Site icon Sanchika

మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-12

అధ్యాయం 12 – పదవీ విరమణ అనంతరం మైసూర్‌లో నా కార్యకలాపాలు

[dropcap]రా[/dropcap]ష్ట్ర సర్వీస్ నుండి నేను పదవీ విరమణ చేసిన తర్వాత మైసూర్ రాష్ట్రంలో నా కార్యకలాపాల గురించి ఈ అధ్యాయంలో వివరించాను. తర్వాతి నాలుగు అధ్యాయాలలో నేను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఎలా పని చేశానో వివరించాను. పదవీ విరమణ తర్వాత విదేశీ ప్రయాణంలో నా అనుభవాలను కూడా వివరించాను. నా కార్యకలాపాలను గురించి స్పష్టమైన వివరణ ఇచ్చే విషయంలో కాలక్రమాన్ని పాటించడం నాకు సాధ్యం కాలేదు.

మైసూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ:

ఇంతకు ముందే చెప్పినట్టు భద్రావతి వద్ద చేపట్టిన ఇనుము ఉక్కు పరిశ్రమ మైసూర్ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఉత్పాదక విలువ కలిగిన కర్మాగారం. ఇనుప కర్మాగారాలలో దుక్క ఇనుము (Pig Iron) తయారీకి అవసరమయ్యే సాధారణ ఇంధనమైన బొగ్గు సమీప దూరంలో లభించే అవకాశం లేదు. అమెరికా, స్వీడన్ రాష్ట్రాలలోని ఇనుప కర్మాగారాలలో దుక్క ఇనుము తయారీకి దగ్గరలో ఉన్న అడవుల నుండి సేకరించిన కలపను కాల్చి తయారుచేసిన బొగ్గును వినియోగిస్తారు. అదే తరహాలో భద్రావతి ఇనుము ఉత్పత్తి కార్మాగారంలో కూడా కలప బొగ్గును వినియోగించవలసి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ చాలా సంవత్సరాలుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాస్తవానికి కర్మాగారం నిర్మాణానికి మే 1918లో అనుమతి జారీ చేసిన తర్వాతనే పనులు ప్రారంభమైనాయి.

డిసెంబరు 1918లో నా పదవీ విరమణ తర్వాత కర్మాగారం నిర్మాణ పనులు నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపిస్తోంది. యంత్ర సామాగ్రి సరఫరాదారులైన మెసర్స్ టాటా సన్స్ లిమిటెడ్ వారితో కుదిరిన అవగాహన మేరకు నిర్మాణ పనులు 18 నెలల్లో పూర్తి చేసి 1919 చివరి నాటికి కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభించాలి. అయితే వాస్తవ నిర్మాణం 1923 వరకు ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది.

మైసూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ

కర్మాగారం నిర్మాణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పుడు కొంతమంది ఉన్నత ప్రభుత్వాధికారులు, అలాగే మెసర్స్ పెరిన్ & మార్షల్ కన్సల్టింగ్ ఇంజనీర్లు కర్మాగారం ఉత్పత్తిని ప్రారంభించరాదని ప్రతిపాదించారు. కారణం.. కర్మాగారం పనులు ప్రారంభించినప్పుడు ఉన్న ఇనుము ధరలు సగం కంటే తక్కువ స్థాయికి పడిపోయినాయని, ఆ ధరలు మునుపటి స్థాయికి పెరిగేదాకా ఉత్పత్తి ఆపాలని వారి వాదన. అప్పటి దివాన్ శ్రీ (తర్వాత సర్ అల్బియాన్) బెనర్జీ గారిని కర్మాగారం వ్యవహారాలు చక్కదిద్దడానికి, విషయాలను దారిలో ఉంచడానికి ప్రభుత్వానికి సహాయం చేయమని కోరుతూ కర్మాగారాన్ని నియంత్రణలోకి తీసుకునేలా నన్ను ప్రేరేపించడానికి, నేను తాత్కాలికంగా నివాసం ఉంటున్న బొంబాయికి పంపించారు. మైసూర్ ప్రభుత్వ కోరిక మేరకు నేను ఈ బాధ్యతను చేపట్టవలసి వచ్చింది. కానీ సహేతుకమైన ఆర్థిక తనిఖీలకు లోబడి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చేందుకు వీలు కల్పించాలనే అవగాహనతో ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి అంగీకరించాను. కర్మాగారం నిర్వాహణ, నియంత్రణ కోసం నేనే ఛైర్మన్‌గా మేనేజ్మెంట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఆరున్నరేళ్ల పాటు కర్మాగారం నిర్మాణ పనులను పర్యవేక్షించాను. ఈ కాలంలో పనులపై కొన్ని నిరాశాపూరితమైన అంచనాలు ఉండేవి. గతంలో మైసూర్ సర్వీస్‌లో ఉన్న సర్ ఆల్ఫ్రెడ్ చాటర్టన్ 22 మే 1925 న లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ ముందు చేసిన ప్రసంగంలో “అవసరరీత్యా ఈ సంస్థను (భద్రావతి ఐరన్ వర్క్స్) మూసివేయాల్సి వస్తుంది. ఇది దురదృష్టకరం” అని అన్నారు. అటువంటి నిరాశాపూరిత వాతావరణం ఉన్నప్పటికీ క్రమేణా పనుల పురోగతి మెరుగుపడింది. అమ్మకానికి ఉత్పత్తి చేయాలనుకున్న దుక్క ఇనుము, దాని ఉత్పత్తుల మార్కెట్ ధరలు మరింత వినాశకరంగా దిగజారుతున్నా లెక్క చేయకుండా కృషి చేసిన ఫలితంగా పనుల సామర్థ్యం బాగా పెరిగింది.

కర్మాగారం నిర్వాహణ బోర్డు ఛైర్మన్ కార్యాలయ బాధ్యతలను మరొకరికి అప్పగించే సమయంలో 1929 సెప్టెంబర్ 24న నేను చేసిన ప్రకటనలో కర్మాగారం నిర్మాణంలో పూర్తి అయిన పనులు, చేయవలసిన పనుల వివరాలు, ఉత్పత్తి తదితర సంగతులు తెలియజేస్తూ ఈ క్రింది విధంగా ఒక ప్రకటన జారీ చేశాను.

గత ఆరేళ్లలో కర్మాగారం నిర్మాణ పనులను పూర్తి చేసి ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవస్థీకృతం చేసినాము. ముడి పదార్థాల సేకరణ, రవాణా ఖర్చులను మొదట అంచనా వేసిన స్థాయికి తగ్గించాము. సంతృప్తికరమైన స్థాయిలో ఉత్పత్తిని సాధించగలిగాము. ఉత్పత్తి వ్యయం కూడా 50 శాతానికి పైగా తగ్గింది. వివిధ స్థానాలలో విధులు నిర్వహించడానికి స్థానిక సిబ్బందికి శిక్షణ ఇచ్చాము. కర్మాగారంలో ఆధునిక పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టాము. ఈ పరిణామాల అనంతరం కర్మాగారంలో పనులు క్రమేణా గాడిలో పడినాయి.

కర్మాగారం నిర్మాణాన్ని రూపకల్పన చేసిన నిపుణుడు శ్రీ సి పి పెరిన్ గారు జనవరి 1927లో దీనిని సందర్శించారు. జంషెడ్పూర్ లోని టాటా ఐరన్ అండ్ స్టీల్ వర్క్సకు సంబంధించిన పనుల విషయమై ఆయన భారతదేశానికి వచ్చారు. మైసూర్ ఇనుము ఉక్కు కార్మాగారాన్ని సందర్శించే అవకాశాన్ని కూడా తీసుకున్నారు. ఆ సమయంలో యూరప్‌లో ఉన్నందున నేను అతనిని కలవలేకపోయాను. ఐరన్ వర్క్సను పరిశీలించిన తర్వాత అతను 1927 జనవరి 19 న లండన్‌లో ఉన్న నాకు తంతి ద్వారా ఈ క్రింది సందేశాన్ని పంపాడు:

మీరు నిర్మించిన సంస్థ, అది సాధిస్తున్న ఫలితాలకు మీకు అభినందనలు తెలుపుతున్నాను. ఈ పురోగతిని చూసి నేను చాలా ఉప్పొంగిపోయాను. ఈ సాయంత్రం హిస్ హైనెస్‌కి నా అభిప్రాయాలు తెలియజేస్తాను. మీకు శుభం కలగాలని ఆశిస్తూ.. పెరిన్.”

