మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-11

1
3

అధ్యాయం 11 – స్వచ్ఛంద పదవీ విరమణ: అనంతర పరిణామాలు

రాజ్యాంగ సంస్కరణలపై చర్చలు:

[dropcap]భ[/dropcap]విష్యత్ భారత రాజ్యాంగపరమైన సంస్కరణలు, రాజకీయ సంస్కరణలకు సంబంధించిన ప్రశ్నలపై బ్రిటీష్ పాలనలో 1917-18 సంవత్సరం నుంచే క్రియాశీల పరిశీలనలో ఉండడంతో పాటు దేశమంతటా విస్తృత చర్చల్లో ఉంది. ఈ చర్చల్లో భారత రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయి. లార్డ్ మోర్లీ తర్వాత భారత అంతర్గత కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ. ఇ ఎస్ మోంటాగు 1917-18 లో భారతదేశ పర్యటనకు వచ్చారు.

భారత అంతర్గత కార్యదర్శి ఇ ఎస్ మోంటాగు

మైసూర్లో మేము కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర భవిష్యత్తు సంబంధాలను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసాము. ఒక సమావేశానికి H H మహారాజా వారు స్వయంగా అధ్యక్షత వహించారు. ఆ సమయంలో ప్రభుత్వ సభ్యుడిగా ఉన్న మైసూర్ యువరాజు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

తరువాత దశలో వైస్రాయ్ లార్డ్ చెమ్స్ ఫోర్డ్, శ్రీ ఇ ఎస్ మోంటాగు.. ఇద్దరూ దేశంలోని ఈ ప్రాంత ప్రముఖ భారతీయ నాయకులు, మద్రాస్ రాష్ట్ర అధికారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మద్రాసును సందర్శించారు. నేను ఆ సందర్భంగా ఒక సమావేశానికి హాజరయ్యాను.

వైస్రాయ్ లార్డ్ చెమ్స్ ఫోర్డ్

తరువాత లార్డ్ చెమ్స్ ఫోర్డ్, శ్రీ మోంటాగు నాతో వ్యక్తిగత సమావేశానికి అవకాశం ఇచ్చారు. ‘An Indian Diary’ శీర్షికతో శ్రీ ఎడ్విన్ ఎస్. మోంటాగు ప్రచురించిన పుస్తకంలో నా సందర్శన గురించి ఈ విధంగా ప్రస్తావించాడు.

ఇ ఎస్ మోంటాగు రాసిన పుస్తకం

వారితో పాటు (కొంతమంది ఇతర సందర్శకులు) మైసూర్ దీవాన్ మాతో వ్యక్తిగతంగా సమావేశమైనారు. కావేరి జలాల పంపకంపై ఉన్న వివాదాల అంశంలో మధ్యవర్తిత్వం వహించే విషయమై నాతో మాట్లాడేందుకు ఆయన వచ్చారు. ఈ చర్చల్లో యువరాజు, రెండవ స్థాయి అధికారులను కూడా పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని అతను కోరినారు. అతని ప్రతిపాదన సరి అయినదని నేను భావించాను. చెమ్స్ ఫోర్డ్ మాత్రం అభ్యంతరం చెప్పాడు. కానీ చెమ్స్ ఫోర్డ్ అభిప్రాయం తప్పని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.”

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించదలుచుకున్నాను. భారత రాజ్యాంగ సంస్కరణలపై లార్డ్ చెమ్స్ ఫోర్డ్, శ్రీ మోంటాగు రూపొందించిన నివేదికలో ఈ అంశం చోటు చేసుకున్నది. యువరాజుల మండలి (Council of Princes) ఏర్పాటుకు వారు సిఫారసు చేశారు. యువరాజుల మండలి, రాష్ట్రాల మండలి (Council of States) మధ్య ఉమ్మడి అంశాలపై చర్చల కోసం శాశ్వత సంప్రదింపుల వేదికగా యువరాజుల మండలిని ఏర్పాటు కావాలని వారు నిర్దేశించారు.

హిస్ హైనెస్ బికనీర్ మహారాజా సర్ గంగా సింగ్ బహదూర్ గతంలో మైసూర్ రాష్ట్రాన్ని సందర్శించారు.

బికనేర్ మహారాజా సర్ గంగాసింగ్ బహాదుర్

ఆయన మైసూర్ పరిపాలనా వ్యవస్థను లోతుగా అధ్యయనం చేశారు. తదనంతరం అతను బికనీర్ నుండి జనవరి 8, 1916న నాకు ఒక లేఖ రాశారు. అతను ఆ లేఖలో ఇలా పేర్కొన్నాడు.

