మిర్చీ తో చర్చ-6: హెర్బల్ మిర్చీ

    1
    2

    [box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

    [dropcap style=”circle”]సుం[/dropcap]దరం మార్కెట్‌లో ఈదడం అలవాటు చేసేసుకున్నాడు. ఓ ఆదివారం ఉదయం క్రింద ఏదో హడావిడిగా ఉన్నదని గ్రహించి కిటికీలోంచి చూశాను.

    మిర్చీ బండి మీద కొత్తగా పెయింట్ వేస్తున్నాడు సుందరం. పంట పొలాలు, రకరకాల చెట్లు కనిపిస్తున్నాయి. మధ్యలోంచి ఏదో అణుపరీక్షకి సిద్ధమైన రాకెట్‌లా ఓ పొడుగాటి మిర్చీ ఆకాశంవైపుకు నిక్కపొడుచుకునుంది.

    ‘హెర్బల్ మిర్చీ’ అని దాని క్రింద వ్రాసి ఉంది.

    ***

    హెర్బల్ మిర్చీని రకరకాల ఊళ్ళల్లో ప్రవేశపెట్టటానికి తిరగటం మొదలుపెట్టాడు సుందరం.

    ఈ రైలు కూడా పచ్చదనంతో నిండిపోయింది.

    “ఇది అన్యాయం” అన్నాను.

    “ఏది అన్యాయం?” సుందరం అడిగాడు.

    “ప్రతి వస్తువునూ హెర్బల్ అని అమ్మేయటం కరెక్ట్ కాదు”

    సుందరం ముక్కు మీద వేలు పెట్టుకున్నాడు.

    “అపచారం”

    “ఇదొకటా?”

    “పితుకుతున్న పాలల్లో చంద్రబింబాన్ని చూసినందుకు శ్రీకృష్ణుడంతటి వానికి ఎన్ని తిప్పలు వచ్చాయో చూశావా?”

    “అయితే?”

    “మిర్చీ ఏ రోజూ రంగు మార్చదు, రుచి మార్చదు. సత్యధర్మాన్ని పాటిస్తుంది”

    “అయితే?”

    కిటికీ దగ్గర కూర్చున్నాయన ఇటు తిరిగాడు. ఇదేదో చిత్రంగా తోచింది.

    “అలాంటి మిర్చీ మోసం చేస్తోందని చెప్పటం బ్రహ్మహత్యతో సమానం!”

    “ఇప్పుడెలా?”

    సీటు క్రింద నుండి టకటకా ఓ అట్టపెట్టె తీశాడు. ఒక పేపర్ ప్లేట్‌లో రెండు మిర్చీలు ఏర్పాటు చేశాడు. ఒక బాటిల్ లోంచి చట్నీ వేశాడు. అలా చేతిలో పట్టుకున్నాడు.

    “ఏంటి? తింటావా? తినిపిస్తావా?”

    సుందరం ఏమీ మాట్లాడలేదు.

    “ఇదేంటి? మిర్చీ హారతి అనే ప్రక్రియ ప్లాన్ చేశావా?

    “కారాన్నీ, మమకారాన్నీ పెంచి పోషించే పంచి పెట్టే వస్తువును వెటకారం చేయకూడదు. పది రూపాయలు నా చేతిలో పెట్టు. ఈ ఆస్తిని అనుభవించే సంపూర్ణ హక్కులు నీకే చెందుతాయి”

    “నాకు వద్దంటే?”

    “నీవు తలపెట్టిన ప్రాయశ్చిత్తం జరుగదు”

    “ఓ”

    ప్లేట్ తీసుకున్నాను. సుందరం నా జేబులో చెయ్యి పెట్టి పది రూపాయలు తీసుకున్నాడు.

    “నువ్వలా నన్ను ఎగాదిగా చూస్తూ కూర్చుంటే నేను ఎలా తినాలి?”

    “అదేమన్న మాట? ఇది హెర్బల్ మిర్చీ. సరికొత్త ప్రయోగం. నువ్వు తింటుంటే నీలోని హావభావాలను బట్టి హెర్బల్ మిర్చీనా లేక మామూలు మిర్చీనా అన్నది తెలుస్తుంది”

    కొద్దిగా కొరికి అలవాటుగా ఇటు కిటికీ బయటకు చూశాను.

    “ఇటు చూడాలి”

    ఇటు తిరిగాను.

    “ఇది హెర్బల్ – సందేహం లేదు” అన్నాడు.

    “ఎలా చెప్పావు?”

    “మూలికలలో మౌలికమైనవి ఉంటాయి. నీ ముఖంలో ఎటువంటి చంచలత్వం లేదు”

    కిటికీ దగ్గరున్న ఆయన నవ్వాడు.

