Site icon Sanchika

మిర్చీ తో చర్చ-32: ప్రేమ – మిర్చీ… ఒకటే-14

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]ఫో[/dropcap]న్‌లో నరసింహం మాట్లాడుతున్నాడు.

“యస్ సింహం గారూ”

“సార్, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినట్లుంది”

“ప్రేమ అనేది ఒక ప్లవంగం సింహం గారూ”

“అంటే?”

“ప్లవంగమము అంటే వానరం”

“అవునా? లవంగం అనుకున్నాను”

“ఊఁ… అది ఒక ఉప్పెన లాంటిది, ఒక దూకుడు, ఒక పరుగు పందెం”

“సార్”

“ఎవరెస్ట్ శిఖరం అధిరోహించినట్లుండడం అందులో ఒక భాగం”

“నిజం సార్”

“ఇంతకీ అలా ఎందుకనిపించింది?

“నిన్న ఓ అద్భుతం జరిగింది”

“గుడ్. ప్రేమ అనేదే ఒక అద్భుతం”

“కరెక్ట్”

“బస్సు వచ్చింది”

“శభాష్”

“నేను ఎప్పటిలాగా నిలబడి ఉన్నాను. మిర్చీ బండి అలా దూరంలో ఉంది”

“వెరీ గుడ్.”

“సార్, బస్సు రావడం, మిర్చీ బండి దూరంగా ఉండటం ఇవన్నీ కూడా వెరీ గుడ్ అంటే ఎలా సార్?”

“ఇదే తమాషా! మన ప్రేమ…”

“ఆఁ? మీరు కూడా…”

“అరే ఉండండి! మన అంటే మాట కలుపుకుంటున్నానయ్యా”

“అలా అంటారా? ఓకే, చెప్పండి”

“ఈ ప్రేమ ఉంది చూసారూ?”

“చూస్తున్నాను సార్”

“ఇది మూడు ముక్కలాట లాగా, మీరు, బస్సు, మిర్చీ మధ్యలో నడుస్తోంది”

నేను పక్కనుండి గిల్లాను.

“… కాదు కాదు, మరో ముక్క ఉంది – పోలీసు అమ్మాయి”

“అయ్యో. ఆమె కూడానా?”

“అవును మరి, అంచాత అలా అన్నాను. ఇంతకీ ఏం జరిగింది?”

“బస్సు ఆగింది”

“సూపర్”

“ఒక కాంతి క్రిందకి దిగింది”

“ప్రేమలో విచిత్రం ఏమిటో తెలుసా?”

“సార్”

“ప్రేమ కవిత్వం నేర్పుతుంది”

“అవును సార్!”

“అవును. అదృష్టవంతులు ప్రేమను, కవిత్వాన్ని రెండిటినీ పెళ్ళిలో కలబోసుకుంటారు”

“లేని వారు?”

“ప్రేమ అటు పోతుంది, కవిత్వం ఇటు పట్టా ఎక్కుతుంది”

“నా సంగతేంటి సార్?”

“నాకు అసలు చెబితే కదా?”

“కరెక్ట్. అమ్మాయి దిగింది. ఈసారి ప్రక్కన ఎవరూ లేరు”

“ఒక విధంగా ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తోందని ఇక్కడ మనం విశ్లేషించుకోవచ్చు”

“అటూ ఇటూ చూసింది”

“నేనూ అనుకున్నాను”

“నన్ను చూస్తూ మెట్లు దిగింది”

“ప్రేమంటే ఏంటో తెలుసా?”

“సార్?”

“ఆఁ… అసలు తెలుసా?”

“చెప్పండి సార్”

“అమ్మాయి మీరు తనని చూడనప్పుడు మిమ్మల్ని చూసి, మీరు తనని చూస్తున్నప్పుడు క్రిందనో ఎక్కడూ చూసి మరల తనని మీరు చూడాలనుకోవడం ప్రేమ”

“చిన్నగా చెప్పాలంటే దొంగ చూపులు…”

దూరంగా గోడకేసి కొట్టిన మొబైల్ అదృష్టం బాగుండి సోఫాలో పడింది. అక్కడి నుండి ‘హలో హలో’ అని వినిపిస్తోంది. ఫోన్ చేతిలోకి తీసుకున్నాను.

“సార్, మీరు అన్న మాటకి సుందరం గారికి కోపం వచ్చి ఫోన్ విసిరేసారు. ఇప్పుడది నా చేతిలో ఉంది. ఆయనకిమ్మంటారా?”

