Site icon Sanchika

మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-15

[భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను అనువదించి అందిస్తున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]

అధ్యాయం 15 – రాజకీయ, ఇతర సదస్సుల్లో నా భాగస్వామ్యం

[dropcap]భా[/dropcap]రత ప్రభుత్వానికి, రాచరిక రాష్ట్రాలకు మధ్య ఉండాల్సిన సంబంధాలను అధ్యయనం చేసి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంతో భారత రాష్ట్రాల మధ్య మెరుగైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను పటిష్టపరచడానికి సిఫార్సులు చేయడానికి 1917లో యువరాజులు, మంత్రుల (లేదా దివాన్ల) కమిటీని ఏర్పాటు చేశారు. నేను మైసూర్ దీవాన్‌గా ఉన్నప్పుడు ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నాను. దాని రెండు సమావేశాలకు హాజరయ్యాను. వాటిలో ఒకటి బికనీర్‌లో, మరొకటి పాటియాలాలో జరిగినాయి. ప్రజ్ఞావంతుడైన బికనీర్ మహారాజా సర్ గంగాసింగ్ బహదూర్ కమిటీ ఛైర్మన్‌గా, అల్వార్ మహారాజు సభ్యులుగా వ్యవహరించారు.

బికనేర్ మహారాజా గంగా సింగ్ బహాదుర్

రాయపూర్‌కు చెందిన సర్ (తర్వాత ప్రభువు) సిన్హా (సత్యేంద్ర ప్రసాద్ సిన్హా) కూడా కమిటీ సభ్యుల్లో ఒకరు.

సత్యేంద్ర ప్రసాద్ సిన్హా

భారత రాచరిక రాష్ట్రాలతో సంబంధం ఉన్నవివిధ అంశాలపై కమిటీ సంస్కరణలు సూచించింది లేదా చర్చించింది. వీటిపై తీర్మానాలు ఆమోదించింది. అప్పటి రాచరిక రాష్ట్రాలు చాలా వరకు ఇప్పుడు భారత యూనియన్‌లో విలీనం అయినాయి. అప్పుడు ఈ కమిటీ ఆమోదించిన తీర్మానాలు, చేసిన సిఫార్సులు ఇప్పుడు ఆచరణాత్మక విలువను, ప్రాసంగికతను కోల్పోయినాయి. అందువల్ల వాటిని ఇక్కడ ప్రస్తావించడం లేదు.

1923లో లక్నోలో జరిగిన భారత వైజ్ఞానిక సదస్సు వార్షిక సమావేశంలో, 1924లో బొంబాయిలో జరిగిన భారత ఆర్థిక సదస్సులో అధ్యక్షుడిగా పాల్గొనే అవకాశం నాకు లభించింది. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో కొత్తగా ఏర్పాటైన కోర్టు సభ్యులు 1938 నుండి వరుసగా తొమ్మిది సంవత్సరాల పాటు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1947లో నా స్వంత అభ్యర్థన మేరకు నేను ఆ పదవి నుండి విరమణ తీసుకున్నాను.

1920వ దశకంలో రెండు రాజకీయ సదస్సుల్లో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించారు. వాటి కార్యకలాపాల గురించి సంక్షిప్తంగా ఇక్కడ ప్రస్తావించాలని భావిస్తున్నాను.

బొంబాయి అఖిల పక్ష రాజకీయ సదస్సు, 1922:

హిస్ రాయల్ హైనెస్ వేల్స్ యువరాజు 17 నవంబర్ 1921న బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు, నగరంలో హర్తాళ్, విదేశీ వస్త్రాల దాహనాలు జరిగాయి. దాని తర్వాత అల్లర్లు, రక్తపాతాలు జరిగాయి. అదే రోజు కలకత్తాలో శాంతియుత హర్తాళ్ నిర్వహించారు. అయితే బెంగాల్ ప్రభుత్వం హర్తాళ్‌లో కాంగ్రెస్ వాలంటీర్లను చేర్చుకోవడం చట్ట విరుద్ధమని ప్రకటించింది. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ సి.ఆర్. దాస్ (చిత్త రంజన్ దాస్) సహా పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగాయి.

కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్ దాస్

కొన్ని రోజుల తరువాత, వైస్రాయ్ కలకత్తాకు వెళ్ళాడు, అక్కడ వేల్స్ యువరాజు క్రిస్మస్ పండుగ జరుపుకోవాల్సి ఉండింది. వైస్రాయ్ కలకత్తాలో ఉన్న ఈ సున్నిత సమయంలో, కాంగ్రెస్ నాయకుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్య, మరికొందరు నాయకులతో సంప్రదింపులు జరిపి, వారందరినీ రౌండ్ టేబుల్ సమావేశానికి తీసుకురావాలనే ఉద్దేశంతో వైస్రాయ్‌తో చర్చలు జరిపారు. ప్రజల మనోభావాలను గాయపరచే సమస్యలను పరిష్కరించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పరిష్కారం లభిస్తుందని అతని ఆలోచన. ఈ సంభాషణలు 21 డిసెంబర్ 1921న వైస్రాయ్‌తో చర్చల కోసం పండిత్ మదన్ మోహన్ మాలవ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం సిద్ధం కావడానికి దారితీశాయి.

పండిత్ మదన్ మోహన్ మాలవ్యా

పండిత్ మాలవ్యా గారి ఆహ్వానం మేరకు కలకత్తాలో వైస్రాయ్‌ని కలిసే బృందంలో నేను కూడా చేరాను. ఈ బృందంలో శ్రీమతి అన్నీ బిసెంట్ కూడా ఉన్నారు.

అన్నీ బీసెంట్

ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, దేశంలోని అన్ని పార్టీల రాజకీయ నాయకుల మధ్య రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించే ప్రతిపాదనలపై వారు చర్చించారు. ఆ రోజుల్లో ప్రజలను ఆందోళన బాట పట్టిస్తున్న అత్యవసరమైన రాజకీయ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని అందరి లక్ష్యం. మహాత్మా గాంధీ ఈ సమావేశానికి సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే దేశ ప్రజలు ముందుకు తెస్తున్న మరిన్ని అత్యవసర రాజకీయ డిమాండ్లను నెరవేర్చడానికి దారితీసే ఏ సహేతుకమైన ప్రత్యామ్నాయాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు.

కలకత్తా సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై వైస్రాయ్ ప్రతినిధి బృందానికి స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ, తాను చేసిన వ్యాఖ్యలు ఏవైనా రౌండ్ టేబుల్ సమావేశాన్నిఏ సమయంలో నైనా నిర్వహించడాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి తిరస్కరణగా భావిస్తే, తనను క్షమించాలని ప్రతినిధి బృందానికి బహు జాగ్రత్తగా చెప్పాడు. అతను ఇంకా ఇలా అన్నాడు:

“ఖచ్చితంగా, నేను ఉపయోగించిన భాష ద్వారా మీకు ఆ అర్థాన్ని తెలియజేయాలని నేను ఉద్దేశించలేదు.. విభిన్న కోణాల నుండి చూసే వారు ఇతరులతో చర్చలు, సంప్రదింపుల నుండి ప్రయోజనం పొందవచ్చని నేను నా సుదీర్ఘ అధికారిక జీవితానుభవం నుంచి నేర్చుకున్నాను. మాకు లేని అభిప్రాయాలను మా మాటల నుంచి అర్థం చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంది.

పండిత్ మదన్ మోహన్ మాలవ్య కలకత్తా నుండి అహ్మదాబాద్‌కు జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ మహాత్మా గాంధీతో కలకత్తా చర్చల పరిస్థితిని వివరించారు. శ్రీయుతులు ఎం ఆర్ జయకర్, ఎం ఎ జిన్నా కూడా ఆ సమావేశంలో ఉన్నారు.

ఎం ఆర్ జయకర్

ఆ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ తన అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తూ తీర్మానాలను ఆమోదించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ స్వచ్ఛంద సేవా దళాల్లో చేరాలని పిలుపునిచ్చింది. నిశ్శబ్దంగా, ఎలాంటి నిరసన ప్రదర్శనలు లేకుండా తమను తాము అరెస్టు కావడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ తీర్మానం వ్యక్తిగత, సామూహిక శాసనోల్లంఘన కార్యక్రమాలకు ఆటంకంగా నిలచింది. సాయుధ తిరుగుబాటుకు ఏకైక నాగరిక, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా భావించిన శాంతియుత పౌర సహాయ నిరాకరణ ఉద్యమాలపై ప్రభుత్వాలు క్రూర దమనకాండకు పాల్పడడానికి జంకుతాయి. అయితే పండిట్ మదన్ మోహన్ మాలవ్య, శ్రీయుతులు ఎం ఎ జిన్నా, ఎం ఆర్ జయకర్ కృషి కారణంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాలను అంగీకరించడానికి మహాత్మా గాంధీ ఆ దశలో కూడా సిద్ధపడినారు.

