మిర్చీ తో చర్చ-11: మిర్చీ థెరపీ

0
5

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ”. [/box]

[dropcap]భ[/dropcap]గవంతుడు కొందరి జాతకాలు నూనెలో ముంచిన కాగితాల మీద వ్రాస్తాడేమోనన్న అనుమానం నాకు చాలా సార్లు వస్తూ ఉంటుంది. అలా వ్రాసిన జాతకాల మెరిట్ లిస్ట్‌లో నా పేరు కూడా ఖచ్చితంగా ఉందని నేను గట్టిగా నమ్ముతాను. బస్సులో కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు ప్రక్కన కూర్చున్న పెద్దాయన పూర్తిగా నా భుజం మీద వాలిపోయి సుఖనిద్రలో సురక్షితమైన ప్రయాణం చేస్తున్నప్పుడు; రైల్లో లోయర్ బెర్త్ దొరికింది కదా అనుకుంటుండగానే ఓ నిండు గర్భిణి ఎదురుగా నిలబడి సందర్భాన్ని గమనించమన్నట్టు పళ్ళికిలించినప్పుడు, అప్పు ఇస్తానని పంచభూతాల సాక్షిగా ఒప్పుకున్న మిత్రుడి ఫోన్ స్పందించడం లేదని అత్యంత వినయంగా స్పందించిన ఫోన్ను చూసినప్పుడు  ఈ ఆలోచన నా అంతరంగాన్ని చిన్నగా స్పృశిస్తూ ఉంటుంది.

బాల్కనీలో ఉన్న కొద్ది చోటులో భాగ్యనగరం నోచుకున్న ఆ మాత్రపు భాగ్యపు వానకి చిహ్నంగా ఏర్పడ్డ ఆ కొద్దిపాటి నీటిలోనే కరెక్ట్‌గా సూటిగా విసిరిన పేపర్ ఈ ఉదయం నన్ను వెక్కిరిస్తున్నప్పుడు కూడా అదే ఆలోచన మరోసారి కలిగింది. గబగబా దానిని తీసి ఒక్కో కాగితం నేల మీద పరిచాను. అసలు మీడియా వాళ్ళు నియమానుసారంగా ఈ విషయంలోని సారాన్నీ పూర్తిగా గ్రహించరని అర్థమైంది. లోపలి కాగితాలకు తడి అంటనే లేదు! ఓ రంగుల కాగితం ఇవతలకి వచ్చింది. టై కట్టుకుని ఉన్న సుందరం కనిపిస్తున్నాడు. జాగ్రత్తగా చదివాను. “విదేశాలలో సంచలనం సృష్టించిన మిర్చీ థెరపీ ఇప్పుడు మీ మహానగరంలో…”

***

ఈ సారి సుందరం డ్రామా విఫలమైందనే అనుకున్నాను. అయిదు గంటలకు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఆ ఫ్లెక్సీల దగ్గర నిలబడి చుట్టూతా చూశాను. ఎవడూ కనిపించలేదు.

“మీకు తెలుసా?” అని ఫ్లెక్సీ మీద వ్రాసి వుంది.

“మీకు తెలుసా? ఏ వ్యాధికైనా మూల కారణం తాత్వికంలో 50%, మానసిక పరిస్థితిలో 25%, సామాజికపరమైన కారణలలో 15% మరియు శారీరకపరమైన కారణాలలో 10% దాగి ఉంటుంది. మీలో ఉన్న సమస్య ఎందులో ఉన్నది అన్నది మీరు మూడు మిర్చీ బజ్జీలు వరుసగా తిన్న తరువాత విశ్వవిఖ్యాతి గడించిన వైద్యులు మిమ్మల్ని పరిశీలించి చెబుతారు. హాలులో కెమెరాలుంటాయి. మీరు మిర్చీ బజ్జీ తినే విధానాన్నీ, ఆ తరువాత మీరు మాట్లాడే మాటలని, మీ ఇతర విన్యాసాలనీ అతి సూక్ష్మంగా పరిశీలించడం జరుగుతుంది. మూడు రోజులలో మీ అన్ని సమస్యలక్కీ పరిష్కారం మిర్చీ బజ్జీతోనే మీకు లభించగలదు.”

