Site icon Sanchika

మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-16

[భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను అనువదించి అందిస్తున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]

అధ్యాయం 16 – నా విదేశీ పర్యటనలు: పారిశ్రామిక బృందంతో యూరప్, అమెరికా పర్యటనలు

[dropcap]నా[/dropcap] విదేశీ ప్రయాణాలు కొంత విస్తృతంగానే ఉన్నాయి. నా విదేశీ పర్యటనానుభవాలను, నన్ను ప్రభావితం చేసిన ఆ దేశస్థుల ఆలోచనలు, అమలవుతున్న పాలనా విధానాలు తదితర అంశాలను ఈ అధ్యాయంలో సంక్షిప్తంగా ప్రస్తావిస్తాను. ప్రభుత్వ సర్వీస్ ఉన్న కాలంలో నా పరిమితులకు లోబడి కొన్ని విదేశీ విధానాలను అనుసరించడంలో ఆ అనుభవాలు నాకు ఉపయోగపడినాయి. పదవీ విరమణ తర్వాత నాకు ఆసక్తి ఉన్న విషయాలలో కూడా విదేశీ పర్యటనానుభవాలు నాకు ఇతోధికంగా తోడ్పడినాయి.

నేను భారతదేశం నుండి ఆరు సార్లు విదేశాలకు ప్రయాణించాను. అందులో ఐదు సార్లు అమెరికా సందర్శించాను. ప్రతి పర్యటన తేదీలు, వాటికి సంబంధించిన ఏవైనా సంఘటనలను ప్రస్తావిస్తే అది పాఠకులను విసిగించవని నేను నమ్ముతున్నాను.

(1) నేను నీటిపారుదల శాఖ పూనా సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్‌కు సహాయకుడిగా పని చేసిన అనంతరం 1898లో మొదటిసారిగా భారతదేశం నుండి విదేశాలకు వెళ్లాను.

మార్చి 1898 నుండి జపాన్‌లో సుమారు మూడు నెలల పాటు నా పర్యటనలు కొనసాగాయి. జపాన్‌లో నేను గమనించిన వాటిని విలువైనవిగా భావించి నోట్ చేసుకున్నాను. జపాన్ నుంచి నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశంలో నా అనుభవాలను వివరిస్తూ ఒక చిన్న పుస్తకాన్ని సంకలనం చేసాను. అయితే, దానిని ప్రచురించడానికి సమయం సరైనదని నేను అనుకోలేదు. అంతే కాకుండా, నేను అప్పుడు బొంబాయి ప్రభుత్వంలో విశ్వసనీయ అధికారిని. ప్రభుత్వ విధానాలు, చర్యలపై ఏవైనా వ్యాఖ్యలు.. సరైనవైనా, సమర్థనీయం అయినప్పటికీ, వాటికి తగిన గుర్తింపు ఉండేది కాదని భావించాను. ఆ రోజుల్లో పూనా రాజకీయ ఉద్యమాలకు కేంద్రంగా పేరు గాంచింది. నేను అటు ప్రభుత్వంతోనూ, ఇటు ఉద్యమ నాయకులతోనూ, పుర ప్రముఖులతోనూ సమాన స్థాయిలో సంబంధాలు కొనసాగించాలనుకున్నాను. ఆ రోజుల్లో ప్రభుత్వ విధానాలపై ఏదైనా విమర్శలు అనుమానాలను సృష్టించి, ప్రభుత్వ అధికారిగా నా కార్యనిర్వాహక విధులను సజావుగా నిర్వహించడానికి ఆటంకం కలిగించే అవకాశం ఉండవచ్చు.