మీ ఉన్నతమైన రాష్ట్రాన్ని సందర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ రాష్ట్రం పేరు ప్రతిష్ఠలకు, వాస్తవిక పరిస్థితులకు మధ్య అంతరాలు కనిపించలేదు. ఈ విషయంలో మీ రాష్ట్రం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తోంది. హిజ్ హైనెస్ మైసూర్ రాజా వారు, మీరు, మీ ప్రభుత్వంలోని ఇతర అధికారులు రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా భారతదేశ అభివృద్ధి కోసం కూడా నిజంగా అద్భుతమైన పని చేస్తున్నారని చెప్పడానికి నాకు సందేహం అవసరం లేదని భావిస్తున్నాను. మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మీ పరిపాలనా వ్యవస్థలో నెలకొని ఉన్న మంచి విధానాలను మా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఆశిస్తున్నాను”

మహాత్మా గాంధీ గారు అనేక సందర్భాల్లో మైసూర్ రాష్ట్రాన్ని సందర్శించారు. నా పదవీ కాలంలో కూడా ఒకసారి, నేను పదవీ విరమణ చేసిన తొమ్మిదేళ్ల తర్వాత మరోసారి రాష్ట్ర పర్యటనకు వచ్చారు.

మైసూర్ లో మహాత్మా గాంధీ పర్యటన

నా పదవీ విరమణ అనంతరం జరిగిన పర్యటన సందర్భంగా మహాత్మాగాంధీ గారు భద్రావతి వద్ద ఏర్పాటు చేసిన మైసూర్ ఐరన్ వర్క్స్, మైసూర్ నగరానికి సమీపంలో ఉన్న కృష్ణరాజ సాగర్ జలాశయాన్ని సందర్శించడం ఒక విశేషం. ఎందుకంటే ఆ రెండు ప్రాజెక్టులపై ప్రాజెక్టు వ్యతిరేకుల నుండి వచ్చిన వ్యాఖ్యానాలను ఆయన నమ్మలేక నివృత్తి చేసుకోవాలనుకున్నారు. అనంతరం మైసూర్ నగరంలో ఆయన గౌరవార్థం ఏర్పాటు అయిన బహిరంగ సభలో చేసిన ప్రసంగంలో అతను ఇలా పేర్కొన్నట్లు పత్రికల్లో నమోదు అయినాయి:

కృష్ణరాజసాగర్ ప్రపంచంలో అతి పెద్ద జలాశయాల్లో ఒకటి. ఈ ఒక్క జలాశయం నిర్మాణంలో కృషి చేసినందుకు సర్ విశ్వేశ్వరాయ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మైసూర్ రాష్ట్రం ప్రారంభించిన ఇతర పెద్ద పారిశ్రామిక సంస్థలు భారతదేశంలోని ఇతర ప్రాంతాలపై ఎంతో ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన స్పూర్తి దేశమంతటా ప్రసరిస్తుంది.” (డైలీ పోస్ట్, బెంగళూరు, 24 జూలై 1927.)

స్వచ్ఛంద పదవీ విరమణ:

దాదాపు 1916-17 సంవత్సరాలలో మద్రాసు రాష్ట్రంలో ప్రభుత్వ సేవలలో బ్రాహ్మణ సమాజానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వారికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమం మైసూరుకు కూడా వ్యాపించింది. ఉన్నత విద్య లేకపోవడం వల్ల బ్రాహ్మణేతర వర్గాలు వెనుకబడి ఉన్నాయని నాకు తెలుసు. నేను మైసూరు దీవాన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విద్యా సమస్యను తీవ్రంగా పరిగణించాను. వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలలో విద్యను ప్రోత్సహించేందుకు మైసూర్ ప్రభుత్వం ఉదారమైన ఉపకార వేతనాలను మంజూరు చేసేలా నేను ఏర్పాటు చేశాను. ప్రభుత్వ సేవల్లో వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు అవకాశాలను మెరుగు పరిచేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులకు మధ్య అసమానతలు గణనీయంగా ఉన్నాయనేది నిజం. చదువుల్లో అందరి కన్న ముందు అవకాశాలు అందిపుచ్చుకున్న బ్రాహ్మణ సమాజం ప్రభుత్వ ఉద్యోగాలను పొందడంలో కూడా ముందున్నారు. విద్యను త్వరితగతిన విస్తరించడానికి మేము అనుసరించిన విధానం కొంత ఫలితాలను చూపుతోంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా, పాఠశాలకు వెళ్లే జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగింది. విద్యా సంస్థలలో ప్రవేశాన్ని పరిమితం చేయడం ద్వారా విద్యాభివృద్దిలో ముందున్న వర్గాలను నిలువరించాలని, లేదా వారికి విద్యావకాశాలను తగ్గించాలనే కోరిక కొన్నివర్గాల్లో ఉండింది. ఈ లక్ష్యంతో సమాజం నుంచి సానుభూతి పొందడం అసాధ్యం. ఎందుకంటే తమ స్వంత చొరవ ద్వారా ముందుకు సాగుతున్న జనాభాలోని ఒక వర్గాన్ని వెనక్కి నెట్టడానికి చేసే ప్రయత్నం ఇది.

