Site icon Sanchika

మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-10

అధ్యాయం 10 – మైసూర్‌లో పౌర సదుపాయాల కల్పన:

[dropcap]దీ[/dropcap]వాన్‌గా నా పదవీ కాలంలో విద్య, రాజకీయ, పరిపాలనా రంగాలలో జరిగిన ముఖ్యమైన మార్పులు, అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి నేను ఇంతకు ముందు అధ్యాయాలలో ప్రస్తావించాను. 1909 నవంబర్‌లో నేను మైసూర్ రాష్ట్ర సర్వీస్‌లో చీఫ్ ఇంజనీర్‌గా ప్రవేశించే సమయంలో ప్రజా పనులతో పాటు రాష్ట్రంలో ముఖ్యంగా విద్య, పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం కల్పించాలని నేను ఒక షరతు విధించాను. దీవాన్‌గా ఈ అంశాన్ని రెండవసారి నేను ప్రత్యేకంగా H E మహారాజు గారి దృష్టికి తెచ్చాను. కేవలం సాధారణ పరిపాలన ఒక్కటే నాకు ఆసక్తి కలిగించే అంశం కాదు. యూరప్, జపాన్, అమెరికాలో నా ప్రయాణాలు, అధ్యయనాలు మన దేశాన్ని మునుముందు పురోగతిలో, సంపద ఉత్పత్తిలో ఈ దేశాలకు దీటుగా తీర్చిదిద్దడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్న భావన నా మనస్సులో బలంగా నాటుకుపోయింది. భారతదేశం లాంటి నాగరిక సమాజం మనల్ని చుట్టుముట్టిన అజ్ఞానం, తక్కువ జీవన ప్రమాణాలతో ఉన్న సామాజిక పరిస్థితిని మార్చకుండా ఇంకా నిశ్చలంగా కూర్చోవడం, దేశం అభ్యున్నతిని ప్రోత్సహించడానికి చురుకైన ప్రయత్నాన్ని ప్రారంభించకపోవడం అనర్థదాయకమని నేను అనుకున్నాను.

దీవాన్‌గా నా పదవీ కాలంలో మరికొన్ని ముఖ్యమైన రంగాలలో జరిగిన అభివృద్ది కార్యక్రమాల ప్రస్తావన చేయడం సముచితమని నేను భావిస్తున్నాను.

జనాభాలో 85 శాతానికి పైగా జనం నిరక్షరాస్యులుగా ఉన్నారు. గ్రామాల్లో రైతుల వద్ద చిన్నచిన్న భూకమతాలు ఉన్నాయి. సామాజిక వ్యవస్థలో ఉన్న ఈ లోపాలు వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచడానికి, వేగవంతమైన పురోగతిని సాధించే అవకాశాలకు ఆటంకాలుగా పని చేస్తున్నాయి. అయినప్పటికీ, క్రింద పేర్కొన్న కొన్ని చర్యలను ప్రభుత్వం తీసుకొన్నది.

ప్రభుత్వం తరపున కొన్ని వ్యవసాయ పరిశోధనల కోసం ప్రత్యేకమైన క్షేత్రాలను స్థాపించాము. వీటిల్లో మెరుగైన సాగు పద్ధతుల ప్రదర్శన; మెరుగైన వ్యవసాయ పనిముట్ల వినియోగం; ఎరువులు, మెరుగైన విత్తన జాతుల పంపిణీ; హెబ్బాలోని వ్యవసాయ పాఠశాలలో స్వల్పకాల శిక్షణా కోర్సులు, ఇటువంటి శిక్షణ కోర్సులను మరికొన్ని కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేశాము. తకావి రుణాల కింద ఉదారంగా మరిన్ని గ్రాంట్లు మంజూరు చేశాము. వ్యవసాయ గణాంకాలు సేకరించేందుకు కూడా ఏర్పాట్లు జరిగినాయి.

మైసూర్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు చిన్న పరిమాణంలో నిల్వ సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి నీటిని వృథా కాకుండా చూసుకోవాలి. చెరువుల నిర్వాహణ రైతులు తమకు తాము చేసుకోలేరు. వారిని అందుకు సిద్ధం చేయడం కూడా కష్టం, కాబట్టి చెరువులను మరమ్మతులు చేసి సరైన స్థితిలో ఉంచడం ప్రభుత్వం మాత్రమే చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పటికే చెప్పినట్లుగా మరకనవె జలాశయం కింద, అలాగే కావేరి ఎడమ గట్టు కాలువ కింద నీటిపారుదల బ్లాక్ సిస్టంను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాము. ఈ ప్రయోగం వలన రైతులకు కొంత మేలు జరిగింది. కానీ అవసరానికి మించిన నీరు అందిస్తే పంటలకు పెద్దగా మేలు జరగదన్న విషయాన్ని నిరక్షరాస్యులైన జనాభాకు బోధించి ఆ నష్టాన్ని గ్రహించేలా ప్రేరేపించడం చాలా కష్టం. సరైన నీటిపారుదల వ్యవస్థను రూపొందించడానికి అవసరమైన క్రమశిక్షణ, నియమాలు ఇప్పటికీ అసంపూర్ణంగా అమలౌతున్నాయని ఒక అసంతృప్తి మాలో ఉండింది. కావేరి లోయలో కూడా అవసరానికి మించి ఎక్కువ నీరు పంటలకు వినియోగిస్తుంటారు. గ్రామస్థులకు నీటి వినియోగంపై ఆంక్షలు నచ్చవు. పౌర అధికారులు, కొన్ని సందర్భాల్లో వారి పక్షం వహించేవారు. తెలియకుండానే కాలువ నీటిని వృథాగా ఉపయోగించేందుకు అనుమతించేవారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన నియమాలు, క్రమశిక్షణలు భవిష్యత్తులో నీటిపారుదల పనులపై ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నాము.

పరిశ్రమలు:

ఆధునిక జీవితంలో పరిశ్రమల స్థాపన, వాటి పురోగతి ఒక దేశం శ్రేయస్సు కోసం ప్రధానమైనవి. నా హయాంలో కింది పరిశ్రమలను పారిశ్రామికవేత్తలు మైసూర్లో ప్రారంభించారు.

పట్టు పరిశ్రమలు, చందనపు నూనె ఉత్పత్తి కేంద్రాలు, సబ్బుల ఉత్పత్తి కేంద్రాలు, లోహ ఖార్ఖానాలు, క్రోమ్ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు అయినాయి. ప్రభుత్వం తరపున కేంద్ర పారిశ్రామిక వర్క్‌షాప్‌లు, జిల్లా పారిశ్రామిక వర్క్‌షాప్ లను ఏర్పాటు చేశాము. గ్రామీణ పరిశ్రమలు, చిన్నస్థాయి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి సబ్సిడీలు ప్రవేశపెట్టాము. కొత్త కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాము. హోటళ్లు, ప్రింటింగ్ ప్రెస్‌ల స్థాపనను ప్రోత్సహించాము. లోన్లు మంజూరు చేసి ప్రైవేట్ వర్క్‌షాప్‌ల ఏర్పాటును ప్రోత్సహించాము.

మైసూర్ ఇనుము, ఉక్కుశుద్ధి చేసే కేంద్రాలను మంజూరు చేశాము. 1918లో ఈ పరిశ్రమ నిర్మాణం ప్రారంభించాము. వీటిపై మరో అధ్యాయంలో వివరణాత్మకంగా చర్చించాను. ఈ ముఖ్యమైన పరిశ్రమ స్థాపన కోసం వాస్తవానికి మంజూరు చేయటానికి దాదాపు నాలుగు సంవత్సరాలు ముందు నుంచే సర్వే చేస్తూ ఉన్నాము. ఈ అంశం ఆనాటి నుంచే ప్రభుత్వ పరిశీలనలో కూడా ఉన్నది. జంషెడ్‌పూర్ లోని టాటా ఐరన్ & స్టీల్ వర్క్స్కు రూపకల్పన చేసిన అమెరికన్ కన్సల్టింగ్ ఇంజనీర్, నిపుణుడు శ్రీ సి.పి. పెరిన్ సహాయంతో ఈ పథకం రూపొందించినాము.

చార్లెస్ పేజ్ పెరిన్

1914 నుంచి నేను డిసెంబరు 1918‌లో దీవాన్ పదవీ విరమణ చేసిన తేదీ మధ్య కాలం అంతా యుద్ధ సమయం. కాబట్టి భారత ప్రభుత్వం మెకానికల్ ఇంజనీరింగ్ తరహా కొత్త పరిశ్రమలు లేదా కర్మాగారాల స్థాపనకు వ్యతిరేకంగా ఉండింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి పని కోసం అన్నిరకాల నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమని భారత ప్రభుత్వం భావించింది. ఈ పరిస్థితులలో ఉక్కు, కాగితం, చక్కెర, సిమెంట్ వంటి అనేక కొత్త పరిశ్రమల కోసం సర్వేలు, ప్రాజెక్టు నివేదికలు, ప్రతిపాదనల తయారీతోనే మేము సంతృప్తి చెందాము. యుద్ధం ముగిసిన వెంటనే నిర్మాణాన్ని ప్రారంభించగలమని ఆశించాము.

అదే సమయంలో యుద్ధం కారణంగా ఎగుమతి వాణిజ్యంలో చాలా తక్కువ అవకాశాలు ఉండేవి. అయినప్పటికీ మేము ఎగుమతి చేయవలసిన, దిగుమతి చేసుకోవలసిన సరకుల అంచనాలను సిద్ధం చేసాము. ఇవి ఆచరణాత్మక విలువగా పరిగణిస్తారని మేము భావించాము. అప్పుడే కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉనికిలోకి వచ్చింది. బెంగళూరు సివిల్ & మిలిటరీ స్టేషన్లో నివసిస్తున్న హాజీ సర్ ఇస్మాయిల్ సైత్ ఒక ఔత్సాహిక వ్యాపారి. ఆయన సమకూర్చిన విరాళం మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాని స్వంత భవన నిర్మాణాన్ని ప్రారంభించడానికి దోహదపడింది.

సర్ హాజీ ఇస్మాయిల్ సైత్

సాధారణ వ్యాపారులకు వాణిజ్య విషయాలలో సాయంత్రం తరగతులు బెంగుళూరులో, కొన్ని తాలూకా ప్రధాన కార్యాలయాలలో జరిగాయి. కామర్స్‌లో యూనివర్సిటీ డిగ్రీ కోర్సు (బి. కామ్) నేను మైసూర్ సర్వీస్ నుండి నిష్క్రమించిన తర్వాత రద్దు చేసినారు. అయితే మూడేళ్ల క్రితం బి.కామ్ కోర్సును పునఃప్రారంభించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

1917లో వ్యాపారవేత్తలు, వ్యాపారుల బృందాన్ని జపాన్ దేశానికి డిప్యుటేషన్ పంపించాము. ఆ ప్రగతిశీల ఆసియా దేశంలో ఉనికిలో ఉన్నవాణిజ్య వ్యవస్థ, వారు అనుసరిస్తున్న వాణిజ్య పద్ధతులను బృందం అధ్యయనం చేసింది. సాధ్యమైన చోట మైసూర్‌లో వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి వాటిని స్వీకరించి అమలుచేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావించాము.

జల విద్యుత్ ఉత్పాదనలో పురోగతి:

శివసముద్రం వద్ద 13,000 హార్స్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఇంతకు ముందు ఒక అధ్యాయంలో పేర్కొన్నాను. కావేరి జలాశయం వద్ద జల విద్యుత్ కేంద్రం పాక్షిక నిర్మాణం ద్వారా దీని సామర్థ్యం 25,000 హార్స్ పవర్‌కు పెరిగింది. ఈ పెరుగుదల దశల వారీగా జరిగింది. కోలార్ బంగారు గనుల అదనపు అవసరాలను తీర్చడానికి ఈ పెంపు అనివార్యం అయ్యింది.

కావేరీ జలాశయం నిల్వ నీటితో ప్రస్తుతం మొత్తం విద్యుత్ సామర్థ్యం 83,000 హార్స్ పవర్. ఈ విద్యుత్ అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయం బాగా పెరిగింది. 1911-12లో రూ. 16.65 లక్షలు ఉంటే అది 1918-19లో రూ. 24.2 లక్షలుగా నమోదు అయ్యింది. 1948-49 నాటికి విద్యుత్ అమ్మకాల ద్వారా సమకూరిన ప్రభుత్వ వార్షిక ఆదాయం రూ. 1.33 కోట్లుగా ఉందని అందుబాటులో ఉన్న తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మైసూర్ రాష్ట్రం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పి అభివృద్ధి చేయడానికి ఇద్దరు అమెరికన్ ఇంజనీర్లు మాకు ఇతోధికంగా సహాయం చేసారు. శ్రీ హెచ్.బి. గిబ్స్, శ్రీ ఎస్. జి. ఫోర్బ్స్.. వీరిద్దరూ మైసూర్లో సమర్ధవంతమైన సేవను అందించారు. అనంతరం వారు బొంబాయిలో మెసర్స్ టాటా సన్స్, లిమిటెడ్ సంస్థలో చేరారు.

