Site icon Sanchika

మిణుగురులు-8

[box type=’note’ fontsize=’16’] విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘Fireflies’ కవితా సంపుటిని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ ముకుంద రామారావు. [/box]

106
మంచు దానిని ఓడించినట్టనిపించినా
కదలకుండా పడుంటుంది కొండ

107
నేను నిన్ను నిత్యం గుర్తుంచుకుంటానని
గులాబీ సూర్యునితో చెబుతుండగానే
దాని రేకులు నేల రాలాయి

108
అందుకోలేకపోతున్న నిరాశకి
భూమి సూచనలు
కొండలు

109
ఓ అందమా
నీ పూవులో ముల్లు నన్ను గుచ్చుకున్నా
నేను కృతజ్ఞుడ్ని

110
ప్రపంచానికి తెలుసు
ఎందరో కంటే కొందరే ఎక్కువ

111
మిత్రుడా
నా ప్రేమ నీ మీద భారం కాకుండా ఉండనీ
అది దానికదే ప్రతిఫలమిస్తుందని తెలుసుకో

112
చీకటి ద్వారం దగ్గర వేణువు ఊదుతుంది వేకువ
సూర్యుడొచ్చాక అదృశ్యంతో తృప్తిచెందుతుంది

113
లోపరహితమైన అద్దంలో
తన మొహాన్ని తానే తిలకించిన
సత్యం దరహాసం అందం

114
కేవలం దాని రవంత గోళంలోనే
మంచుబిందువు సూర్యుడ్ని తెలుసుకుంటుంది

115
వదిలేసిన అన్ని వయస్సుల తేనెటీగల్నుండి దీనమైన ఆలోచనలు
నా స్వరాన్ని కోరుతూ, నా గుండె చుట్టూ ఝంకారం చేస్తూ, గాలిలో ముసురుకొంటున్నాయి

116
అడ్డంకిలేని నిష్ఫలత్వ గోడలో
ఎడారి బంధించబడింది

117
చిన్నారి ఆకుల ఒళ్లు జలదరింపులో
కనిపించని గాలి నాట్యం
వాటి మిణుకు మిణుకు మనే కాంతిలో
ఆకాశపు రహస్యగుండె కొట్టుకోవటాల్ని నేను చూస్తాను

118
పుష్పిస్తున్న చెట్టులా నువ్వు
నీ కానుకలకు నేను ప్రశంసిస్తే ఆశ్చర్యపడతావు

119
భూమి హోమయజ్ఞం
నిప్పు రవ్వల్లా పూలని వెదజల్లుతూ
దాని చెట్లలో జ్వలిస్తుంది

120
అడవులు, భూమేఘాలు
వాటి నిశ్శబ్దాన్ని ఆకాశానికి ఎత్తి చూపుతాయి
పైనుండి మేఘాలు
చినుకులతో ప్రతిద్వనిస్తూ కిందికొస్తాయి

(మళ్ళీ వచ్చే వారం)

Exit mobile version