[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ఇం[/dropcap]జనీర్లకు పితామహుడుగా పేరుగాంచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య కర్ణాటక రాష్ట్రంలో జన్మించారు. విశ్వేశ్వరయ్య జన్మదినమైన సెప్టెంబరు 15వ తేదిని ‘ఇంజనీర్స్ డే’ గా జరుపుకుంటారు. ఇంజనీరుగా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత మైసూరు రాజుగారి వద్ద దివానుగా పని చేశారు. 1912వ సంవత్సరం నుంచి 1918వ సంవత్సరం దాకా మైసూరు రాజ్యంలో దివానుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
విశ్వేశ్వరయ్య స్వగ్రామమైన ముద్దున హళ్లి లోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరిగింది. ఆనాడు వారున్న ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఇక్కడ విశ్వేశ్వరయ్య సాధించిన రికార్డులు, మెమెంటోలు, బిరుదులు, పతకాలు వంటి వాటిని ప్రజల సందర్శనార్థం అలంకరించారు. అంతేకాక వారి కుటుంబం వాడిన వస్తువులు కూడా ఉన్నాయి. విశ్వేశ్వరయ్య వాడిన కప్పులు, కళ్ళద్దాలు, విజిటింగ్ కార్డు వంటి వాటిని కూడా ప్రదర్శనలో ఉంచారు. కృష్ణరాజ సాగర్ ఆనకట్ట మోడల్ ఆ ఇంటిలోనే భద్రపరిచారు.
ఈ ఇంటి పక్కనున్న స్థలంలో ఒక స్మారక చిహ్నం నెలకొల్పబడింది. వీరిని కర్ణాటక రాష్ట్ర పితామహుడుగా గుర్తిస్తారు. మద్రాసు విశ్వ విద్యాలయం నుంచి 1881 లో బి ఏ డిగ్రీని పొందారు.
మైసూరు రాజు కృష్ణరాజ వడయార్ దగ్గర దివానుగా పని చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. మైసూరు ఆనకట్ట కట్టేందుకు విశ్వేశ్వరయ్య చీఫ్ ఇంజనీరుగా పని చేశారు. ఇంజనీరింగ్ రంగంతో పాటుగా విద్యా రంగానికి కూడా ఎనలేని కృషి చేశారు. మైసూరులో కృష్ణరాజసాగర్ ఆనకట్టకు మాత్రమే కాదు మైసూరు విశ్వ విద్యాలయం నెలకొల్పటం లోనూ ప్రధాన పాత్ర పోషించారు. బ్రిటిషు ప్రభుత్వం తరుపున ఐదవ కింగ్ జార్జి వారికి ‘నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్’ అనే బిరుదు నిచ్చి గౌరవించారు.
విశ్వేశ్వరయ్య కర్ణాటక రాష్ట్రానికే కాదు తెలుగు రాష్ట్రాలకు తమ సేవలందించారు. మూసినదికి వచ్చే వరదల నుండి హైదరాబాద్ లోని పత్తర్ గట్టి నిర్మాణానికి ప్లానును వేసిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని వరదల బారి నుండి రక్షించినపుడు గొప్ప పేరు వచ్చింది. సముద్రపు కోత నుండి విశాఖపట్నం రేవును కాపాడే విధంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట పూర్తిగా విశ్వేశ్వరయ్య పర్యవేక్షణ లోనే జరిగింది. నీటి పారుదల శాఖలో ఉద్యోగంలో చేరి దక్కను ప్రాంతంలో నీటి పారుదల వ్యవస్థను రూపొందించారు.
కర్ణాటక లోని కాలేజీలన్నిటికి విశ్వేశ్వరయ్య పేరునే పెట్టారు. విశ్వేశ్వరయ్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ పేరున్న పెద్ద సంస్థ. బెంగుళూరు లోని టెక్నాలజికల్ మ్యూజియంకు విశ్వేశ్వరయ్య పేరే పెట్టారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు అయన పేరుతోనే నడుస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో గౌరవ సభ్యులు గానూ, ఎనిమిది విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తోనూ సత్కరించారు. ఐ.ఎస్.సి కి 1923 లో అధ్యక్షుడిగా పని చేశారు. లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ యాభై ఏళ్ల పాటు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. మైసూరు సబ్బుల కర్మాగారం, బెంగుళూరు అగ్రికల్చరల్ యూనివర్సిటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, పారాసిటాయిడ్ లేబరేటరీ వంటి ఎన్నో నెలకొల్పటంతో విశ్వేశ్వరయ్య అధ్బుత ప్రతిభ చూపారు. భారత ప్రభుత్వం 1955 లో అత్యన్నత భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది.