మిర్చీ తో చర్చ-22: ప్రేమ – మిర్చీ… ఒకటే-4

0
3

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]త[/dropcap]లుపు దగ్గర సింహం మరల కనిపించాడు. భుజాన సంచీ తగిలించుకుని పట్టుదలతో ఉన్నాడు. గంభీరంగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అప్పటికే అక్కడ పెట్టి ఉన్న మిర్చీ బజ్జీ తీసుకున్నాడు. దాన్ని ఎ.ఎన్.ఆర్. మందు గ్లాసును చూసినట్టు చూసాడు.

“నమిలితే మరిచిపోగలను” అన్నాడు, “… నమలలేను. మరచిపోతే నమలగలను. మరిచిపోలేను”

“కరెక్ట్.”

“మిర్చీ గతి ఇంతే.”

“సార్, వాళ్ళు ఫొటోలే తీసుకున్నారంటే, ఇంకేం మాట్లాడుతాం?

“నేను హీరోలా ఉన్నానని తీసుకోలేదు ఫొటోలు. జేబు దొంగలా కనిపించాను.”

సుందరం ముక్కు మీద వేలు పెట్టాడు.

“తప్పు! మనిషికి ఓపెన్ మైండ్ ఉండాలి. ప్రేమ అనేది ఊహ కాదు. కలామ్ ఏమన్నాడు? నిద్రలో చూసేది స్వప్నం కాదు! దేన్నయితే చూసిన తర్వాత నిద్ర పూర్తిగా దూరమవుతుందో అది స్వప్నం!”

సింహం ఎందుకో లేచి నిలబడ్డాడు. సుందరం కూర్చోమని సైగ చేశాడు.

“నాకసలు నిద్రపట్టడమే మానేసింది” అంటూ కూర్చున్నాడు.

“ప్రేమ, మిర్చీ ఒకటే. మిర్చీ బజ్జీలు ఎక్కువగా తినేసిన వాడికీ నిద్రపట్టడు, మనస్సనే దుప్పటీని ఇంకొకరి మీద ఎక్కువగా కప్పేసిన వాడికీ నిద్రపట్టదు.”

“నన్నేమి చెయ్యమంటారు సార్?”

“కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం.”

“కరెక్ట్.”

“వికారాలను వదిలిపెట్టి మన ప్రేమ వ్యవహారానికి చక్కని ఆకారాన్ని ఇచ్చేద్దాం.”

“సార్… నా ప్రేమ!”

“ఓ యస్. అలాగే! ఇంతకీ ఫొటోలు దిగాక మరల ఏం జరిగింది?”

“నేను ఫొటోలు దిగడం ఏంటి సార్? బలవంతంగా వాళ్ళు ఫొటోలు తీసుకుంటేనూ?”

“భలేవారు సార్! ఇంత తొందరగా ఏ అమ్మాయి అయినా మీ పక్కన నిలబడి సెల్ఫీ తీసేసుకుంటుందా? అలా చేసినా అనుమానించాల్సి ఉంటుంది. మీరు నచ్చారు, ఫొటోలోకి వచ్చేసారు, దట్సాల్!”

సింహం ముఖం ముఖరితమైంది. కళ్ళు మూసుకుని దాహం తీరిన వాడిలా చిరునవ్వు నవ్వాడు.

“ఇప్పుడు ముందుకు వెళ్ళడం ఎలా?”

“సింపుల్. మరల బస్‍ స్టాప్‌కి వెళ్ళండి.”

“సార్! ఆడ పోలీసులు…”

“నో… పోలీసులేమీ పిచ్చివాళ్లు కారు. ఎలా పడితే అలా వ్యవహారం చెయ్యరు!”

“సరే! వెళతాను. ఆ తరువాత?”

“ఈసారి గెటప్ మార్చండి. భుజం మిద ఆ దిక్కుమాలిన సంచీ తీసెయ్యండి.”

అతను అటూ ఇటూ చూసి సంచీని మూలగా విసిరేశాడు.

“సరికొత్త లాప్‌టాప్ బ్యాగ్ తగిలించండి. ఒక టైని వ్రేలాడదీయండి.”

“ఒకే.”

