[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]
[dropcap]ఫో[/dropcap]న్ మ్రోగింది.
“హలో”
“సింహం, నరసింహం”
“శభాష్. మీ మిర్చీ ప్రేమ ఎంతవరకు వచ్చింది?”
“జై మిర్చీ”
“ఓ… జై జై మిర్చీ!”
“మిర్చీ సామాన్యమైనది కాదు”
“అస్సలు”
“దేశమంతా మెచ్చుకున్న ఏకైక నాయకుడు”
“ప్రపంచం”
“కరెక్ట్”
“ఎక్కడెక్కడివో పట్టుకొచ్చి అర్థం కాని వంటకం వండితే ఎవరికీ రుచించదు”
“కరెక్ట్”
“ఇక్కడున్నదానిని గట్టిగా పట్టుకుని ఓ చక్కనిది వండిపెట్టాలి. జనాలకి అదే నచ్చుతుంది”
“సూపర్”
“అది మిర్చీకే చెల్లింది”
“లెస్స పలికితివి సింహం”
“రాజకీయం కూడా మిర్చీతో ముడి పడి వుంది”
“ఎందుకలాగ?”
“మరొకడి నాలుకకు కావాలని మిర్చీ తగిలించాలి”
“తరువాత?”
“వాడు వాగుతూనే ఉంటాడు”
“అయితే?”
“వాగనివ్వాలి”
“ఉపయోగం?”
“మీ ప్రచారం వాడి ద్వారా అయిపోతుంది”
“ఎలా?”
“మిర్చీ అందరూ తింటారు”
“ష్యూర్”
“అందరికీ ఇష్టం”
“కొద్దిగా మరోలా అంటాను”
“అనండి సార్”
“మిర్చీని ఇష్టపడ్డం మొదలెట్టాకే అసలు మనిషికి ఇష్టపడటం గురించి తెలుస్తుంది”
“ఆగండి…”
“ఏమైంది?”
“నేను ఇది వ్రాసుకుంటున్నాను”
“గుడ్”
“సార్”
“యస్?”
“అందరికీ ఇష్టమైన మిర్చీని అనవసరంగా తిడుతుండేవాడిని పని పెట్టుకుని అవసరంగా అందరూ ద్వేషించడం ప్రారంభిస్తారు”
“మిర్చీని సరిగ్గా, సరైన చోట కొరకాలి”
“మరి?”
“అడ్డదిడ్డంగా కొరికినప్పుడు జనాలకు కొరుకుడు పడదు”
“సార్”
“యస్?”
“రహస్యం చెబుతాను”
“ఊదు”
“ఆకుపచ్చ సల్వార్‌లో ఉన్న అమ్మాయినే ఎందుకు ప్రేమించానో తెలుసా?”
“చెప్పేయి”
“అసలు మిర్చీ రంగులో అంతా ఉంది”
“కరెక్ట్”
“న్యాయం పట్టి పిండితే”
“పిండితే?”
“పడుచుపిల్ల స్వరూపమే పచ్చి మిర్చీ స్వరూపం”
“మీ ప్రేమ పచ్చి మిర్చీ నుంచి పండు మిర్చికి పండుతోంది సింహం”
“సార్… మీరు చెప్పేది చాలా కరెక్ట్”
“నో… తప్పు సింహం”
“ఎలాగ?”
“ఏదైనా జీవిత సత్యం లాంటిదే నాలోంచి ఇవతలికి వస్తుంది”
“బాగుంది సార్”
“ఇంతకీ ప్రేమ మిర్చీ ఏమంటోంది?”
“మిర్చీ అనేది ఒక వ్యక్తి లో దాగి వున్న అద్భుతమైన శక్తిని ఇవతలికి తీసుకువస్తుంది”
“అది శాస్త్రజ్ఞులు నిర్వచించారు. మిర్చీ కొరికిన తరువాతే ఏదైనా తినాలా? తినకూడదా? తింటే వంటికి పడుతుందా, పడదా అనేవి వ్యక్తికి అవగతం అవుతాయి. మిర్చీ ఆదిలో ఉంటుంది, అంతంలో ఉంటుంది”
“అంటే?”
“ఏ రోజైతే మిర్చీ తినలేమో ఆ రోజు నుండీ అంతం ఆరంభమైనట్లు”
“ఆ రోజు రాకూడదు సార్”
“నీలాంటి మిర్చీ ప్రేమికులకు రాకపోవచ్చు”
“సార్”
“యస్?”
