[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]
[dropcap]పా[/dropcap]ర్క్‌లో బెంచ్ దగ్గర ఆగాను. చక్కని పాట వినిపిస్తోంది – “విన్నావా… ఆ…. ఆ… విన్నావా, మనసులోన దాగి ఉన్న మధుర గీతి విన్నావా!” దగ్గరలోనే సుందరం మిర్చీ బజ్జీ బండి ఆగి ఉంది. ఆ బండి లోంచి వస్తున్న పాట అది.
మంచి చోటకే వచ్చాననుకొని అక్కడున్న బెంచీ మీద కూర్చున్నాను. సుందరం నాకు కొద్ది దూరంలో ఆగాడు. జేబులోంచి ఓ రిమోట్ తీసుకుని బటన్ నొక్కాడు. మిర్చీ బండి వయ్యారంగా వచ్చి నా ముందర ఆగింది.
“మిర్చీ బజ్జీలాంటిదేమైనా తీసుకుంటారా సార్?” ఎంతో వినయంగా అడిగాడు.
“నీ మొహం తగలెయ్య” అన్నాను.
వచ్చి పక్కన కూర్చున్నాడు.
“ఓ మాటనుకుందాం” అన్నాడు.
“చెప్పు”
“మీరూ వంట చేస్తారు, నేనూ వంట చేస్తాను”
“నేను వంట చెయ్యను”
“మీరు కథలు వండుతారు”
“….”
“నేను వండుతాను, అమ్ముతాను కూడా. నా డిగ్రీ పెద్దది”
“కథలు అమ్మటమా? అదేవన్నమాట?”
విరగబడి నవ్వాడు. ఓ ప్లేటు బజ్జీలు నా ముందర పెట్టాడు.
“తిను స్వామీ. ఈ బజ్జీ లేకుండా నువ్వు కథ వ్రాయలేవు. మీరూ మీరూ అంటుంటే తెగ పోజులు పెడుతున్నావు”
“అన్యాయం. మీరు… మీరు అంటే రచయితల సంఘం అనుకొన్నాను”
“ఆదివారం చర్చ్ దగ్గర, గురువారం సాయిబాబా గుడి దగ్గర, ఇలా అన్ని చోట్లా అమ్మబడతాయి బజ్జీలు. చివరికి ఇక్కడికి వస్తాను”
“ఏంటి ఈ బెంచ్ విశేషం?”
“మా మిర్చీ సంఘం ఇక్కడే కూర్చుంటుంది”
మిర్చీలోని గింజ పంటి క్రింద తగిలి చుర్రుమంది.
“మిర్చీ సంఘమా?”
“మరి? కొద్ది సేపట్లో కోర్ కమిటీ వచ్చి బెంచ్ మీద కూర్చొంటుంది. ఇది మామూలు బెంచ్ కాదు. సుప్రీం కోర్ట్ బెంచ్ లాంటిది”
“ఛా”
“మరి? ఈ పార్కు ఎప్పటిదనుకుంటున్నావు?”
అటూ ఇటూ చూశాను. చాలా పాతదిగా అనిపించింది.
“అర్థమైందా? ఈ బెంచ్ కూడా అంత పాతది. సినిమాల్లో ఛాన్స్ దొరికేవరకు చాలామంది ఇక్కడే కాలక్షేపం చేసేవారు. ఎన్.టి.ఆర్ బెంచ్ మీద, ఎ.ఎన్.ఆర్. బెంచ్‌కి ఆనుకొని కునుకులు తీసేవారు”
“ఇది టూ మచ్”
“ఆ కాలంలో సెల్ఫీలు లేవు. ఉంటే ఇప్పుడు చూపించేవాడ్ని”
“ఓ… మరి హీరోయిన్లు? వాళ్ళూ అంతేనా?”
“సందేహమా? సావిత్రి లేటుగా వచ్చి తొందరగా వెళ్ళిపోయేది. షావుకారు జానకి అటూ ఇటూ తిరుగుతూనే నిద్రపోయేది”
“వింటున్నానని చెప్పు. ఏం చేస్తాం? బజ్జీలమ్మినట్లు కథలనమ్మాలంటే లోపల అంటుంకుంటున్న గింజల్లా ఏదో వివాదంతో తగులుకోవాలి. నీ అదృష్టం వేరు. నీ వ్యాపారమే మసలాతో ఉంటుంది”
“తక్కువగా, తప్పుగా చెబుతున్నావు సోదరా! షావుకారు జానకి కళ్ళు ఎప్పుడూ నిద్ర పోతున్నట్టు ఎందుకుండేవనుకొన్నావు? ఇదీ కారణం”
మంచినీళ్ళ బాటిల్ అందించాడు. గడగడా తాగి లేవబోయాను.