మైసూర్ లోని బ్రాహ్మణేతర వర్గాల నుంచి పలువురు ప్రముఖులు ఒక ఖచ్చితమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. మద్రాసులోని బ్రాహ్మణేతర నాయకులు, వారి పత్రికల్లో చర్చకు వస్తున్న విధానాలను మైసూర్‌లో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని వారు సూచించినారు. హిస్ హైనెస్ మహారాజు గారు ఈ అంశాన్ని విచారించడానికి మైసూర్ ప్రధాన న్యాయమూర్తి సర్ లెస్లీ మిల్లర్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు.

సర్ లెస్లీ మిల్లర్, మైసూర్ చీఫ్ జస్టిస్

మద్రాసు లోని బ్రాహ్మణేతర నాయకుల వాదనలను మైసూర్‌లో అమలు చేయడానికి స్వీకరించవచ్చా లేదా అన్న ప్రశ్నను ఈ కమిటీ కూలంకషంగా చర్చించి సిఫారసులతో కూడా నివేదికను సమర్పించాలని నిర్దేశించారు. విద్యను సమాజ విస్తృత శ్రేణుల్లోకి వేగంగా వ్యాప్తి చేయడం, వస్తూత్పత్తిలో, పరిశ్రమలలో ఖచ్చితమైన, నిర్దిష్టమైన పద్ధతులను అవలంబించడం ద్వారా రాష్ట్రం, దాని మొత్తం జనాభా వేగంగా అభివృద్ధి చెందుతుందని నా భావన. ప్రతిభ, సామర్థ్యాన్ని విస్మరించడం ద్వారా ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, మేము చాలా కష్టపడి సాధించిన పరిపాలనా సామర్థ్యం కూడా దెబ్బతింటుందని నేను భయపడ్డాను. నేను సమాజంలో ఏ వర్గానికి ఏనాడూ ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడానికి మొగ్గు చూపలేదు. ఈ విషయమై నా మీద ఎటువంటి ఫిర్యాదులు ఎప్పుడూ లేవు. ఏది ఏమైనప్పటికి మిల్లర్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని నేను వ్యతిరేకించాను. మద్రాసులోని బ్రాహ్మణేతర నాయకులు ప్రతిపాదించిన విధానాలకు మద్దతిచ్చిన మైసూర్ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలను, వారి నాయకులను శాంతింపజేయాలని హిస్ హైనెస్ మహారాజా వారు ఆరాటపడుతున్నట్లు కనిపించింది. సుదీర్ఘ చర్చ అభిప్రాయాల మార్పిడి తర్వాత నేను మైసూర్ సర్వీస్ నుండి రిటైర్ కావడానికి హిస్ హైనెస్ మహారాజా వారి సమ్మతిని పొందాను. దీనికి గణనీయమైన కాలం పట్టింది. నేను నిజానికి పదవీ బాధ్యతల నుంచి తొలగిపోయే ముందు అన్ని కొత్త స్కీం లను, ఇతర ప్రతిపాదిత అభివృద్ధి పథకాలను అమలులోకి తీసుకు రావడం, వాటిని ఒక దారిలో పెట్టడానికి, సురక్షితమైన స్థితిలో ఉంచడానికి కొంత సమయం అవసరం అయ్యింది. కాబట్టి ఏడాది చివరిలో నాకు అనుకూలమైన తేదీన పదవీ విరమణ చేయాలని ఎనిమిది నెలల ముందే హిస్ హైనెస్ మహారాజా వారు అంగీకరించారు. ఈ ఏర్పాటును అత్యంత రహస్యంగా ఉంచాలని కూడా నిర్ణయించారు.