జోగ్ జలపాతం వద్ద జల విద్యుత్ కేంద్రం అభివృద్ధి కోసం ఒక ప్రాజెక్ట్‌ను షిమోగా జిల్లాలోని శరావతి నదిపై సర్వేలు చేపట్టారు. అవి పురోగతిలో ఉన్నాయి. యుద్ధ సమయంలో వనరుల కొరత.. ముఖ్యంగా కార్మికులు, డబ్బు కొరత కారణంగా నా పదవీ కాలంలో ఈ ముఖ్యమైన, ఆకర్షణీయమైన జల విద్యుత్ పథకం నిర్మాణాన్ని చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఈ పథకం వాస్తవ నిర్మాణం ఇప్పుడు మంచి పురోగతి సాధించిందన్న సమాచారం సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు 48,000 కిలోవాట్లు మాత్రమే. ప్రస్తుత డిజైన్ ప్రకారం విద్యుత్ కేంద్రం పూర్తయినప్పుడు మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,20,000 కిలోవాట్లు ఉంటుంది.

రైల్వే మార్గాల విస్తరణ:

నేను దీవాన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నిర్మాణం నిలిచిపోయిన అదనపు రైల్వే లైన్ల పనులను చేపట్టాము. ఈ రైల్వే నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ఒక చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని నెలకొల్పాము. ఇందుకోసం భారత ప్రభుత్వం నుండి శ్రీ (తరువాత సర్) ఇ.ఎ.ఎస్. బెల్ అనే నిపుణుడి సేవలను పొందాము. స్థానిక రైల్వే శాఖను కూడా ఏర్పాటు చేసాము. శిక్షణ తర్వాత రైల్వే శాఖలో సేవల నిమిత్తం స్థానిక ఇంజనీర్లు, ఇతర అధికారులను నియమించాము. ఎం & ఎస్ ఎం రైల్వే సంస్థ అధీనంలో ఉన్న మైసూర్ – బెంగుళూరు, ఇతర అనుబంధ రైలు మార్గాలను మైసూర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగినాయి. H H మహారాజా వారు 1918 ఏప్రిల్ 10న నాకు వ్యక్తిగతంగా రాసిన లేఖలో ఈ విధంగా ఉల్లేఖించారు.

భారత ప్రభుత్వం బీరూర్-షిమోగా, మైసూర్-నంజన్గూడు, బెంగళూరు-మైసూర్ రైల్వే మార్గాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఈ ఉదయం మీ వద్ద వచ్చిన ఉత్తరం ద్వారా తెలుసుకున్నందుకు నేను సంతోషించాను.

ఇది రాష్ట్రానికి నిజమైన లాభం చేకూర్చే నిర్ణయం. ఈ విషయంలో మీరు చేసిన కృషికి మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను

రాష్ట్రంలో 411 మైళ్ళు ఉన్న రైల్వే మార్గాల పొడవు 616 మైళ్లకు పెరిగింది. నేను రాష్ట్ర సర్వీస్ నుండి పదవీ విరమణ చేసినప్పుడు 46 మైళ్లు రైలు మార్గాలు నిర్మాణంలో ఉన్నాయి. 1950లో ప్రస్తుతం మైసూర్ రాష్ట్రంలో రైల్వే మార్గాల పొడవు 757 మైళ్ళు. రైలు మార్గాల నిర్వాహణకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బందితో కొత్త రైల్వే శాఖను ఏర్పాటు చేయడం జరిగింది.

మైసూర్ రాష్ట్ర రైల్వే లోగో

1912-13 లో నేను దీవాన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు రైల్వేల నుండి వచ్చిన స్థూల వార్షిక ఆదాయం రూ. 37,21,674. 1918-19 లో నేను పదవీ విరమణ చేసినప్పుడు అది రూ. 53,00,806 లకు పెరిగింది. 1948-49 నాటికి రైల్వే ఆదాయం రూ. 2.48 కోట్లకు పెరగడం గమనార్హం.