    “సార్, అది హెర్బలో కాదో ఆయన్ని రుచి బట్టి చెప్పమనండి. ఆయన హావభావాలు మనకెందుకు?”

    సుందరం అడ్డంగా తలూపాడు.

    “ఆకలి వేసిన వ్యక్తి మిర్చీ ఒకలా తింటాడు. ఎవరో తింటున్నారని మనం కూడా తినాలనుకునేవాడు మిర్చీని మరొక విధంగా కొరుకుతాడు. అసలు మిర్చీ ఎక్కడిది? గుంటూరుదా? బెళ్ళారిదా? పొళ్లాచ్చిదా? ఇందులో ఏ పిండి వాడారు? ఏ మసాలా వాడారు అని తెలుసుకుంటూ తినేవాడు మరొక విధంగా కొరుకుతాడు. కేవలం సరదాగా కాలక్షేపం కోసం తినేవాడు ఇంకొక విధంగా, హాయిగా తింటాడు. ఒక్కొక్క మిర్చీకి ఒక్కొక్క నిర్దిష్టమైన అనుభూతి ఉంది, రుచి ఉంది. సుందరం అనే మహా మనిషి గుండె లోతుల్లోంచి తనంతటతా పెల్లుబికిన యోగం అది, ప్రయోగం అది. మన జాతి గర్వంగా తినే మిర్చీ బజ్జీని మోసం పేరిట అపభ్రంశం చేయకు రా!”

    కిటికీ దగ్గర కూర్చున్న వ్యక్తి ఎదురుగా ఆయన భార్య ఉంది.

    “ఈ గోలెందుకు? మీకేమైనా అర్థమైందా? హెర్బల్ ఏదైనా నాలుకకు తగిలిందా?” నన్ను సూటిగా అడిగింది.

    “పూర్తిగా అర్థం కావడం లేదండీ…” చెప్పాను. “ఏదో కొత్తమీర తాలుకూ రుచి, కొద్దిగా పుదీనా లాగా అలా అలా తెలుస్తోంది”

    నేను మాట్లాడే లోపే సుందరం రెండు ప్లేట్లు సర్దాడు. పెద్దాయన ముందు జాగ్రత్త చర్యగా ఇరవై రూపాయల నోటు ముందరే పట్టుకున్నాడు. సుందరం దానిని పరిశీలించి జేబులో పెట్టుకున్నాడు. రైలు బండి అలా పోతోంది.

    సైడ్ బెర్త్‌లో కూర్చున్న వ్యక్తి టై సర్దుకున్నాడు.

    “ఏం కంపెనీ సార్ మీది?” అడిగాడు.

    “ఇవి హోం ప్రాడక్ట్స్ సార్. కంపెనీ అయితే ప్లేటు ముప్ఫయి రూపాయలకి అమ్మాలి. మాది సూపర్ క్వాలిటీ ప్రాడక్ట్. మిర్చీ వలన ఆరోగ్య సమస్య ఏదైనా ఉందని ఎవరైనా అనుకుంటే ఈ హెర్బల్ మిర్చీలో అది  మాయమవుతుంది”

    “నిజమా?”

    ఈ సౌండ్ ఎక్కడిదా అని అందరం అటు తిరిగాం. వెనుక నుండి ఓ పెద్దావిడ తల ఆడిస్తూ కనిపించింది.

    “హెర్బల్ అని ఊరికే అనలేదు మేడమ్!”

    “ఇంతకీ ఇందులో ఏం కలిపారు?” పెద్దాయన అడిగాడు.

    “ఏదో ఒకటి కలపకుండా ఏమొస్తుంది?” అడిగాను.

    “అలాక్కాదు. ఆ వస్తువేమిటి?”

    “హెర్బల్”

    అందరూ నవ్వారు. సుందరం నవ్వలేదు. చేతులు కట్టుకున్నాడు.

    “ఈ సమస్య మన తెలుగు వాళ్ళకే ఉంది” అన్నాడు.

    “మళ్ళీ ఇదేంటి?”

    “తెలుగువాళ్ళని తెలుగువాళ్ళు గౌరవించరు. ‘కలసి పాడుదాం తెలుగు పాట’ అని ఎందుకు వ్రాసారో తెలుసా?”

    “ఎందుకు?”

    “ఇంకే పాటైనా కలసి పాడవచ్చు. తెలుగు పాట మటుకు కలసి పాడలేం!”

    “కరెక్ట్”

    బండి పోతోంది. చక్కగా ఉన్న ఇద్దరు పిల్లలు వచ్చారు. చెరో ప్లేట్ పట్టుకుపోయారు. పాప అంటోంది.

    “ఒరేయ్, మన హెచ్.ఎమ్.ని రేపొద్దున్నుంచీ హెర్బల్ మిర్చీ అని పిలుద్దాం రా…”.

