[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ”. [/box]
[dropcap]ఆ[/dropcap]దివారం కొద్దిగా ఆలస్యంగా నిద్ర లేచి సుందరం కోసం అటూ ఇటూ చూశాను. సుందరం అసలు సిసలు వ్యాపారి. కాలం వృథా చేయడు. అప్పటికే లేచి ఏదో పని చేసుకుంటున్నాడు కాబోలు. ఇంతలో ఓ మూల కుర్చీలో అటు తిరిగి కూర్చున్నట్టు అర్థమైంది. కాకపోతే, ఓ పసుపు పచ్చని శాలువా ధరించాడు. దగ్గరగా వెళ్ళాను. ఆ శాలువా నిండా మిర్చీ బొమ్మలు ఆకుపచ్చని రంగులో మెరుస్తున్నాయి. భుజం మీద చెయ్యి పెట్టాను.
“నా వల్ల కాదు” అన్నాను.
“ఏంటి కాదు?”
“ఏంటి ఈ అవతారం? మిర్చీ స్వామివా?”
“కాదు”
“చేప మందులాగా మిర్చీ మందు ఇస్తావా?”
“నో”
“మరి? నీ మిర్చీ గ్రూప్‌ని తీసుకెళ్ళి ఏకంగా హరే మిర్చీ గ్రూపు కింద మారుస్తున్నావా?”
“నో”
సుందరం లేచి నిలబడ్డాడు. త్రిశూలం సినిమాలో కృష్ణంరాజులా శాలువా సర్దాడు. నుదుటి మీద రక్త తిలకం మెరుస్తోంది.
“ఈ తిలకం ఏమిటి?”
“ఆకారాన్ని జాగ్రత్తగా గమనించు”
జాగ్రత్తగా చూశాను. నిజమే. చక్కని పచ్చి మిర్చీని నిలబెట్టి మూసలా చేసి అందులోకి తిలకం దిద్దినట్లుంది.
“ఆరు చక్రాలపైన ఏడో చక్రం ఇది”
“ఛా”
“మిర్చిక చక్రం. ఇది అదృశ్యంగా ఉంటుంది”
“నిన్ననే విన్నాను”
“ఏంటి?”
“పంచమంలో శని ఉన్న వాడి బుర్రను పరమాత్మ కూడా బాగు చేయలేడు అన్నాడు!”
“పాయింటుకు వచ్చాం. నీవు ఏదైనా చదువుతున్నది అర్థం కాకపోతే దాని గురించి ఇంకొకరికి చెప్పు. అర్థమైపోతుంది!”
“అంటే”
“ఇది మిర్చీ శాలువా! దీనిని ఓ పెద్దాయనకు కప్పుతున్నాను. మిర్చీ బండిలో పార్టిషన్ ఉంటుంది. ఆయన లోపల ధ్యానంలో కూర్చుని జ్యోతిషం చెబుతాడు. మిర్చీ తినేవారికి అది ఉచితం”
“ఇది అన్యాయం. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమమైన….”
చెయ్యి అడ్డుపెట్టాడు సుందరం.
“చూడు బ్రదర్! ఇల్లు వాకిలి అనేవి పాత మాటలు. అందరి ఇళ్ళూ నడి బజారులోనే ఉన్నాయనేది అక్షర సత్యం. మనలోని చైతన్యం గురించి మనకెందుకు? మనం ఈశ్వరుని అద్భుతమైన చైతన్యంలో ఉన్నాము. మన ఇల్లు కూడా ఓ పెద్ద మార్కెట్‌లోనే వున్నదని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం!”
***
జనం పుష్కరాలను మరపించారు. నేను చేరుకోవడం ఆలస్యం అయినట్లుంది. దూరంగా కాషాయం రంగు తెరలోపల మిర్చీ బండీ కనిపిస్తోంది. ఎలాగో అలాగ అందరినీ తోసుకుంటూ లోపలికి వెళ్ళాను. సుందరం చెమట్లు కక్కుతున్నాడు.
“టైమ్‌కి వచ్చావు. టోకెన్లు ఇవ్వు. నావల్ల కావడం లేదు” అన్నాడు.
ఆశ్చర్యం వేసింది. ఆరు మూకుళ్ళలో మిర్చీ బజ్జీలు వేగిపోతున్నాయి. టోకెన్లివ్వడం మొదలుపెట్టాను. ఇక్కడ తింటున్నారు, అక్కడ లోపలికెళ్ళి జాతకం చెప్పించుకుని వెళ్ళిపోతున్నారు.