మైసూరు రైల్వేలు దక్షిణ రాష్ట్రాలలో ఉన్న మీటర్-గేజ్ మార్గాలతో అనుసంధానం జరగలేదు. దక్షిణాదిలో రైల్వే వ్యవస్థ అంతా బ్రిటిష్ కంపెనీల నిర్వాహణలో ఉండేవి. బహుశా ఈ కారణం వల్లనే వారు ఎం &ఎస్ ఎం కంపనీ నిర్వహణలో ఉన్న మైసూర్ మార్గాలను దక్షిణాది రాష్ట్రాల మార్గాలతో అనుసంధానించే ప్రతిపాదనలను తిరస్కరించారు. ఈ అనుసంధానంపై దృష్టి పెట్టాలని నేను కూడా భారత ప్రభుత్వాన్ని పలు మార్లు కోరాను. కానీ వారు అంగీకరించలేదు.

మైసూర్ సముద్ర తీరంలో పోర్టు నిర్మాణం:

భత్కల్ వద్ద హార్బర్ నిర్మాణం కోసం పరిశోధనలు, సర్వేలు ప్రారంభించాము. ఇది మైసూర్ విదేశీ వాణిజ్యానికి అనుకూలమైనది. ఇంజినీరింగ్ కోణంలోంచి చూస్తే మంగళూరు ప్రాంతం పోర్టు నిర్మాణానికి అనుకూలమైన స్థలం కాదని, సౌకర్యవంతంగా ఉండదని నేను గుర్తించాను. పోర్టు నిర్మాణం విషయంలో భారత ప్రభుత్వం ఎప్పుడు తుది నిర్ణయం తీసుకున్నా అది దేశంలోని అత్యధిక జనాభా ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని భావించాము. భత్కల్ పోర్టు మద్రాస్, బొంబాయి, మైసూర్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు సేవలు అందించే అవకాశం ఉంది. మైసూర్ రాష్ట్ర ప్రయోజనాలు ఈ భత్కల్ ప్రాంతంలో నిర్మించే ఓడరేవు ద్వారా అత్యధికంగా అందుతాయి. 1918లో నేను పదవీ విరమణ చేసే సమయానికి నౌకాశ్రయం, రైల్వేని షిమోగాతో అనుసంధానించడానికి అవసరమైన పరిశోధనలు మరియు సర్వేలు పూర్తయ్యాయి.

పరిపాలనలో సంస్కరణలు:

మైసూర్ రాష్ట్ర సర్వీసుల నియామకాలకు సంబందించిన నిబంధనలు రూపొందించాము. వీటికి తోడు సవరించిన నిబంధనల ప్రకారం మైసూర్ సివిల్ సర్వీస్ పరీక్ష క్రమం తప్పకుండా జరిగేది. అధికారుల గ్రేడ్ల కోసం ఇతర శాఖలలో కూడా పోటీ పరీక్షలు అనేకం జరిగేవి. దిగువ స్థాయి ఉద్యోగాలకు సరైన అర్హత సూత్రం సాధారణంగా పాటించేవారం. అది పకడ్బందీగా అమలు జరిగింది. సర్వీసులకు నియామకాలలో వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు నిర్దిష్ట సంఖ్యలో ఖాళీలు కేటాయించాము.

మేము ప్రవేశపెట్టిన మరో ముఖ్యమైన సంస్కరణ ఏమిటంటే.. వ్యవసాయం, ఇతర వ్యాపకాలలో ఉండే స్థానిక ప్రతినిధులచే వారి సమస్యలపై చర్చ కోసం జిల్లా, తాలూకా స్థాయిలో సమావేశాలు నిర్వహించే సాంప్రదాయాన్ని నెలకొల్పాము.

దీవాన్‌గా నా సేవలు ముగింపు దశకు చేరుకునే లోపల పరిపాలన, ప్రభుత్వ సేవల్లో ఖచ్చితంగా అనుసరించాల్సిన సూత్రాలు, విధి విధానాలపై ఒక కోడ్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాను. పాశ్చాత్య పద్ధతులకు చాలా దగ్గరగా కట్టుబడి ఉండటం పెద్దగా ప్రజాదరణ పొందలేదు. నేను సర్వీస్ నుండి పదవీ విరమణకు సమయానికి ఆశించినట్టుగా సర్వీస్ నియమావళిని పూర్తి చేసి, అమలులోకి తీసుకురావడం సాధ్యం కాలేదు.

