[box type=’note’ fontsize=’16’] వేదాంతం శ్రీపతి శర్మ నూతన శీర్షిక మిర్చీ తో చర్చ…. వేడి మిర్చీ బజ్జీ లో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో ప్రతి పదిహేను రోజులకోసారి వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ మిర్చీ తో చర్చ… [/box]
“ఏం వ్రాస్తున్నావు?” సుందరం అడిగాడు.
“కావ్యమైనా వాక్యమైనా రసాత్మకంగా ఉండాలని ఇదిగో ఇక్కడే చదివాను.”
“మిరపకాయ బజ్జీ” అన్నాడు.
“అదేంటి? వ్యంగ్యమా?”
“కాదు. వాక్యమూ, కావ్యమూ రెండూను.”
“అదెలా?”
“పచ్చి మిరపకాయలో రసం చేర్చి పిండిలో ముంచి నూనెలో వేపుకుని తింటాం.”
“కరెక్ట్.”
“పచ్చి మిరపకాయ వాక్యం. బజ్జీ కావ్యం.”
“ఛా.”
“మరి? మిర్చీ బజ్జీని మించింది లేదు. దాని విలువ ఎవరికీ తెలియటం లేదు.”
“కరెక్ట్.”
సుందరం వార్తా పత్రిక తీసుకున్నాడు. ‘నగరంలో ఈ రోజు… చదువుతా విను’ అన్నాడు.
“ఎందుకు?”
“అదేం ప్రశ్న? నా స్టార్టప్ ఈ రోజు నుంచే.”
“శభాష్. ఏంటా కంపెనీ?”
“ఇంకేముంది? మిర్చీ బజ్జీ మొబైల్ స్టాల్.”
“అన్యాయం. బి.టెక్. చదువుకుని ఆఖరుకి ఇదా?”
“తప్పేం లేదు. ఈ సాయంత్రం ఎక్కడ స్టాల్ పెట్టాలా అని చూస్తున్నాను.”
“ఇంకేం? చదువు.”
“ఊఁ… స్థానిక రవీంద్రభారతిలో సాయంత్రం నాలుగున్నరకు జిల్లేళ్ళ పోలేరమ్మ గారి ప్రసంగం – శీర్షిక… స్త్రీ ఒక శక్తి.”
“ఇంకేం? విరగబడి మిర్చీ తింటారు.”
“వద్దురా బాబూ. మా ఆవిడకి దొరికిపోయానంటే నా వేళ్ళను కొరికి బజ్జీలు వేసి ఆ సభలోనే కొత్త ఐటమ్‍గా స్టార్టప్ ఇచ్చేస్తుంది…!”
“ఓ. ముందుకెళ్ళు.”
“నగర గ్రంథాలయంలో ఆరు గంటలకు అందరూ మౌనంగా కూర్చుంటారు.”
“ఎందుకు?”
“ఇక్కడ వ్రాయలేదు.”
“పోనీ ఇక్కడ బండి పెడితే?”
“వద్దు. మొదటి రోజే ఇలాంటి చోట ఓ సెంటిమెంట్. పోతే… కె.వి.బి. పార్క్‌లో ప్రకృతి వైద్యం, ‘రోజూ తినే వస్తువులలో కొద్దిగా గడ్డి కలుపుకుని తింటే ఎలా ఉంటుంది’ అనే అంశం మీద చర్చ ఉంటుంది. ఇదెలా ఉంది?”
“వద్దు సుందరం… ఈ తరహా మనుషులు మిర్చీ బజ్జీని అమ్మనీయరు. తరువాత చూడు.”
“తరువాత… ఆంజనేయస్వామి గుడిలో కుమారి రుద్రమదేవి యొక్క భరత నాట్యం… ఇదెలా ఉంది?”
“ఇది బాగానే ఉండవచ్చు కానీ ఒకసారి ఫొటో చూపించు, ఏది?”
పేపరు ఇటు తిప్పాడు.
“సుందరం… ఈమె కుమారి అన్నారు కానీ చాలా పెద్ద ఆంటీలా ఉంది. ఇద్దరు ముగ్గురు కంటే ఉండరు.”