ఈ సమయంలో నేను ప్రారంభించిన రెండు ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి (1) కావేరి జలాశయం (2) భద్రావతిలో ఇనుము ఉక్కు పరిశ్రమ. ఇనుము ఉక్కు పరిశ్రమ పనులు నిర్మాణం అప్పుడే ప్రారంభమైంది.

కావేరి జలాశయం (కృష్ణరాజసాగర్) పాక్షికంగానే నిర్మాణమయ్యింది. జలాశయం రెండో దశ పనులు, కాలువ పనులు చెప్పుకోదగ్గ స్థాయిలో ముందుకు సాగలేదు. జలాశయం పనులు కొద్దిపాటి లాభాలను మాత్రమే తెచ్చిపెట్టాయి.

కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర్ డ్యాం

కానీ ఇనుము ఉక్కు పరిశ్రమ నిర్మాణం అప్పుడే ప్రారంభమైంది కాబట్టి దాని నుంచి ఇప్పుడే ఏమీ ఆశించలేము. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి ఆశించిన ఫలితాలు పొందే దశకు అవి చేరుకోలేదు.

భద్రావతి ఇనుము ఉక్కు ఫ్యాక్టరీ

పరిశ్రమలకు సంబంధించి వాస్తవ నిర్మాణం, భద్రావతి ఇనుము ఉక్కు పరిశ్రమ పనులు పనుల ప్రారంభం కావడానికి ప్రపంచ యుద్ధం వలన తీవ్ర ఆటంకం ఏర్పడింది. 1914 లో యుద్ధం ప్రారంభం అయి దగ్గర నుంచి నేను డిసెంబరు 1918లో పదవీ విరమణ చేసే వరకు యుద్ధం కొనసాగింది. ఈ కాలంలో పరిశ్రమల కోసం నిపుణులు, యంత్రాలు పొందడం కష్టం అయ్యింది. యుద్ధ విరమణ జరిగిన ఒక నెల తర్వాత నా పదవీ విరమణ జరిగింది.

భారత ప్రభుత్వంతో, మైసూర్‌లో వారి ప్రతినిధితో నా సంబంధాలు సాధారణంగా ఆహ్లాదకరంగా, సంతోషంగానే ఉన్నాయి. 1914 అక్టోబరు 13 నాటి వ్యక్తిగత లేఖలో, మైసూర్ లో బ్రిటిష్ రెసిడెంట్ అయిన సర్ హ్యూ డాలీ నాకు ఈ క్రింది విధంగా రాశారు:

సర్ హ్యూ డాలి, బ్రిటిష్ రెసిడెంట్

నిజానికి, మైసూర్ లాన్సర్ల సేవలను మైసూర్‌లో వినియోగించుకుంటూనే వారు బెంగుళూరు నుండి దాదాపు అన్ని సైనిక దళాలను ఉపసంహరించుకున్నారు. ఇక్కడి పరిస్థితులకు సంబందించి భారత ప్రభుత్వానికి మైసూర్ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసానికి ఇంతకంటే మంచి రుజువు అవసరం లేదు. ఈ చర్య సమర్థనీయమా కాదా అన్న అంశాన్ని విచారించవలసిన అవసరం కూడా లేదని నేను భావిస్తున్నాను.”

నేను, మీరు ఒకరి పట్ల మరొకరం అత్యంత స్పష్టతతో, పారదర్శకంగా వ్యవహరించడానికి సిద్దపడినాము. అందుకే ఆ విషయాన్ని మీకు తెలియజేశాను. నాకు తెలిసినదంతా మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.”

ఇప్పుడు నేను నా పదవీ విరమణ అంశంలో హిస్ హైనెస్ మహారాజా వారితో కుదిరిన అవగాహనకు తిరిగి వస్తాను. 1918 ఏప్రిల్‌లో మహారాజా వారు నా పదవీ విరమణకు అనుమతించాలి. అనాటికి నేను నా వారసుడికి క్లిష్టమైన లేదా కొత్త అధికారిక వ్యవహారాలు అన్ని సాఫీగా కొనసాగేందుకు వీలుగా పరిస్థితులను చక్కదిద్దడం నా బాధ్యత. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించకూడదని నిర్ణయం జరిగింది. ఇంతకు ముందు ప్రస్తావించిన రెండు పెద్ద పథకాల ద్వారా స్వల్ప సమయంలో ప్రయోజనాలను ఆశించడం సాధ్యం కాదు. అయితే భవిష్యత్లో వాటి పురోగతికి గట్టి పునాది వేయడానికి అనేక ఏర్పాట్లు, చర్యలు అవసరం. వీలైనంత వరకు వాటిని నెరవేర్చాను.

