మిర్చీ తో చర్చ-21: ప్రేమ – మిర్చీ… ఒకటే-3

0
5

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]సిం[/dropcap]హం మరల వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అక్కడ ఉన్న మూడు మిర్చీలు ఒకేసారి తినేసాడు. మంచి నీళ్ళు త్రాగి సుందరాన్ని ఎంతో ఆదరంగా చూసాడు.

“మిర్చీలో ఓ మర్మం ఉంది సార్” అన్నాడు.

“కరెక్ట్.”

“నేను ఆ రోజు క్రింద పడిపోయి నేలను కరుచుకున్న మాట వాస్తవం.”

“పడ్డవాడు చెడ్దవాడు కాడు.”

“సత్యం.”

“క్రింద పడ్డవాడు అస్సలు చెడ్డవాడు కాడు.”

“పైగా ఉత్తముడు.”

“కరెక్ట్.”

“ఆ సమయంలో ఆ అమ్మాయి పక్కన వున్న మరో అమ్మాయి చేతిలోకి తన పాదరక్ష తీసుకొని నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఎలా అనుకున్నానో తెలుసా?”

“ఎలా అనిపించింది సార్?”

“నన్ను నేను ఒకలాగా ఊహించుకున్నాను. బల్లి నోట్లో ఇరుక్కుని సగం చచ్చి పూర్తిగా చావబోతున్న బొద్దింకలాంటి పరిస్థితి నాది.”

“ప్రేమలో కొన్ని తప్పవు.”

“ఏంటి? ఇలాంటి చావు కూడానా?”

“నో నో నో… ఒక వాస్తవం చెబుతాను మీకు.”

“చెప్పండి.”

“అందరికీ వ్యక్తిత్వాలుంటాయి. కాకపోతే, ఒకరిని ప్రేమించినప్పుడు, లేదా మరొకరి చేత ప్రేమించబడినప్పుడు వ్యక్తిలోని వ్యక్తిత్వం పాల మీద కట్టిన మీగడలా పైకి వస్తుంది. కానీ ముందర మటుకు మీరంటున్నట్లు ఏదైనా ఈగలాంటిది పాలల్లో పడి ఉంటే అది పైకి తేలినట్టు ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇంతకీ ఆ తరువాత ఏమైంది?”

“నా బ్రతుకు మూస్కున్నట్లు అనిపించింది. కానీ ఎక్కడి నుండో, నల్ల మబ్బు చాటు నుండి ఓ సూర్యకిరణం ఆకాశాన్నంతటినీ ఆశతో ముంచినట్లు ఓ దృశ్యం కనుల ముందుకు వచ్చింది.

“శభాష్! ఏంటది?”

“నేను ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి చేయి పట్టుకుంది.”

“గుడ్, మిర్చీ ఏ రోజూ నిరాశను మిగల్చదు.”

“వద్దు వద్దు అని వెనక్కి లాగింది. ఈ అమ్మాయి నన్ను, ఆ అమ్మాయినీ రెండు మూడు సార్లు చూసింది.”

ఏమీ మాట్లాడకపోతే బాగుండని నేను అడిగాను, “మీరు ఇంకా అలానే పడుకుని ఉన్నారా?”

“అవును సార్. ఒక్కసారిగా లేవటం, ఒక్కసారిగా పడుకోవటం చేయకూడదని డాక్టర్లు చెబుతూ ఉంటారు. పైగా పడ్డవాడు చెడ్డవాడు కాదని మనం ఓ మాట అనుకున్నాం.”

“కరెక్ట్.”

“అంచేత డవున్ టు ఎర్త్ పరిస్థితిలోంచి నేను పూర్తిగా మనసు పారేసుకున్న అమ్మాయిని పరిశీలిస్తూ అలా ఉండిపోయాను.”

“సూపర్. ఈ అమ్మాయి ఇద్దరినీ పరిశీలించింది. తరువాత ఏం చేసింది?” సుందరం అడిగాడు.

“చెప్పు క్రింద పడేసింది. కాలికి తొడుక్కుని ఆమెతో వెళ్ళిపోయింది.”

సుందరం కళ్ళజోడు తీసి చిన్నగా తుడిచాడు.

“చూడండి. చెప్పులు కాలికి తొడుక్కున్నాక ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆలోచించి ఉంటుంది.”

“ఏమని సార్?”

“ఈ ఇద్దరి మధ్యనా ఏదో ఉన్నట్లుంది అని తలచకుని అలా జరిగిపోయి ఉండవచ్చు. అది మీ వైపు ఉన్న పాయింటు.”

“అంతే అంటారా?”

“ముమ్మాటికిన్నూ! కాకపోతే మీకు కావలసిన అమ్మాయి ఏమీ మాట్లాడలేదు.”

“నో”

“మీరు ఆ రోజు ఫోనులో ఏదో రహస్యం అన్నారు, ఏంటది?”

“చెబుతాను. నేను లేచే ప్రయత్నం చేస్తూ కూడా ఆ అమ్మాయి వైపే దృష్టి ఉంచాను.”