(2) 1908లో బొంబాయి ప్రభుత్వ సర్వీసు నుండి పదవీ విరమణ చేసిన తర్వాత నా రెండవ విదేశీ ప్రయాణం యూరప్, అమెరికాలో జరిపాను. పదవీ విరమణకు సన్నాహకంగా దీర్ఘకాల సెలవు తీసుకుని రెండు సంవత్సరాలు ఉపయోగకరంగా గడపాలనే ఉద్దేశంతో ఈ పర్యటనలు చేశాను. అయితే, నా పర్యటన ప్రణాళికకు మధ్యలోనే ఆటంకం కలిగింది. ఇటలీలో ప్రయాణిస్తున్నప్పుడు గంభీరమైన ఒక ఇంజనీరింగ్ సమస్యను ఎదుర్కోవటానికి ఆహ్వానిస్తూ నాకు ఇండియా నుంచి సందేశం అందింది. 28 సెప్టెంబర్ 1908న మూసి నది పరీవాహక ప్రాంతంలో సంభవించిన అసాధారణ వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో కొంత భాగం నాశనం అయింది. తత్ఫలితంగా భవిష్యత్తులో వరదల నివారణ కోసం తీసుకోవలసిన పరిష్కార మార్గాలను, ప్రణాళికలను సూచించమని హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ సంగతులు ఒక అధ్యాయంలో వివరించి ఉన్నాను. అయితే, హైదరాబాద్ ఆహ్వానాన్ని అంగీకరించిన తర్వాత నేను యూరప్, అమెరికాలో దాదాపు ఐదు నెలలు గడపగలిగాను. అత్యంత ఆసక్తికరమైన ఈ పర్యటనలో, ఇటలీలో, యూరప్, అమెరికా, కెనడా దేశాల్లోని వివిధ ప్రాంతాలలో తాగునీటి సరఫరా, ఆనకట్టలు, మురుగునీటి వ్యవస్థ, నీటిపారుదల, ఇతర రంగాలలో ఇంజనీరింగ్ అభివృద్ధిని పరిశీలించడంలో నేను కొంత సమయం గడిపాను. నేను నా అధ్యయనాంశాల్లో చాలా ముఖ్యమైన వాటి గురించి నోట్స్ రాసుకున్నాను. కానీ నేను భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నేను తీరిక లేకుండా గడిపిన కఠినమైన పనుల వలన వాటిని నమోదు చేయడానికి కూడా నేను సమయాన్ని వెచ్చించ లేకపోయాను. నేను సేకరించిన సమాచారం నా ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని విస్తరించుకోవడానికి సహాయపడినప్పటికీ, నేను దానిని వివరమైన సాంకేతిక పత్రం రూపంలోకి మార్చలేకపోయాను. బొంబాయి ప్రెసిడెన్సీలో ఇంజినీరింగ్ డిజైన్లను తయారు చేసే పనిలో నేను తాజాగా ప్రవేశించినందున, ఇటలీలో ఆచరణలో ఉన్న మట్టి కోత సమస్య, నీటిపారుదల, మురుగునీటి పారుదల పనులను రెండు నెలలకు పైగా అధ్యయనం చేసాను. ఇటలీలో మిలన్ నగర మురుగునీటి వ్యవస్థకు ఇన్‌చార్జ్ చీఫ్ ఇంజనీర్‌తో కలిసి భూగర్భ మురుగునీటి కాలువలను సందర్శించాను. ఆ అధికారి నన్ను సాదరంగా ఆహ్వానించారు. అయితే మురుగునీటి సొరంగాల రూపకల్పన మొదలైన పెద్ద పథకాల గురించి ఎందుకు తపన పడుతున్నావని ఆయన నన్ను అడిగాడు. ఎందుకంటే భారతదేశంలోని అటువంటి ఉన్నతమైన పనులన్నీ బ్రిటిష్ అధికారుల గుత్తాధిపత్యమని అతను భావించాడు. అది సరి కాదని నేను అతనికి హామీ ఇచ్చాను. అవసరమైన అర్హతలు కలిగిన భారతీయులు కష్టపడి పనిచేస్తే, వారి సేవలకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయని, వారి సేవలను సమర్థవంతంగా ఉపయోగిస్తారని చెప్పాను. ఒక ఉదాహరణగా 1906లో ఏడెన్‌కు నా డిప్యుటేషన్‌ని అతని దృష్టికి తీసుకువచ్చాను.

నేను 1908లో, 1909 ప్రారంభంలో స్వీడన్, రష్యా సహా యూరప్ లోని వివిధ ప్రాంతాలను సందర్శించాను. స్వీడన్, డెన్మార్క్, హాలండ్ ఆనాటికే చాలా అభివృద్ధి చెందిన దేశాలు. నేను బాల్టిక్ సముద్రంలో పడవలో ప్రయాణించి సెయింట్ పీటర్స్‌బర్గ్ (ఇప్పుడు లెనిన్ గ్రాడ్) ని సందర్శించాను. లెనిన్ గ్రాడ్ నుండి నేను మాస్కోను సందర్శించాను. అక్కడ యూరప్ లోని మిగిలిన ప్రాంతాలలో అభివృద్ది చెందిన ఆధునిక నాగరికత తరహాలోనే అదే స్థాయిలో ప్రబలంగా ఉన్నట్లు అనిపించింది. అయితే అక్కడ రాచరిక పాలన నిరంకుశంగా ఉంది. జార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండింది.