ఆ ఉపోద్ఘాతం క్రింద ఆరు ఫొటోలున్నాయి. వాటిల్లో డాక్టర్లు చిత్రంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఫొటోల చుట్టూ మిర్చీల తోరణాలు కనిపిస్తున్నాయి. మొదటి ఫొటోలో ఓ ఆఫ్రికన్‌లా కనిపిస్తున్నాడు – పేరు గ్రెగరో జిబిలీ అని ఉంది. జిబుటీ ద్వీపాల నుండి ప్రత్యేకంగా వచ్చిన వైద్యుడు. దానికింద షారన్ పొపొవా అనే అందమైన యువతి కనిపిస్తోంది. కజకిస్థాన్‌కు భారతదేశం నుండి తీసుకువెళ్ళి అక్కడివారికి మిర్చీ బజ్జీ రుచి చూపించిన మహిళా శాస్త్రవేత్త. దానిక్రింద వి.ఎస్. యోగీశ్వర్ అనే భారతీయుడున్నాడు. అమలాపురం దగ్గరనున్న లంకలలో రకరకాల మిర్చీలను పండించి, మానవ శరీరానికీ ఒక మిరపకాయలో గల భాగాలను అనుసంధానించి ఇక్కడ షట్చాక్రాలనూ, అక్కడ పలురకాల గింజలను అన్వయించి మిర్చీ యోగాన్ని ఆవిష్కరించిన విశిష్టమైన వ్యక్తి అని వ్రాశారు. ఆయన చాలా గంభీరంగా ఉన్నాడు.

దాని క్రింద చల్లని చిరునవ్వుతో ఓ కొరియన్ సుందరి కనిపిస్తోంది. చాంగ్ చా అని వ్రాసి ఉంది. ఆ పేరు క్రింద అడ్వాన్స్‌డ్ మిర్చీ థెరపిస్ట్ అని పరిచయం చేస్తున్నారు.

దాని క్రింద ఎన్నో సినిమాలలో నటించిన పాత హీరో ఫొటో వుంది. మిర్చీ థెరపీ వలన ఒక దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందినవారు – వీరి పరిచయం ఎవరికీ అక్కరలేదు అని చెప్పారు. వారి అనుభవాలను వారు చివరకు తెలియజేస్తారు అని వ్రాశారు.

దాని క్రింద సుందరం ఫొటో కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల కో-ఆర్డినేటర్ అని చెపుతున్నారు.

ఎక్కడి నుండో ఈల వినిపించింది.

“ఆ కారు మీదా?” నన్ను అడుగుతున్నాడు.

అతని చెయ్యి తీసుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చాను.

“థ్యాంక్స్. నేను కారులో రాగలనని అనుకున్నందుకు. నాది కాదు” అన్నాను.

అతను వ్యంగ్యంగా చూశాడు. “డ్రైవర్ అనుకున్నాను” అంటూ వెళ్ళిపోయాడు.

***

దూరంగా ఉన్న మైదానంలో కార్లు ఆగి ఉన్నాయి. క్రింద కేవలం రిజిస్ట్రేషన్ పెట్టుకుని పైన హాల్లో కార్యక్రమం జరుపుతున్నట్టు అర్థమైంది.

తెల్లని దుస్తులలో కొందరు కార్యకర్తలు నిలుచున్నారు. వివరాలన్నీ వ్రాసుకుని ఓ గదిలోకి పంపారు. ఫీజు కట్టిన ప్రతి ఒక్కరికీ మూడు బజ్జీల ప్లేట్లు అమర్చారు. ఓ వంద మందిని ప్లేట్ల ముందు నిలబెట్టారు. నిశ్శబ్దం పాటించమన్నారు. అయిదు నిముషాలు ఏదో చిత్రమైన సంగీతం వినిపించింది. కార్యకర్తలు ముందుకొచ్చారు.

