టు అనిపించినా, ఇప్పుడు తల పైకెత్తి చూసేలా తెల్లగా మెరుస్తున్న చందమామ.