[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘మొక్కలతో మమేకమైతే..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ది గ్రీష్మ ఋతువు
మంచి ఎండాకాలం
సాయంకాలం ఐదు గంటలకు
గాలికోసం మాతోటలో
చెట్లమధ్య కూర్చున్నా
తోటంతా కలయచూశా
ఉదయంనుంచి కాసిన ఎండకు
చెట్లన్నీ తలలు వాల్చి బిక్కమొఖంవేసి
దిక్కులు చూస్తున్నాయి
తమ దాహాన్ని తీర్చి
తమకు శక్తిని చేకూర్చమని
నావైపే చూస్తూ రారమ్మని పిలిచినట్లు
చేతులుచాచి ఆహ్వానిస్తున్నట్లనిపించింది
ఈ వేడిమికి నేనేం చేయగలనని
నాలోనేనే మథనపడ్డాను
తళుక్కున మెరసిన ఆలోచనతో
కొన్ని నీళ్ళు తీసుకెళ్ళి
మొక్కల మొదట్లో పోశాను
అదేమి చిత్రమో కాని
తోటంతా తడిపేటప్పటికి
చెట్లకున్న ప్రతి ఆకు తలయెత్తి
నన్ను చూసి చిరునవ్వు
నవ్వుతున్నట్లనిపించింది
కదలుతున్న కొమ్మల ఆకులు
పిల్లగాలులతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు
నా శరీరానికి హాయిని చేకూర్చాయి
చంద్రోదయంతో విచ్చుకున్న
పూలన్నీ సువాసనలు వెదజల్లుతూ
మనస్సున కొత్త భావాలు మేలుకొలిపాయి
అప్పుడు నా కనిపించింది
మొక్కలతో మమేకమైతే
అర్థం చేసుకునే మనసుంటే
అవి మూగబాసలు చేస్తాయి
పచ్చని చెట్లన్నీ మనసు విప్పి
మొక్కలు మనతో మాట్లాడతాయి
ప్రకృతిఅందాలను ఆస్వాదించగలిగితే
మనిషి ఆనందానికి అవధులుండవు.