మహమ్మద్ అలీ జిన్నా

పండిత్ మదన్ మోహన్ మాలవీయ వంటి మితవాద నాయకులు బొంబాయిలో జరిగే అఖిలపక్ష సమావేశానికి మహాత్మా గాంధీని హాజరయ్యేలా ప్రేరేపించారు. బొంబాయిలో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సదస్సుకు దేశంలోని అన్ని పార్టీల మూడు వందల యాభై ప్రముఖ పౌరులకు ఆహ్వానాలు జారీ చేసినారు. సదస్సుకు దాదాపు 200 మంది హాజరయ్యారు. 1922 జనవరిలో అప్పటి కాన్ఫరెన్స్ సెక్రటరీలు శ్రీయుతులు ఎం ఏ జిన్నా, ఎం ఆర్ జయకర్, కె నటరాజన్ ప్రచురించిన ‘బొంబాయి ప్రతినిధుల సదస్సు కార్యకలాపాలపై నివేదిక’ అనే ముద్రిత బ్రోచర్‌లో హాజరైన వ్యక్తుల పేర్లు, ఆ సదస్సు కార్యకలాపాల వివరాలు పొందుపరచినారు. ఈ అధ్యాయంలో ఇచ్చిన ఈ అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన మొత్తం సమాచారం ఆ బ్రోచర్ నుండి తీసుకున్నాను.

సర్ సి ఎస్ శంకరన్ నాయర్

సదస్సు ప్రారంభమైనప్పుడు సర్ సి. శంకరన్ నాయర్ ఛైర్మన్ లేదా స్పీకర్‌గా నామినేట్ అయ్యారు. అతను మొదటి రోజు సమావేశాన్ని నిర్వహించాడు. అయితే రెండవ రోజు సదస్సులో ఆమోదించిన కొన్ని తీర్మానాలతో అతను ఏకీభవించలేదు. ఆ కారణంగా సదస్సు నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన స్థానంలో నేను సదస్సుకు చైర్మన్‌గా ఎన్నికయ్యాను.

ఈ దశలో పండిత్ మదన్ మోహన్ మాలవ్య చేసిన ప్రసంగాన్ని బ్రోచర్‌లో నమోదు చేసినారు. ఆయన ఉపన్యాసంలో కొన్ని భాగాలు కింద ఉటంకిస్తున్నాను.

ఈ సమావేశానికి స్పీకర్‌గా అధ్యక్షత వహించడానికి అంగీకరించిన మా గౌరవనీయ మిత్రుడు సర్ శంకరన్ నాయర్ ఈ తీర్మానాలలో పొందుపరచబడిన కొన్ని విషయాలను అంగీకరించలేకపోయారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. అతను ఈ విషయాలపై తన అభిప్రాయాలను మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అందువల్ల సదస్సు అధ్యక్ష పదని వదులుకున్నాడు. ఈ కమిటీ చర్చలలో అతను మాకు అందించిన మార్గదర్శకానికి మేము అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సర్ శంకరన్ నాయర్ పదవీ విరమణ అనంతరం కమిటీ సర్ ఎం. విశ్వేశ్వరాయను స్పీకర్‌గా ఎన్నుకుంది (కరతాళ ద్వనులు). కమిటీ చేసిన ఎన్నికను మీరు ఖచ్చితంగా ఆమోదిస్తారని నేను నమ్ముతున్నాను. ఈ తరుణంలో సదస్సుకు అధ్యక్షత వహించడానికి అంగీకరించినందుకు సర్ ఎం. విశ్వేశ్వరాయకు కృతజ్ఞతలు. కమిటీ రూపొందించిన తీర్మానాలపై చర్చకు ఇప్పుడు సమావేశం కొనసాగుతుంది.

కమిటీ ఆమోదించిన నాలుగు తీర్మానాలను శ్రీ ఎం ఏ జిన్నా సదస్సు ముందు ఉంచారు. ఆ తర్వాత సదస్సు తదుపరి ప్రక్రియలో భాగంగా పలువురు ప్రముఖ సభ్యులు సమావేశంలో ప్రసంగించారు. వీరిలో శ్రీ హెచ్.పి.మోడీ, పండిత్ హెచ్.ఎన్.కుంజ్రు, శ్రీ పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్, పండిత్ మదన్ మోహన్ మాలవ్య ఉన్నారు.

