[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘మోదుగ పూలు’ నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ గారి తాజా నవల ‘మోదుగ పూలు’. ఈ పేరు వినగానే అప్రయత్నంగా, ఇదే పేరుతో ఉన్న దాశరథి రంగాచార్య గారి నవల గుర్తొస్తుంది. రెండు నవలల నేపథ్యాలు వేర్వేరు. సంధ్య గారి నవలకి పెట్టిన ఉపశీర్షిక ‘గిరిజన జీవన స్వరాలు’ అనేది ఈ నవల గురించి ఎంతో చెబుతుంది.
గిరిజనుల జీవన విధానం, వారి ఆచార సంప్రదాయాలు, వారి పండుగలు వేడుకలు, వారి నిష్కాపట్యం, నిర్భీతి, మాట ఇస్తే దాన్ని మనసా వాచా కర్మణా పాటించడం, వంచనకు గురయ్యే వారి అమాయకత్వం, తమ జీవితాలని బాగు చేసుకోడానికి వారి ప్రయత్నం – ఇలా గిరిజనుల జీవితాన్ని పాఠకుల కళ్ళ ముందుంచుతుందీ నవల.
ఈ నవల రెండు రకాల ప్రకృతులను ద్యోతకం చేస్తుంది. ఒకటి అటవీ ప్రకృతి, రెండు నగర/పట్టణ ప్రకృతి. దట్టమైన అడవుల లోని ప్రకృతిని రచయిత్రి వర్ణించినప్పుడు ఆయా గ్రామాలూ/గూడేల పరిసరాల రమణీయత సూక్ష్మంగా అనుభవం లోకి వచ్చి పచ్చటి పరవశం కలుగుతుంది. నగరంలోని ప్రకృతిని ప్రస్తావించినప్పుడు ఆధునికత/అభివృద్ధి పేరిట ఇక్కడి ప్రకృతిని వికృతి చేస్తున్న వైనం మనసులో మెదిలి బాధ కలుగుతుంది.
రెండవ ప్రకృతి ఏమంటే – గిరిజనుల నిష్మల్మషమైన స్వభావం, పట్టణవాసుల కపట స్వభావం! గిరిజనులు వీలైనంత వరకూ ఉమ్మడిగా ఉండాలని ప్రయత్నిస్తుంటే, ఆధునికులు – ఎవరినీ దరిచేరనీయకుండా, తానూ, తన కుటుంబం అన్న పరిధికి కుచించుకుపోతూండడం – వెల్లడవుతుంది.
చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్న కథానాయకుడు వివేక్‌కి – తన తండ్రి రహస్య జీవితం గడుపుతూ, సొంత ఊరు నుంచి పట్నం వచ్చేసి అజ్జాతంగా బతికాడని తెలుసు. కానీ పూర్తి వివరాలు తెలియవు. తన తల్లి కూడా పట్నంలో కాయకష్టం చేసి జీవించిందే తప్ప ఏనాడూ తామెవరమో, తమ మూలాలేవో చెప్పలేదు. పేదరికాన్ని అనుభవిస్తూ పిల్లలిద్దరినీ పెంచుతుంది. ఎం.ఎ. చదివి, పంటిట్ ట్రైనింగ్ చేసిన వివేక్ – ముందు ఏదైనా ఉద్యోగం చేసి తల్లికి, చెల్లెలికి కష్టాలను దూరం చేసి. – కొంత స్థిరపడ్డాకా విదేశాల వెళ్ళాలనుకుంటాడు. కానీ తెలుగు ఉపాధ్యాయుడిగా ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారు మూల ప్రాంతంలో పనిచేస్తుండగా అతనకి తమ మూలాలు తెలుసుకోవాలన్న కోరిక కలిగి, అందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో తన తండ్రి గురించి తెలుసుకుంటాడు. తమ సంస్కృతిని తెలుసుకుంటాడు. తనని తాను తెలుసుకుంటాడు. ‘చరైవేతి చరైవేతి’ అన్న మంత్రం చెప్పినట్టు.. అలుపు సొలుపు లేకుండా తన అన్వేషణని కొనసాగిస్తాడు. వ్యక్తిగత లక్ష్యం అనుకున్నది కాస్తా, బృహత్తరమైన సామాజిక ప్రయోజనం కోసం కార్యాచరణకి దోహదం చేస్తుంది.