హిస్ హైనెస్ మహారాజు ఆ తర్వాత 1927 ఫిబ్రవరి 12 న ఢిల్లీలోని తన శిబిరం నుంచి  నాకు ఉత్తరం రాశారు. అందులో ఆయన ఇలా అన్నారు:

“ఐరన్ వర్క్స్ పనులు చాలా బాగా కొనసాగుతున్నాయని నేను తెలుసుకున్నాను. శ్రీ పెరిన్ గారు కొద్ది రోజుల క్రితం మైసూర్ సందర్శించినప్పుడు నన్ను కలిశారు. అక్కడ మీరు పనిని కొనసాగించడానికి జరిపిన ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మీరు అమెరికన్ కార్మికులతో కాకుండా పూర్తిగా మా స్థానిక సిబ్బందితో కార్మాగారాన్ని నిర్వహించడం పట్ల అతను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇది రాష్ట్రం గర్వించదగ్గ విజయం.”

కర్మాగారం పనులతో సంబంధం లేని కారణాల వల్ల నేను సెప్టెంబర్ 1929లో మైసూర్ ఐరన్ వర్క్స్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసాను.

నా రాజీనామాపై, హిస్ హైనెస్ మహారాజా వారు అక్టోబరు 6, 1929 తేదీన ఒక లేఖలో నాకు ఈ క్రింది విధంగా రాసినారు:

“కర్మాగారంతో మీ సంబంధాన్ని వదులుకోవడానికి నేను మీకు నా వ్యక్తిగత ప్రశంసలు వ్యక్తీకరించకుండా అనుమతించలేనని నేను భావిస్తున్నాను. కర్మాగారం నిర్మాణంలో, దాని అభివృద్ధిలో మీరు అందించిన సేవలు, మీరు మీ సమయాన్ని, ప్రతిభను వెచ్చించిన విధానం గురించి నేను సంపూర్ణ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. ఈ దిశలో మీరు చేసిన మంచి కృషిని నా కంటే మరెవరూ ఉన్నతంగా మెచ్చుకోలేరని నేను మీకు హామీ ఇస్తున్నాను.

ఆ సమయంలో మైసూర్ దివాన్‌గా పనిచేస్తున్న సర్ మీర్జా ఎం ఇస్మాయిల్ గారు నాకు రాసిన లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.

సంస్థ అధిపతిగా అకుంఠిత దీక్ష, బాధ్యత, గొప్ప సామర్థ్యం, అనుభవంతో సంస్థ ఉన్నతి కోసం మీరు మీ బాధ్యతలను నిర్వర్తించారు. మీ నాయకత్వం లేకపోయి ఉంటే సంస్థ పరిస్థితి ఘోరంగా ఉండేదని నా అనుమానం. మీ సేవలు అందకపోయి ఉంటే సంస్థ చాలా కాలం మనుగడ సాగించి ఉండేది కాదని చెప్పడం అతిశయోక్తి కాదు”

నా రాజీనామా గురించి తెలుసుకొని ఇప్పటికే ప్రస్తావించిన అమెరికన్ కన్సల్టింగ్ ఇంజనీర్ శ్రీ చార్లెస్ పి. పెరిన్ నాకు న్యూయార్క్ నుంచి నవంబర్ 25, 1929న ఒక ముఖ్యమైన లేఖ రాశారు. ఆ లేఖను యథాతథంగా ఉటంకిస్తున్నాను.

చార్లెస్ పి పెరిన్, లోహశాస్త్ర నిపుణుడు

మీరు మైసూర్ ప్రభుత్వ ఐరన్ వర్క్స్ మేనేజ్మెంట్ బోర్డ్ నుండి పదవీ విరమణ పొందారని తెలుసుకున్నందుకు నేను ఎంత చింతిస్తున్నానో చెప్పలేను.

