మిగిలిన మిథునం

10
6

[dropcap]ప్రి[/dropcap]యమైన శ్యామలకి..

నువ్వెళ్లి సంవత్సరం అయింది.. నీకు బహుశా ఒక్కరోజు అనుకుంటా నాకు రోజులు సంవత్సరాలులా గడుస్తున్నాయి.. నువ్వు లేక పోవడం ఏంటి.. నాకేం అర్థం కావడంలేదు.. పిల్లలిద్దరూ ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తున్నారు.. సాత్విక్ క్యాంపస్ ఇంటర్వూలో సెలెక్ట్ అయ్యాడు.. జాబ్ వచ్చేస్తుంది.. ఇంకొక నాలుగు నెలల్లో జాయిన్ అవుతాడు.. మేఘన బానే ఉంది.. మెల్లి మెల్లిగా తేరుకుంటోంది.. మొన్నే బంటి థర్డ్ బర్త్ డే అయింది.. రమ్మని పిలిచింది.. నిజానికి తనే వస్తానంది.. నేనే రావద్దన్నాను.. “నేనే వస్తానులే” అని వెళ్లొచ్చాను.. సాత్విక్‌ని కూడా అక్కడికే రమ్మని అక్కడే కలిశాను.. నాకెందుకో వాళ్లు రాకపోతేనే బావున్నట్టుగా అనిపిస్తుంది.. ఎందుకంటే వాళ్లకి కూడా నువ్వు లేని ఈ ఇంటికి రావాలని లేదు.. ఆ విషయం నాకు తెలుసు.. అలాగని నన్ను వదల్లేరు.. అందుకే ఇక నేనే వెళ్లి మధ్య మధ్యలో చూసి వస్తున్నాను..

వాళ్లు వస్తే, నాకు నువ్వు లేవన్న విషయం మరీ స్పష్టంగా తెలిసిపోతోంది.. ఇప్పుడైతే చాలాసార్లు మర్చిపోయి నువ్వు పక్కగదిలో పడుకుని ఉన్నావనే అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అనిపిస్తోంది.. నువ్వు నా గదిలోనే పడుకుని ఉండి ఉంటే ఎంత బాగుండేది.. అసలు మన గదులు ఎప్పుడు వేరయ్యాయి.? నేను టీవీ సౌండ్ ఎక్కువ పెడుతున్నాను అని, ఫ్యాన్ స్పీడ్‌గా పెడుతున్నాను అని నువ్వు పక్క గదిలో పడుకోవడం మొదలు పెట్టావు.. నేను నిన్ను అలా ఎలా పడుకోనిచ్చాను..? నా మీద చెయ్యి వేసుకుని, పడుకుని నువ్వలా తగులుతూ ఉంటే ఎంత బాగుండేది.. ఆ టీవీ కట్టేసి ఉండొచ్చు కదా నేను? ఆ ఫ్యాన్ ఆపేసి ఉండొచ్చు కదా? ఇప్పుడసలు ఫ్యాన్ కూడా వేసుకోవడం లేదు.. గుండె మంచుగడ్డలా ఉంది.. టీవీ అసలు చూడ బుద్ధే కావడం లేదు..

ఇప్పుడు ఆఫీసు నుంచి కూడా తొందరగానే వచ్చేస్తున్నాను.. పనమ్మాయి సరిగ్గా సాయంకాలం 5:30 కి వస్తుంది.. నేను లేట్ చేస్తే వెళ్ళిపోతుంది.. మళ్లీ నాకు డిన్నర్ కష్టం అవుతుంది.. నేను టైంకి వస్తే తను రెండు చపాతీలు చేసి, కూర వండి వెళ్తుంది.. పని మనిషి కోసం నేను టైంకి వచ్చేస్తున్నాను.. కానీ నా కోసం కాచుకుని ఉండే నీకోసం ఎందుకు రాలేక పోయే వాడిని. అమ్మాయికి పెళ్లయిపోయింది.. అబ్బాయి కాలేజీలో ఉన్నాడు.. ఎక్కడో హాస్టల్లో ఉంటున్నాడు.. చక్కగా ఇద్దరమే ఉన్నాం. పెళ్లయిన కొత్త రోజుల్లోలా ఉండే అవకాశం ఉండి కూడా ఎంత మూర్ఖుడిని. సమయాన్ని దాట పెట్టుకున్నాను. నువ్విలా హఠాత్తుగా వెళ్లిపోతావని ఊహించలేకపోయాను. నువ్వు “తొందరగా రండి ఆఫీస్ నుంచి” అని బ్రతిమాలితే కూడా పని పని అని ఆఫీస్ నుంచి లేట్ చేసేవాడిని. ఇప్పుడెలా కుదురుతోంది నాకు?

