Site icon Sanchika

మొక్క

[dropcap]నా[/dropcap]గలి పట్టి భూమిని దున్నగా దున్నగా…
మడక కారు తాకిడికి
మట్టి ముద్దలు పెళ్ళలు పెళ్ళలుగా రాగా…
మట్టి రేణువు రేణువూ పొరలుగా విడిపోగా…
రెక్కలొచ్చిన పక్షి పిల్ల గూటిలోనుండి తొంగి చూసినట్టూ…
పొడుచుకువచ్చిన మొలక
తల్లి జాడకోసం వెతకినట్టు…
మా నాన్న కోసం చూస్తున్న చేను.

గుడ్డు పెట్టగానే
అమాంతం తన ఒడిలో పొదుగుకునీ కంటికి రెప్పలా కాచే కోడి పెట్టలా…
విత్తనం తనతో స్నేహం చేసీ చెయ్యగానే…
అమాంతం తన ఒడిలో పొదుగుకుని…
తన శరీరాన్నే కప్పి పుచ్చుతుంది “పుడమి తల్లి”.

పుడమి తల్లి గర్భంలో ఉన్న విత్తనం…
పాతుకుపోయి కుళ్లిన చెత్తాచెదారం సాయంతో… పుడమి కడుపు నుండి…
సరికొత్త రూపుతో బయటపడింది.

బయటి ప్రపంచమే చూడాలనీ…
పుడమి ఒడిలో దాగకూడదని…
చీమలెన్ని చీవాట్లు పెట్టినా…
ఊపిరి ఆడకనున్నా…
గాలి సోకకనునా…
వెలుతురే కానరాకున్నా…
వర్షం ఎంత దబ్బటగా పడినా…
మట్టి తనమీదకెంత కూరుకుపోయినా…
లోలోపల తన ఆవేదనను దేవునికి చెపుతూ…
తన కన్నునే… పొడుచుకుని
అన్నింటినీ భరించి… మరీ మరీ
తన రెండు చేతులతో…
పుడమిని చీల్చి…
ఆకాశాన్ని చూసి…
మై మరచిపోయే…
ఈ బుల్లి విత్తనం …
మొలకలు వేస్తూ…
ఓ చిన్ని మొక్కై.

Exit mobile version