ఆర్థికం – ఆదాయం:

1911-12లో రాష్ట్ర స్థూల ఆదాయం రూ. 2.51 కోట్లు ఉంటే అది 1919-20 నాటికి రూ. 3.1 కోట్లకు పెరిగింది.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 1948-49 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం రూ. 11.84 కోట్లు ఉందని అంచనా.

1928-29లో నేను విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ వివరణాత్మక గణాంకాలు ఉన్నాయి. నేను మైసూర్‌లో దీవాన్‌గా ఉన్న ప్రతి సంవత్సరంలో మిగులు ఉందని, మూలధనం రూ. 332 లక్షల మేరకు పరిశ్రమలు, ఉత్పాదక ప్రజా పనులపై పెట్టుబడి పెట్టామని చూపించడానికి అ గణాంకాలు తోడ్పడతాయి. ఆ పెట్టుబడుల అనంతర కాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగడానికి చోదక శక్తులుగా మారినాయి. రాష్ట్ర సర్వీస్ నుండి పదవీ విరమణ చేసిన సుమారు పదేళ్ల తర్వాత నేను ఈ ప్రకటనను జారీ చేసాను. ఎందుకంటే నా పదవీ కాలంలో రాష్ట్ర ఆర్థిక స్థితిని విజ్ఞులు సరిగ్గా అర్థం చేసుకోలేదని భావించాను. నేను పదవీ బాధ్యతలు విరమించిన కొన్ని నెలల తర్వాత 1919-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను అప్పటి దీవాన్ గారు శాసన మండలిలో ప్రవేశపెట్టినారు. ఆ బడ్జెట్‌ను ఆయన ‘సంపద్వంతమైన బడ్జెట్ అని అభివర్ణించారు.

నగర – పట్టణాభివృద్ది:

బెంగళూరు, మైసూర్ నగరాల్లో కూడా కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. హిస్ హైనెస్ దివంగత మహారాజా శ్రీ కృష్ణరాజ వడియార్ బహదూర్ వ్యక్తిగత పర్యవేక్షణలో మైసూర్ నగరం చాలా వరకు అభివృద్ధికి నోచుకున్నది. ఈ రెండు నగరాల పట్టణాభివృద్ది కార్యక్రమాలను నిరంతరం ప్రేవేక్షించడం జరుగుతున్నది.

నా అనంతరం మైసూర్ దీవాన్‌గా పదవీ భాద్యతలు నిర్వహించిన నా వారసుల కాలంలో.. ముఖ్యంగా సర్ మీర్జా ఎం. ఇస్మాయిల్ హయాంలో ఇవి మరింత అభివృద్ధి చెందాయి. ఆయన దీవాన్‌గా సుదీర్ఘకాలం పదవిని అనుభవించారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాలు అభివృద్ది ప్రణాళికలపై, రెండు ప్రధాన నగరాల అభివృద్ధిపై ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. నేను రాష్ట్ర చీఫ్ ఇంజనీర్‌గా ఉన్నప్పుడు మైసూర్ కోసం నేను తయారు చేసిన ఆధునిక మురుగు నీటి పారుదల ప్రాజెక్ట్‌ను ఆ తర్వాత చేపట్టారు.

సర్ మీర్జా ఎం ఇస్మాయిల్

అనేక మంది దివాన్లు పని చేసినప్పటికీ , సర్ కె. శేషాద్రి అయ్యర్, శ్రీ వి.పి. మాధవరావు, సర్ మీర్జా ఎం. ఇస్మాయిల్‌ల పదవీ కాలంలో బెంగుళూరు, మైసూర్.. రెండు నగరాలు విశేషంగా అభివృద్ధి చెందాయి. వారి సాధారణ ప్రణాళిక కొంత వరకు ఆధునిక పట్టణ ప్రణాళికా వ్యవస్థలను పోలి ఉంటుంది. వాటి లేఅవుట్, నిర్వహణకు సరితూగే వ్యవస్థలు బహుశా భారతదేశంలోని మరే ఇతర పెద్ద నగరాలకు లేవని చెప్పవచ్చు.