నాకు ఈ రియలైజేషన్ రాకపోయి ఉంటే చాలా బాగుండేది. నిన్ను మహాప్రస్థానంలో కట్టెల పానుపు ఎక్కించాకా, అగ్ని దేవుడు నిన్ను హత్తుకుంటున్నప్పుడు నాకు ఈ కనువిప్పు కలిగింది. నువ్వు ఇంకా ఇంటికి రావన్న సత్యం అర్థమయింది. కానీ కారెక్కి, ఇంటి దగ్గర ఆగి, ఇంటి మెట్లు ఎక్కుతుంటే ఎక్కడో ఏదో ఫీలింగ్. నువ్వే తలుపు తెరుస్తావని. కానీ వరండాలో నీ ఫోటో పక్కన దీపం వెలుగుతోంది. నాకు గుండె జారిపోయింది. ఆ రోజు నుండి నా గుండె గొంతులోనే ఉంది. ఏ దీపం చూసినా ఆ దీపమే గుర్తొస్తోంది.

మొన్న దీపావళి రోజు ఇంటి ముందు పనమ్మాయి దీపం పెడుతుంటే నీ జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కిపోయింది. దీపావళినాడు టపాసులు కాల్చాక నువ్విచ్చే పాయసం గుర్తొస్తోంది. నాకు ఆ పాయసం అంటే చాలా ఇష్టం. కానీ నీకు ఎప్పుడూ నేను చెప్పలేదు కదా, ‘నాకు నువ్వు చేసే పాయసం ఇష్ట’మని. ఎందుకు చెప్పలేదు? డైనింగ్ టేబుల్ మీద నేను తిన్నగిన్నె తీస్తూ పాయసం బాగుందా అని నువ్వు అడిగాక బావుంది అన్నానే కానీ, నా అంతట నేను “శ్యాము నువ్వు చేసే పాయసం అమోఘంరా..” అని ఎందుకనలేదు? డైనింగ్ టేబుల్ అంటే గుర్తొస్తోంది. ఆ డైనింగ్ టేబుల్ కొనడానికి నేనంత గొడవ చేయకూడదు కదా. ‘ఎందుకు ఆరు చైర్ల టేబుల్ కావాలి’ అని ఎంత క్లాస్ పీకాను నీకు. పిల్లలు, మనవలు వస్తే ఒక్కసారే అంతా కలసి భోజనం చేయాలని నీ చిన్న ముచ్చట. ఒక ఇరవైవేల రూపాయల తేడాకి అంత గొడవ చేసిన నేను, మొన్న నీ పేరు మీద పాతిక వేలు పెట్టి అన్నదానం చేయించాను. అక్కడ నీకు ఏమైనా ఆనందం కలిగిందా? నీకు ఏమైనా తెలిసిందా? నువ్వు మనసు పడ్డ పని చేయకుండా నీ మనసుని బాధ పెట్టిన నేను వేరే లోకంలో ఉన్న నీ కోసం అన్ని దానాలూ చేస్తున్నాను. క్షమించగలవా.. ?

కాశీకి వెళ్లాలన్న నీ కోరికని కూడా కుండలో పెట్టి తీసుకు వెళ్ళాను. రెండేళ్ళ క్రిందట మనం కాశీకి వెళ్దామని చేసుకున్న ప్లాన్ గుర్తుకొచ్చింది. ఆఫీసులో ఏదో ప్రోజెక్ట్ అని క్యాన్సిల్ చేసుకున్నాను. నీ ముఖంలో తీవ్రమైన నిరాశని నేను గమనించాను. మళ్ళీ వెళ్ళచ్చులే అని అనుకున్నాను. నాకు దేవుడి మీద కూడా చాలా కోపంగా ఉంది. గుడికి వెళ్లాలని లేదు. అక్కడ నువ్వు “కాసేపు ఇక్కడ కూర్చుందామా” అని అడిగే రావిచెట్టు కనిపిస్తోంది.. చాలా బాధగా ఉంటోంది.. ఆదివారాలు నాకు కొంపలు ముంచుకు పోయే పనేముంది.. టీవీలో సినిమాలు చూడటం తప్ప.. నువ్వు అడిగావు కదా అని కాసేపు ఎందుకు కూర్చోలేదు.. ఇలాంటి నాతో అసలు అలా కాసేపు కూర్చుందామని నీకు ఎందుకనిపించింది? నువ్వు నాతో కాకుండా ఇంకెవరితోనైనా గుడికి వెళ్తే మళ్లీ నాకు చిరాకు. నాతో వెళ్తే గబగబా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేయాలి. ఎంత అన్యాయం..?

