[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]
[dropcap]మొ[/dropcap]బైల్‌లో ఈ రోజు అపాయింట్‌మెంట్ ఒక బిచ్చగాడు తీసుకున్నాడు. సుందరానికి ఆ విషయం చెప్పాను.
“చివరకు నీ పరిస్థితి ఇలా అయిపోయింది” అన్నాను.
“పొరపాటు…” చెప్పాడు. “…మన సలహాలు ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక రంగానికి ఉపయోగపడబోతున్నాయి.”
“నాన్‌సెన్స్… అడుక్కోవటం ఒక పరిశ్రమ… అందులో అది రంగం కూడా. నిన్నెవరూ బాగు చెయ్యలేరు.”
“అడుక్కునేవాడు ఖాళీగా కూర్చోడు. అదొక కళ – ఒక ఆర్ట్! అది కూడా చేతవ్వాలి.”
ఇంతలో తలుపు దగ్గర అతడు ప్రత్యక్షమయ్యాడు. భుజం మీద గోతం ఉంచాడు. లోపలికి దర్జాగా నడిచాడు. సోఫాలో కూర్చున్నాడు.
“ఇలా కూర్చున్నందుకు ఏమీ అనుకోకండి సార్”
“తప్పు…!” చెప్పాడు సుందరం. “…ఎందుకు ఏదైనా అనుకోవాలి? మీరు డబ్బు కట్టారు, ఇక్కడికి వచ్చారు. సింపుల్. యాచన మీ వృత్తి. యోచన మాది. అయిపోయింది.”
“అంటే?”
“ఏం కాలేదు. ఆ ప్లేటులోని మొదటి మిర్చీ తినండి.”
అతను గబగబా తినేశాడు.
“సార్, అడుక్కునే వాడికి మిర్చీ బజ్జీ ఎవరూ ఇవ్వరు. ఈ రోజు జన్మ తరించింది.”
“కరెక్ట్.”
“సార్, మంచినీళ్ళు.”
“అప్పుడే ఇవ్వం. ఓపిక పట్టాలి. నాలుక చుర్రుమంటుంటే ఎలా వుంది?”
“నా వైపు చూసి కూడా జోలెలో ఏమీ వెయ్యకుండా వెళ్ళిపోయినవాడిని చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది.”
“అంటే కాలింది.”
“అద్దీ!”
“కరెక్ట్. వాస్తవానికి అందరూ అడుక్కునేవాళ్ళే. కథ బాగుందని అనిపించుకోవాలని రచయిత నిశ్శబ్దంగా అడుక్కుంటాడు. తనని ఏదీ తెమ్మని అడుక్కోవద్దని భార్య వద్ద నుండి భర్త అడుక్కుంటాడు. అడుక్కోకుండా మెచ్చుకోలేదని భర్తను మరో విధంగా ఉచ్చులో బిగిస్తుంది భార్య. ప్రదక్షిణం చేసి అడుక్కోనిదే సూర్యుడు భూమికి శక్తినివ్వడం లేదు. అడుక్కోవటం మీదనే అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఏ డాంబికమూ, దాపరికామూ లేకుండా సూటిగా్ అమ్మా, అయ్యా అని అడుక్కునే మీరు వాస్తవానికి ఎంతో ధర్మాత్ములు, నిజాయితీపరులు. మీకు దానం క్రింద పడేసిన వారి పాపాలను పోగొడుతున్నారు. మహాత్ములు. మీరే లేకపోతే దానధర్మాలు ఎలా? గొప్ప సంప్రదాయానికే ముప్పు. ఒక రాజకీయ సంక్షోభం!”
అతను ఆలోచించాడు.
“నిజమా?” అన్నాడు.
“అవును. ముందర మీ క్రియను గౌరవించండి. అందులో మర్మముంది.”
“అది సరే సార్! ఇతర బిచ్చగాళ్లతో పోలిస్తే నాకు ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఇంకో దేశంలో అడుక్కుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మీరు అలాంటిదేదయినా చేయిస్తారా?”
“చదువుకున్నట్లున్నావు?”
అతను బాధగా చూశాడు.
“రోజూ పేపరు చదువుతూ చదువు నేర్చుకున్నాను సార్. దయచేసి నాకు ఉద్యోగం చూపించవద్దు. నా వల్ల కాదు.”
“ఓ చదువురాని వాడు కార్పోరేట్ స్కూలుకి వెళ్ళి ఉచితంగా చదువు చెప్పమని అడుక్కున్నాడు. పో పొమ్మన్నారు. చదువుకొన్నవాడు ఉన్నత విద్య ఉచితంగా ఇమ్మని పెద్ద సంస్థలలో అడుక్కున్నాడు. పొమ్మన్నారు. డబ్బున్నవాడు పార్టీ టికెట్ అడుక్కున్నాడు. వెళ్ళిపొమ్మన్నారు. టికెట్ దొరికినవాడు ఓటు అడుక్కున్నాడు. ఇంతమంది అడుక్కునేవాళ్ళుంటే ఎవరిని సరైనవాడని ఎంచాలి? అదో సమస్య అయింది. ఎన్నికలలో గెలిచినవాడు పదవిని అడుక్కుంటున్నాడు. పనికొచ్చేవాడికి పడేయ్యాలి అన్నారు… ఒకే ఒక్క మాట! ఈ దేశంలోని వ్యవస్థే అడుక్కునేవాళ్ళ అవస్థ. నువ్వెందుకు బాధపడతావు?”
