మిర్చీ తో చర్చ-17: మిర్చీ వచనం!

0
3

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]త[/dropcap]లుపు దగ్గర ఓ పెద్దాయన నిలబడ్డాడు. దట్టంగా విభూతి నుదుటి మీద పులుముకున్నాడు. బొట్టు మటుకు చిన్నగా దిద్దాడు. నశ్యం పట్టుకున్నట్లు రెండు వేళ్ళు కలిపి సరిగ్గా నాసిక వద్దనే పట్టుకున్నాడు.

“మీ మొబైల్‌లో విషయం మనవి చేసుకున్నాను” అంటూ చూపుడు వేలును, బొటనవేలును చటుక్కున విడదీసాడు.

శాల్తీ చూడడానికి బాగుంది. ముఖంలో పెద్దగా కల్తీ ఏమీ లేదనిపించింది.

“ఎలాగ?” అడిగాను.

“అది వరకు గతంలో కూడా మీ అం… దరికీ మనవి చేసుకున్నాను సుమండీ!”

“ఏంటి సార్? మనవి?”

“తైత్తిరీయం సూటిగా చెబుతున్నది”

“ఛా”

“కర్మ విచికిత్సగానీ వృత్తి విచికిత్సగానీ కలిగినప్పుడు అక్కడ వున్న పెద్దవాళ్ళను కనుక్కుని ఆ విధంగా ప్రవర్తించమని చెబుతోంది”

“సార్, చెప్పనీయండి. కాకపోతే ఇది ఆసుపత్రి కాజాలదు. పెద్ద డాక్టరు కోసం వచ్చినట్టున్నారు. చిన్న డాక్టరు కాదు కదా, అసలు డాక్టరు కూడా ఇక్కడుండడు. ఇది మిర్చీ కన్సల్టెన్సీ సార్”

ఆయన లోనకొచ్చి కూర్చున్నాడు.

“నేను సరైన ప్రదేశానికే వచ్చాను సుమండీ! మీరే పొరపాటు పడుతున్నారు. నాకు మీరు పంపిన నంబరు ఇదిగోండి” అంటూ మొబైల్ చూపించాడు. నిజమే. ఈ రోజు సంప్రదింపు ఈయన తోనే!

“సార్, మీ నంబరు కరెక్టే. అలా కూర్చోండి. సుందరం గారు వస్తారు.”

“ఎక్కడి నుండో, ఎక్కడికో, ఎందుకో, ఎలాగో అలాగ ప్రయాణం చేసేస్తున్నవారందరినీ ఒకచోట కూర్చోపెట్టి మాట్లాడాలనుకోండి, ఒకలాగ ఉంటుంది.”

“కరెక్ట్”

“ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి, ఇంకెక్కడికో వెళ్ళిపోయి అక్కడక్కడ లెక్కలు తప్పులు చెప్పి, ఇక్కడికే వచ్చి ఒక్కడినే మాట్లాడాలనుకోండి, మరోలా ఉంటుంది.”

“కరెక్ట్! ఆఁ!”

“అందుకే… ఈ సాంకేతిక పరిజ్ఞానం, ఈ వ్యవహారమంతా ఒక వైపు అయితే అసలు తత్వాన్ని గ్రహించి అంతా కలిపి ఇంత అని చెప్పగలిగే ఒక వ్యక్తి ఒక ఎత్తు. అంచేత గతంలో మీ అం…దరికీ మనవి చేసుకున్నాను చూడండి…”

సుందరం వచ్చి కూర్చున్నాడు. కాగితాలు తిరగేసాడు.

“చెప్పండి” అన్నాడు.

“నేను ఆ పుస్తకం ఈ పుస్తకం చదివి అక్కడా ఇక్కడా ప్రవచనాలు చేసేస్తున్నాను సార్”

“ఓహో!”

“దండలు వేస్తున్నారు”

“గుడ్”

“శాలువాలు కప్పుతున్నారు”

“వెరీ గుడ్”

“అల్లా అన్నమాట”

“ఆ… అల్లానా?”

నేను సుందరాన్ని గిల్లాను. “రేయ్, గోదావరి… కొద్దిగా క్రిందకి నొక్కి పైకి లేస్తుంది. అలా అన్నమాట!”

“ఆహా… ఒకే. చెప్పండి. బాగానే ఉందిగా సార్? అంతకంటే ఏం కావాలి?”

“బాగానే ఉంది కానీ బండి పెద్దగా ముందుకు సాగడం లేదు”

“ఊఁ… వడివడిగా పాండిత్యం సంపాదించడం వేరు, విడిగా కూర్చుని జనంలో వేడి పుట్టించడం వేరు. దేనికైనా పిండి ఒకటే. బజ్జీలు వెయ్యవచ్చు, బోండా వెయ్యవచ్చు… ఇదిగో మిర్చీ కూడా వెయ్యవచ్చు”

“ఇంతలో ప్లేటులో మూడు మిర్చీ బజ్జీలు ప్రత్యక్షమైనాయి. వాటి వైపు జాగ్రత్తగా చూశాడు.