జనం లోంచి కొంతమంది వాళ్ళంతట వాళ్ళే అక్కడున్న బెంచీల మీద కూర్చోబెడుతూ లైను సంగతి చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. ఓ కుర్రాడు కాగితాలిస్తున్నాడు. దూరం నుంచి చదివాను – యాదాద్రిలో లే అవుట్‌లో ప్లాట్లుట!
విభూది దట్టంగా పెట్టుకున్న ఓ పెద్దాయన ఎందుకో నా పక్కన నిలబడ్డాడు. జనాన్ని సర్దుతున్నాడు.
“ఇంత కాలం ఈయన ఎక్కడున్నాడండీ?” అడిగాడు.
“ఎవరు?”
“ఈ జ్యోతిష్కుడు… సామాన్యుడు కాడండీ”
ఆలోచించాను. సుందరం ఎవరిని నియమించాడో నాకే తెలియదు. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెప్పాలి.
“విజయనగరం దగ్గర దూరంగా ఓ పల్లెటూరుకు ఆనుకుని కొన్ని కొండలున్నాయి సార్”
“అవును ఉన్నాయి”
“అలా బాగా లోపలికి వెళితే ఒక లోయ వస్తుంది”
“ఆఁ”
“ఆ లోయ లోంచి జాగ్రత్తగా అటు దాటెయ్యాలి”
“అచ్ఛా”
“అక్కడ రెండు గుహలున్నాయి”
“ఒకే”
“ఈయన ఉత్తరాయణంలో ఒక గుహలోనూ, దక్షిణాయణంలో మరో గుహలోనూ ఉంటారు”
“ఛా”
“అవును”
“ఇక్కడికెలా వచ్చారు?”
“ఈ ఒక్క నెలా మిర్చీ మాసం – కేవలం మిర్చీ తిని శయనిస్తారు”
“వామ్మో! మిర్చీకి అంత ఉందా?”
“అదేవన్నమాట! రెండు మిరపకాయలతో ప్రత్యంగిరా అనే విధానం ఉన్నది కదా?”
ఆయన కళ్ళెగరేశాడు.
“కరెక్ట్” అని ఎందుకో చెంపలేసుకున్నాడు.
ఆయన వద్దకు ఎవరో వచ్చి ఏవేవో అడుగుతున్నారు. ఆయన ఇంకేవో వారికి చెప్పేస్తున్నాడు.
బండి లోంచి చెప్పించుకున్న వాళ్ళు క్రిందకి దిగుతూ ఫామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నవాళ్ళలా అదోలా ముఖం పెట్టి కొందరు ఇబ్బందిగా, కొందరు మూడు రోజులుగా మురిగిన డ్రైనేజి క్లియర్ అయినట్లు సంతోషంగా జనంలోకి వెళ్ళిపోయి మాయమైపోతున్నారు.
ఇవతలికి వచ్చిన ఓ పెద్దావిడని ఎవరో అమ్మాయి అడుగుతోంది “ఆంటీ, ఎలా చెబుతున్నారాయన?”
“అమ్మో! సామాన్యుడు కాడు. కళ్ళు తెరవడు. టకటకా ప్రశ్నలు వేస్తాడు. మనం తడుముకోకుండా చెప్పాలంతే! తరువాత ఏం చెయ్యాలో చెబుతాడు”
“ఓ! మీరు మీ గురించి అడిగారా?”
“లేదే అమ్మాయీ. మా అబ్బాయి గురించి అడుగుతానని చెప్పి మిర్చీ బజ్జీలు తినే ఛాన్స్ కొట్టేశా! లేకపొతే నన్ను తిననియ్యరు గదా!”
ఇంతలో చీపురు పుల్ల సైజులో పొడుగ్గా ఒకాయన ఇవతలికి వచ్చాడు. నడుం మీద రెండు చేతులు పెట్టుకొన్నాడు. వాలకం చూస్తుంటేనే అర్థమవుతోంది, వారానికి ఇద్దరు డాక్టర్లను మార్చినట్టు రోజుకు ముగ్గురు జ్యోతిష్కులను మారుస్తున్నట్టున్నాడు. ఆయన దగ్గరనుండి టోకెన్ తీసుకుని డబ్బాలో పెట్టాను.
“ఇంతమంది జనం ఊరికే రారు సార్” అన్నాడు.
