Site icon Sanchika

మిర్చీ తో చర్చ-19: ప్రేమ – మిర్చీ… ఒకటే

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]స్త్రీ[/dropcap]లు శిరోజాలు దువ్వుకునేటప్పుడు ఒక పద్ధతి కనబడుతుంది. చక్కగా రెండుగా విభజించుకుని అటూ ఇటూ సమం చేసుకుని ఒక జడో లేదా రెండు జడలో అల్లుకుంటారు, ఈ రోజు మిర్చీ సంప్రదింపు కోసం వచ్చిన వాడు దీనికి పూర్తి విరుద్ధంగా ఒక ప్రక్రియ చేసినట్లున్నాడు. తల మీద సరిగ్గా మధ్యలో ఒక గీత లాగా విచిత్రంగా నిలబడ్డ కేశాలను వదిలేసాడు. అటూ ఇటూ మెరుస్తున్న మరచెంబు బోర్లించినట్లుంది. ఇది ఏ ప్రాంతమనుకుని ఇక్కడి వచ్చి వాలాడో ఒక్క క్షణం అర్థం కాలేదు. అలసి సొలసి ఓడిపోయి ఎక్కడైనా దాహానికి కొద్దిగా మంచి నీళ్ళు దొరుకుతాయనే ఆశలో ఇక్కడికి వచ్చినట్లున్నాడు.

“సింహం…” అన్నాడు సుందరం. “… నరసింహం మీ పేరు”.

“కరెక్ట్.”

“కూర్చోండి.”

సింహం ఇల్లంతా సింహావలోకనం చేసాడు. వచ్చి కూర్చున్నాడు.

“ప్రేమలో పడ్డారు” అన్నాడు సుందరం.

“నో… ఏదో దారిలో పోతుండగా కరెంటు తీగ మీద పడినట్లు ఆ ప్రేమ అనే తత్వం నన్ను ఎక్కడినుండో ఊడిపోయి ఇక్కడ తాకింది.”

ఇద్దరం ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నాం. ఆ తీగె ఈయన తల మీదనే తాకినట్లుంది!

“ఆకుపచ్చని కమీజ్, చక్కని సల్వార్‌లో ఏదో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇద్దరం…”

“ఇద్దరూ…?”

“అయ్యో ఎలా చెప్పాలండీ సార్…”

“అరే! ఇందులో సిగ్గు పడేదేముంది? ఒక మిర్చీ సత్యం చెబుతాను విను.”

“ఏంటి సార్, మిర్చీ సత్యమా?”

“ఆ. మిర్చీ తీస్కోండి.”

ఒక మిర్చీ తీసుకుని నమిలాడు.

“హాట్‌గా ఉంది.”

“ఊ… మిర్చీ సత్యం ఏంటో తెలుసా? వాస్తవానికి సిగ్గుపడేవాళ్ళే ఎక్కువగా ప్రేమిస్తారు!”

“ఆలోచించాలి.”

“కాకపోతే? తలుపు చాటున నిలబడి అమ్మాయి ఓర చూపు చూసి, మీరు చూడగానే చూపు మరల్చి లోపలికెళ్ళిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది?”

’కరెక్ట్‌గా నాలుక – కొండ నాలుకకు మిర్చీ తగిలినట్లుంటుంది!”

“అద్దీ. ప్రేమ – మిర్చీ – ఒకటే”

“కరెక్ట్. ఇంతకీ ఆకుపచ్చ… కాదు, మిర్చీ రంగులోని దుస్తులలో ఉన్న పిల్ల తగులుకున్నాక ఏమైంది?”

“మళ్ళీ షాక్ తగిలింది.”

“గుడ్.”

“నిద్ర పట్టడం లేదు.”

“పట్టకూడదు.”

“ఎందుకని సార్?”

“భోజనం బదులు కేవలం డజన్ మిర్చీలు తినేసి పడుకుంటే నిద్ర పట్టునా?”

“పట్టదు.”

“ఎందుకు?”

“మిర్చీ ఒక ఆలోచన, ఒక అందమైన భావన. అది మనసు నిండా నింపుకున్నాక ప్రపంచం కొత్తగా ఉంటుంది. లేదా ఒక కొత్త ప్రపంచం మన ముందుకు వస్తుంది.”

“కరెక్ట్. అంతటా మిర్చీయే… కాదు, ఈ ఆకుపచ్చ రంగు అమ్మాయే కనిపిస్తోంది.”

“దానినే మనవాళ్ళు ప్రేమ అన్నారు.”

అతను కళ్ళు మూసుకున్నాడు. మిర్చీనో లేక ప్రేమనో ఆస్వాదిస్తున్నాడు.

“రెండో మిర్చీ తీస్కోండి.”

అతను తీసుకున్నాడు. “నేను ఎలా ముందుకు వెళ్ళాలో తెలియటం లేదు.”

“సింపుల్. కరెక్ట్‌గా నాలుగు రోజులు పోనీయండి.”

అతను సోఫాలోనే ముందుకు వచ్చాడు.

“అక్కడే నిలబడి గుర్తు పట్టనట్లు చూసి మీలో మీరు నవ్వుకోండి.”

“పిచ్చివాడనుకుంటారు.”

“అనుకోవాలి. ప్రేమ పిచ్చిది. పిచ్చివాళ్ళకి తప్ప, పచ్చి మిర్చీలు తినేవారికి తప్ప అర్థం కాదు.”

“ఛా”

“అవును.”