కర్మాగారం ఈ స్థాయికి అబివృద్ధి చెంది ప్రయోజనాలను అందించడానికి సిద్ధం అయ్యిందంటే అది మీరు వ్యక్తిగత ఆసక్తితో అందించిన సేవలకు రుజువుగా నిలుస్తుంది. మీరు లేకుంటే అది ఉనికిలో ఉండేది కాదని నేను భావిస్తున్నాను. మీరు మాకు పంపిన రెండు పత్రాలపై మేము చాలా ఆసక్తిని కలిగి ఉన్నాము. కర్మాగారాన్ని నిర్మించడానికి తీసుకున్న అసలు నిర్ణయంలో ఇమిడి ఉన్న దృఢత్వం మార్కెట్‌లో మీ ఉత్పత్తుల అమ్మకాలు నిరూపిస్తాయని నేను ఆశిస్తున్నాను.

“మీ గురించి నేను నా విస్తృతానుభవంలో నుంచి చెప్పాలనుకుంటున్నాను. అపారమైన గౌరవం కలిగిన మీలాంటి వ్యక్తిని నేను చాలా అరుదుగా కలుసుకున్నాను. మీలో ఉన్న నైతిక ప్రవృత్తి, ఆదర్శాలు, గొప్ప దేశభక్తి విషయంలో మాత్రమే కాదు మీలో ఉన్న ఇంజనీరింగ్ నైపుణ్యం కూడా మీ పట్ల నాకు గౌరవ భావాన్ని పెంచింది.

మైసూర్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఇటీవల.. జనవరి 1950లో.. అంటే సంస్థ ఛైర్మన్‌గా పదవీ విరమణ చేసిన 20 సంవత్సరాల తర్వాత నేను కర్మాగారాన్ని సందర్శించే సందర్భం వచ్చింది. కర్మాగారం స్థాపన దినోత్సవం వేడుకల సందర్భంగా నేను చేసిన ప్రసంగంలో కర్మాగారం ప్రస్తుత పరిస్థితి, దాని భవిష్యత్తు అవకాశాల గురించి ఈ విధంగా ప్రస్తావించాను:

1949 నాటికి ఉత్పత్తుల స్థూల విలువ రూ. 1.69 కోట్లు. నికర రాబడి రూ. 13.1 లక్షలు.. అంటే నికర రాబడి పెట్టుబడిపై 6 శాతం అన్నమాట”

“కర్మాగారం ఇప్పటికే దాని మీద పెట్టిన పెట్టుబడి మూలధనాన్ని తరుగుదల నిధి రూపంలో తిరిగి చెల్లించింది.”

అనేక దశల్లో విస్తరణ, అభివృద్ధితో కార్మాగారం పురోగతి, పనుల మూల పెట్టుబడి విలువ దాదాపుగా రూ. 5 కోట్లకు పెరుగుతుంది. పనులు పూర్తయినప్పుడు అటువంటి పరిశ్రమలలో సాధారణంగా ఉండే విధంగా కార్మాగారం వార్షిక స్థూల ఆదాయం దాదాపు రూ. 5 కోట్లు ఉంటుంది. రాబోయే రెండు లేదా మూడు సంవత్సరాల కాలంలో అది ప్రభుత్వానికి ఏటా అర కోటి నికర ఆదాయాన్ని అందించే అవకాశం ఉంది.”