“మిర్చీ క్రియకు అందరికీ స్వాగతం. ఈ రోజు మీది. ఇది ఇప్పటికే  మూడవ బ్యాచ్. ఒక్కసారి శ్రీకృష్ణుడిని తలచుకోండి. ఏం చెప్పాడు? “యం ప్రాప్య న నివర్తంతే తత్ ధామ పరమం మమ!” దేనినైతే పొందిన తరువాత తిరిగి ఎటూ చూడవలసిన అవసరం ఉండదో ఆ సన్నిధానాన్ని తానన్నాడు! అటువంటిదే మిర్చీ క్రియ! దేనినైతే సరైన మోతాదులో ఈ శరీరం పొందిన తరువాత మరి ఏ ఇతర పదార్థంతో పని ఉండదో మీరు సాక్షాత్ దాని ముందు నిలుచున్నారు. మంచి నీళ్ళు తీసుకోకుండా అందరూ ఒక బజ్జీ తీసుకోండి. మీరు మామూలుగా ఎలా తింటారో అలా తినండి.”

అందరం ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుంటూ ఒక బజ్జీని పూర్తి చేశాం. ఇంతలో కొరియన్ సుందరి చాంగ్ చా రంగప్రవేశం చేసింది. మా అందరి కాగితాలు ఆమె చేతిలో ఉన్నాయి. అందరి చేతులూ నాడిని పరీక్షిస్తున్నట్లు పట్టుకుని చూసింది. కొందరి కళ్ళను పరీక్షించింది. కొందరికి కేవలం కళ్ళల్లోకి చూసి కలవరపెట్టింది. కాగితాల మీద ఏదో వ్రాసేసి అందరికీ అందంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది.

“మంచినీళ్ళు ముట్టుకోకుండా రెండో మిర్చీ తినండి” అన్నారు. రెండవది ఖాళీ అయింది. గ్రెగరో  వచ్చి అందరినీ ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు. నా పక్కనున్న వ్యక్తి హనుమాన్ చాలీసా చదివినట్లనిపించింది.

“మూడవ మిర్చీ తినాలి” అన్నారు. మూడవదీ ఖాళీ అయింది. పొపొవా ప్రత్యక్షమైంది.

“లెటస్ డూ మిరిషీ కిరియా రైట్” అంది. నాలుగు రకాల విన్యాసాలు చేయించి కాగితాల మీద ఏవో వ్రాసుకుని వెళ్ళిపోయింది. అందరం మంచినీళ్ళు సేవించాక యోగీశ్వర్ వచ్చాడు.

“మన శరీరం సహజమైన ఆనందం నుంచి ఉద్భవించిన అద్భుతం…!” చెప్పాడు. “…శరీరంలోని అన్ని అంగాలను సమానంగా పెట్టుకుని శక్తిని సహజయోగంలొ సమీకరించుకునే సర్పాలకూ, ఎటువంటి తారతమ్యాలకు గురికాని మిర్చీకీ చక్కని సంబంధం ఉంది. ఒక మిర్చీ తిన్న తరువాత మీలో వచ్చే మార్పులను పరిశీలించి మీకు తిరిగి మిర్చీతోనే జన్యు చికిత్స చేయగలగడం ఈ మిర్చీ క్రియలోని ఆంతర్యం. మీ కాగితాల మీద అందరికీ ఏదేది అవసరమో మేము వ్రాసి ఉంచాం. ఇప్పుడు ఆ పక్కనున్న హాల్లోకి వెళ్ళండి.”

అందరం నిశ్శబ్దంగా అటు నడిచాం. ఎవరో ఏదో మాట్లాడుతుంటే ఓ కార్యకర్త ఆపాడు.

“వద్దు సార్. మా సంస్థలో ఎవరినీ, దేనినీ పొగడటానికి వీలు లేదు.”

***

పెద్ద హాల్లో అందరూ అటు తిరిగి కూర్చున్నారు. మమ్మల్ని వాళ్ళ వెనుకనే కూర్చోమన్నారు. విశేషజ్ఞులందరూ స్టేజ్ మీద ఉన్నారు. సుందరం మైక్ తీసుకున్నాడు.