గ్రామీణాభివృద్ది:

ఈ రంగంలో చోటు చేసుకున్నముఖ్యమైన అభివృద్దిలో గుర్తించదగినది గ్రామాల వికాసం కోసం ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకంలో గ్రామాల శుభ్రత, ప్రజారోగ్యం అంశాలను పర్యవేక్షించే అధికారం గ్రామ పంచాయతీలకే కట్టబెట్టడం జరిగింది. ఒక గ్రామం నుంచి మరో పొరుగు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వ గ్రాంట్ లను మంజూరు చేసి వారిని ప్రోత్సహించాము. అదే సమయంలో గ్రామస్థులు తమ గ్రామంలో కూడా అంతర్గత రోడ్డు సౌకర్యాలు మెరుపరచడం కోసం కూడా ప్రభుత్వం గ్రాంట్లు సమకూర్చింది. ఈ రకమైన చర్యలు గ్రామాలను కొంత మేరకు తట్టి లేపినాయి. తమ గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, పొరుగున ఉన్న గ్రామాలతో రోడ్డు సౌకర్యాలు మెరుగుపడాలని గ్రామ ప్రజలు కోరుకున్నారు.

ప్రస్తుతం కావేరి లోయలో 460 పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. వీటికి విద్యుచ్ఛక్తి, సరఫరా, వీధి దీపాలు ఏర్పాటు చేసాము. గ్రామీణ పరిశ్రమలను కూడా ప్రోత్సహించాము.

మల్నాడ్ అభివృద్ది పథకం అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించాము. మల్నాడు ప్రాంతాలను అభివృద్ది చేయడమే ఈ పథకం లక్ష్యం. మలేరియా వ్యాప్తిని తగ్గించడం, మల్నాడు ప్రాంత భూముల ఉత్పాదకతను పెంచడం, తద్వారా ఆ ప్రాంత ప్రజల సంపాదనా శక్తి పెంచడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలని భావించాము. 1917లో ప్రభుత్వం 100 పేజీలకు పైగా ముద్రించిన కరపత్రాన్ని విడుదల చేసింది. ఈ కరపత్రంలో ఆ సమయంలో చేసిన పని వివరాలను, మరింత అభివృద్ధి కోసం చేసిన సన్నాహాలను వివరించింది.

సామాజిక పురోభివృద్దికి చేసిన ప్రయత్నాలు:

అనేక దిశలలో అభివృద్ధికి ఆస్కారం ఉండింది. కానీ వనరులు పరిమితంగా ఉన్నాయి. దానికి తోడు జనాభాలో.. ముఖ్యంగా గ్రామీణ జనాభాలో ఉత్సాహం కొరవడింది.

దేవాలయాలను, ప్రార్థనా స్థలాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడం అనేది ఈ దిశలో తీసుకున్న ప్రధాన చర్యలలో ఒకటి. ఇందు కోసం ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశాము.

హిల్ స్టేషన్ల అభివృద్ధికి మైసూర్ ప్రభుత్వం నాంది పలికింది. బెంగళూరు నుండి 33 మైళ్ల దూరంలో ఉన్న నందికొండతో ఈ ప్రయత్నాలు ప్రారంభం అయినాయి. దీనితో పాటు కల్హట్ గిరి, దేవరాయండ్రుగ్ను వంటి అనేక ఇతర హిల్ స్టేషన్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేశాము. ఈ హిల్ స్టేషన్లను గతంలో బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు ఉపయోగించేవారు. సందర్శకులకు వసతి సౌకర్యాలు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా నంది హిల్స్‌ను మరింత ప్రసిద్ధ హిల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడం జరిగింది.

మైసూర్ నగరంలో కొత్త అతిథి గృహాలు నిర్మించాము. చిన్న సబ్సిడీలను మంజూరు చేయడం ద్వారా బెంగుళూరులో ఆధునిక హిందూ హోటల్ స్థాపనకు ప్రోత్సహాన్ని అందించాము. మైసూర్‌లో ఆధునిక హిందూ హోటల్ కోసం కొత్త భవనం నిర్మించాము.