“అమ్మాయి బస్సులోంచి దిగేవేళకి అక్కడ ఉన్న మిర్చీ బజ్జీ వాడి దగ్గర రెండే రెండు మిర్చీలు కొని ప్లేట్లో పెట్టుకోండి. ఒక్క విషయం జాగ్రత్త పడాలి.”

“చెప్పండి సార్. మిర్చీ తింటునట్లే ఉంది.”

“అమ్మాయికి మీరు దర్జాగా కనిపించాలి. మిర్చీ కుడా స్టైల్‌గా తింటునట్లుండాలి.”

కళ్ళు గుడ్డివాని కళ్ళలాగా పైకి పెట్టాడు సింహం.

“ఆలోచిస్తాను సార్.”

“వెరీ గుడ్. ఒక వేళ జిహ్వ చాపల్యం వన రెండూ తినేయాల్సి వస్తే మరో రెండు తీస్కోండి. అధికస్య అధికం ఫలం!”

సింహం ముందర ముందున్న ప్లేట్ ఖాళీ చేశాడు.

***

“హలో”

“యస్”

“సింహం సర్.”

“చెప్పండి. మిర్చీ…”

“తీసుకున్నాను సార్.”

“వెరీ గుడ్.”

“ఒక్కసారి మీ పాదాలు సెల్ఫీ తీసుకుని నాకు పంపండి.”

“ఎందుకు?”

“నమస్కారం చేసుకుంటాను.”

సుందరం నన్ను అదోలా చూశాడు.

“ఏం జరిగింది?

“మీరు చెప్పినట్టు చేశాను. బస్సులోంచి దిగి నా వైపు వస్తుండగా మిర్చీ ప్లేటు తీసుకున్నాను.”

“శభాష్.”

“అమ్మాయిలు నా దాకా వచ్చి నన్ను చూస్తూ నిలబడ్డారు.”

“సూపర్.”

“నేను వాళ్ళని విస్మరించి ఎటో చూస్తూ మిర్చీలు తింటున్నాను.”

“కరెక్ట్”

“అమ్మాయి నన్నే చూస్తూ నిలబడిపోయింది.”

“ప్రేమ… దటీజ్ ప్రేమ. ప్రేమ, మిర్చీ ఒకటే!”

“ఒక మిర్చీ అయిపోయాక అటు తిరిగాను.”

“ఓ. అమ్మాయి….”

“దగ్గరగా వచ్చింది.”

సుందరం సోఫాలో కూర్చుంటూ పడిపోయాడు.

“తర్వాత ఏమైంది?”

“మిర్చీలు ఒంటరిగా తింటారా అని అడిగింది.”

“జన్మ సాఫల్యానికి ఒకటే పాలసీ… ప్రేమ, మిర్చీ పాలసీ.”

“నేను సమాధానం చెప్పే లోపు నవ్వుతూ పారిపోయింది.”

“పండింది. ప్రేమ అనే గోరింటాకు మీ అరచేతిలో పండింది.”

“కానీ ఒక్క విషయం.”

“చెప్పండి.”

“వాళ్లను విస్మరిస్తూ నటిస్తున్నప్పుడు నేను అనుకోకుండా లారిని చూస్తూ నిలుచున్నాను.”

“ఇది అన్యాయం. అప్పుడే సెకండ్ హీరోయిన్ పరిచయం అవుతోందా?”

“నో. నో. నో.. సార్, నాకు అంత అదృష్టమా? అది కాదు.”

“అప్పుడేమైంది?”

“నా చూపు తెలియకుండా ఆడ పోలీసు మీద పడింది.”

“అయ్యో.”

“ఆమె ఎంతో వయ్యారంగా దగ్గరకు వచ్చింది.”

“మిగిలిన మిర్చీ తీసుకుందా?”

“లేదు. తన మొబైల్ తీసి ఏదో వెతికి నన్ను ఫోన్‌లో ఉన్న ఫొటోతో పోల్చింది.”

“ఓ. సరిపోయిందా?”

“అవును. దగ్గరగా వచ్చి నా టై పట్టుకుంది.”

“అయ్యో!”

“మిర్చీ ఒక్కడివే తింటావా? అని అడిగింది.”

“ఇదేంటి?”

“అదే అర్థం కాలేదు. శేషభాగం రేపు చెబుతాను. ప్రస్తుతం… ఆ. పో.. అంటే ఆడ పోలీసు ఫోనే వస్తోంది.”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here