శ్రీ జయ చామరాజేంద్ర వృత్తి విద్యా సంస్థ ( Sri Jaya Chamarajendra Occupational Institute):

నేను మైసూర్ ఇనుము & ఉక్కు కార్మాగారం మేనేజ్మెంట్ బోర్డు నుండి రాజీనామా చేసినప్పుడు అప్పటి ప్రభుత్వంతో చేసుకున్న అవగాహన ప్రకారం 1923లో నేను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆరున్నరేళ్ల కాలానికి నాకు చాలా పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉంది. రాష్ట్రం కోసం బెంగళూరులో ఒక సాంకేతిక వృత్తి విద్యా సంస్థను నెలకొల్పడానికి ఆ మొత్తాన్నిప్రభుత్వానికి తిరిగి ఇచ్చాను. ఈ డబ్బు వృత్తి విద్యా సంస్థ ఏర్పాటుకు కేంద్రకంగా ఉపయోగపడాలన్నది నా ఆలోచన. నేను ఒక వృత్తి విద్యా సంస్థ ఏర్పాటు కోసం పథకాన్ని కూడా రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాను. శ్రీ ఎన్ మాధవరావు గారు దివాన్‌గా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. అంతే కాదు సంస్థను స్థాపించడానికి, నిర్వహించడానికి మరింత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి సంతోషంగా అంగీకరించింది.

మైసూర్ చివరి మహారాజు శ్రీ జయ చామరాజేంద్ర వొడియార్(1940-47), మైసూర్ రాజ్ ప్రముఖ్(1947-56)

నా సూచన ప్రకారం హిస్ హైనెస్ ప్రస్తుత మహారాజు గారు సంస్థకు అతని పేరు పెట్టడానికి దయతో అనుమతించడం పట్ల నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. సంస్థను ఇప్పుడు ‘శ్రీ జయ చామరాజేంద్ర వృత్తి విద్యా సంస్థ’ గా పిలుస్తున్నారు.

కావేరీ కాలువ కమిటీ:

కావేరి జలాశయం పథకానికి సంబంధించి నేను నిర్దేశించిన మార్గాల్లో పనులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్లు నేను గుర్తించాను. తదనుగుణంగా ప్రతి దశలో ప్రభుత్వం నా సలహాల కోసం నాతో సంప్రదించడం కొనసాగించింది. 24 జూన్ 1924 నాటి లేఖలో హిస్ హైనెస్ నేను “ఈ పథకంపై మీరు ఇక ముందు కూడా ఆసక్తిని కొనసాగిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఈ పథకం మీ మానస పుత్రిక.” అని రాసినారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడానికి, కావేరి లోయలో సాగునీటిని సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు జలాశయం కింద ప్రతిపాదిత ఎగువ కాలువ వ్యవస్థ రూపకల్పన, నిర్మాణానికి సంబంధించి సలహాలు, సూచనలు, సిఫార్సులు చేయడానికి ఒక కమిటీకి అధ్యక్షుడిగా ఉండటానికి నేను అంగీకరించాను. కమిటీ సిఫార్సు చేసిన ఎగువ కాలువ పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. కాలువ, సొరంగం పనులను ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తూనే ఉన్నాను.

మైసూర్ లో కావేరీ కాలువ

బొంబాయి ప్రావిన్స్ లోని నీరా కాలువలో జయప్రదంగా అమలు చేసిన ‘బ్లాక్ సిస్టమ్’ను ఇక్కడ కూడా చీఫ్ ఇంజనీర్ శ్రీ కె. ఆర్. శేషాచారి పర్యవేక్షణలో ప్రవేశపెట్టాము.

కృష్ణరాజసాగర జలాశయం పథకం ద్వారా సాగునీటి సరఫరా, జల విద్యుత్ సరఫరా అన్నవి రెండు ప్రధాన లక్ష్యాలు. ఈ లక్ష్యాలు నెరవేరిన తర్వాత ఇప్పుడు వీటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నది. ఇంతకు ముందు చెప్పినట్లుగా, ప్రత్యక్ష పరోక్ష ఆదాయాలను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న వార్షిక రాబడి సుమారు రూ. 1.50 కోట్లు. 1948-49లో బడ్జెట్లో ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రాజెక్ట్ 7.25 శాతం నికర రాబడిని సమకూర్చింది. ప్రత్యక్ష, పరోక్ష ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు మాజీ చీఫ్ ఇంజనీర్ అలాగే ప్రస్తుత స్పెషల్ చీఫ్ ఇంజనీర్ ఈ రాబడి సుమారుగా 15 శాతానికి పైగా ఉండవచ్చునని అంచనా వేయడం జరిగింది.