బెంగుళూరులో ఇంగ్లీష్ వారి తరహాలో రెండు క్లబ్బులు.. ఒకటి కబ్బన్ పార్క్ లోని సెంచరీ క్లబ్.. రెండవది కార్ల్టన్ హౌస్ పక్కనే మహిళల కోసం ఒక క్లబ్‌ను ప్రారంభించాము. భవన నిర్మాణానికి స్థలాన్నిమంజూరు చేసి మైసూర్ లోని కాస్మోపాలిటన్ క్లబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సహాయం చేసింది.

మైసూర్‌లో పౌర, సామాజిక వేదికను కూడా స్థాపించాము. ఈ వేదిక మొదటి కార్యవర్గం దివంగత సర్ కె.పి.పుట్టన్న చెట్టి అధ్యక్షతన ఏర్పడింది.

సాధారణాంశాలు:

అభివృద్ది చెందిన దేశాలలో ఉన్నటువంటి అధునాతన సంస్థలు లేదా సేవలు వేటినీ మేము విస్మరించలేదు. కానీ పరిమిత మానవ వనరులు, ఆర్థిక వనరుల లభ్యత కారణంగా ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయాము.

నేను కేవలం ప్రజా ప్రయోజనాల కోణంలో నుంచి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల స్థూల జాబితాను మాత్రమే ప్రస్తావించాను. దీవాన్‌గా నా హయాంలో మైసూర్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలకు అనేక మంది ప్రభుత్వ అధికారులు, ప్రముఖ పౌర ప్రతినిధులు నాకు సహకరించారు. ఈ విజయాలలో నాతో పాటు వారికి కూడా సమానమైన భాగస్వామ్యం ఉన్నదని నేను భావిస్తున్నాను. పైన పేర్కొన్న అన్ని కార్యకలాపాల లక్ష్యం భవిష్యత్ పురోగతికి ఒక దృఢమైన పునాది వేయడం, మన ప్రజలకు ఆధునిక తరహా నాగరిక జీవన విధానాన్ని పరిచయం చేయడం.

ఈ సందర్భంగా నేను హిస్ హైనెస్ సర్ శ్రీ కృష్ణరాజ వడియార్ బహదూర్ గారికి గౌరవ పూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను. అతను అత్యున్నత వ్యక్తిత్వం, గొప్ప దేశభక్తి గల పాలకుడు. ప్రజా సంక్షేమం, తన రాష్ట్రం పురోగతి పట్ల అతనికున్న అకుంఠిత దీక్షా, పట్టుదల కారణంగా మైసూర్ ప్రజలు అతన్ని అమితంగా ప్రేమించారు. అతను రాష్ట్ర అభివృద్దికి, ప్రజా సంక్షేమానికి పనికి వచ్చే అన్ని కార్యక్రమాలకు మద్దతును అందించాడు, నిండు మనసుతో ప్రోత్సహించాడు.

మైసూర్ రాజు కృష్ణ రాజా వొడియార్ IV

నా పదవీ కాలం ముగిసే సమయానికి కొన్నిఅధికారిక విషయాలలో, ప్రత్యేకంగా అభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలు, అమలులో మందకోడితనానికి సంబంధించి కొన్ని అంశాలలో మా మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ మా మధ్య వ్యక్తిగత సంబంధాలు మొత్తం మీద చాలా స్నేహపూర్వకంగా ఉండినాయి. ఊటకాముండ్ నుండి మే 24, 1917 నాటి లేఖలో, H H మహారాజు గారు నాకు ఈ విధంగా రాసేందుకు సంతోషించారు:

మీరు ప్రస్తావించిన ఇటీవలి సంఘటనలకు సంబంధించి మన మధ్య ఏర్పడిన భిన్నాభిప్రాయాలను వివరించడానికి వ్యక్తిగతంగా నా వంతు కృషి నేను చేసాను. మీ పరిశీలన అనంతరం భిన్నాభిప్రాయాలు తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయని, సరిదిద్దలేనివి కావని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. అయితే, మన మధ్య ఉన్న ఈ అధికారిక విభేదాలు మీ పట్ల నాకున్న వ్యక్తిగత గౌరవాన్ని, మీరు నా రాష్ట్రానికి అందించిన గొప్ప సేవలకు నా గుర్తింపును ఏ విధంగానూ ప్రభావితం చేయలేవని నేను మీకు భరోసా ఇవ్వగలను.

***

Exit mobile version