నువ్వు వెళ్లిపోయిన తర్వాత ఒక రెండు వారాలు మేఘన ఉండి అన్నీ సర్ది పెట్టింది.. నిజానికి ఇంకొక నెల ఉందాం అనుకుంది.. కిరణ్ ఇబ్బంది పడుతున్నట్టుగా మాట్లాడాడు.. మేఘన నన్ను వదల్లేక వదిలి వెళ్ళింది. “డాడీ మీ హెల్త్ జాగ్రత్త” అని మా అమ్మ చెప్పినట్టుగా జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. కిరణ్ కాస్త ఓపిక పట్టచ్చుగా అని విసుక్కుంది కూడా. అప్పుడు నీ మాటలు గుర్తొచ్చాయి. రెండు వారాలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే ఎందుకంత గింజుకుంటారు అని నువ్వు విసుక్కోవడం గుర్తుకు వచ్చింది. నిజంగా ఎందుకంత గింజుకున్నాను. “ఓకే.. అలాగే.. హాయిగా ఉండిరా” అని పంపించి ఉండొచ్చు కదా. ఇప్పుడు మరి నువ్వు లేకుండానే ఉంటున్నాను కదా.. నువ్వు లేని సాయంత్రాలు టీవీ చూడాలని లేకపోయినా చూస్తూ కాలాన్ని గడపాల్సి వస్తోంది. నువ్వు పెట్టమని అడిగే చాగంటి గారి ప్రవచనాలు ఇప్పుడు నేను వింటున్నాను. ఇప్పటినుంచి ఎందుకు ఇలాంటివి అని నీకు చెప్పే వాడిని. నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాను. నువ్వు ఆపమన్న ఆ న్యూస్ గోల ఇప్పుడు ఆపేసాను. నీకిష్టమైన ప్రోగ్రాములు చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది ఇద్దరం కలిసి చూస్తే ఎంత బావుండేది అని. ఎవరి మానాన వాళ్ళు చూస్తాం. ఎవరి మానాన వాళ్ళు వింటాం. కలిసి చూడడం ఏంటో అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలుస్తోంది, దానికి ఒక ప్రత్యేకమైన అందం ఉంటుందని..

పాపం.. నీకు నాతో ఎంత విసుగొచ్చి ఉంటుంది..? నువ్వు సహించలేకపోయావు కదా..? అందుకే వెళ్లిపోయావు. ఎందుకంటే నువ్వు ఆ పోరాటంలో గెలవలేవు. నీది ఆరాటపడే మనస్తత్వమే కానీ పోరాడే మనస్తత్వం కాదు. జీవన పయనాన్ని అందంగా చేయాలనే నీ ఆరాటాన్ని అర్థం చేసుకోలేని సగటు మగవాడ్ని. నేను నిర్మించుకున్న నా జీవితం అనే బాట మీద వడివడిగా వెళ్ళిపోతున్నాను. నేనే కరెక్ట్ అన్న భావనలో ఉన్నాను. ఈ బాట పక్కన ఉన్న సెలయేళ్లని, పూల మొక్కలనీ, పక్షులనీ పలకరిస్తూ, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని గమనిస్తూ వెళ్లాలని నువ్వంటావు. వాటి దగ్గర కాసేపు ఆగాలనుకుంటావు. వాటిని గమనించే హృదయం నా దగ్గర లేకుండింది. నేను వేసిన ఈ డొక్కు రోడ్డుమీద నిర్లిప్తమైన సగటు నడక నడవలేక నువ్వు చక్కగా హంస ఎక్కి ఎగిరి పోయావు. నీ కోసం వెతుకుతుంటే ఇప్పుడు ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. ఎంత పని జరిగింది? అప్పుడు నా కళ్ళు అహంకారంతో ఎందుకు మూసుకుపోయాయి.. ?

నిజమే ఎప్పటికైనా ఎవరి అంతిమ ప్రయాణం వారిదే. కానీ అంతవరకూ ఒంటరిగా ఎందుకు.. జంటగా సరదాగా ప్రయాణం చేయండి అని పెళ్లితో ఒక నేస్తాన్ని తోడుగా ఇస్తే అది ఎందుకు తెలుసుకోలేకపోయాను..? పాపం నీకు ఈ విషయం తెలుసు.. కానీ నాకు తెలియజేయడం నీకు తెలియలేదు.. నువ్వు మాట్లాడిన భాష నువ్వు వెళ్లాక నాకు అర్థమవుతోంది.. జీవిత కాలం లేటుగా. ఒకే ఇంట్లో ఉంటాం కానీ, చాలా దూరాలు వచ్చేస్తాయి మనుషుల మధ్య. ఉదయం ఐదు గంటలకే లేచి చిరు చీకట్ల మధ్య కాఫీ తాగడం నీకు ఇష్టం. నాకేమో ఆ తెల్లారగట్లపట్టే నిద్ర అంటే ఇష్టం. ఎంత దూరం? రోజుకి రెండు గంటల చొప్పున దూరం జరిగి పోయినట్లే కదా..? ఇలా ఎన్నో.., కాలం మనల్ని చూసి నవ్వుకుని ఉంటుంది.. పాపం వెర్రివాళ్లు అని.