“మీ వద్దకు వచ్చిన వారికి ఇవి ఉచితంగా ఇస్తారు. అవునాండీ?”

“అవునండీ. మా ప్రత్యేకత! ఉండండి…”

ఆయన ఒక బజ్జీ తీసుకోబోతుంటే సుందరం ఆపాడు. కుర్రాడు వచ్చి, వచ్చినాయనకి కళ్ళకి గంతలు కట్టాడు.

“గతంలో చాలామందికి మనవి చేసియున్నాను…” ఆయన అన్నాడు. “… భారతంలో గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుందని. కానీ, ఇలా ధృతరాష్ట్రుడికి కూడా కడతారని నాకు తెలియదు సుమండీ! న్యాయం పట్టి పిండితే… మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ధృతరాష్ట్రుడు జన్మతః గ్రుడ్డివాడు!”

“సార్! ఇది కన్సల్టెన్సీ”

“అవునన్నమాటే కానండీ, ఇల్లాగ ముందర మంచి బజ్జీలు పెట్టి కేవలం నా నాసికకు మటుకు పని అప్పగించి తమాషా చూడడం అన్నది చూశారు… ఇక్కడ ఎటో వెళ్ళిపోతోంది మనసు!”

“సార్. మిమ్మల్ని బజ్జీలు తినవద్దని నేను చెప్పడం లేదు. ఆ సువాసనను బట్టి ఒకే ఒక బజ్జీ వేసుకోండి చూద్దాం!”

“ఇల్లా చేసేదాన్ని కన్సల్టెన్సీ అనరు సుమండీ…” అంటూనే ఒక మిర్చీ తీసుకుని కొరికాడు.

“అయ్య బాబోయ్…” అరిచాడు. “… జిహ్వ కాలిపోవడమే కాదు సుమండీ, ఈ దిక్కుమాలిన మిర్చీ తాలుకూ బీజములు ఎక్కడెక్కడో పయనించి చిత్రమైన విన్యాసాలు చేస్తున్నాయి. అయ్యో… అమ్మో!”

“మాకు అర్థం కావడం లేదు సార్. మీరు చెప్పదలచుకున్నదేదో సూటిగా, చిన్నగా చెప్పండి.”

“ఆఁ… చిన్నగా ఒక్క ముక్కలో కక్కాలంటే గూబ గుయ్యిమంది సుమండీ”

చేతికి మంచినీళ్ళ గ్లాసు అందించాడు కుర్రాడు.

“సార్. గ్లాసు క్రిందపెట్టకుండా గడగడా త్రాగాలి”

ఆయన అలాగే త్రాగాడు. గాలి లోపలికి పీల్చి వదిలాడు.

“ఏం లేదు సార్. ప్రవచనంలో ఇది మొదటి టెక్నిక్. కిక్కు రావాలి అంటే మీరు ఏదో మహత్తరమైన విషయం చెప్పక్కరలేదు. వాడు వచ్చాడు, వీడు వెళ్ళాడు అనేవే ఇలా మంచి నీళ్ళు గడగడా త్రాగినట్లు గ్రుక్క తిప్పుకోకుండా చెప్పేసి గాలి వదలాలి. దాని ప్రతిక్రియ వేరుగా ఉంటుంది. కాలానికి కావలసింది ప్రసారం, సారం కాదు!”

ఆయన ఆలోచించాడు. కళ్ళకి గంతలు తీసేశారు.

“సార్, రెండవ మిర్చీ తీసుకోండి”

ఆయన జాగ్రత్తగా పరిశీలించాడు. ఒకటి ఏరుకున్నాడు.

“రెండూ ఒకలాంటివే. కానీ వేరు వేరుగా కొరకాలి. ఇది రెండో విద్య”

“గతంలో…”

సుందరం చెయ్యి అడ్డుపెట్టాడు. “సార్, ఇక్కడ చెప్పవలసినవాడిని నేను. పాతదైనా కొత్తగా కనిపెట్టినట్టు చెప్పాలి. రోజూ మిర్చీలు వండినా, ఎప్పటికప్పుడు కొత్తవే!”

మారు మాట్లాడకుండా కొరికాడు.

“ఒక్క విషయం మీరు గమనించండి…” అన్నాడు. “ఈ మిర్చీ ఉంది చూశారూ, ఏదో అద్భుతమైన తత్వం దాంట్లో దాగి ఉంది. మీరేమీ అనుకోనంటే ఆ చివరిది కూడా…” అంటూనే తీసేసుకున్నాడు.