“కరెక్ట్. తరువాత… తార్నాకలో ‘నేను ఇక వ్రాయను’ అనే పుస్తకం మీద పలువురు రచయితల సమీక్ష ఉంటుందట! ఇదేమిటిరా గోల? ఊర్లో సరైన కార్యక్రమమే లేదా?”
“కాదు. ఆలోచించు. ఈ చివరిది కరెక్ట్. ఎక్కువగా మిర్చీ బజ్జీ తినేవాళ్ళే ఇక్కడికి వస్తారు. దాచుకొన్న మసాలా, ఎన్నాళ్లగానో వండుకొన్న వంటలు, కారాలు మిరియాలు నూరుకొన్న వ్యంజనాలు, విచ్చలవిడిగా పంచుకొనే ప్రదేశం ఇది!”
“నిజమే. టైటిల్ కూడా ఆలోచింప జేస్తోంది. ‘నేను ఇక వ్రాయను’ అనే టైటిల్‌తో పూర్తి పుస్తకమే వ్రాసాడు ఈయనెవరో.”
“కరెక్ట్.”
“ఇది నిజమైన మిర్చీ. నాలుక కాలుతుంది, శరీరానికి మంచిది కాదు అని తెలిసినా లోకం నమిలేసేది మిర్చీని! మంచి స్టార్టప్! చలో!”
***
సందులో మిర్చీ బండి ఆగింది. సుందరాన్ని అతని పనికి వదిలేసి నేనో సంచీ వేసుకుని లోనకెళ్ళాను. పెద్దాస్పత్రిలో లోపల ఎవర్నో ట్రీట్‌మెంటుకు పంపి రిసెప్షన్‌లో కూర్చున్న మనుషుల్లా ఓ పది మంది కనిపించారు. నేనెవరికీ పరిచయం లేకపోయినా, నాకు ఇద్దరు చెయ్యి చూపించారు. నేనూ నా చెయ్యి చూపించి ఓ మూల కూర్చున్నాను.
వేదిక మీద అనర్గళంగా మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాను. అడ్డదిడ్డంగా గడ్డం పెంచి, ‘ఇంకొక్కడు నాతో వస్తే చాలు, ఈ దేశాన్ని మార్చేస్తాను’ అని చెప్పే మనిషిలా చాలా చోట్ల కనిపిస్తాడు ఈయన. ఇదన్న మాట సంగతి. ఈ బాపతు సభల్లో ఇక్కడే ఉంటాడు.
“బాగుంది” అన్న మాట ప్రక్క నుండి వినిపించింది. అటు చూశాను.
“ఏంటి?” చిన్నగా అడిగాను.
“మిర్చీ బజ్జీ” అన్నాడు. ఆయన చేతిలో కాగితం ప్లేటు చూసి కిటికీ బయటకు చూశాను. సుందరం తన పనిలో తాను ఉన్నాడు. ఈ గదిలోంచి చాలామంది అటే చూస్తున్నారు. మొబైల్‌లో ఏదో ఫోన్ వచ్చినట్టుంది, ఓ సభ్యుడు అది పట్టుకుని బయటకి వెళ్ళి బండి దగ్గర నిలబడ్డాడు. గెడ్డం మాస్టారు మాట్లాడుతూనే ఉన్నాడు. కిటికీ బయటకు చూశాను. ఆ మొబైల్ పట్టుకున్నాయన ఓ ప్లేటు అందుకున్నాడు. ఆకాశంలోకి చూస్తూ మిర్చీ సేవిస్తున్నాడు…
” ‘నేను ఇక వ్రాయను’ అనే పుస్తకం మీద ఇప్పుడు ఆత్మారాం గారు మాట్లాడుతారు” అని చెప్పడం జరిగింది. ఆత్మారాం గారు లేచారు. ఆయనెందుకో చాలా సేపు అలా నిలబడే ఉండిపోయారు. నడుము సమస్యలున్నవారు గబుక్కున లేవటం లేదా ఉన్న పళంగా కూర్చోవటం చెయ్యకూడదని డాక్టర్లు చెబుతూ ఉంటారు. ఏదో ఒక విచిత్రమైన అనారోగ్యం – ఏదో ఒక లడ్డూలో అక్కడక్కడా నాలుకకు తగులుతున్న నూపప్పో లేక జీడిపప్పో లాగా – తరచూ తగులుకునేవారు రచయితలయి తీరుతారని కొందరు అనటం నేను కూడా విన్నాను. కాకపోతే వైద్యులు చెప్పిన జాగ్రత్తలు మైకు కమ్మిన మైకంలో పూర్తిగా మరచిపోవడం సహజం.