“అరె! మిర్చీ తో చర్చ ఉంది”
“ఏంటి? ఇప్పుడా?”
“అదుగో ముగ్గురు మరాఠీలూ ఇటే వస్తున్నారు”
అటు చూశాను. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇచ్చేసే వారిలా అంటుకుంటూ, అంటిపెట్టుకుంటూ అందరూ చూడాలనో లేక చూడకోడదనో అని ఓ కంట కనిపెట్టుకుంటూ కొద్దిగా కుంటు కుంటూ వస్తున్నారు ఆ ముగ్గురు. తాటికాయ పూర్తిగా పండిపోయిన రంగులో పూర్తి హెలిపాడ్‌లాగా ఉన్న గుండుతో ఉన్నాయన ముందుగా కరచాలనం చేశాడు.
“కాప్” అన్నాడు.
“అంటే?”
“కాప్సికం నా పేరు. అసలుకి కమలాకరరావు.”
ఆయన పక్కన సిగ్గు పడుతున్నట్టు, ఏ మాత్రం నిలకడ లేనట్టు ఒకాయన చేతులు కట్టుకుని నన్ను కలపద్దు అన్నట్టు జాగ్రత్తగా చెయ్యి కలిపాడు.
“ఊర” అన్నాడు.
“ఎలాగ? ఊర?”
సుందరం నవ్వాడు. “ఊర మాస్! ఊర మెరపకాయన్న మాట!”
“శభాష్. అదిరింది. ఊర గారూ, మీరు సూపర్”
ఆయన పళ్ళికిలించాడు.
“అసలు పేరు సూర్యారావు…” సుందరం చెప్పాడు. “… సామాన్యుడు కాడు. ఎవడి భోగట్టా తియ్యమన్నా తీస్తాడు. ఊర మిరపకాయలాగా డబ్బాలో రెడీగా వుంటాడు. ఎందులోనైనా కలుపుకోవచ్చు. ఏ గ్రూప్‍లోనైనా కలిసిపోతాడు.”
మూడో మనిషి వైపు చూశాను. చాలా గంభీరంగా ఉన్నాడు. నా చెయ్యి కలిపాడో నలిపాడో అర్థం కాలేదు.
“వీరా” అన్నాడు.
“వీరేశలింగం” అన్నాడు సుందరం.
ముగ్గురూ బెంచీ మీద ఫొటో తీస్తున్నట్టు కూర్చున్నారు. మిర్చీ బండి తలుపు దగ్గర మేమిద్దరం కూర్చున్నాం.
“సుందరా”
“చెప్పు”
“కోర్ కమిటియా ఇది?”
“అవును”
“ఏమీ మాట్లాడరేంటి?”
“కోర్ కమిటీలో ఎవరూ మాట్లాడరు. ఎవరి దర్జా వారిది”
“మరి కూర్చోవటం ఎందుకు?”
“కమిటీ మీటింగ్ జరగడం అనివార్యం. అది ముఖ్యం. వీళ్ళు ఎలా మాట్లాడుతారో చూస్తావా?”
“’చూడాలనుంది”
సుందరం దగ్గాడు.
“వాడు అస్సలు లాభం లేదురా” అన్నాడు.
“ఎవరు?” కాప్ అడిగాడు.
“వాడే ఆ శాస్త్రి గాడు”
“ఛీ ఛీ”
సుందరం ఊర వైపు తిరిగాడు. ఆయన తల అడ్డంగా ఊపాడు.
“ఏమి ఊరా?”
“ఇప్పుడు కాదు. మిరపకాయ మజ్జిగలో మూడుసార్లు ముంచి నానపెట్టి ఎండబెట్టిన రోజే డిక్లేర్ చేశాను. ఏంటి? వాడు వద్దు, పరమ వేస్ట్ అని”
“కరెక్ట్. నేను వీరాని అడుగుదామనుకున్నాను…!”
వీరా చెయ్యి అడ్డుపెట్టాడు.
“ఇదే నీ దగ్గరున్న సమస్య. ఇలాంటివి అడగవు. పనికి మాలినవన్నీ పని పెట్టుకుని అడుగుతావు. వాడి గురించి ఆ పోస్ట్ ఆఫీసు వెనకాల ఇంట్లో అడుగు. పెన్ డ్రైవ్‌లో డేటా లోడ్ చేసి ఇచ్చేస్తారు. ఏదో అలా అనుకొంటున్నాం అంతే!”
సుందరం ఓ పెద్ద ప్లేట్‌లో బజ్జీలు సద్ది వాళ్ళ ముందర ఉంచాడు. మెల్లగా ఒక్కొక్కటీ లాక్కున్నారు.
“ఎవరు ఈ శాస్త్రి?”
