మిర్చీ తో చర్చ-31: ప్రేమ – మిర్చీ… ఒకటే-13

0
4

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]త[/dropcap]లుపు చిన్నగా తెరుచుకుంది. అక్కడ నేల మీద అలా జారి కొద్ది సేపు కదలకుండా ఉన్న నీడ బట్టి ఈ రోజు ద్వారం దగ్గర ఉన్నది ఒక అమ్మాయి అని అర్థమైంది.

“మిర్చీ, ఆ… ఇదేనా?”

ఇది ఒక సమస్య. అమ్మాయిలు ఇలా ఎందుకు మాట్లాడుతారో తెలియదు. స్పీడ్ బ్రేకర్లు లేకుండా చక్కగా, సూటిగా ఒక పూర్తి వాక్యం పలకటం ఈ రోజు అనాగరికత అనిపించుకుంటుంది.

“అంటే?”

“ఆ… ఏక్‌చువల్లీ…”

సెక్యూరిటీ చెకప్ అవుతుంటే శూన్యంలోకి ఎందుకు చూస్తామో తెలియదు. అదో సమస్య. అమ్మాయి కూడా ఆ గదిలో దేన్ని చూస్తోందో తెలియలేదు. కాకపోతే నేను జాగ్రత్తగానే చూశాను. ఈ అమ్మాయికి మెల్లకన్ను లాంటిదేమీ లేదు.

“ఏక్‌చువల్లీ?”

“ఏక్‌చువల్లీ… ఆ  లైక్…”

మొబైల్ చూసాను. అందులో లైక్ చెయమ్మన్న పోస్ట్ ఏదీ లేదు.

సుందరం వచ్చాడు. అలవాటుగా సోఫాలో కూర్చున్నాడు. అమ్మాయిని చూసి నన్ను ‘బుద్ధుందా’ అన్నట్టు చూసాడు.

“కూర్చోండి” అన్నాడు. అతనికైనా బుద్ధుంది అన్నట్లు నన్ను చూసింది.

‘నాకు బుద్ధి రాదులే’ అన్నట్టు నేను సుందరాన్ని చూసాను.

“చెప్పండి”

“ఆ… ఏక్‌చువల్లీ…”

“ఆ..”

“మిర్చీ… అంటే.. ఏక్‌చువల్లీ…”

సుందరానికి సహనం ఎక్కువ. మిర్చీ తినేవాళ్ళు, తట్టుకునేవాళ్ళు సహజంగానే సహనం పెంచుకుంటారని అతను ఒక సందర్భంలో చెప్పి యున్నాడు.

ఈ అమ్మాయి అలా సాఫ్ట్‌వేర్ కల్చర్‌ను ఉదారంగా మాకు ఒలకబోస్తుంటే చక్కగా పరిశీలిస్తూ కూర్చున్నాడు సుందరం.

“చెప్పండి”

“మీరు మిర్చీ కౌన్సిలింగ్ చేస్తారు కద్దా?”

“అవ్వును”

ఎందుకో మూతికి చెయ్యి అడ్డుపెట్టుకుంది. నవ్వు ఆపుకుందని నేను అనుకోలేదు. నేను చాలా మాడర్న్, చాలా పాష్ అని చెప్పేందుకు ఇదొక ప్రసాధనం అని చాలాసార్లు అనుకున్నాను. కాలం చాలా విచిత్రమైనది. అప్పలమ్మలందరూ కూడా అనవసరంగా జీన్స్ తొడిగేసినా అడ్డమైన తెలుగు సినిమాల గురించి మాట్లాడేసినప్పుడు ఇవ్వకుండానే వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ అందరికీ ఇచ్చేస్తూ ఉంటారు…

“లైక్… నాకు ఓ ప్రాబ్లమ్”

“వెరీ గుడ్. ఒకటి కాదు, ఎన్ని ఉన్నా మేమున్నాము”

నన్ను నువ్వెందుకున్నావన్నట్లు చూసింది.

“మేమిద్దరం తప్పదు. చెప్పండి” అన్నాడు సుందరం.

“లైక్… మీరు అబ్బాయిల గురించి కనుక్కుని చెప్పగలరా?”

“అంటే డిటెక్‌టివ్ పనా?”

“యా. అంటే లైక్… ఒక అబ్బాయి ఉన్నాడు”

“ఉంటాడు”

“యా. అంటే లైక్… ఏమీ లేదు మా మధ్య”

“ఉండక్కర్లేదు. అబ్బాయి ఉంటే చాలు”

“ఆ… ఏక్‌చువల్లీ అతనూ”

“అబ్బాయి కాడా?”

“ఓ నో… లైక్… మంచోడు. నన్ను.. అదే… ఫాలో అవుతున్నాడనుకుంటున్నాను”

“గుడ్. చూడమ్మా మీ పేరు…”

“రుక్స్”

“ఛా”

“అంటే లైక్ రుక్మిణీ, కానీ…”

“రుక్స్ బాగుంది. గుడ్ లుక్స్ లాగా రుక్స్. సూపర్ అండీ”

“అదేనండీ… నా వెనుకే వస్తున్నాడనిపిస్తుంది.

“ఓ. మిర్చీ రూల్ ఒన్ ఒకటుంది”

“లైక్… ఆ… చెప్పండి”

“ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఫాలో అవుతున్నాడని అనిపిస్తొందంటే ఈ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని గమనిస్తున్నట్లు… ఫాలో అవుతున్నట్లే అని అర్థం”

“సార్, నేను… అంత లైక్… అర్థం చేసుకోలేను”

“ఏం లేదు. మీరు ఆ అబ్బాయిని గమనిస్తున్నారు, అవునా?”