కార్యరంగంలోకి దిగకముందు ఎన్నో అపోహలుంటాయి. ఏవేవో అనుమానాలుంటాయి. తాను చేరబోయేది ఏదో చిన్న బడి అని, ఏ ఇరవయ్యో ముప్పయ్యో పిల్లలుంటారని ఊహించి వచ్చిన వివేక్‍కి – విశాలమైన స్కూలు భవనం కనబడడం, అందులో పన్నెండు వందల మంది గిరిజన బాలబాలికలు చదువుతున్నారన్న వాస్తవం విస్తుగొల్పుతాయి. ఇటువంటివన్నీ అతనిలో ఉన్న అపోహలను దూరం చేస్తూ, తన లక్ష్యం దిశగా మళ్ళిస్తాయి. నవల సాగుతున్న కొద్దీ వివేక్ తన వ్యక్తిగత అన్వేషణలో ముందుకుపోతూ తన తండ్రి ఎవరో, తమ మూలాలు ఎక్కడివో, తెలుసుకుంటాడు. మూలాలను గ్రహించిన తరువాత ఒకప్పటి తన వ్యక్తిగత లక్ష్యాలను వదిలి తన జాతికి మేలు చేసే దిశగా తన ప్రస్థానాన్ని మార్చుకుంటాడు, విజయం సాధిస్తాడు.
ఇది ప్రక్రియా పరంగా నవలే అయినప్పటికీ ఇందులో ఒక ట్రావెలోగ్ ఉంది. వివేక్ అన్వేషణలో భాగంగా పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని సహజమైన వాతావరణంలో మట్టి రోడ్ల పైన కాలినడకనో, ఎడ్ల బండి మీదో మనం కూడా అతనితో పాటే గ్రామాలలో తిరుగుతాం. పచ్చటి చెట్లు, విధ్వంసానికి లోనుకాని స్వచ్ఛత – రా రమ్మని ఆహ్వానిస్తూ, మనల్ని ఆ యాత్రలో భాగం చేస్తాయి.
ఈ నవలలో – జ్యాగ్రఫీ ఉంది, ఆంత్రోపాలజీ ఉంది, సోషియాలజీ ఉంది. సైకాలజీ ఉంది. వివేక్ ఉద్యోగార్థి యై గిరిజన గ్రామానికి వెళ్ళటానికి ఆదిలాబాద్ బస్ ఎక్కుతాడు. అప్పుడు ఆదిలాబాద్ జిల్లా గురించి చెప్తూ రచయిత్రి జిల్లా సరిహద్దులని, మహరాష్ట్రలోని సమీప పట్టణాల గురించి చెప్తున్నప్పుడూ నవలలో జాగ్రఫీ కనబడుతుంది. తన మూలాలను తెలుసుకునే క్రమంలో వివేక్ జరిపిన పర్యేషణ – సమాజశాస్త్రం లోని డైనమిక్స్‌ను వ్యక్తం చేస్తుంది. గిరిజనుల జీవన విధానాలు ప్రస్తావించేటప్పడు మానవ విజ్ఞాన శాస్త్రపు మౌలిక అవగాహనను వ్యక్తావ్యక్తంగా ప్రదర్శిస్తుంది. ఇక ప్రధాన పాత్ర, అతని కుటుంబం, బడి, స్నేహితులు – వీరందరి మానసిక సంవేదనలను వెల్లడిస్తున్నప్పుడు మానసిక శాస్త్రపు లక్షణాలు కనబడతాయి.