“ఎవరిక్కావాలి?”
నోరు వెళ్ళబెట్టి వాళ్ళని చూస్తూ కూర్చున్నాను. మిర్చీ బజ్జీ తినే పద్ధతులలో ఒక్కొక్కరిది ఒక్కో వెరైటీ. కాప్ తన తల నిమిరి బజ్జీని జాగ్రత్తగా పట్టుకొన్నాడు. శ్రీరాముడు గడ్డి పరకను మంత్రించి బ్రహ్మాస్త్రంగా మార్చినట్లు ఏదో మననం చేస్తూ చేస్తూ మొదలు కొరికాడు. ఊర ఇది తినటం తప్పేమోనన్నట్లు చేతిలో పట్టుకొని అటూ ఇటూ చూశాడు. అలా చేయటంలో తప్పేమీ లేదు. పేరున్న నటులు చాలామంది నటనకు ఇచ్చిన తాత్పర్యం అదే. ఎదురుగా ఉన్న పాత్ర ఏదైనా పలికినప్పుడు అటొకసారి, ఇటొకసారి తిరిగి వెర్రి చూపు చూసేసి నడుము మీద చేతులు పెట్టి నవ్వటమో లేక వెక్కిరింతలా ఓ మాట అనటమో నటన అయికూర్చొంది మరి. ఊర కూడా ఊరకుండక అలానే మిర్చీని మొదటి టేక్ లోనే నమిలి పారేశాడు. వీరా పద్ధతి వేరుగా ఉంది. బెంచీ వెనుక చెయ్యి చాపి వేళ్ళ మధ్యలో బజ్జీని పట్టుకుని ఇది ఇక్కడున్నది కాబట్టి కొరుకుతున్నానన్నట్లు కొరుకుతున్నాడు…
“మన సంఘానికి ఇంతకీ పేరేమి పెట్టాలి అన్నది ఆలోచించాలి” అన్నాడు సుందరం.
“నువ్వే ఆలోచించు” అన్నాడు కాప్.
“అలాక్కాడు. ఓ నాలుగు పేర్లు అనుకొందాం. సెలెక్ట్ చేద్దాం” వీరా అన్నాడు.
“మిర్చీ సమైక్య సమితి” అన్నాడు ఊర.
“ఇంకా”
“సింపుల్‌గా మిర్చ్ మసాలా”
ముగ్గురూ బజ్జీలు ఖాళీ చేశారు. కాప్ లేచాడు.
“రేపు నాలుగు కాదు, నలభై పేర్లు తెస్తాను. వస్తాను” లేచి గబగబా అడుగులు వేశాడు.
“నిలకడ లేదు మనిషికి” వీరా చెప్పాడు.
“అసలు ఆ నడక చూడు” ఊర పలికాడు.
“ఎలా నడుస్తున్నాడంటావు?”
“స్కూటర్ మీద నుండి పడ్దా బుద్ధి రాలేదు”
“ఎప్పుడిది?” సుందరం అడిగాడు.
“తెలీదా?…” ఊర నెత్తిమీద చెయ్యి పెట్టుకున్నాడు.
“… ఆరేళ్ళ క్రితం అమ్మాయిని చూస్తూ గబుక్కున కాలు క్రింద పెట్టేశాడు. అప్పటి నుండీ ఒక వైపు వంగి నడుస్తున్నట్లు నటిస్తాడు దేవానంద్ లాగా. చూడు చూడు. తల మొత్తం బ్లాంక్ అయినా ఆ స్టైల్ చూడు”
“కరెక్ట్. వీడు లాభం లేదురా మనకి”
“అస్సలు”
“ఊ. బజ్జీలు తిని పారిపోయాడు”
“రెండు ఎగ్‌స్ట్రా”
“ఛా”
“మరి?”
“ఈ వ్యాపారం ఇలా సాగదు”
“నేను చాలాసార్లు చెప్పాను…!” ఊర మంచి ఫార్మ్ లోకి వచ్చాడు. “… మనకు పని చేసే వాళ్ళు కావాలి సుందరా”
“కరెక్ట్”
వీరా ఇంటి నుండి తెచ్చుకున్న మంచి నీళ్ళు త్రాగాడు.
“అందరినీ కలుపుకొని పోవాలి సుందరా. ఒక్కొక్కడు ఒక్కో తీరుగా ఉంటాడు. మనం సంఘం పెడుతున్నాం”
“అదీ నిజమే”
“మనం కొట్టుకోకూడదు”
ఊర ఆవులించాడు. “కొట్టుకోవటం ఏంటి వీరా? మనం చర్చించుకోవాలి. అలా లేచి వెళ్ళిపోతే ఏమనుకోవాలి?”
సుందరం ప్లేట్లు సద్దాడు.
