మిర్చీ తో చర్చ-25: ప్రేమ – మిర్చీ… ఒకటే-7

0
4

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]ఫో[/dropcap]న్ మ్రోగింది.

“హలో”

“సార్, మిర్చీ కౌన్సిలింగ్‌తో మాట్లాడుతున్నానేటి?”

“అవును”

“సార్, నేను నూకాని”

“ఓ. చెప్పు రాకీ. ప్రేమ వ్యవహారం ఎంత వరకు వచ్చింది?”

“ప్రేమ అంటేనే పిచ్చి పిచ్చిగా ఉన్నాది. మతి పోనాదంటే మరండీ, మీరు నమ్మరన్న మాటండి”

“కరెక్ట్”

“అంటే ఎలాగండి?”

“ఏం లేదు. ప్రేమ, పిచ్చీ, మిర్చీ… మూడు ఒకటే”

“సారు”

“చెప్పు”

“ఎలాగో ఉన్నదండి. ప్రేమ సరేనండి గాని పోలీసోల్లతో ప్రేమ ఎలాగో, ఎలగుంటదో తెలియటంలేదన్నమాటండి”

“బాగుంటుంది నూకా! నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. సర్కారీ ఉద్యోగం. నువ్వు మిర్చీ బండీ ప్రక్కన పెట్టచ్చు”

“ఎలాగ? అది మటుకు కుదర్దండి. కోట్లు సంపాదించినా ఇది మటుకు వదలలేను. అమ్మ తల్లి!”

“గుడ్. ఈ సమాధానం కోసమే ఎదురుచూస్తున్నాను. నీలో నిజాయితీ ఉంది. అందుకే పోలీసు ప్రేమలో పడ్దావు!”

“అవును సారూ…”

“చెప్పు”

“నేను ప్రేమించగలనా అన్న మాటొకటి అనుకుందాం సారూ…”

“అదేవన్నమాట? ప్రేమించగలనా ఏంటి? నువ్వు రెండో అంతస్తులో ఉన్నావు”

“అంటే?”

“మిర్చీ తిన్న ప్రతి వాడూ ప్రేమించగలడు. మిర్చీ అమ్ముతున్నావు నువ్వు..”

“అయితే?”

“ఇద్దరిని ప్రేమించగలవు”

“వామ్మో!”

“ఏమైంది?”

“కాలుతున్న నూనెలో ఇప్పుడే బజ్జీలు దేవేసేనన్న మాటండీ. రేపొద్దున్న నా పరిస్థితీ అంతే”

“భయపడకు.  బజ్జీలో ఏముందీ అన్నది ఒకరికి కొరికితే కానీ తెలియదు”

“మా బాగా సెప్పారు సారూ”

“ఒకరు మనల్ని ప్రేమిస్తే గానీ మనలో ప్రేమ ఉన్నదని, ప్రేమించగలమని మనకు తెలియదు”

“ఇది పెద్ద గరితో తిప్పి కలపవలసిన పిండి సారు. కొరుకుడు పడదన్న మాటండీ”

“కాదు. పోలీసు పిల్ల నిన్ను ప్రేమిస్తోంది”

“….”

“హలో”

“హలో… ఇంటున్నానండీ… అలా ఎలా సెబుతారు సారూ?”

“నీ దగ్గరకి రోజూ వస్తోంది”

“వస్తోందన్న మాటేనండీ… పిచ్చి పిచ్చిగా మిర్చీలు లాగిత్తున్నదండి. ఆ నములుతున్నప్పుడు నన్ను సూత్తా ఉంటుందండి”

“కరెక్ట్. అదే ప్రేమ. ఆ చూపులో సృష్టి రహస్యమంతా దాగి ఉంది”

“బాబోయ్!”

“ఏమైంది?”

“ఆ సూపు అమ్మో! తట్టుకోలేనండీ…”

“చరిత్రలో ఈ రోజు వరకూ ఏ మగాడు తట్టుకోలేదు. నిజానికి అది తట్టుకోకూడదు. తెలుసా?”

“ఎలాగ?”

“కావాలని జారి పడిపోవడాన్ని ప్రేమ విన్యాసమన్నారు. అంచాత ప్రేమలో పడటం అన్నారు. ప్రేమ మన మీద పడదు”

“సారూ… ఇప్పుడసలు మాట గుర్తుకొచ్చిందండి మరి! అసలు అందుకు చేసాను ఫోన్”

“చెప్పు”

“నిన్ననేనండీ, సేతిలోకి ప్లేటిచ్చాను సారూ”

“గుడ్”

“ఏడి ఏడివి నాలుగు బజ్జీలు తీసి అలా పెట్టాను సారూ”

“శభాష్”

“నన్ను పొగడ్తగా చూసి ఒక బజ్జీ ముట్టుకోబోయి ఏలు కాలినందుకు ప్లేటు పడేయ్యబోయింది సారూ”

“నువ్వేం చేసావు? ఎలా స్పందించావు?