“అమ్మాయి నన్ను పట్టించుకోకపోతే?”

“తప్పు. అమ్మాయిలు అన్నీ గమనిస్తారు. అన్నీ గమనించినా ఏదీ చూడనట్టు ఉండేవాళ్ళని అమ్మాయిలు అంటారు.”

అతను చేతులు కట్టుకుని, కళ్ళు మూసుకుని దృశ్యాన్ని ఊహించుకుని, ఆస్వాదించాడు.

“ఆ తరువాత ఏం చెయ్యాలి సార్?”

“మూడో మిర్చీ తీస్కోండి.”

అతను ఆసక్తితో తీసుకుని తిన్నాడు.

“ఎలా ఉంది?”

“తినగ తినగ మిర్చీ తియ్యగుంది.”

“శభాష్.”

“ప్రేమ కూడా అంతే.  ఆ దూరంగా ప్లేట్లో చూడండి…”

అక్కడ మరో ప్లేట్‍లో రెండు మిర్చీ బజ్జీలున్నాయి. న్యాయం చెప్పాలంటే నోరూరిస్తున్నాయి.

“చూస్తున్నాను సార్.”

“గుడ్.”

“ఏమనిపిస్తోంది?”

“మీరు తీసుకోనిస్తే తినెయ్యాలనుంది.”

“ఆగండి. ప్రేమ అనేది ఊహకి, నిజానికి మధ్యలో అందీ అందని అరవిందం లాంటిది. తినకుండానే రుచి తెలిసిపోయేది. కానీ తినకూడదు అనిపించేది. అర్థమైందా?”

“ఊ… అవుతూ ఉంది. అవునూ, మరి అమ్మాయి అసలు పట్టించుకోకపోతే?”

“సుందరం చెయ్యి అడ్డం పెట్టాడు.

“మసాలా ఎక్కడో అక్కడ గ్యారంటీగా ఉంటుంది. మిర్చీలో ఉండవచ్చు, అది దాక్కున్న పిండిలో ఉండవచ్చు, ప్రేమ ఒక ఊహ!”

“కరెక్ట్.”

“అది మనస్సులో దాగిపోవచ్చు, మాటలోకి రాకపోవచ్చు. అవునూ వచ్చు, కానూ వచ్చూ… కాకా… పోవచ్చు.”

“సార్…”

“నేను ప్రేమిస్తున్నాను.”

“అది నేను చెప్పాలి.”

’అదేవన్న మాట?”

“మీ కళ్ళు, మీ ఒళ్లు, కదలికలు, ఇవన్నీ మీకు కనిపించవు.”

“అయితే?”

“మాకు కనిపిస్తాయి.  మీది నిజమైన ప్రేమ అయితే ధైర్యంగా మిర్చీ నమిలినట్లు అమ్మాయి కళ్ళ లోకి చూసి మీ హృదయం లోని అనుభూతిని ట్రాన్స్‌ఫర్ చెయ్యండి.”

“కష్టమైన పని సార్.”

“సోమరిపోతులకు ప్రేమతో పని లేదు. శ్రమ జీవులే ప్రేమకు అర్హులు.”

“ఇది ఆలోచించాలి సార్.”

“నో. ప్రేమ ఒక విచిత్రమైన అసోసియేషన్. ఆలోచనకు అందుకుంటేనే ఎక్కడికో జారిపోతుంది.”

“కరెక్ట్. నా పరిస్థితి కూడా అదే.”

“మరేం ఫరవాలేదు. నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఆ ప్రాంతంలో అడుక్కునేవాడిలా నిలబడండి.”

“అంటే, ఆ దుస్తులు కూడా వేసుకోవాలా?”

“నో. ప్రేమను ఆకర్షించాలి. అంతటా వెతకాలి. పొందాలి. పెంచాలి. ఇవ్వాలి… ఇదిగో ఈ మిర్చీ లాగా.”

***

మొబైల్ మ్రోగింది.

“హలో!”

“హలో సార్, నేను”

“అంటే?”

“ప్రేమికుడిని”

“శభాష్. అమ్మాయి…”

“ఆ… అక్కడికి వెళ్ళి నిలబడ్డాను. బస్సు వచ్చి కొద్దిగా దూరంగా ఆగింది.”

“గుడ్.”

“బస్సులోంచి దిగి నా వైపే నడుచుకుంటూ వచ్చింది.”

“శభాష్. మిర్చీ రంగు కమీజా?”

“నో. … రక్తం రంగు”

“ఓ. తమలపాకుల్లా మీ ప్రేమ కూడా పండుతుంది. అదీ సంగతి.”

“నా వైపు వచ్చింది.”

“వెరీ గుడ్.”

“నేను మీరు చెప్పినట్టు తల ఆడించాను.”

“శభాష్.”

“కానీ నన్ను చూడకుండానే నన్ను దాటేసింది.”

“లేదు. ఖచ్చితంగా గమనించి ఉంటుంది.”

“అది నాకు తెలియదు కానీ, అప్పుడే అక్కడ మిర్చీ బజ్జీలు నూనెలో వేసినవాడు వాటిని ఇవతలికి తీసి నాలుగు పొట్లంలో కట్టి చేతికిచ్చాడు. ‘ఎవడడిగాడు?’ అన్నాను. ‘నువ్వే కదా తలూపినవ్?’ అని కోపంగా చూసాడు.”

“మీరేం చేసారు?”

“చచ్చినట్లు వాటిని తినేసాను.”

00000

Exit mobile version