సీరియస్‍గా తలాడించాను.
“చాలామందిని చూశాను…” అంటూ ఎందుకో ఆగాడు.
“…అసలు ఏదో శక్తి ఉందండీ! సార్, మీరు ఇలాంటి చోట కాదు సార్, బాగా స్థలం ఉన్న చోట పెట్టాలి. దీనిని ఆన్‌లైన్ చేయండి. పిచ్చి ఎక్కి దిగిపోతుంది కూడాను!”
అలా ఆయన గాలిలో తేలుతూ ఎటో వెళ్ళిపోయాడు. ఆదివారం రోజంతా ఎలా గడిచిపోయిందో తెలియదు. మిర్చీ బజ్జీ మీద జనాలకి ఎంత ప్రేమో, జాతకాలంటే అంత వెర్రి అని కూడా అర్థమైంది.
ఇంతకీ ఏం చెబుతున్నాడో చూద్దామని లోపలికి వెళ్ళాను. జనం పలచబడ్డారు. నా డ్యూటీ సుందరం తీసుకున్నాడు.
ఎదురుగా కూర్చున్నాను. నా చేతిలోని టోకెన్ తీసుకుని పక్కన బెట్టాడు. చేతులు రెండూ శాలువా లోపలే ఉన్నాయి. మిర్చీ తిలకం చెమటతో మరింత మెరుస్తోంది. కళ్ళు మూసుకుని చిరునవ్వు చూపించాడు.
“ఏమైంది?” అన్నాడు
“ఏంటి?”
“హు హు”
“అంటే?”
“పదకొండవ ఏట ఏమైంది?”
“ఓ పెళ్ళి కెళ్ళి ఇద్దరం పడుకునే మంచం మీద ఆరుగురం పడుకున్నాం. నేను చివర పడుకుని జారిపడ్డాను”
“ఊఁ… పుట్టినప్పుడు ఏమైంది?”
“ఏమీ లేదు. ఆఁ, ఆఁ… మా మేనత్తకు ఓ కంటిలో చూపు పోయింది”
“ఊఁ… అక్షరాభ్యాసం రోజు ఏమైంది?”
“ఊర్లో పంటలన్నీ మంటల్లో కలిసాయి”
“యోగ జాతకుడవు”
“ఛా”
“మరి? రెండు సార్లు పెళ్ళి చూపులకు వెళ్ళావు”
“అవును”
“మూడవది అవలేదు. మూడేండ్లు పట్టింది”
“కావచ్చు”
“అమ్మాయి ఉంది”
చుట్టూతా చూశాను.
“ఎక్కడ?”
“పిచ్చివాడా! ఇక్కడ కాదు. ఒంటికాలి మీద నిలబడి నీ కోసం తపస్సు చేస్తోంది”
“ఛా”
“అవును”
“నేనెలా తెలుసు ఆమెకి?”
“ఇంటికెళ్ళి ఆలోచించు. పిచ్చుకలకు గింజలు వెయ్యి”
“పిచ్చుకలు కనిపించడం లేదు”
“ఫరవాలేదు. పావురాలు వస్తాయి”
“ఒకే”
“వచ్చేవారం కనిపించు”
నమస్కారం పెట్టుకుని లేచాను. కాళ్ళ దగ్గర ఏదో కొండచిలువ లాంటి తాకిడి అయి గాభరా పడ్డాను. అతనే గట్టిగా పట్టుకున్నాడు.
“అయ్యో! ఏంటిది?”
“సార్! నా గుట్టు ఎక్కడా చెప్పకండి”
“ఎవరు నువ్వు?”
“సుందరం సార్ ఇలా చెయ్యమన్నారు”
“ఓ… నిన్నెక్కడో చూశానయ్యా!”
“నేను సార్, రాజుని. మీ బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటాను”
***
మిర్చీ బండీ అలా పోతోంది. మా జ్యోతిషరత్న కాల్ళు జాపుకుని దమ్ము లాగుతున్నాడు. సుందరం ఫోన్ మ్రోగింది.
“హలో”
“సుందరం గారా?”
“అవునండీ”
“సార్! మేము అరిష్ట టి.వి. నుంచి మాట్లాడుతున్నాం సార్”
“చెప్పండి”
“సార్, మీ జ్యోతిషరత్న నంబరు కొద్దిగా కావాలి సార్. మెసేజ్ పెడతారా? ఈ నెంబరుకే!”