ఈ నవల చదువుతున్నప్పుడు అలెక్స్ హేలీ నవల ‘రూట్స్’ మనసులో మెదులుతుంది. అందులోని ప్రధాన పాత్రదీ స్వీయమూలాల అన్వేషణే, ఖండాంతర అన్వేషణలో తన ఏడు తరాలను తెలుసుకుంటాడు. ‘మోదుగ పూలు’ నవల పరిధి ‘రూట్స్’ అంత విస్తృతమైనది కాకపోయినా, ఇందులో ప్రధాన పాత్రదీ కూడా ఓ అన్వేషణే కావడం, తన తండ్రిని వెతికే క్రమంలో – తమ జాతి గురించి, ఆచార వ్యవహారాల గురించి తెలుసుకోవడం, ఆధునికత సంతరించుకున్నా, మౌలిక స్వభావాన్ని వదులుకోకుండా గిరిజనులలో ఒకడిగా జీవించడం వంటివి – ‘రూట్స్’ లోని కింటా కుంటే పాత్రని గుర్తు చేస్తుంది. రెండు నవలలోనూ వెనుకబాటుతనం, దోపిడీ, ఆధిపత్య ధోరణులు – ప్రధాన పాత్రలను ప్రభావితం చేస్తాయి. అందులో పెట్టుబడీదారీ వ్యవస్థ దౌష్ట్యం, ఇందులో భూస్వామ్య వ్యవస్థ దౌర్జన్యం! ఈ పోలిక సమంజసం కాకపోవచ్చు. కానీ నాకు అలా అనిపించింది.
ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పాట, నాటకం ఎంతలా ఉపకరించాయో ఈ నవల మరోసారి గుర్తు చేస్తుంది. వర్తమాన సమాజంలో ప్రజలలో అవగాహన కలిగించేందుకు అవసరమైన ఉపకరణాలలో నాటకం కూడా ఒకటని ఈ నవల ఘంటాపథంగా చాటుతుంది. కొమరం భీమ్ గురించి, ఆయన వ్యక్తిత్వం, పోరాటం గురించి ఈ నవలలో పిల్లలు ప్రదర్శించిన నాటకం – పెద్దలనూ ఆకట్టుకున్నట్టే – లక్ష్యసాధనలో నిజాయితీ ఉంటే, ఆశించిన గమ్యాన్ని చేరుకోగలమని తెలుస్తుంది,
గిరిజనులకు మేలు చేయాలనే తలంపు సాకారం కావాలంటే వారి భాషకి ఎందుకు ప్రాముఖ్యతనీయాలో ఈ నవల చెబుతుంది. స్వభాష ప్రభావాన్ని చెబుతుంది.
అన్నిటికీ మించి ఆర్ద్రత ఈ నవలనిండా పరుచుకుని పాత్రలతో పాఠకులు మమేకమయ్యేలా చేస్తుంది. వివేక్ వెతుకులాట ఫలించాలని పాఠకులు మనస్ఫూర్తిగా కోరుకుంటారు. హ్యుమన్ ఎలిమెంట్స్ ఈ నవలకి బలం! ఈ నవలలో ప్రధాన గుణం వేగంగా చదివించగలగడం. సరళంగా సాగిన కథనం పాఠకులను కట్టిపడేస్తుంది. చదువుతుంటే మరో ప్రపంచంలో విహరిస్తున్న భావన బలంగా కలుగుతుంది.
సినిమా గానో/ఓటిటి సీరిస్ గానో మలచదగ్గ ఇతివృత్తం ఇది.
ముఖచిత్రం కోసం అన్వర్ వేసిన బొమ్మ నవల ఆత్మను పట్టుకుందని చెప్పాలి. ఆయనకీ అభినందనలు. అన్వర్ గారి బొమ్మని కవర్ పేజీగా రూపుదిద్దే క్రమంలో ముఖచిత్రంలోని మోదుగ పూలను, పుస్తకం టైటిల్‍ను, చిత్రంలోని ఇద్దరు మిత్రులను, వెనుక అట్ట మీద రచయిత్రి ఫొటోని మాత్రం లామినేట్ చేసి కవర్ పేజీని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్రచురణకర్తకు అభినందనలు తెలియజేయాలి.
ఆసక్తిగా చదివించే నవల. పాఠకులను నిరాశపరచదు. ఈ పుస్తకం విక్రయాలపై వచ్చే ధనాన్ని గిరిజన గురుకులం వారికి పంపాలన్న నిర్ణయం రచయిత్రి సహృదయతను, ఈ రచనలోని నిబద్ధతనూ చాటుతుంది.
***
మోదుగ పూలు (నవల)
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 168
వెల: ₹ 150
ప్రతులకు:
అచ్చంగా తెలుగు పుస్తకాలు: 085588 99478 (వాట్సప్ మాత్రమే)
ఆన్‍లైన్‍లో:
https://books.acchamgatelugu.com/products/moduga-poolu