బెంగళూరు నగరానికి కొత్త తాగునీటి పథకం:

బెంగళూరులోని పాత తాగునీటి సరఫరా వ్యవస్థ నగర జనాభా అవసరాలకు పూర్తిగా సరిపోవడం లేదు. నా సూచన మేరకు ప్రభుత్వం, పెరిగిన అవసరాల మేరకు సరఫరా పెంచడం కోసం ప్రతిపాదనలు సమర్పించడానికి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి నన్ను చైర్మన్‌గా ఉండమని అడిగారు. కమిటీ బెంగళూరు నగరానికి కొత్త తాగునీటి పథకాన్ని తయారు చేసింది. ఇందులో 3,000 మిలియన్ ఘనపు అడుగుల కంటే ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యం గల జలాశయం నిర్మాణం, బెంగుళూరు నగరానికి ప్రతిరోజూ 10 మిలియన్ గ్యాలన్ల వడ కట్టిన నీటిని సరఫరా చేయడానికి 16 మైళ్ల పొడవుతో, దాదాపు 1,000 అడుగుల ఎత్తు వరకు నీటిని తీసుకుపోవడానికి ఒక పైప్ లైన్ నిర్మాణం చేయాలని ప్రతిపాదించాము.

మైసూర్‌లో ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపనకు ప్రయత్నాలు :

నేను 1935లో యూరప్, అమెరికా పర్యటన నుండి భారతదేశానికి తీసుకువచ్చిన ఆటోమొబైల్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం యుద్ధం కారణంగా అమలుపరచడానికి అనుమతించలేదు. ఈ విషయాలను నా విదేశీ పర్యటనలపై రాసిన 14వ అధ్యాయంలో వివరించాను. బెంగళూరులో ఆటోమొబైల్ పరిశ్రమను ప్రారంభించేందుకు ఒక ప్రయత్నం జరిగింది. మైసూర్ ప్రభుత్వం కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. దీవాన్ సర్ మీర్జా ఎం.ఇస్మాయిల్ ఈ ప్రాజెక్టు విషయంలో అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శించారు. నేను సమర్పించిన ప్రాజెక్టు నివేదికను ఆయన పునర్ముద్రించారు. నా నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమను ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. అమెరికా కంపనీ ‘క్రిస్లర్ కార్పొరేషన్’ వారు ఆటోమొబైల్ పరిశ్రమ నిర్మాణంలో ఆసక్తిని కలిగి ఉన్నట్టు, అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పరిశ్రమ స్థాపనకు సన్నాహాలు జరుగుతున్నప్పుడు భారత ప్రభుత్వం మైసూర్ లోని బ్రిటిష్ రెసిడెంట్‌ని హిస్ హైనెస్ మహారాజా గారు ఈ ప్రతిపాదనకు అంగీకరించకుండా ఒప్పించమని కోరినట్లు తెలిసింది. అందుకే ఆ ఆలోచనను విరమించుకోవాల్సి వచ్చింది.

హిందుస్తాన్ విమాన కార్మాగారం (The Hindustan Aircraft Factory):

నేను అమెరికా, యూరప్ లోని అన్ని ప్రధాన ఆటోమొబైల్ కార్మాగారాలను సందర్శించాను. భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమను స్థాపించడం కోసం 1936లో ఒక నివేదికను ప్రచురించాను. బొంబాయికి చెందిన శ్రీ వాల్చంద్ హీరాచంద్ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రారంభించాలని కోరుకున్నారు.

