[dropcap]వ[/dropcap]ర్షమని ఆశపడ్డాను కానీ
గుండెను గట్టు తెగిన చెరువుగా
చేసిపోతుందనుకోలేదు
తామర తంపరై
విరిసిన ఆశను కకావికలు
కావిస్తుందని అనుకోలేదు
నవ్వుతూ వచ్చిన
నీలిమేఘం ఇంద్ర ధనువై
నిలిచిపోతుందనుకున్నాను కానీ
నన్నొక ఆనవాలు లేని
నీటిరాతనుగా మలిపేస్తుందనుకోలేదు
నేల నీటిని వలచినట్లు
పక్షి గాలిని ప్రేమించినట్లు
చిన్ని చీమ చక్కెర తుంపును
తలకెత్తుకు పరవశంగా
మోసుకెళ్ళినట్లు
నీ మాటల పరవశాన్ని చుట్టుకు తిరిగిన
పిచ్చి మనసు కదా యిది
కంటి తడిలా
చూపునలుముకున్న బంధానికి
ఇక సెలవని చెప్పలేను
వూపిరిగా మలుచుకున్న
నవ్వుల చూపులను
మరచి నిలవగలననీ అనుకోలేను