    ***

    రైల్లో మిర్చీ అమ్మేవాడొచ్చాడు. ఒక్కడూ పట్టించుకోలేదు. ఎక్కడి నుంచో పాంట్రీ కారు మేనేజరు వచ్చాడు.

    “సార్ ఇక్కడ మిర్చీ బజ్జీ అమ్ముతున్న వారెవరండీ?”

    “నేనే” అన్నాడు సుందరం.

    “అలా ఎలా అమ్ముతారు సార్? మీరు పాసెంజరా లేక వెండరా?”

    “ఏం పాసెంజర్ వెండర్ కాకూడదా?”

    “బిల్లుందా?”

    “మిర్చీ పంచానండీ, అమ్మలేదు. మీరు బిల్లిస్తున్నారా?”

    “మాది టిక్కెట్టుతో సంబంధమున్నది. మాకు రైల్వేతో సంబంధం”

    “మేము వ్యాపారం చెయ్యటం లేదు”

    “వాళ్ళు మీకు డబ్బులిచ్చారు”

    “ప్రేమతో, అభిమానంతో ఇచ్చారు”

    అందరూ నవ్వారు. అతను వెళ్ళిపోయాడు. ఓ యువ జంట అటుగా వెళుతూ ఆగింది.

    “సార్, ఇక్కడ హెర్బల్ మిర్చీ ఎవరో అమ్ముతున్నారట?” అడిగాడతను.

    “ఎన్ని కావాలి?”

    అతను అమ్మాయి వైపు చూశాడు. అమ్మాయి సిగ్గు పడుతూ చిరునవ్వు నవ్వింది. సుందరం ఒకే ప్లేట్‌లో నాలుగు పెట్టాడు.

    “ఇంకో ప్లేట్ లేదా?”

    “వద్దు. వైవాహిక జీవితంలో పొట్లాటలు రాకుండా ఉండాలంటే ఇలా తినాలి” అన్నాడు. అతను ప్లేట్ తీసుకున్నాడు.

    “ఇంకా పెళ్ళి కాలేదు” అన్నాడు.

    “ఇది హెర్బల్ మిర్చీ. మూలికను మంత్రించి వాడతాం. మహిమ తగులుకుంటుంది”

    వాళ్ళు వెళ్ళిపోయారు.

    “ఏరా? ఇంకెన్ని చెబుతావురా? మంగళవారం రోజున తింటే పిల్లలు పుడతారు కూడానా?”

    “చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. ప్రజలకు ఎక్కువగా కావలసిన దానిని, చక్కగా తయారు చేయటంలో తప్పు లేదు. అవహేళన అపచారం”

    నేను పెద్దాయన వైపు తిరిగాను.

    “సార్, మీకేం అనిపించింది?”

    “ఆఁ… ఏదో కొత్తగా ఉంది సార్. అలా తీసి పారేయ్యలేం. హెర్బల్ అంటున్నారు కదా?”

    పెట్టె ఖాళీ అయింది.

    ***

    ఉదయం ఎవరూ లేవకుండానే లేచి క్రిందకి దిగాను. సుందరం ఇంకా పడుకునే ఉన్నాడు. చెప్పులు వెతుకుతూ సీటు క్రింద తడుముతూ అట్టపెట్టె లాగాను. అందులో ఒక కాగితం ఉంది.

    దాని మీద హెర్బల్ మిర్చీకి కావలసిన దినుసులన్నీ ఉన్నాయి. నాకు దేని రుచీ తగిలినట్లనిపించ లేదు, ఒక్క మావిడల్లం తప్ప. ప్రతి దినుసుకీ అంగ్ల పేర్లన్నీ వింతగా వ్రాశాడు. నాకెందుకని లోపలికి తోశాను.

    మేమిద్దం మా ఊళ్ళో దిగేందుకు సిద్ధమయ్యాం. పెద్దాయన అడిగాడు, “సార్ ఇంతకీ హెర్బల్ మిర్చీలో ఏం వేస్తారు సార్?”

    “రాత్రి నిద్ర పట్టిందా?” అడిగాడు సుందరం.

    “పట్టింది సార్. ఇదే అర్థం కాలేదు”

    “నిద్ర పడితే ఖచ్చితంగా హెర్బల్ మిర్చీ అని అర్థం”

    “ఓ..”

    “అవును సార్. ఓ హెర్బల్ ప్రాడక్ట్ గురించి మీరు అడిగారు, హెర్బల్ అంటే ఏంటి? అని… అంటారా లేదా? ఇదీ అంతే”

    “ఇంతకీ…”

    “మిర్చీ అనేదే హెర్బల్. వేరేది ఎందుకు?”

    00000

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here