Site icon Sanchika

మొదటి వరుస

[dropcap]మూ[/dropcap]డో తరగతి చదివే ఆ పిల్లలందరూ, తరగతిలో ఎప్పుడూ మొదటి వరుసలో కూర్చోవడానికే ఇష్టపడేవారు. వారిలో ‘రాగిణి’ ఎప్పుడైనా రెండోవరుస లేదా మూడోవరుసలో కూర్చోవాల్సి వస్తే ఏడుపు మొహంతో కూర్చునేది. అలాగే ‘జమీల్’ ఎప్పుడైనా వెనుక వరుసలోకూర్చోవాలంటే బుంగమూతి పెట్టేవాడు.

వాళ్ల తరగతి టీచరు పిల్లలను వంతులవారీగా ముందు బెంచీలో కూర్చోబెట్టేది. అప్పటికి టీచరు మాట విన్నా, వెనుక బెంచీలలో కూర్చోవడానికి ఆసక్తి చూపేవారు కాదు.

ఒక రోజు ‘పి.ఇ.టి సార్’ వాళ్ల తరగతికి వచ్చారు. పిల్లల ఎత్తు, బరువు చూడడానికి అందరిని వరుసగా నిలబెట్టారు. తరువాత పొడవుగా ఉన్నవారిని వెనుక వరుసలోను, కొంచెం పొడవు తక్కువగా ఉన్నవారిని ముందు వరుసలలోను కూర్చోబెట్టారు.

ఆ తరువాత ‘లెక్కల సార్’ వచ్చారు. చివరి వరుసలో కూర్చున్న ‘పాల్’ సరిగా వినడం లేదని ముందు వరుసలో కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చున్న ‘రూప’ను వెనుక కూర్చోమన్నాడు. అలాగే మాట్లాడుతూ, సరిగా వినని పిల్లలని కూడా వారి స్థలాలను మార్చి కూర్చోబెట్టారు.

తరువాత వారి ‘తెలుగు టీచరు’ వచ్చారు. ఎప్పుడూ ఉత్సాహంగా పిల్లలు, దిగులుగా కూర్చోవటం చూసి, కారణం అడిగారు. ‘తామందరికి తరగతిలో ఎప్పుడూ ముందువరుసలోనే కూర్చోవాలని ఉంటుంద’ని చెప్పారు.

“ఎందుకు?”

“మొదటి వరుసలో కూర్చునే పిల్లలే బాగా చదువుతారట “

“అవును టీచర్!”

“మొదటి వరుసలో కూర్చునే పిల్లలే తెలివికలవారట. వెనుక వరుసలో కూర్చుంటే మొద్దబ్బాయ్ అని వెక్కిరిస్తారు.”

ఇలా పిల్లలందరు తమ కారణాలను చెప్పారు.

తెలిసో తెలియకో పెద్దవాళ్లో, చుట్టుపక్కలవాళ్లో పిల్లలతో మాట్లాడే మాటలు ఇటువంటి అభిప్రాయాలు ఏర్పడడానికి కారణమని టీచర్‌కి అర్థమైంది.

టీచరుగారు బోర్డు మీద వరుసగా

‘అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః’

‘క ఖ గ ఘ ఞ’

‘చ ఛ జ ఝ ఙ’

…………………

అక్షరాలను రాసారు. తరువాత ముందు వరుసలోని అక్షరాలను మాత్రమే ఉపయోగిస్తూ పిల్లలని కొన్ని వాక్యాలు చెప్పమన్నారు. పిల్లలు చెప్పడానికి ప్రయత్నించారు. కాని చెప్పలేక పోయారు.

‘మీరు ఏ అక్షరాలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయ’ని అడిగారు. అలాగే ‘మీకు ఏ వరుసలోని అక్షరాలు ఇష్టమో’ చెప్పమన్నారు.

పిల్లలు కొంతసేపు ఆలోచించారు!

నెమ్మదిగా రూప లేచి “నాకు అక్షరాలన్నీ ఇష్టమే” అంది.

తరువాత జమీల్ “అన్ని అక్షరాలు కలిస్తేనే, మాట్లాడగలం. చదువుకోగలం. పాడుకోగలం” అని చెప్పాడు.

‘అవునం’టూ…! పిల్లలందరు రూప, జమీల్ మాటలకు వంత పలికారు.

అప్పుడు టీచరుగారు “పిల్లలూ! ఈ అక్షరాలలాగా మీరందరు ఎక్కడ కూర్చున్నా శ్రద్ధగా వినాలి. తరగతిలో బోర్డు అందరికీ కనబడాలని ఎత్తుని బట్టి కూర్చోపెడతాము. అందరూ మాకు ఇష్టమైన పిల్లలే, బాగా చదివే పిల్లలే” అని చెప్పారు.

ఆ మాటలకి పిల్లలు సంతోషపడి వారికి ఇష్టమైన ‘గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః’ అంటూ శ్లోకాన్ని చదవడం మొదలుపెట్టారు.

Exit mobile version