“పోన్లే స్వామీ. ఏదో పని ఉండుంటుంది”
వీరా లేచాడు. “నువ్వెందుకు లేచావు?”
“కోర్ కమిటీలో మనం నలుగురం ఉండాలి. అదే కరెక్ట్”
“నలుగురుం కూర్చుందాం”
“వస్తాను…” వీరా నిష్క్రమించాడు.
“లాభం లేదు”
“అస్సలు”
“ఎవరు?”
“ఈ వీరా”
ఊర చెయ్యి అడ్డం పెట్టాడు. “సుందరా, వీడి గురించి నీకు పూర్తిగా తెలీదు”
“అవునా?”
“మరి? రోజుకి రెండు జతల బట్టలు మారుస్తాడు. బామ్మర్దిని తీసుకెళ్ళి నెలకి నాలుగు కొత్త జతలు కొంటాడు. ట్రెజరర్ పోస్ట్ అడుగుతున్నాడు”
“ఇది విన్నావా?”
“ఏది?”
“కాప్ గాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి”
“ఎందుకు?”
“అతనితో ఏం చెప్పినా పేపర్లో వేసినట్లే!”
“ఛా”
“అవును మరి”
“మరి ఇది కూడా విన్నావా?”
“ఏంటది?”
“ఇక్కడి నుండి నేరుగా మరో మీటింగ్‍లో వెళ్ళి కూర్చుంటాడు”
“అయితే?”
“అయ్యో సుందరా! మనమింకా సంఘం మొదలుపెట్టనే లేదు. ఇలాంటి వాళ్ళను పెట్టుకుంటే ఎలా?”
ఊర సర్దుకుని లేచాడు.
“ఊరా…!” సుందరం అడిగాడు.
“చెప్పు”
“మరి శాస్త్రి సంగతేంటి?”
అతను ఆలోచించాడు.
“శాస్త్రి… ఏదో చెబుతాడు కానీ అతను పనికొస్తాడయ్యా. ఏదో పోజు పెడతాడు కానీ… మనం ఉంచుకోవచ్చు…”
“బై ఊ… కలుద్దాం. టచ్‍లో ఉండు”
“బై”
అతను వెళ్ళిపోయాడు.
“సుందరా…” అడిగాను.
“చెప్పు”
“ఈ శాస్త్రి ఎవరో నీకే తెలియదన్నావు. ఈ ఊర ప్లేటు మార్చాడేంటి?”
“ఆలోచించాడు. రెండోసారి అడిగాను కాబట్టి నాకు మిత్రుడనుకొన్నాడు. వీలుగా ఓ రూటు తీసుకొన్నాడు”
***
ఇద్దరం బండిలో కూర్చున్నాం. మిర్చీ బండిలో ప్రయాణం బాగుంటుంది.
“సుందరా”
“యస్”
” మీ కోర్ కమిటీ అదిరిపోయింది”
“సంఘాలు ఇలాగే ఉంటాయి బ్రదర్! అసలు సంఘం అనేదే ఓ పచ్చి మిరపకాయ లాంటింది”
“కరెక్ట్”
“ఆకుపచ్చ రంగులో చక్కగా కట్టుకొన్న పడతి లాంటిది”
“వామ్మో”
“అద్దీ! ఓ కాప్సికమ్ ఉండాలి. ఇది ఇంకొకరితో కలసి గాని రాజకీయం ఆడలేదు. ఒక రెండు మిరపకాయలు ఉండాలి. చుట్టు ప్రక్కనున్న వారు దడుసుకోవాలి…”
“ఓహో!”
“ఓ ఊర మిరపకాయ తప్పదు – ఊరికే హడావిడి చేస్తూ ఉండాలి. నలుగురూ కూర్చున్నప్పుడు చక్కని రుచికరమైనవి పంచుతూ ఉండాలి. మా కోర్ కమిటీ అలా అనిపించినా, అదే కరెక్ట్!”
“బాగుంది. నేను ప్రక్కకి వెళ్ళినా నా గురించి చెప్పుకుంటారు కదా?”
“అవును మరి. ఇది విన్నావా?”
“ఏంటి? నీకూ ఈ అలవాటొచ్చిందీ?”
“అవును మరి. మిర్చీ మొత్తం తినేసాక ముచిక పారేస్తారెందుకు?”
“ఎంత గొప్పవారైనా చివరకు కొమ్ములు తీసేసి పారేస్తుంది సంఘం!”
“కరెక్ట్”
బండి లోని సి.డి. ప్లేయర్ మరల ఆ పాట దగ్గరకు వచ్చింది-
“విన్నావా… ఆ…. ఆ… ఆ… విన్నావా, మనసులోన దాగి ఉన్న మధుర గీతి విన్నావా!”
00000