మిఠాయి చేదు

0
3

[box type=’note’ fontsize=’16’] “ఎదుట వారికి నీతులు చెప్పే ముందు, ముందుగా ఆ నీతి మనం పాటించాలి. అప్పుడే మన మాటకి విలువ ఉంటుంది” అని రామకృష్ణ పరమహంస తన శిష్యులకు తెలిపిన కథని పిల్లల కోసం సరళంగా అందించారు శంకర ప్రసాద్. [/box]

[dropcap]రా[/dropcap]మకృష్ణ పరమహంస గొప్ప ఆధ్యాత్మిక గురువు, యోగి , దైవాన్ని చూసిన మహా పురుషుడు. అతనికి ఎందరో భక్తులు శిష్యులు ఉండేవారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వామి వివేకానంద ఆయన ప్రియ శిష్యుడు. పరమహంస వద్దకు ప్రతి దినం చాలా మంది భక్తులు వచ్చి వారి వారి సమస్యలు చెప్పుకొనేవారు. భగవాన్ వారందరికీ తగు పరిష్కారాలు సూచించేవారు.

ఒకరోజు ఒక స్త్రీ సుమారు పదేళ్ళ వయసున్న తన కొడుకుని పట్టుకొని పరమహంస వద్దకు వచ్చింది. తరువాత ఆమె తన సమస్యను ఈ విధంగా చెప్పింది ” స్వామీ, నా కొడుకుకి మిఠాయిలు అంటే విపరీతమైన పిచ్చి, రోజంతా మిఠాయిలు తింటూనే ఉంటాడు. అతిగా తీపి తింటే ఆరోగ్యం చెడుతుందని ఎంత చెప్పినా వినటం లేదు. మీరు మహా యోగులు, దివ్య పురుషులు, మీరు చెపితే మీ మాట వింటాడు, దయ చేసి వాడికి మిఠాయిలు తినవద్దని చెప్పండి స్వామీ” అని ప్రార్థించింది.

అప్పుడు భగవాన్ ఆ బాలుడి వంక ఒకసారి చూసి, ఆ స్త్రీ తో చెప్పారు “పది రోజులు తరువాత నీ కొడుకుని ఇక్కడకు తీసుకొని రా తల్లి”. ఆవిడ సరే అని చెప్పి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది.

పది రోజులు తరువాత ఆమె తన కొడుకుని భగవాన్ వద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు  పరమహంస ఆ బాలుని వంక చూసి “చూడు నాయనా, మిఠాయిలు తినవద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు” అని అన్నారు. వెంటనే ఆ బాలుడు “అలాగే గురువు గారు, మరి మిఠాయిలు తినను” అని ప్రమాణం చేసాడు. ఆ తల్లి ఎంతో సంతోషించి భగవాన్‌కి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది.

ఇప్పుడు ఆశ్చర్యపోవటం శిష్యల వంతయింది. శిష్యలంతా పరమహంస చుట్టూ చేరి “గురుదేవా, ఆ స్త్రీ మొదటిసారి వచ్చినప్పుడే ఆ బాలుడికి మిఠాయిలు తినవద్దు అని చెప్ప వచ్చు కదా, పది రోజులు తరువాత రమ్మని ఎందుకు చెప్పారు” అని అడిగారు. అప్పుడు పరమహంస చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పారు.

“ఆ బాలుడుకి మిఠాయిలు అంటే ఎంతో ఇష్టం. నాకు కూడా మిఠాయిలు అంటే వల్లమాలిన ప్రీతి. నేను కూడా మిఠాయిలు ఎంతో ఇష్టంగా తింటాను, ఆ సంగతి మీకు కూడా తెలుసు. నేను మిఠాయిలు తింటూ పిల్లవాణ్ణి మిఠాయిలు తినవద్దు అని చెప్పే అర్హత నాకు లేదు. అందుకే పది రోజులు తరువాత రమ్మన్నాను. ఈ పది రోజుల్లో నేను చేసిన పని ఏంటంటే, ప్రతి రోజు మిఠాయిలు విపరీతంగా తినటం. ఇలా కొనసాగించాను. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు…. ఇలా వారం గడిచే సరికి నాకు  మిఠాయిలు అంటే విపరీతమైన అసహ్యము, ఏహ్య భావము వచ్చాయి. మిఠాయిని చూస్తే రోత కలిగింది. నేను మిఠాయిలను‌ ఆ విధంగా సన్యసించాను. ఇప్పుడు ఆ బాలుడికి మిఠాయి తిన వద్దు అని చెప్పటానికి అర్హత సంపాదించాను. అందుకే నేను చెప్పిన వెంటనే ఆ బాలుడు కూడా మిఠాయిలు తినటం మానేసాడు”. గురువుగారి మాటలకి శిష్యులంతా నిర్ఘాంతపోయి, సాష్టాంగ నమస్కారాలు చేసారు.

నీతి :- ఎదుట వారికి నీతులు చెప్పే ముందు, ముందుగా ఆ నీతి మనం పాటించాలి. అప్పుడే మన మాటకి విలువ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here