నామీద నాకు రెండు విషయాలకి కోపంగా ఉంది.. ఒకటి నువ్వు ఉన్నప్పుడు ఏమి చేయలేక పోయాను అని.. రెండవది ఇప్పుడు ఎందుకు రావాలి నాకు ఈ రియలైజేషన్ అని.. బహుశా నువ్వు శపించి ఉంటావు.. బహుశా కాదు నిజంగానే శపించావు కూడా.. ఒకసారి అన్నావ్.. నేను పోతే కానీ నా విలువ మీకు తెలియదు అని. అయినా ఆ దేవుడు ఇలా చేసి ఉండకూడదు. ఏదో నీకు కాస్త జబ్బు చేసి, నాకు జ్ఞానోదయం అయ్యి, నీకు తగ్గిపోయి, మనం నువ్వు కోరుకున్నట్టుగా ముచ్చటగా ఉండి ఉండొచ్చు కదా? ఆ కాస్త అవకాశం దేవుడు ఎందుకు ఇవ్వలేదు. నిన్ను లేకుండా చేసి ఇప్పుడు నాకు జ్ఞానం ఇస్తే చేసిన తప్పులని సరిదిద్దుకునే అవకాశమే లేదు కదా..?

ఇది పూర్తిగా నా తప్పేనా..? అలా అనుకుంటే ఇక బ్రతకలేను. ఈ తప్పు ఎవరి మీదనైనా తోయాలని ఉంది. “నా చుట్టూ సమాజం అలా ఉంది.. నాకెవరూ చెప్పలేదు.. మరి మా అమ్మ వాళ్లూ ఎవరి పని వాళ్ళు చేసుకునే వారు.. వాళ్ళు హ్యాపీగానే ఉండేవారు కదా..” ఇలా సర్ది చెప్పుకోవాలని అనుకుంటాను.కానీ ఇంతలో మనసు “అబద్దం, అబద్దం” అని చెబుతోంది. ఇప్పుడు గుర్తొస్తోంది. మా అమ్మ ఇలాంటి కంప్లైంట్స్ చేసేది. “దేనికి కలిసిరారు నాన్నగారు.. ఒక ముద్దూ ముచ్చటా లేదు” అని. నేను ఆ జ్ఞానాన్ని నా లైఫ్‌కి అప్లై చేసుకోలేకపోయాను.

ఈ రాంగ్ టైం రియలైజేషన్ నన్ను తినేస్తోంది. పరీక్ష చెత్తగా రాసి బయటకు వచ్చాక ఆన్సర్స్ గుర్తుకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎవ్వరినీ నిందించలేను. ఇది నా నిర్లక్ష్యమే అని నాకు తెలుసు.. ఏంటో ‘మర్యాద ఇచ్ఛి పుచ్చుకోమని’ నేర్పారు గానీ .. ‘ప్రేమించి, ప్రేమని పొందమని’ చెప్పలేదు. అయినా మరి నువ్వు ప్రేమని ఇచ్చావు కదా.. మరి నీకు ప్రేమ దొరకలేదు కదా.. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు.. నువ్వు ‘ప్రేమిస్తూనేఉండు, వెనక్కి ఏమీ ఆశించకు’ అని డిసైడ్ అయి ఉంటావు.. అలా డిసైడ్ అవ్వడానికి ఎన్ని కన్నీళ్లు మింగి ఉంటావో ఇప్పుడు తెలుస్తోంది. ఆ కన్నీళ్లే నీ గుండెకి అడ్డం పడ్డాయి. లేకపోతే BP కూడా లేదు నీకు స్ట్రోక్ ఏంటి..? ఏమోలే BP కూడా ఉందేమో? నువ్వు నా ఆరోగ్యాన్ని పట్టించుకున్నట్టు నీ ఆరోగ్యాన్ని ఎవరూ పట్టించుకోలేదు కదా? నీకు బాగోలేదేమో అన్న ఆలోచనే రాలేదు. అయినా నాకేం తెలుసు.. నీకు ఏది ఇష్టమో, ఏది కష్టమో? ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కదా? హాస్పిటల్లో నిర్జీవమైన నీ చేయి పట్టుకున్నప్పుడు కానీ తెలియలేదు.. నా జీవితం చేజారిందని.

ఇదేం మనసో.. మనం కలిసి సంతోషంగా గడిపిన రోజులు గుర్తొచ్చినా బాధే.. గడపకుండా వదిలేసుకున్న రోజులు గుర్తొచ్చినా బాధే.. ఇంకా బాధ. ఈ బాధ తీరే మార్గం ఏమైనా ఉందా? I think I am too late..

-ఇట్లు,

నువ్వులేకుండా మిగిలిన నేను..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here