మైకును సర్దుకున్నాడు. ఎందుకో అందరినీ కొద్దిగా కోపంగా చూశాడు.
“అసలు మనిషి ఎందుకు వ్రాయాలి?” అడిగాడు. కొద్ది సేపు అందర్నీ చూసి, “ఎందుకు వ్రాయటం మానెయ్యాలి?” అని అడిగాడు.
ఎందుకో ఎవరో చప్పట్లు కొట్టి, ఎవరూ కొట్టకపోవటం వలన అటూ ఇటూ చూసి వెర్రి నవ్వు నవ్వాడు. ఆత్మారాం గారు అల్పసంతోషి. అంతదానికే అతన్ని చప్పట్లు కొట్టవద్దని చెయ్యి చూపించాడు.
“వీటన్నిటికీ చక్కని సమాధానాలు రచయిత ఈ పుస్తకంలో చూపించాడు. న్యాయం పట్టి పిండితే నాకసలు నేను గతంలో వ్రాసిన పుస్తకం ‘నేను మాట్లాడను’ గుర్తుకు వచ్చి నన్ను ఎంతగానో గిలిగింతలు పెడుతున్నది. మీరు వద్దన్నా ఆ పుస్త్తకంలోని కొన్ని పుటలను ఇక్కడ మీకోసం… ఏంటి? మీ కోసం కొద్దిగా ఉటంకిస్తాను…” అంటూ ఓ సంచీలోంచి పుస్తకం తీశాడు. అందులోంచి అదే పనిగా చదవటం ప్రారంభించాడు. మరో ఇద్దరు మిర్చీ బజ్జీ బండి వైపు బండి కట్టారు…
ఇంతలో గెడ్డం మాస్టారు విశ్వప్రయత్నం చేసి ఆత్మారాం గారిని కూర్చోబెట్టాడు. ఆయన మైకు తీసుకున్నాడు.
“ఈ రోజు సుదినం..!” అన్నాడు, చిన్నగా టేబుల్ మీదకి పాకుతూ… “ఈ రోజు సుదినం. ఎందుకంటే వ్రాయటానికీ, మాట్లాడటానికీ ఆత్మారాం గారు చక్కని అనుసంధానం చేశారు…” అంటూ ఓ అరగంట అందరినీ ఆవహించి మైకు పండరీబాయి గారికి ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఓ పెద్దమనిషి తెల్ల చొక్కా, తెల్ల పాంటులో దర్శనం ఇచ్చాడు. అక్కడున్న అందరికీ మిర్చీ బజ్జీ ఆర్డరు చేశాడు. అందరం చెరో ప్లేటూ లాక్కున్నాం.
పండరీబాయి గారు చీరె సర్దుకున్నారు.
“నేను పండు ముసలినీ కాను, నిండు గర్భిణినీ కాను. పండరీబాయిని. అందుచేత నేను వ్రాస్తాను…” అన్నారు. అందరూ సరదాగా చప్పట్లు కొట్టారు.
“రచయిత ఇక వ్రాయను అని ఎందుకంటున్నాడు – ఇది ఈ రోజు మన ముందరున్న ప్రశ్న. అసలు ఏ రచయిత అయినా వ్రాయను అంటున్నాడంటే ఖచ్చితంగా సమాజం దానికి తీవ్రమైన నిరసన చేపట్టాలి. పాడాలనే ఉన్నది అని ఒక పాట ఉంది. అలాగే వ్రాయలనే ఉన్నది అని ఎవరైనా అనాలి కానీ నేను ఇక వ్రాయను అని ఎన్నడూ అనకూడదు!”
ఇలా చెబుతుండగా ఒక చిన్నపిల్లని వెంటపెట్టుకుని ఓ పెద్దాయన వేదిక మీదకి ఎక్కి మైకు లాక్కున్నాడు.