హెచ్ పి మోది
హృదయనాథ్ కుంజ్రు
పురుషోత్తందాస్ ఠాకూర్ దాస్

తీర్మానాలపై మహాత్మా గాంధీ గారిని తన అభిప్రాయాలను వివరించడానికి పిలిచారు. వారు ఈ క్రింది విధంగా మాట్లాడారు:

తీర్మానాలలో చాలా ముఖ్యమైన మార్పులు ఏమీ లేవు. వాటిని మీరు చూసారు. నిన్న తీర్మానాలను మీకు చదివి వినిపించారు. ఈ సదస్సు తీర్మానాలకు భాగస్వామిగా ఉండకూడదని నేను భావిస్తున్నాను. నాకు సంబంధించినంత వరకు, సహాయ నిరాకణ ఉద్యమంలో పాల్గొంటున్న వారు కూడా భాగస్వాములుగా ఉండరని ఈ సదస్సుకు తెలియజేస్తున్నాను. వారు చర్చల్లో కూడా పాల్గొనరు. మీ అందరికీ నా సవినయ సూచన ఏమిటంటే.. ఈ తీర్మానాల పర్యావసానాలను పూర్తిగా పరిశీలించడం సహాయ నిరాకరణలో పాల్గొనని వారి ప్రత్యేక హక్కు, విధి కూడా. వాటిని వారు అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.. రౌండ్ టేబుల్ సమావేశానికి ఏదైనా అవకాశం ఉంటే, సాధారణ శాసనోల్లంఘన ఉద్యమాన్ని సస్పెండ్ చేయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నేను సలహా ఇస్తాను. ఈ కార్యక్రమం అహ్మదాబాద్ కాంగ్రెస్‌లో ఒక తీర్మానం ద్వారా ఆచారణలోకి వచ్చింది.. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అన్నింటిని నేను గమనిస్తున్నాను. కానీ ఈ డిమాండ్ల ముఖ్యమైన లక్ష్యం దేశానికి డొమినియన్ హోదా పొందడం.. నా దేశస్థుల శక్తిపై నాకు తక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే వారు తగినంత బాధలు అనుభవించలేదు. అందువల్ల నా స్వంత అనుమానాలు నాకు ఉన్నాయి. ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే, ఆ సమావేశాన్నివెంటనే పిలవాలని వైస్రాయ్‌కు సహాయ నిరాకణ ఉద్యమకారుల తరపున నా ఈ వినయపూర్వకమైన సందేశాన్ని, కొత్తగా నియామకమైన కమిటీ వైస్రాయ్‌కి తెలియజేస్తుందని నేను భావిస్తున్నాను.. జరగబోయే దారుణం ఏమిటంటే.. మనకు ఈ భూమి మీద ఎప్పుడైనా నూకలు చెల్లవచ్చు. ఈ నేల మీద నుంచి మనలను తొలగించవచ్చు. నేను స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అనుభవించలేనంత కాలం నేను ఈ పరిణామాలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాను.

చివరగా.. శ్రీ ఎం ఏ జిన్నా ఐదవ తీర్మానాన్ని క్రింది విధంగా ప్రతిపాదించారు:

ప్రస్తుతం డిమాండ్ల వివరాల జోలికి వెళ్లకుండా పంజాబ్, ఖిలాఫత్, స్వరాజ్యానికి సంబంధించిన దేశం ముందున్న ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడానికి ఈ సమావేశం ఒక కమిటీని నియమిస్తుంది. ఈ కమిటి ప్రభుత్వంతో నేరుగా అన్ని రకాల సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఒక వైపు దేశంలోని ముఖ్యమైన రాజకీయ సంస్థలు, మరోవైపు పేర్కొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహణకు సంబంధించిన రాజకీయ కూర్పు, తేదీలు, ఇతర వివరాలను సమకూర్చడానికి; దేశ ప్రయోజనాల కోసం యాదృచ్ఛికంగా ఈ తీర్మానాలలో అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు చేయడానికి; అవసరమని భావిస్తే మరొక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కమిటీకి అధికారాలు కట్టబెట్టడం జరిగింది.

ప్రతిపాదిత కమిటీలో 21 మంది ఉన్నారు. అందులో కార్యదర్శులుగా శ్రీయుతులు జిన్నా, జయకర్, నటరాజన్, చైర్మన్‌గా నన్ను కొనసాగించారు.

మహాత్మా గాంధీ, ఇతర సహాయ నిరాకరణ ఉద్యమకారులు సదస్సులో సూత్రప్రాయంగా ఓటు వేయకుండా దూరంగా ఉండిపోయారు. అయితే ఆయన ఇచ్చిన వివరణల ఆధారంగా నేషనల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధికారికంగా 17 జనవరి 1922న జరిగిన సమావేశంలో సదస్సు తీర్మానాలను ఆమోదించింది.

