[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]
1
నా భావనలు మిణుగురులు
అవి చీకటిలో తళుక్కుమంటున్న
సజీవ కాంతి రేణువులు
2
పట్టించుకోని చూపులకు
ఆకర్షించలేని దారిపక్కన పూల స్వరాలు
ఆదరబాదరగా గొణుగుతాయి
3
దినసమూహం జారవిడిచిన శకలాలు
మసక చీకటి మనస్సు గుహలో
కలల గూడు కట్టుకుంటాయి
4
చపలత్వపు ఆ క్షణంలో
భవిష్యత్తు ఫలాలు కాని పూరేకుల్ని
వసంతం చెదరగొడుతుంది
5
భూనిద్రనుండి విడిపడ్డ సంతోషాలు
లెక్కలేనన్ని ఆకుల్లో వేగంగా ప్రవహించి
రోజంతా గాలిలో నాట్యం చేస్తాయి
6
దిగుమతితో బరువైన నా రచనలు మునిగిపోతుంటే
అల్పమైన నా పదాలు
సమయం అలలమీద తేలికగా నర్తిస్తాయేమో
7
మనస్సు రహస్య చిమ్మటలు
పొరల్లాంటి రెక్కలతో పెరిగి
సంధ్యాకాశంలో వీడ్కోలు తీసుకుంటాయేమో
8
సీతాకోకచిలక
నెలల్ని కాదు
బోలెడంత సమయంతో
క్షణాల్ని లెక్కిస్తుంది
9
ఒకే ఒక్క నవ్వుతో
ఆశ్చర్యపు రెక్కలమీద నా ఆలోచనలు
మెరుపురవ్వల్లా సవారీ చేస్తాయి
10
చెట్టు తన అందమైన నీడని
ఎప్పటికీ అందుకోలేకపోయినా
ప్రేమగా చూసుకుంటూనే ఉంటుంది
11
సూర్యకాంతిలా నా ప్రేమ
నిన్ను చుట్టుముట్టనీ
అయినా ప్రకాశించే స్వేచ్చ నీకే ఉండనీ
12
అగాధ రాత్రి ఉపరితలం మీద
తేలే రంగుల బుడగలు
పగళ్లు
13
నా నివేదనలు
గుర్తించుకోమని కోరలేని మరీ పిరికివి కావున
నువ్వే గుర్తుంచుకోవాలేమో వాటిని
14
నా పేరు భారమనిపిస్తే
కానుకనుండి దానిని తొలగించేయ్
కానీ నా పాటని మాత్రం ఉంచు
15
ఏప్రిల్ – శిశువులా
పూలతో మట్టిమీద చిత్రలిపి రాసి
చెరిపేసి మరచిపోతుంది
(సశేషం)