“ఈ రోజు ఎక్కువమంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నవారు వచ్చారు. కొందరు ఎసిడిటీ, కొందరు కీళ్ళనొప్పుల వాళ్ళు, ఇలా అన్ని రకాల వ్యాధుల వాళ్ళూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికీ మా దగ్గర మిర్చీలో మందు వున్నది. అది మా డాక్టర్లు ఆ ప్రత్యేకమైన మిర్చీలో పెట్టి మీకు అందజేస్తున్నారు. మీ టోకెన్ చూపించిన వెంటనే ఆ మందు మీకు లభిస్తుంది. క్రిందటి వారం తీసుకున్న వారి ప్రతిక్రియలు ఇక్కడ మీరు వారి నోటితోనే వినండి.”

చాలా ఇబ్బంది పడుతూ ఓ మహిళ మైక్ తీసుకుంది.

“ఊబకాయంతో బాధ పడుతున్న నేను మిర్చీ తీసుకున్నాను. వారం రోజుల తరువాత చాలా తేలికగా ఉంది.”

మరో మహిళ మైక్ లాక్కుంది.

“సనాతనమైన యోగం, అధునాతమైన… అదే ఆధునిక విజ్ఞానం కలసిన మిర్చీ… గ్రేట్ కాంబినేషన్! కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పట్టాయి!”

ఓ కుర్రాడు ముందుకు వచ్చాడు.

“నేను చదువు మీద కాన్‌సన్‌ట్రేషన్ చేయలేకపోయేవాడిని. ఇప్పుదు చాలా తేలిగ్గా రోజులో పది గంటలు చదువగలుగుతున్నాను.”

సుందరం మైక్ తీసుకున్నాడు. “దయచేసి మా థెరపీ గురించి ఎవరికీ చెప్పకండి. మేము ప్రచారాన్ని ఇష్టపడం. పిండిలో దాగి ఉన్న మిరపకాయలాగా మా ప్రతిభను గోప్యంగానే ఉంచదలచుకున్నాం.”

యోగీశ్వర్ వచ్చాడు. జనంలోంచి ఓ వృద్ధురాలిని స్టేజ్ మీదకి తీసుకుని వచ్చాడు. బాగా బక్క చిక్కి ఉన్నదావిడ. అక్కడ ఏర్పాటు చేసిన టీ.వీ.లలో అంతా దగ్గరగా కనిపిస్తోంది. ఆవిడ కుర్చీలో కూర్చుంది. యోగీశ్వర్ మిర్చీ తీసుకుని పెదవుల దగ్గర పెట్టాడు. ఆవిడ ఏదో నములుతున్నట్టు కనిపిస్తోంది. పళ్ళు లేవు.

“ఈమెకు ఎన్నో బాధలున్నాయి….” యోగీశ్వర్ చెబుతున్నాడు. “…కానీ చూడండి, మిర్చీ దగ్గర పెట్టగానే ఎంత చక్కగా నవ్వుతోందో!” నిజంగానే ఆవిడ క్లోజప్‌లో అలాగే ఉంది!

“ఇదే ఆనంద్ మిర్చీ!”

***

మిర్చీ బండీ ఎక్కాను. అందులో ఆ డాక్టర్లూ, ముసలావిడతో సహా కార్యకర్తలందరూ ఉన్నారు. అందరికీ చెరో అయిదొందలు చేతిలో పెట్టాడు.

“వచ్చే వారం అడ్వాన్స్‌డ్ కోర్స్. ఈ రోజు వచ్చినవాళ్ళలో కొందరు మళ్ళీ వస్తారు. గుర్తు పెట్టుకోండి.”

బండి ఆగింది. కొందరు దిగారు. మరి కొద్ది దూరంలో బండి మరల ఆగింది. “హరీశ్ కాన్‌ఫెడరేషన్” బిల్డింగ్ దగ్గర విదేశీయులందరూ దిగి లోపలికి వెళ్ళిపోయారు! బండిలో ఓ మూల ఓ పెద్దాయన నిద్రపోతున్నాడు. దగ్గరకెళ్ళి కదిపాడు సుందరం. ఉలిక్కిపడి లేచి క్రిందకి దిగాడు.

“ఓహో… ఇక్కడున్నానా? మీ థెరపీ బాగుంది సార్. డాక్టర్ వద్దన్నాడు. మీ దయవల్ల ఈ రోజు ఏకంగా పదహారు మిర్చీ బజ్జీలు లోపలికి తోశాను. ఉంటాను సార్!”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here