బొంబాయి పారిశ్రామికవేత్త వాల్చంద్ హీరాచంద్

అతని అభ్యర్థన మేరకు, అప్పుడు బొంబాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, శ్రీ వాల్చంద్ గారిని అధ్యయనం కోసం 1939 లో అమెరికా పంపించింది. ఆయనకు సాంకేతిక సలహాదారుగా వెళ్లేందుకు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న శ్రీ పి బి అద్వానీని ఎంపిక చేసింది. తిరుగు ప్రయాణంలో విమానంలో అద్వానీకి చైనాకు వెళుతున్న ఒక అమెరికన్ విమాన నిపుణుడు శ్రీ డబ్ల్యూ డి పాలీ తో పరిచయం ఏర్పడింది. ఆయనతో సంభాషిస్తున్న సమయంలో భారతదేశంలో ఒక విమాన తయారీ కార్మాగారం ఏర్పాటు కోసం ఒక పథకాన్ని తయారు చేసి ఇవ్వమని అడిగారు. అద్వానీ అభ్యర్థన మేరకు శ్రీ పాలి ప్రాజెక్ట్ నివేదికను పంపించారు.

డబ్ల్యూ డి పాలి, అమెరికన్ విమాన తయారీ నిపుణుడు

శ్రీ వాల్చంద్ హీరాచంద్ గారు పరిశ్రమను ప్రారంభించేందుకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ప్రాజెక్టు నివేదికను భారతదేశంలోని కమాండర్-ఇన్-చీఫ్‌కు పంపారు. ఆరు నెలలు దాటినా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డన్కిర్క్ విపత్తు తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం భారతదేశంలో విమానాల కర్మాగారం ఆవశ్యకతపై మేల్కొన్నది. విమానాల తయారీ నిపుణుడు శ్రీ డబ్ల్యూ డి పాలి మార్గదర్శకత్వంలో మెసర్స్ వాల్చంద్ హీరాచంద్ & కంపెనీ వారి యాజమాన్యంలో బెంగళూరులో విమానాల తయారీ కర్మాగారాన్ని స్థాపించడానికి ఏర్పాట్లు చేసింది.

విమానాల తయారీ కర్మాగారాన్ని శ్రీ వాల్చంద్ గారు స్థాపించి విజయవంతంగా నిర్మించారు. ఆ తర్వాత కార్మాగారాన్ని మైసూర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఒక కారణమో లేదా మరేదైనా కారణంగానో, బహుశా భారతీయ నిర్వహణ సామర్థ్యంపై అపనమ్మకం కారణంగా, విమానాల తయారీ చాలా కాలం పాటు నిలిపివేసినారు. ప్రభుత్వ, ప్రజా అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో విమానాలను తయారు చేసేందుకు కనీసం భవిష్యత్తులోనైనా కర్మాగారం సంపూర్ణంగా వినియోగంలోకి వస్తుందని ఆశిస్తున్నాము.

గ్రామీణ పారిశ్రామికీకరణ పథకం:

గ్రామీణ పారిశ్రామికీకరణ కోసం నేను ఒక పథకాన్ని రూపొందించాను. ఆల్-ఇండియా మాన్యుఫ్యాక్చరర్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా 1949లో ఆ పథకాన్ని భారత ప్రభుత్వానికి సమర్పించాను. భారత ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటంటే.. తమ స్వంత సిఫారసు ఏదీ లేకుండానే నివేదికను అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం.

మైసూర్ ప్రభుత్వం ఈ పథకాన్ని వెంటనే ఆమోదించింది. తొలివిడతగా రెండు జిల్లాల్లో ప్రవేశపెట్టే పనిలో నిమగ్నమైంది. అయితే ఈ జిల్లాలలో ఈ పథకం లాభదాయకంగా ఉందని రుజువైతే దీనిని రాష్ట్రంలోని ఇతర గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ పని మా అందరికీ కొత్తది. ఆరు నెలల నుంచి మాత్రమే అమల్లో ఉన్నది. నా సలహా మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారి ఈ పథకం అమలును పర్యవేక్షిస్తున్నారు. ఇది ఆశాజనకంగా ప్రారంభం అయింది. వాస్తవానికి మేము ప్రారంభించిన లేదా అమలు చేసిన పథకంలో ఏర్పాటైన కొత్త గ్రామీణ పరిశ్రమల స్థాపన, వాటి పురోగతి గురించి నేను ఇప్పుడే ఏమీ మాట్లాడలేను. ఫలితాలను వెలికి తీయడానికి తగిన సమయం లభించ లేదు.

***

Exit mobile version