“ఇదెలా ఉంది?” సుందరం అడిగాడు.

“ఇది ఇంకేవేవో కలిపి వండినట్లుంది సుమండీ”

“కరెక్ట్. మీరు గుర్తించలేరు ఏమి కలిపామో”

ఒక గుటక లాంటిది మ్రింగి భయంగా చూసాడు.

“అదివరకు కూడా…” చెప్పబోతూ ఆగిపోయాడు.

“సార్, ఇది ప్రధానమైన మిర్చీ!”

“అల్లాగా!”

“అవును. ప్రజలకి దేనితో వండారో తెలియకూడదు. వంట ఎప్పుడూ కొత్తగా ఉండాలి. శ్రీరాముడు గొప్పవాడు అని చెప్పడంలో గొప్పదనం ఏమీ లేదు. అక్కడ కూర్చున్న ఆడవాళ్ళని చూసి ‘అంతా సీతే’ అని అరవాలి. చప్పట్లు మారుమ్రోగుతాయి. అసలు ప్రవచనం ఎలా మొదలెట్టాలి? మీరు మిర్చీ అక్కడక్కడ కొరికారు చూసారూ? అలాగ”

“ఓహో”

“దైనందిన సమస్యలతో చమత్కరించాలి. శ్రీరాముడు రావణుడి మీద బాణమే వెయ్యలేదు అని మీరు సగం కొరికి ఆగిపోయినట్లు ఆగిపోవాలి. నిద్రపోతున్నవారు కూడా లేచి కూర్చుంటారు.”

“అల్లాగా?”

“అవును మరి. రొటీన్ పనికిరాదు. ‘ఆ తపశ్శక్తితో చూశాడు, ఆ బాణం అదే ఎగురుకుంటూ వెళ్ళి వాడి మీద పడింది’ అని నొప్పి పెడుతున్న కాళ్ళు సర్దుకోవాలి”

ఆయన కూర్చున్న భంగిమ మార్చాడు. ఇదేదో ఈయనకు సరిపోతున్నట్లుంది.

“మరి కొన్ని రుచులు తెలియడం కోసం సొంత పైత్యమంతా ఫలానా సోమయాజులు గారి సాహిత్యం అని చెప్పాలి. జనంలో కుర్రకారు ఎక్కువగా వుంటే సినిమా పాటలు ఉదహరించి ఇంట్లో భార్యాభర్తల తగాదాలను కలిపేసి చమత్కరించాలి”

“అవును సుమండీ…!” అన్నాడు. “… వివాహం అయిన కొత్తల్లో తగువులాడుకున్నవన్నీ స్టేజ్ మీద ఎందుకో గుర్తుకొచ్చినప్పుడల్లా మరింత ఉత్సాహం కలుగుతుంది”

“కరెక్ట్. అదే మిర్చీ మహిమ! గింజలు రాసుకుని జిహ్వను కదిలించాలి.”

***

కారు ఆపాడు సుందరం. మైదానం ముందర పెద్ద ఫ్లెక్సీ పోస్టర్ ఉంది. అందులో ఈ మాస్టారు తన రెండు వ్రేళ్ళ మధ్యలో మిర్చీ పట్టుకుని ఉన్నాడు. ఇద్దరం దిగి లోపలికి వెళ్ళాం. మైదానం చుట్టూ మిర్చీ బళ్ళే!

మైకులో పోతన గారి పద్యం వినిపిస్తోంది.

“అసలు వారి పద్యంలోనండీ….” ఈయన చెబుతున్నాడు.

“… గతంలో కూడా మనవి చేసుకున్నాను మీ అందరికీనూ… మొదటి పంక్తి మిర్చీ బజ్జీ అక్కడక్కడ కొరికినట్లుంటుంది, రెండవ పంక్తి మన బుద్ధిని పరీక్షిస్తుంది… అంటే మిర్చీ, పిండీ సరిగ్గా కలిసాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మూడవ పంక్తి దగ్గరికి వచ్చేసరికి కారం పైకి ఎగదన్ని తత్వ రహస్యాన్ని చాటి మేధస్సు కాస్తా కొరబోయినంత పని చేస్తుంది. ఇక నాల్గవ పంక్తిలో నాలుగు రుచులూ తాండవం చేసేస్తాయి. అది తురీయమైన స్థితి! అందుకే ఓ పెద్దాయన అంటాడూ…”

మా ప్రక్కన ఛానెల్ వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఓ బండి దగ్గర ఇద్దరు కుర్రాళ్ళు అది వింటూ కళ్ళెగరేస్తు అప్పడప్పుడు పళ్ళు కూడా ఇకిలిస్తున్నారు.

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here