1922 ఫిబ్రవరి 14 న ప్రతినిధుల సమావేశం కమిటీ ఆమోదించిన తీర్మానాలలో ఒకటి ఈ క్రింది విధంగా ఉంది:

శ్రీ గాంధీ గారికి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులకు మమ్ములను బార్డోలీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఆహ్వానించినందుకు, ఈ సమావేశానికి హాజరైన పండిత్ మాలవ్య, శ్రీయుతులు నటరాజన్, జయకర్ లకు వర్కింగ్ కమిటీ ముందు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం కల్పించినందుకు కమిటీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.

అనంతరం సదస్సు కార్యదర్శులు సదస్సు తీర్మానాలను ఒక లేఖ ద్వారా వైస్రాయ్‌కు పంపుతూ, 21 డిసెంబరు 1921 నాటి సమావేశంలో వైస్రాయ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను తీర్చినట్లు తాము భావిస్తున్నామని రాసినారు. అయితే, వైస్రాయ్ భిన్నమైన అభిప్రాయాన్ని తీసుకున్నాడు. తీర్మానాల పట్ల తన విచారం వ్యక్తం చేశాడు. తీర్మానంలోని ప్రతిపాదనలను కలకత్తాలో ఆయన వ్యక్తం చేసిన భావాలకు ప్రతిస్పందనగా ఉండి ఉంటే బాగుండేదని ఆయన భావించారు. వైస్రాయ్‌తో తదుపరి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అయితే వైస్రాయ్‌కి మహాత్మా గాంధీ ఇచ్చిన అల్టిమేటం దృష్ట్యా, తదుపరి చర్చ నిష్ఫలమని ఆయన సదస్సు కార్యదర్శులకు తెలియజేశారు.

చౌరీ చురా సంఘటన, బార్డోలి శాసనోల్లంఘన కార్యక్రమం, మహాత్మా గాంధీని అరెస్టు చేసి జైలులో పెట్టడం వంటి తదుపరి సంఘటనల ఫలితంగా సంఘటనలు అనుకోని విధంగా మలుపు తీసుకున్నాయని కమిటీ భావించింది. ఇవన్నీ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నమోదు అయిన ప్రధాన ఘట్టాలు. తీర్మానాల ప్రకారం మరొక సమావేశానికి పిలుపు ఇవ్వలేని పరిస్థితిలో కమిటీ ఇక ముందు పనిచేయడం సాధ్యం కాదని భావించి అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది.

దక్షిణ భారత రాష్ట్రాల ప్రజా సదస్సు, 1929:

1929 జనవరి 14, 15 తేదీల్లో త్రివేండ్రంలో దక్షిణ ‘భారత రాష్ట్రాల పీపుల్స్ కాన్ఫరెన్స్’ జరిగింది. దీనికి మైసూర్, హైదరాబాద్, పుదుకోట్ట, కొచ్చిన్, ట్రావెన్కోర్ సంస్థానాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ముఖ్యమైన సదస్సుకు నన్ను ఛైర్మన్‌గా వ్యవహరించమని ఆహ్వానించారు. భారత రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన సమస్యలపై చర్చలు ఒక ముఖ్యమైన దశకు చేరుకున్నాయి. వాటి పరిష్కారంలో సహాయం చేయడానికి, ఇప్పటివరకు జరిగిన సంస్కరణలను రక్షించడానికి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఏర్పాటు అయ్యే ఏదైనా సంస్థ ద్వారా ప్రజల ప్రయోజనాలు, భారతీయ రాష్ట్రాల ప్రయోజనాలు, భవిష్యత్‌లో ఏర్పడే భారత ప్రభుత్వం రూపు రేఖలు ఇమిడి ఉంటాయని భావించారు. సదస్సులో చేసిన ప్రసంగంలో నేను భారత రాజ్యాంగ సంస్కరణలు, రాష్ట్రాల ప్రజల వెనుకబాటుతనం, వారి ప్రత్యేక ఆకాంక్షలు, భారత రాష్ట్రాల స్థితిగతులు, భారతదేశం కోసం ఫెడరల్ వ్యవస్థ, భారతీయ రాష్ట్రాల ఫెడరల్ వ్యవస్థలో యువరాజుల కమిటికి ఉండవలసిన స్థానం గురించి వివరించాను.

సదస్సు రాజ్యాంగ సాధారణ సూత్రాలు, నిబంధనలను ఆమోదించింది. ఇవి ‘రాష్ట్రాలు సహా స్వతంత్ర భారతదేశ రాజ్యాంగం’ అనే శీర్షికతో ముద్రించిన మెమోరాండంలో పొందుపరచి సదస్సుకు సమర్పించడం జరిగింది. సబ్జెక్ట్స్ కమిటీ, శాశ్వత కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడానికి ఈ కమిటిలో 17 మంది సభ్యులు ఉంటారు.

***

Exit mobile version