“ఇవ్వండి సార్. తప్పు ఏం మాట్లాడాను?”

“సుందరం గారు సృష్టిలోని ప్రేమతత్వాన్ని కాచి, వడబోసి, పిండి ఆ రసాన్ని మీకు చెరుకు రసంలా అందిస్తే దాన్ని పట్టుకుని తుక్కును అమ్మి వేసినట్లు దొంగ చూపులంటారా? ఆయ్… ఎంత మాట, ఎంత మాట? ఏమంటివేమంటివి?”

“సార్, తప్పు. తప్పయిపోయింది. క్షమించాలి మరి. సార్‍కి కూడా చెప్పండి”

ఫోన్ సుందరానికిచ్చాను.

“హలో”

“సార్, క్షమించండి. నేను పెద్దగా చదువుకోలేదు. నాకు కొన్ని అర్థం కావు.”

“అలా వదిలెయ్యండి. ఇంతకీ ఏవైంది?”

“నా వైపు నడుచుకుంటూ వచ్చింది”

“టూ గుడ్. ఒక్క నిమిషం”

“సార్”

“ఆ నడకలో ఏముంది?”

“అంటే? బాటా చెప్పులు తొడిగిందనుకుంటాను సార్”

“అబ్బా అది కాదు, నడకను గమనించారా?”

“నేను అసలు అది చూసేసరికి ఈ లోకం సంగతి మరచిపోయాను”

“అలాక్కాదు, ప్రేమ రకరకాలుగా నడుస్తుంది. నడకలో గాభరా ఉంటుంది. అడుగులు ఒక్కోసారి తడబడతాయి, ఒక్కోసారి నడక వయ్యారంగా ఉంటుంది, ఒక్కోసారి నడవకూడదు అని అనుకుని కూడా నడుస్తున్నట్లుంటుంది. ఈ నడక ఎలా ఉంది?”

“దగ్గరగా వచ్చి ఆగిపోయింది”

“అవును మరి. ప్రేమలో మరొక్క మెట్టు అది మరి. సికింద్రాబాదు కాకుండా మౌలాలిలో ఆగిపోయిన బండిలా ప్రేమ అలా ఆగిపోతుంది. ఇంతకీ ఎందుకు ఆగిపోయింది?”

“బాగ్ సద్దుకుంది”

“గుడ్. అందులోంచి లెటర్ ఏదైనా…”

“నో. చిటికె వేసింది”

“అంటే ఎక్కడికైనా వెళ్ళిపోదామనా?”

“కాదు సార్, తన చూపుడు వేలు చూపించింది”

“నెయిల్ పాలిష్ బాగుందా అని అడిగిందా?”

“లేదు. ఈ మిర్చీ ఎవరు? అని అడిగింది”

“ఓ. నా గురించి…”

“లేదు. అదొక గొప్ప కార్పోరేట్ కన్సల్టెన్సీ అని అన్నాను”

“ఎక్కడుంటాడు? అని అడిగింది. మీ నెంబరిచ్చాను”

“ఓ. ఆ తరువాత?”

“నన్ను చిత్రంగా చూసింది”

“గుడ్”

“అటు తిరిగి మరల నన్ను ఓ చూపు చూసింది”

“ఎందుకని?”

“చిలిపిగా నవ్వింది సార్”

“…”

“చెయ్యి చిన్నగా ఊపి, వినిపించకుమ్డా ‘బాయ్’ అంది సార్… అంతే! నేను ఇంద్ర పదవి పొందాను”

సుందరం చెయ్యి పట్టుకుని నాడి పరీక్షించాను. మొబైల్ జారిపోయి దాని దారి అది చూసుకుంది. సుందరం తన్మయత్వంలో ఉన్నాడు.

ఫోన్ “సార్… సార్…” అంటూ మొత్తుకుంటోంది. ఆ తరువాత ఆగిపోయింది. సుందరం ఈ లోకంలోకి వచ్చాడు.

“రేయ్”

“యస్”

“అసలు అమ్మాయి లంటే ఎవరురా?”

“ఎందుకు?”

“ఎందుకో అందుకు. తెలిస్తే చెప్పు”

“సుందరా…”

“చెప్పరా”

“ఏదీ తెలియకుండా చెప్పేసేది కవిత్వం”

“కరెక్ట్”

“పూర్తిగా తెలిసినా కొంత కూడా చెప్పకూడనిది అమ్మాయి గురించి”

“…”

00000

Exit mobile version