[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]
241
దినాంతంలో నా పాటల రేవు
ఎక్కడనుంచి నేను చూడగలుగుతానో
ఆ ఆవలి తీరానికి తీసుకుపోతుంది
242
పూవునుండి పూవుకి ఎగిరే సీతాకోకచిలుక
ఎప్పటికీ నాదిగానే ఉండిపోతుంది
నేను వలపన్ని పట్టిందే నేను కోల్పోతాను
243
నీ స్వరం, విడుదలైన పక్షి, నిద్రిస్తున్న నా వలని చేరుతుంది
నిద్రమబ్బులో నా రెక్కలు
మేఘాల పైనున్న కాంతిని చేరుకున్నట్టు కలగంటాయి
244
జీవితం ఆటలో
నా వంతు అర్థాన్ని నేను కోల్పోతాను
ఇతరులాడే అంశాలు
నాకు తెలియవు గనక
245
పూవు తన రెక్కలన్నింటినీ రాల్చి
దాని పండుని కనుగొంటుంది
246
పూలతేనె గ్రోలేందుకు ఎప్పుడూ తిరిగొచ్చే
దక్షిణగాలి ఆనందం కోసం
నా వెనక నా పాటల్ని వదిలేస్తాను
247
మట్టిలో కలిసిపోయిన ఎండుటాకులు
అడవి జీవితంలో పాలుపంచుకుంటాయి
248
శబ్దాలు నిశ్శబ్దాల నుండి
మనసు దాని పదాల్ని కోరుకుంటుంది
వెలుగుచీకట్ల నుండి ఆకాశంలా
249
కనిపించని చీకటి తన మురళి వాయిస్తే
నక్షత్రాలు, సూర్యుళ్ల లోకి
ఆలోచనలు, కలల్లోకి
కాంతిలయ సుడిగాలిలా చేరుతుంది
250
నాకిష్టమైనవి
నిన్ను గానంచేసే పాడుకునే నా పాటలు
251
నిశ్శబ్ద స్వరం నా పదాల్ని స్పర్శించినపుడు
అతను నాకు తెలుసు కావున నాకు నేను తెలుసు
252
నా అసంపూర్ణత తెలిసినా ఎవరైతే నన్ను ప్రేమించారో
వారికి నా అంతిమ అభినందనలు
253
కానుక ఇవ్వలేనిది ప్రేమ
అది అంగీకారానికే నిరీక్షిస్తుంది
254
మృత్యువు వచ్చి నాతో గుసగుసలాడి
నీ రోజులు ముగిసాయన్నపుడు
నేను అతనికి చెప్పనీ, నేను కేవలం కాలంలో కాదు, ప్రేమలో జీవించానని
అతను అడుగుతాడు, నీ పాటలు నిలుస్తాయా అని
నాకు తెలియదని, నేను పాడినపుడు నాకు తెలిసినదల్లా
నా శాశ్వతత్వం తరచు దొరికేదని, నేను అంటాను
255
నా దీపాన్ని వెలిగించనీయనీ
అంటుంది నక్షత్రం
ఎన్నడూ వాదించకు
చీకటిని తొలగించేందుకు అది సాయపడుతుందా అని
256
నా ప్రయాణం ముగింపుకి ముందు
నాలోకి నన్ను చేరుకోనివ్వు
అంతా ఒకటే అయిన అతను
మార్పు గతి ప్రవాహం మీద
జనసమూహంలో తేలుతూ కొట్టుకుపోతూ
బాహ్య ఆవరణని విడిచిపోతున్నాడు
(సమాప్తం)