“ఏటి సారూ?”

’ఏం లేదు. నువ్వేం చేసావు? అని అడుగుతున్నాను”

“నేను ప్లేటు పట్టుకోబోయి చెయ్యి పట్టుకున్నాను”

“ఛా”

“అవును సారూ. ఏటోలా ఉంది”

“ఇంతకీ ఆ తర్వాత ఏమైంది? పోలీసు పిల్ల సిగ్గుపడిందా? అమ్మాయిలు సిగ్గులోంచి ప్రేమలోని నిగ్గును ముఖమంతా ముత్యాల ముగ్గులా సింగారిస్తారు!”

“ఏటన్నారేటండీ?”

“ఏం లేదు. ఇంతకీ ఏమైంది? చెయ్యి పట్టుకున్నాక?”

“సినిమాలోలాగా అక్కడ షాట్ ఆగిపోటానికి అది షూటింగ్ కాదు కదండీ”

“నో. కానే కాదు”

“నన్ను చూడనే లేదండీ”

“చూసావా? దానినే సిగ్గు అన్నారు నూకా. చూడలేకపోవడం, చీదరించుకోవటం కాదు. చూడాలని ఉండటం, మిర్చీ తినాలని ఉండటం లాంటిది. చూసాక మరోలా చూడాలనుకోవటం మరో వెరైటీ మిర్చీ తినాలనిపించటం లాంటిది. నూకా! ప్రేమ తేలిగ్గా కొరుకుడు పడదు. ఇంతకీ నిన్ను చూడలేదన్నావు. దేనిని చూసింది పోలీసు పిల్ల?”

“సారూ ఈమె పోలీసు పిల్లేనా? పిల్ల కాదన్న మాటేనండీ”

“నూకా! ఒక మిర్చీ సత్యం చెబుతాను. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. మిర్చీ ఏ వయసులోనైనా మనోరంజకమైన దినుసు! అసలు ఏంటో తెలుసా?”

“సెప్పేయ్యండి సారూ!”

“ప్రేమించిన ప్రతి మహిళా పిల్లే!”

“బాబోయ్!”

“ఇంతకీ పోలీసు పిల్ల ఎక్కడ చూసింది?”

“నా సెయ్యిని సూత్తా ఉంది”

“శభాష్. పురుషుని స్పర్శకు పులకించి ఉంటుంది, నీ నూనెలో కదిలిన పుణుకులా రకరకాలుగా రవళించి ఉంటుంది”

“సారూ! అలా జరగలేదన్నమాటేనండీ”

“మరేమైంది”

“నా చేతిని చూసింది”

“చెప్పావు”

“నా చేతిని చూసింది, ప్రక్కన పెట్టిన లాఠీ చూసింది, అలాగ లాఠీ చూసింది, చెయ్యిని చూసింది, చెయ్యిని చూసింది, లటుక్కున లాఠీ చూసింది. ఇదెలాగుందేటండీ?”

“బాధపడకు నుకా! ప్రేమకు కొన్ని స్వరూపాలుంటాయి. మొదటిది భయం”

“అది వొళ్ళంతా జ్వరంలా పాకింది”

“గుడ్. రెండవ స్వరూపం బాధ”

“సారూ”

“ప్రేమ రెండవ స్టేజిలో బాధలోకి వస్తుంది.”

“తరువాత సారూ?”

“బాధ, భయం పాత్రలు మార్చుకుంటాయి”

“అలాగండీ?”

“అవును. ఏది ఏది అన్నది తెలియది. అది నిజమైన ప్రేమతత్వం”

“ఇది అంత దూరం పోలేదన్నమాటండీ”

“ఓ”

“లాఠీ తీసి బండి మీద బాదిందండీ”

“ఛా”

“అది నా మీద తగిలుంటే ఇయ్యాల ఈ ఫోన్ పలికేది కాదన్న మాటండి”

“ఇది మామూలే నూకా”

“సారూ… దయ ఉంచి ఇది ప్రేమ దెబ్బ అని సెప్పకండి”

“మరేం పరవాలేదు. ఇంతకీ మిర్చీ తిన్నదా లేదా?”

“అది మటుకు తినేసినాదండీ”

“అద్దీ. మిర్చీ ఎవరినీ మోసం చెయ్యదు. సినిమాలు చూస్తావు కదూ?”

“సూత్తానండీ”

“శుభం కార్డు చివరుంటుంది. మిర్చీ బజ్జీలో చివరి ముక్కలో అసలు రుచి ఉంటుంది. తెలియనివాళ్ళు పారేస్తారు. తెలిసినవారు జాగ్రత్తపడతారు.”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here