[dropcap]‘మి[/dropcap]స్ ఇండియా’ 4, నవంబర్ 2020న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ‘మహానటి’ సినిమా ద్వారా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ మీదనే దృష్టి పెట్టిందని అనిపిస్తోంది. కానీ ఆ మధ్య విడుదలైన ‘పెంగ్విన్’పూర్తిగా నిరాశాజనకంగా ఉండి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దానితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ‘మిస్ ఇండియా’ చాలావరకు బాగానే ఉందని చెప్పవచ్చు.
మానసా సంయుక్త అనే మధ్యతరగతి తెలుగు అమ్మాయి ఎంబీఏ చదివి అమెరికా వెళ్లి చాయ్ బిజినెస్ చేసి విజేతగా నిలవడమే క్లుప్తంగా ఈ చిత్రంలోని కథ. సంయుక్త పాత్రచిత్రణ చక్కగా ఉంది. తాతయ్య పెంపకం, భారతీయ ప్రాచీన ఆయుర్వేద ప్రభావం ఆమె మీద ఉండటం, చిన్నప్పటి నుండి స్వతంత్రంగా వ్యాపార రంగంలో స్థిరపడాలను కోవటం బాగుంది. కొన్ని కారణాల వల్ల సంయుక్త కుటుంబం మొత్తం అమెరికా వెళ్లడం జరిగింది. ఈ చిత్ర ప్రారంభంలో కథ, కథనం, పాత్రల స్వరూపం చాలా చక్కగా మొదలైంది. ఒక ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో తన కాళ్ళపై తాను నిలబడి పదిమందికి ఉపాధి కల్పించాలనుకోవటం బాగుంది. కీర్తి సురేష్ కాన్ఫిడెన్స్‌తో కూడిన ఎక్స్‌ప్రెషన్స్, నటనకి మంచి మార్కులు ఇవ్వవచ్చు.
కానీ చిత్రంలో కొన్ని చోట్ల రీజనింగ్, డీటెయిలింగ్, క్లారిటీ లోపించిందని చెప్పాలి. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అయినా తన ఫ్రెండ్స్‌కి SWOT ఎనాలసిస్ ఆమె ఎక్స్‌ప్లెయిన్ చేయడం, అది వాళ్ళు అబ్బురంగా వినటం హాస్యాస్పదంగా ఉంది.
(అమెరికాలో ఎక్కువగా ఇష్టపడని, అంతగా దొరకని,) చాయ్‌కి అవసరమైన తేయాకు వంటి సరంజామా ఎక్కడినుంచి దిగుమతి చేసుకుంటున్నది…. రెండు నెలలకే ప్యాకెట్‌లతో ప్యాక్ చేసి మరీ అమ్మేయడం… వంటి విషయాలు బోర్డు మీటింగ్‌లో కనీసం చర్చించక పోవటం చిత్రం.
ఎదుట వున్న ఒక బలమైన వ్యాపార శత్రువు కైలాస్‌ని ఎదుర్కొనే పరిస్థితిలో అప్రమత్తంగా ఉండకుండా, క్రెడిట్‌లో అంత మొత్తంలో సరుకును ఎలా ఎగుమతి చేసింది అన్న సందేహం సాధారణ ప్రేక్షకుడికి కూడా వస్తుంది.
వ్యాపారంలో ‘రిస్క్’ ఉంటుంది. మంచి వ్యాపారవేత్త దాన్ని అంచనా వేయగలిగి ఉండాలి. ఏ మాత్రం వ్యాపార అనుభవం లేని అమ్మాయి ఇలాంటి రిస్కు తీసుకొని, పూర్తిగా మునిగిపోవటం, వెంటనే ముక్కు మొహం తెలియని వాళ్ళు, దేశం కాని దేశంలో, ఆమె పిలుపు మేరకు వచ్చి, బోల్డంత డబ్బు ఇచ్చి సహాయం చేయటం – నిజజీవితంతో పోల్చుకుంటే అసహజంగా లేదూ! ఫ్రాడ్ చేసినట్లు రుజువై, కేసులు పెట్టబడ్డ కైలాష్ (జగపతిబాబు)కి శిక్షలు పడ్డాయా? మరి హఠాత్తుగా లుంగీ, తలపాగాతో (అమెరికానా, అమలాపురమా?) ప్రత్యక్షమవడం రీజనింగ్‌కి అందని విషయాలు. ఇవన్నీ కాసేపు మర్చిపోయి హాయిగా ఇంట్లో కూర్చొని, కీర్తి సురేష్ కొత్త సినిమా కదా అని తాపీగా సరదాగా చూస్తే బాగానే ఉంది ‘మిస్ ఇండియా’!