“నాలోంచి ఎక్కడలేని ధైర్యం బయటకి వస్తోంది”
“ఎందుకలాగ?”
“మామూలుగా బస్‌స్టాప్‌లో నిలబడ్డాను”
“గుడ్”
“మిర్చీ బస్సు లోంచి దిగింది”
“ఎలా దిగింది సింహం?”
“బాగా అడిగారు. అక్కడే మతి పోతుంది”
“ముందుకెళదాం”
“కదిలీ కదలని కర్పూర కదళీ ఫలంలా”
“ఆహా”
“కదలికలు కనిపించకుండా సాగిపొయిన కథలా”
“ఓహో”
“ఎవరినీ చూడకుండా ఎవరో చూడాలనుకునేలా…”
’సింహం”
“సార్”
“మీరు మిర్చీ కవి”
“ఎలా?”
“ప్రేమించిన ప్రతివాడు కవే!”
“ఎలా సార్?”
“ప్రేమ ప్రవహించే భావం! కవనం ఒక జలపాతం”
“సూపర్”
“అంచాత ప్రతి ప్రేమికుడూ ఒక కవి. ప్రతి కవి ఒక ప్రేమికుడే!”
“జై మిర్చీ”
“జై జై మిర్చీ!”
“తరువాత?”
“బస్సు వెళ్ళిపోయింది”
“తప్పదు”
“ఎప్పటిలాగా ఎందుకో మిర్చీ బండీ వైపు వెళ్ళలేదు”
“ఎందుకలాగ?”
“అక్కడికి ఓ బైక్ వచ్చి ఆగింది”
“ఓ”
“అతని వెనుక కూర్చుంది. బైక్ వెళ్ళిపోయింది”
“మరి?”
“నేను చెప్పాను కదా?”
“ఏంటి?”
“మిర్చీ నాలోని నాయకుడిని పైకి తీసుకుని వచ్చింది”
“శభాష్”
“అటు వెడుతున్న కుర్రాడిని ఆపాను. అతనూ బైక్ మీద ఉన్నాడు”
“గుడ్”
“లిఫ్ట్ అడిగాను. ముందర నో అన్నాడు”
“తరువాత?”
“నిజం చెప్పాను”
“ప్రేమికులు అబద్ధాలు చెప్పరు”
“ఆ అమ్మాయి వెనుక పద అన్నాను”
“శభాష్”
“వెనుక సీటు తుడిచి మరీ కూర్చోమన్నాడు. పిచ్చి పిచ్చిగా నడిపాడు”
“మిర్చీ తగిలించి ఉంటాడు”
“అమ్మాయికి దగ్గరగా నడిపాడు. ట్రాఫిక్ వల్ల ఆ బైక్ కూడా స్లో అయింది”
“హైదరాబాదు ప్రేమికుల నగరం”
“కరెక్ట్! నా మిర్చీని దగ్గరగా చూస్తూ అలా ట్రాఫిక్‍లో వెళుతుంటే… ఇక ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు”
“వింతగా ఉంది”
“మా ఇద్దరినీ ఒకే ఉయ్యాలలో కూర్చోబెట్టి వెనుక నుండి ఈ బైక్ వాడు, ముందు నుంచి ఆ బైక్ వాడు చెరో తోపు తోస్తూ ఊపుతున్నట్లుంది”
“జగమే ఊయల”
“కరెక్ట్. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రక్కప్రక్కనే ఆగిపోయాం”
“బాగుంది. అమ్మాయి మిమ్మల్ని చూసిందా?”
“ఊఁ… అదే ఒక కావ్యం. ఎ.సి. లోంచి సన్నగా గాలి తగిలినట్టు, ఒక చూపులోంచి ఏదో తగిలింది. మరల అటూ ఇటూ చూసింది. నేను లైటుగా గమనిస్తున్నాను. నన్నే గమనిస్తోందని తెలిసిపోయింది”
“హృదయం ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు”
“కరెక్ట్”
“ఎక్కడో ఏదో కదులుతుంది”
“కరెక్ట్”
“అది హృదయం అనుకోవాలి”
“ఇలాగే అనుకుంటుంటుండగా పండు మిర్చీ లైటు పచ్చి మిర్చీ రంగు సిగ్నల్‌గా మారింది. రెండు బైకులు సిగ్నల్ దాటేసాం!”
“తరువాత?”
“ప్రసుత్తం నా ఫోన్‌లో ఎందుకో సిగ్నల్ పోతోంది. మరల ఫోన్ చేస్తాను”
“శుభం భూయాత్!”
00000