“అంటే ఈ రాజ్యం మాదే అంటారు.”
“కరెక్ట్. అర్ధరాజ్యం మీదే. మిగతాది మీ మీద బ్రతుకుతోంది. వాస్తవానికి మీదే పై చేయి!”
అతడు రెండో మిర్చీ తీసుకున్నాడు.
“అడుక్కునేవాళ్ళకి లోను ఇవ్వరా?” అడిగాడు.
“ఇవ్వరు. లోను అక్కరలేదు అని నిరూపించిన వాడికి లోన్లు ఇచ్చి అడుక్కునేవారిగా మారుస్తారు.”
“నన్ను ఏం చెయ్యమంటారు?”
“పెట్టుబడి పెట్టాలి.”
“అడుక్కునేవాడు ఏం పెట్టుబడి పెడతాడు?”
“డబ్బు కాదు, ఆలోచనని వాడాలి.”
“అందుకే కదా ఇక్కడికొచ్చింది!”
మూడో మిర్చీ తీసుకున్నాడు అతడు.
***
ఒకరోజు సాయంత్రం ఓ హోటల్‍లో కూర్చున్నాను. దగ్గరగా వచ్చి ఒకడు నన్ను పలకరించాడు. నేను గుర్తు పట్టలేదు. తెల్లని చొక్కా, తెల్లని పాంటు, చేతికి ఒక బంగారు బ్రేస్‌లెట్, నల్ల కళ్ళద్దాలతో ఉన్నాడు.
“సార్, గుర్తు పట్టలేదా?” అడిగాడు.
“లేదు” అన్నాను.
“ఏంటి సార్? మీ వల్లనే కదా ఇంతటివాడినైనాను. నేను, మీ దగ్గరకు మిర్చీ కౌన్సిలింగ్‌కు వచ్చాను.”
“ఓ.. ఏంటి కథ? కూర్చో” అంటుండగా కూర్చున్నాడు.
“నన్ను ఇలా చూసి ఏమీ అనుకోవద్దు సార్. సుందరం సార్ ఇచ్చిన పాయింట్ గొప్పది. ఈ ఫోటో చూడండి…”
ఓ ఫోటో మొబైల్‌లో చూపించాడు. ఓ పెద్ద జట్టు బిచ్చగాళ్ళున్నారు. వెనక శిరిడీ సాయి మందిరం ఉంది.
“ఇది గురువారం గ్రూప్ సార్.”
మరో ఫోటో చూపాడు.
“ఇది మంగళవారం ఆంజనేయస్వామి గ్రూప్ సార్. ఇదిగోండి, ఇది ఆదివారం చర్చ్ గ్రూప్. శుక్రవారం దుర్గాదేవి గుడి గ్రూప్. ఇది అది…. ఇదిగోండి…!”
ఇలా ఓ పదహారు గ్రూపులు చూపించాడు.
“ఏం చేస్తారు వీళ్ళంతా?”
“మంచోరే. ఒక్కో గ్రూపుకీ ఒక్కొక్కడున్నాడు నాయకుడు. సినిమా ఆడియో రిలీజ్ నుంచి పార్టీ ప్రసంగాల వరకూ డబ్బులు ఫిక్స్ అయిపోయాయి. సినిమాల్లో జనాల్ని చూపించాలన్నా మేమే! ఫోన్ ఒక్క క్షణం ఖాళీ ఉండదు. డబ్బు డైరక్ట్ ట్రాన్స్‌ఫర్ – ఎకౌంట్‍కి అయిపోతుంది.”
అతను నా పక్కన నిలబడి సెల్ఫీ దిగాడు. ఓ అర్ధరాజ్యం పట్ల ఎందుకో అభిమానం పెరిగిపోయింది.
ఇంటికి వచ్చి ఫోటో చూపించాను. సుందరం ఆ రోజు తిన్న మిర్చీలు ఎప్పుడూ తినలేదు. చివరకు ఆయాసపడ్డాడు.
“ఏమైంది?” అడిగాను.
“నేను బిచ్చగాడిని ఎందుకు కాలేదని బాధ పడుతున్నాను.”
“తప్పు. అలా అనుకోకూడదు.”
“నో… నడి బజారులోని నిజజీవితం నుండి విజయ రహస్యాలు ఇవతలికి వస్తాయి. ఇలా కూర్చుని సలహాలు ఇవ్వటంలో ఏమీ లేదు.”
“ఇప్పటికీ ఏంటి తక్కువ? నువ్వు కార్పోరేట్ మిర్చీవి కావా?”
“ఏంటి ఉపయోగం? ఈ వ్యక్తి ఎవరో తెలుసా?”
“ఎవరు?”
“ఒకప్పుడు మనలాంటి కన్సల్టెంట్. అడుక్కునే పరిస్థితికి వచ్చి మనలనే సంప్రదించి ఎక్కడికో వెళ్ళిపోయాడు.”
“ఓ. మన అర్ధరాజ్యం మనకి మిగిల్చాడు.”
“అది తప్పదు. అయినా మన మేధస్సు మనకే మిగిలింది.”
“నాలుక గీసుకుందాం… దా… మిర్చీ వలన కాలిపోతోంది కూడానూ!”
00000