మైసూర్ వ్యవహారాల ప్రస్తావన ముగించే ముందు ఆసక్తిదాయకంగా ఉంటాయని భావిస్తూ.. నేను 9 డిసెంబర్ 1918 న బెంగుళూరులోని సాధారణ పరిపాలనా & రెవెన్యూ సచివాలయం కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో కౌన్సిల్ సభ్యులు, విభాగాధిపతులు, కార్యదర్శుల నుండి అధికారికంగా సెలవు తీసుకున్నప్పుడు నేను చేసిన వీడ్కోలు ప్రసంగం నుండి కొన్ని మాటలను ఈ సందర్భంగా ఉటంకిచదలచాను. ఈ నా ముగింపులో ప్రసంగంలో నాతో చాలా విధేయతతో పని చేసిన ప్రభుత్వ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు చెపుతూ వీడ్కోలు తీసుకుకున్నాను.

దివాన్‌గా బాధ్యతలు స్వీకరించిన నెల లోపలనే చేసిన మొదటి ప్రసంగంలో నేను ప్రస్తావించిన సూత్రాలు, వాటి ఆచరణ మధ్య ఏ అంతరాలు లేవని నేను నిస్సంకోచంగా చెప్పదలుచుకున్నాను. నా పదవీ కాలంలో నాకు ఎదురైన పరిస్థితులు విధించిన పరిమితుల్లో త్రికరణ శుద్ధితో ఆ సూత్రాలను ఆచరించడానికి ప్రయత్నించాను. నేను ఈ విధంగా మాట్లాడడం క్షమించదగినదని నేను ఆశిస్తున్నాను. అప్పుడప్పుడు జరిగే వ్యక్తిగత సమావేశాల్లో కూడా నేను దీనికి అనుకూలుడను లేదా ఆ సంఘానికి వ్యతిరేకిని అని ఎప్పుడూ మాట్లాడలేదు. నేను త్రాసును సామాన్య స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నించాను. కాలం ఈ అంశాన్ని రుజువు చేస్తుంది. కాని రాష్ట్ర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పాలకుడి ప్రయోజనాలను కాపాడటం, మైసూర్ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించడం నా ప్రధాన కర్తవ్యమని నేను ఎల్లప్పుడూ భావించాను. ఈ సందర్భంగా ఈ విషయాన్ని అంగీకరించడానికి నేను సంకోచించడం లేదు.”

నా ఆదర్శాలను సాధించడంలో వైఫల్యం గురించి నాకు తెలుసు. ఇది నాకు బాధాకరమైన అంశమే. నేను చేయాలని అనుకున్నవి చాలా వరకు సాధించలేక పోయినందుకు నేను నిరాశ చెందాను. కానీ ఈ ఆరేళ్ల పాలనా కాలంలో నాకు ప్రజలకు మంచి స్పందన లభించినందుకు నేను కృతజ్ఞుడను. రాష్ట్ర పేరు ప్రతిష్ఠలను, పరిపాలనా వ్యవస్థలను దెబ్బతీసే విధంగా ఎలాంటి అవాంఛనీయ సందర్భాలు లేదా సంఘటనలు కూడా నా హయాంలో చోటు చేసుకోనందుకు సంతోషంగా ఉన్నది. మైసూర్ ప్రజలను చాలా సహేతుకంగా, బాగా ప్రతిస్పందించే వారిగా నేను భావిస్తున్నాను. గుర్తింపు పొందిన ప్రజా నాయకుల కంటే కూడా వారు విశ్వసనీయంగా ఉన్నారు. ఇది పరిపాలనలో మేము సాధించిన విజయాల వల్ల మాత్రమే కాదని కూడా నేను నమ్ముతున్నాను. ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఆత్రుతతో ఉందని వారికి తెలుసు కాబట్టే వారు మా పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చారు.”

నేను యూరోపియన్, భారతీయ పాత్రికేయులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. నా హయాంలో మైసూర్ ప్రభుత్వం పరిపాలన పట్ల వారు న్యాయమైన, ఉదారత వైఖరిని ప్రదర్శించారు.”