“క్షమించాలి…” అన్నాడు. “నా మనవరాలు ఒకటే పేచీ పెడుతోంది. మైకులో పాడాలని ఒకటే గొడవ. పండరీబాయి గారు ఎందుకో పాడలని ఉంది అనే సరికి సభకు సాహిత్యంతో పాటు సంగీతం కూడా తోడవగలదని ఇలా చొరవ తీసుకున్నాను. అమ్మా, పాడు. చక్కగా పాడు”.
ఎవరో వెనుక నుండి ‘వినాలనే ఉంది’ అన్నాడు. కొద్ది సేపు నవ్వుకున్నాం. పాప మైకు తీసుకుని ‘హీ..’ అని అటూ ఇటూ చూసింది. గెడ్డం మాస్టారు గెడ్డం గోక్కున్నాడు.
“మై లడకీ ఘుమా రహా థా…” అని మొదలుపెట్టింది.
“మై గాడీ చలా రహా థా…” ఎవరో తాళం వేస్తున్నారు.
“తుఝ్‌కో మిర్చీ లగే తో మై క్యా కరూం…”
ఆ గది మొత్తం ఊగిపోతోంది. కిటికీ దగ్గర సుందరం పండగ చేసుకుంటున్నాడు.
గెడ్డం మైకు తీసుకున్నాడు.
“సంగీత రస విభావరి బాగుంది…” అన్నాడు. “… ఇప్పుడు అసలు వక్త ‘నేను ఇక వ్రాయను’ పుస్తకం రచయిత ప్రసంగిస్తారు.”
ఆయన పుస్తకాన్ని ఎందుకో ప్రేమగా నిమిరాడు. ఒక రచయితకి తన పుస్తకం పట్ల మిగిలేది అదొక్కటే… ఓ చిన్ని ఆత్మానందం! ఓ వెర్రి ఆత్మానుభూతి!
“నేను ఎన్నో పుస్తకాలు వ్రాశాను. వాటి గురించి పెద్దగా ఎవరూ మాట్లాడలేదు. ఎందుకో వ్రాయను అనగానే ఈ పుస్తకం గురించి ఆలోచించటం మొదలుపెట్టారు…”
గదిలో నిశ్శబ్దం కమ్ముకుంది.
“నిజానికి ఇది కొత్త పుస్తకం కాదు. నా రచనలన్నింటిలోనుండీ సావకాశంగా ఏరుకొని కొన్ని అంశాలను ఒక సరళిలోకి తీసుకొని వచ్చాక నా జీవన యానానికి ఇది చాలు అనిపించి ఇక్కడ ఓ మిర్చీ బజ్జీలోని దినుసులను ఒక చోట పెట్టి ఆస్వాదించమన్నట్లు పేర్చి మీ ముందుంచాను. వ్రాయను అని శీర్షిక ఇచ్చినందుకు మానవ మనసు దగ్గరకు తీసుకుని రుచి చూస్తున్నందుకు ధన్యవాదాలు.”
అందరూ చప్పట్లు కొట్టారు.
“మరో విషయం…!” అన్నాడాయన. “… ఏ పుస్తకావిష్కరణ సభకీ రాని నా శ్రీమతి ‘నేను ఇక వ్రాయను’ అనే పుస్తకావిష్కరణకి ఎందుకు వచ్చిందో మీరే ఆలోచించుకోవాలి” అని అందరికీ నమస్కారం చేసుకొని కూర్చున్నాడు.
***
మిర్చీ బండీ ఖాళీ అయింది. ఇద్దరం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకొన్నాం. సుందరం మంచి హుషారుగా ఉన్నాడు.
“ఎలా ఉంది స్టార్టప్?” అడిగాను.
“అప్.. భలేగా ఉంది. ఇక చూస్కో. మూడు మిర్చీలు, ఆరు కుర్చీలుగా సాగుతుంది. ఇంత లాభం కొడతాననుకోలేదు.”
“నీ పనే బాగుందయ్యా! నీకు డబ్బు మిగిలింది. నాకు కేవలం వెర్రి ఆలోచనలు మిగిలాయి.”
గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బండి కదిలింది.
“ఊర్కో. మిర్చీ సామాన్యమైనది కాదు. దీనితో చర్చ జరుగుతూనే ఉండాలి!”
“కరెక్ట్.”
00000