“మీది నిజమైన ప్రేమ. అర్జునుడు పక్షిని కాకుండా పక్షి కంటిలోని గుడ్డునే చూసాడు. లక్ష్యమంటే అది సార్. శభాష్. ఆ అమ్మాయి ఏం చేసింది?”

“ఏమీ చెయ్యలేదు.”

“మరి?”

“అటుగా వెళ్ళిపోతూ, ఓరకంట నన్ను ఒక్క చూపు చూసింది!”

సుందరం రెండు చేతులూ గాలికి వదిలేసాడు.

“క్లోస్! అక్కడుంది సమస్తం! అమ్మాయి అరనవ్వు పూర్తి కథ చెబుతుంది. ఓరకంటి చూపు అంటే ఏంటో తెలుసా?”

సింహం పూర్తిగా సోఫా క్రిందకి జారాడు.

“చెప్పండి సార్. ఆ చూపు తరువాత నాకు నిద్ర పట్టటం మానేసింది.”

“రాకూడదు. నిద్ర రాకూడదు. దటీజ్ మిర్చీ… సారీ… దటీజ్ ప్రేమ.”

“ఇంతకీ నా ప్రేమ పండినట్లేనా?”

“తొందర పడకండి. ఓరకంటి చూపు గురించి నేను పూర్తిగా చెప్పలేదు. ఓరకంటి చూపు అనేది రక్త పరీక్ష కొసం కొద్దిగా, సన్నగా, చిన్నగా గుచ్చిన సూది లాంటింది. అందులోంచి కొద్దిగా రక్తాన్ని లాగి రకరకాల పరీక్షలు చేస్తారు అమ్మాయిలు.”

సింహం ఆలోచించాడు. జరిగిన దానిని నెమరు వేసుకుంటున్నాడు.

“కరెక్ట్. అక్షరాలా అలాగే అనిపించింది. సూది లాంటి చూపే! ఇంతకీ ఏం పరీక్ష చేస్తుంది? నన్ను ఏం చెయ్యమంటారు?”

“సింపుల్. ఆ బస్ స్టాప్ బెంచీ మీద కూర్చోకండి.”

“మరి?”

“ఈసారి అక్కడున్న ఇనప కడ్డీ మీద జాగ్రత్తగా కూర్చుని అమ్మాయి బస్సు దిగినప్పుడు అస్సలు చూడకుండా సీరియస్‌గా మొహం పెట్టండి.”

“అయినా నా కథ యావత్తూ బస్ స్టాండ్ లోనే జరగాలా?”

“తప్పదు. ప్రేమించిన ప్రతి వాడి బ్రతుకూ తొలుత బస్ స్టాండ్ పాలవుతుంది.”

***

ఫోన్ మ్రోగింది.

“హలో”

“సార్, సింహం!”

“యస్”

“మీరు చెప్పినట్లే చేసాను సార్!”

“వెరీ గుడ్.”

“బస్ స్టాప్‌లో ఇనుప కడ్డీ మీద కూర్చున్నాను.”

“శభాష్.”

“బస్సొచ్చింది.”

“గుడ్.”

“ఇద్దరూ దిగారు. నేను వాళ్ళని జాగ్రత్తగా గమనించి నాకు మీతో పనేంటి అన్నట్లు అటూ ఇటూ చూసి తలదించుకున్నాను.”

“ఓకే.”

“వాళ్లు నన్ను దాటి వెళ్ళిపోయారు.”

“అలాగే వెళతారు. కానీ మిమ్మల్నే గమనిస్తారు.”

“అలా అనుకోలేదండీ. వాళ్ళు అలా వెళ్లిపోయారు.”

“ఫరవాలేదు. అలా ఒకటి రెండు సార్లు జరగాలి.”

“జరగదు సార్.”

“ఎందుకు?”

“ఇటు వైపు తిరిగి చూస్తారా చూడరా అని తెలుసుకోవాలని తల పైకి ఎత్తి అటు తిరిగాను.”

“మంచి పని చేసారు. అలాగే చెయ్యాలి.”

“ఇద్దరూ నా వైపే తిరిగి నిలబడ్దారు.”

“మిస్టర్ సింహం! మిర్చీ తప్పు చెయ్యదు!”

“ఇద్దరూ వాళ్ళ మొబైళ్ళలో కనీసం ఆరు ఏడు ఫొటోలు తీసారు.”

“పంట పడింది సార్!”

“నో! అలా ఎందుకు చేసారా అని ఆలోచించే లోపు నా ప్రక్కనున్న ఓ పెద్దాయన అడిగాడు.”

“ఏమని అడిగాడు?”

“ఆ అమ్మాయిలని ఏడిపించావా? అని అడిగాడు. వాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఆ ఫోటోలు చూపిస్తారు. రేపటి నుండి షీ టీమ్ ఇక్కడే ఉంటుంది… అని సెలవిచ్చాడు!”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here