నేను పదవీ విరమణ చేసిన మరుసటి రోజు మరుసటి రోజు.. డిసెంబర్ 10, 1918 న నా తర్వాత దీవాన్ పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీ. టి. ఆనందరావు, C.I.E., తన భావాలను నాకు రాసిన వ్యక్తిగత లేఖలో ఈ విధంగా వ్యక్తీకరించారు. వాటిని నేను క్రింద ఉటంకిస్తున్నాను.

సచివాలయంలో వీడ్కోలు సభలో మీరు చేసిన విలువైన ప్రసంగ పాఠాన్ని ప్రచురించిన మైసూర్ గజిట్ ప్రత్యేక సంచికను, డైలీ పోస్ట్ పత్రికలో ప్రచురించిన వార్తా కథనాన్ని నిన్న సాయంత్రం చాలా భావోద్వేగంతో చదివాను. ఈ సందర్భంగా లార్డ్ మోర్లీ రాసిన పుస్తకం ‘లైఫ్ ఆఫ్ గ్లాడ్ స్టోన్’ లోని ఒక భాగాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. మీకు, దివంగత శ్రీ డబ్ల్యూ.ఇ. గ్లాడ్ స్టోన్‌కు సమానంగా వర్తించేలా ఉన్న ఈ వాక్యాలను యధాథతంగా ఉటంకిస్తున్నాను:”

“‘మేం అందరం మిమ్మల్ని ఎలా పరిగణిస్తామో, ఎలా భావిస్తారో మీకు తెలియదు. ధర్మ నిరతిని నమ్ముకున్న ప్రధానమంత్రి జీవించి ఉన్న కాలంలో మేము కూడా జీవించడం ఆనందదాయకంగా ఉంటుంది. తప్పుదోవలో నడిచే ఏ వ్యక్తిని ఎవరూ విశ్వసించరు. కానీ ఒక వ్యక్తి సమగ్రతను, ఖచ్చితత్వాన్ని విశ్వసించడం వలన మనసుకి విశ్రాంతిగా ఉంటుంది’.”

పదవీ విరమణకు ముందు నేను ఆరు నెలలు సెలవుపై కొనసాగాను. ఆ వ్యవధి ముగింపులో నా పదవీ విరమణ వార్తను ప్రభుత్వం ఒక ప్రత్యేక గజిట్ ద్వారా ప్రకటింటించింది. ఆ గజిట్‌లో ఈ విధంగా రాసినారు.

“..ఈ కాలంలో సర్ ఎం. విశ్వేశ్వరాయ ఎడతెగని ఉత్సాహంతో, అకుంఠిత దీక్షతో మైసూర్ రాష్ట్రంలో భౌతిక వనరులు పెంపొందడానికి శ్రమించారు. దీవాన్‌గా అతని పరిపాలనలో మైసూర్ రాష్ట్రం విద్య, నీటిపారుదల పనులు, రైల్వే కమ్యూనికేషన్లు, పరిశ్రమలలో గణనీయమైన అభివృద్దిని సాధించింది. భవిష్యత్‌లో రాష్ట్రానికి సంపన్నమైన, ప్రగతిశీల భవిష్యత్తుకు పునాదులు వేసింది. సర్ ఎం. విశ్వేశ్వరాయ గారు తన పదవీ విరమణ సమయంలో హిస్ హై నెస్ మహారాజా వారి హృదయపూర్వక శుభాభినందనలతో పాటూ మైసూర్ రాష్ట్ర అన్ని తరగతుల ప్రజల శుభాకాంక్షలను తనతో తీసుకువెళుతున్నారు.”

రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దివంగత శ్రీ సెట్లూర్ గారు 1926 ఫిబ్రవరి 12న ది హిందు దిన పత్రికలో రాసిన ఒక వ్యాసంలో ఇలా వ్రాశారు:

సర్ ఎం విశ్వేశ్వరాయ పరిపాలన మైసూరు సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని మునుపెన్నడూ ఎరగని ఉన్నత స్థాయికి తీసుకుపోయింది.”

శ్రీ రంగాచార్లు రాష్ట్రాన్ని పై నుంచి ప్రజాస్వామ్యయుతంగా మలిచారు. కానీ సర్ ఎం. విశ్వేశ్వరాయ ప్రజాస్వామ్యాన్ని దిగువ నుండి నిర్మించే పని మరింత సాహోసోపేతంగా ప్రయత్నించారు.”

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here