Site icon Sanchika

అశ్రుకణాల్లాంటి జీవితాలను చూపే ‘మెట్రోకథలు’ ఆవిష్కరణ

[dropcap]మా[/dropcap]రుతున్న హైదరాబాద్ నగరానికున్న కేరక్టర్ అనండి జీవలక్షణమనండీ… దాన్ని కథలలో ప్రతిఫలించిన ఘనత రచయిత ఖదీర్ బాబుది… భిన్నవర్గాలవారు విభిన్న ఆకాంక్షలతో మెట్రోనగరంగా మారిన హైదరాబాద్ నగరాన్ని ఎలా own చేసుకున్నారు అనే అంశంపై కొంతకాలం కితం ఓ ప్రముఖ దినపత్రికలో వెలువడిన మెట్రో కథలను సంకలనంగా ఈనెల 21న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌‌లో రచయితలు, కవుల సమక్షంలో ఆవిష్కరించారు…

ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి అధ్యక్షత వహించిన ఆనాటి సభలో రచయిత, జర్నలిస్ట్ శ్రీ ఎన్.వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. అన్వేషి సంస్థ సునీత గారు, విమర్శకులు శ్రీ జి.లక్ష్మీనరసయ్య, కవి కోడూరి విజయకుమార్, సామాజిక కార్యకర్త  శ్రీమతి విమల ఇతర అతిథులు… తొలిప్రతిని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్వీకరించారు… కవి శివారెడ్డి మాట్లాడుతూ మంచి వచనం రాయటం సామాన్యమైన విషయం కాదని ఖదీర్ కథలలో కవిత్వం తొంగిచూస్తుందని ప్రశంసిస్తూ చలికోటు కథలోని కొన్నివాక్యాలను చదివివినిపించారు…

ఆవిష్కర్త శ్రీ ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ ఒకనగరం మెట్రోనగరంగా మారుతున్న విషాదకాలంలో రూపానికి సారానికి ఉన్న లంకెను ఖదీర్ పట్టుకోగలిగాడని ప్రశంసించారు…

అన్వేషి సంస్థ  సునీత గారు మాట్లాడుతూ ‘ వలస జీవితాలీకథలంటూ అజ్ఞాత జీవనాన్ని తలుచుకుని బాధపడని వ్యక్తుల జీవితాలను కూడా ఖదీర్ కథలుగా మలచాలని కోరారు..

విమర్శకులు శ్రీ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ’ నగరం ఎదుగుతున్నకొద్దీ పురుషకేంద్రకంగా మారుతుందని అందుకు ఉదాహరణగా ‘ షి ‘ కథను క్లుప్తంగా పరిచయం చేశారు.

విమలగారు మాట్లడుతూ కథలన్నీ మనకు ముల్లులా గుచ్చుకునేవే అన్నారు.

మెట్రోకథలకు పునాది ఖదీర్ ‘బియాండ్ కాఫీ’ కథలలో మనం చూడొచ్చని అన్నారు కవి కోడూరి విజయకుమార్…

నగరం ఎదుగుతున్నకొద్దీ మానవీయ స్పర్శను కోల్పోతూ మొద్దుబారిపోతుందని ఆ బాధే తనను ఈ మెట్రోకథలను రాయించిందన్నారు మెట్రోకథల రచయిత శ్రీ ఖదీర్ బాబు.

దేవిప్రియ, వేమూరి సత్యం, చినవీరభద్రుడు, కుప్పిలి పద్మ, వి.రాజారామ్మోహనరావు, రెంటాల జయదేవ, పింగళి చైతన్య, మణి వడ్లమాని వంటి ఎందరో రచయితలు, రచయిత్రులు పాల్గొన్న ఆ ఆవిష్కరణ సభ వేగంగా మారుతున్న హైదరాబాద్ నగరం జీవితాలను మలచుతున్నతీరును స్పష్టంగా చూపించాయీ కథలు అన్న చర్చకు శ్రీకారం చుట్టిందని అభిప్రాయపడటంలో ఆశ్చర్యం లేదు.

Exit mobile version