“యా”

“అంటే ఫాలో అవుతున్నారనే కదా?”

“నో… అలా ఎలా అనగలరు సార్?”

“సింపుల్. అతను మీ మైండ్‌లో కూర్చున్నాడనే కదా!”

“ఓకే. అది ఒప్పుకుంటాను. కానీ లైక్… ఫాలో అవుతున్నానంటే కరెక్ట్ కాదు”

“రైట్. మిర్చీల్లో రకాలుంటాయి. పులుసులోంచి అనుకోకుండా ఇవతలికి వచ్చిన సన్నని మిర్చీ రుచి ఒకలా ఉంటుంది. ఏదో తింటుంటే తనంతటతా నాలుకకి తగిలి ఇబ్బంది పెట్టేది మరొకలా ఉంటుంది. అలా కాకుండా సూటిగా మిర్చీలనే ఎంచుకుని పచ్చడి చేసుకుని కేవలం మిర్చీనే ఆస్వాదించడం మరొక విధంగా ఉంటుంది. ఒక్కొక్క మిర్చీకీ, ఒక్కొక్క నిర్దిష్టమైన రుచి ఉంది, అభిరుచి ఉంది…”

“సార్, లైక్… ఇదెక్కడో విన్నట్టుంది”

“ఇంతకీ మీ మిర్చీ ఏ రకం?”

“అంటే?”

“సింపుల్. ప్రత్యేకంగా మిమ్మల్ని ఇష్టపడడం వలన మిమ్మల్ని ఫాలో అవుతున్నాడా లేక ఓ అమ్మాయి దొరికిందీ, ప్రయత్నిద్దామని వెంటబడుతున్నాడా?”

“తేడా ఏంటి?”

“భూమికి, ఆకాశానికీ ఉన్న తేడా”

“ఓ. అయినా ఒక ప్రశ్న”

“యస్”

“నన్నుఇష్టపడినట్లు ఎలా చెబుతున్నారు?”

“అదలా ఉంచండి. అతనంటే మీకూ ఇష్టమని మిర్చీ శాస్త్రం చెబుతోంది”

“నో… టూ మచ్. చాలా పొరపాటు. నేను జస్ట్…” అంటూ రెండు చేతులు కెమెరా పట్టుకున్నట్టు పెట్టింది.

“ఓకే. ఇదే నిజమైతే మీరు పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా మా దగ్గరకు ఎందుకొచ్చారు?”

అమ్మాయి మొహం ఎర్రగా మారింది. అలా జరిగినప్పుడు ఎక్కువగా అందరూ నన్ను ఎందుకు చూస్తారో తెలియదు.

“అలాక్కాదు…!” అన్నాను. “మా దగ్గరకొచ్చారంటే… మీరు అతన్ని ప్రేమిస్తున్నారని కాదు…”

“ఓకే”

“… ఒక విధంగా ద్వేషిస్తున్నారనీ కాదు”

అనుమానంగా చూసి తల ఆడించింది.

“ఓకే… లైక్… చెప్పండి”

“మేం ఏం చెబుతాం?” అన్నాడు సుందరం. “… మీకు ఇష్టమైతే పెళ్ళి చేసుకోండి”

“అయ్యో. నో సర్. ఏక్‌చువల్లీ అబ్బాయి గురించి జస్ట్…”

“జస్ట్?”

మరల చేతులు అడ్డం పెట్టుకుంది. ఇంతలోనే తీసేసింది.

“మీరు నన్ను ఏడిపిస్తున్నారు”

“నెవర్! మిర్చీ ఎవరి జోలికీ వెళ్ళదు”

“ఓకే.. లైక్… నాకెప్పుడు చెబుతారు?”

“ఏంటి?”

“అబ్బాయి గురించి”

“ఊఁ… మాకు కొంత డేటా కావాలి”

“లైక్… సింపుల్. నేను బస్ దిగినప్పుడల్లా బస్‌స్టాపులో కూర్చుని చూస్తూ ఉంటాడు. మేం మిర్చీ బజ్జీలు తినడానికి వెళ్ళినప్పుడు వెనుక వస్తాడు”

“గుడ్. బిల్లు కడతాడా?”

“ఊఁ… లైక్.. నేనే ఒకటి రెండు సార్లు ఏడిపించడానికి కట్టించాను”

“ఛా. అన్యాయం రుక్కు”

“రుక్స్”

“ఓ రుక్స్! అబ్బాయిలను పెళ్ళి ముందర కాదు, తరువాత ఏడిపించాలి”

ఎందుకో సిగ్గుపడింది. మొబైల్‌లో ఫొటో చూపించింది.

సుందరం ముసి ముసి నవ్వులు నవ్వుతూ చూసాడు.

“కుర్రాడు స్మార్ట్”

అమ్మాయి చిన్నగా కులికి ఎదురుగా ఉన్న గోడని ఆ మూల ఈ మూల చూసింది.

“ఫొటో నాకు షేర్ చెయ్యండి” అన్నాడు సుందరం.

మొబైల్‍లో టక టకా ఏవో నొక్కింది.

“నా నెంబరు ఎవరిచ్చారు?” సుందరం అడిగాడు.

టక్కున లేచి నిలబడింది. ఒక చిటికె వేసింది.

“యూ… పెళ్ళయ్యిందా?’

సుందరం కూడా ఎందుకో నిలబడ్డాడు.

“నో!”

“లైక్… అయామ్ రుక్స్… ఒక్క లుక్కులో చెప్పగలను. బై!”

***

ఫోన్ మ్రోగింది.

“హలో?”

“సార్. నేను సింహాన్ని మాట్లాడుతున్నాను”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here