ప్రతి యూరప్ దేశాల నా పర్యటనలకు లండన్ కేంద్రంగా ఉండింది. లండన్‌లో నాకు మార్గనిర్దేశం చేసేందుకు కొంతమంది గతంలో నాతో పని చేసిన సహచరులు, స్నేహితులు ఉన్నారు. వారు నా ప్రయాణాలు సుఖవంతంగా చేయడానికి ఎంతగానో సహాకరించారు.

నేను తదుపరి న్యూయార్క్ వెళ్లాను. అక్కడ శక్తియుక్తులు, ఉన్నతాశయాలు కలిగిన భారతీయ వ్యాపారులు, వ్యాపారవేత్తల సంఘం ఉంది. వారితో నా అనుబంధం నాకు భారతదేశంతో పోలిస్తే అమెరికాలో ఆర్థికాభివృద్ధి పరిణామాల గురించి చాలా సంగతులు తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. నేను కెనడాలోని ఒట్టావా, టొరంటోలను సందర్శించి, అక్కడి నుండి డెట్రాయిట్‌కి వెళ్లి ఫోర్డ్ ఫ్యాక్టరీలో ఆటోమొబైల్ పరిశ్రమను అధ్యయనం చేశాను.

అమెరికాలో న్యూయార్క్‌కు నీటిని సరఫరా చేసే క్రోటన్ డ్యామ్ వంటి కొన్ని పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆనాటికి నీటిపారుదల రంగంలో అభివృద్ధి గణనీయమైన పురోగతిని సాధించినట్లు కనిపించలేదు.

న్యూయార్క్ నగరానికి నీటిని సరఫరా చేసే క్రోటన్ డ్యాం

కెనడాలో నాకు ప్రతి శాఖకు సంబంధించిన గణాంకాలు, గణాంకాల సేకరణ విధానాల గురించి సమాచారాన్ని అందించారు. ప్రముఖ గణాంకవేత్త శ్రీ సి ఏ కోట్స్ ఈ విషయంలో స్నేహపూర్వకంగా, సహాయకారిగా ఉన్నారు. నేను కెనడా విడిచిపెట్టిన తర్వాత కూడా కొన్నాళ్లపాటు అతను నాతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. కెనడా పర్యటన ముగించుకొని రెండవసారి లండన్, ఫ్రాన్స్ లకు చేరుకున్నాను. దీనితో నా యూరప్, అమెరికా పర్యటనలు ముగిశాయి. మార్సెయిల్స్ నుండి నేను పి & ఒ కంపనీ (Peninsular & Oriental Steam Navigation Company) వారి ఓడలో బొంబాయికి తిరిగి వచ్చాను.

(3) నేను మైసూర్ ప్రభుత్వ సర్వీస్ నుండి పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత 1919 సంవత్సరంలో తదుపరి విదేశీ పర్యటన జరిగింది. బొంబాయిలోని పత్తి మిల్లు పరిశ్రమతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న సర్ విఠల్ దాస్ దామోదర్ థాకర్సే, శ్రీ ముల్రాజ్ ఖటౌ నేతృత్వంలో మహిళలు, డజను మంది ప్రముఖుల బృందంతో ‘ప్రపంచ’ పర్యటనను నిర్వహించాడానికి తలపెట్టారు.

సర్ విఠల్ దాస్ దామోదర్ థాకర్సే
ముల్ రాజ్ ఖటౌ

వారిద్దరితో నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. నేను కూడా ఆ బృందంలో చేరాను. మేమంతా సిలోన్, సింగపూర్ మీదుగా ప్రపంచాన్ని చుట్టి రావాలని నిర్ణయించుకున్నాము. మేము పి & ఒ ఓడలో ప్రయాణించాము. జపాన్‌లో విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, రాజకీయాలలో ఆధునిక పరిణామాలను అధ్యయనం చేయడానికి నేను దాదాపు మూడు నెలలు జపాన్‌లో ఉన్నాను. ఇది నా రెండవ జపాన్ పర్యటన. అక్కడి నుంచి మేము అమెరికా వెళ్లాలనుకున్నాం. మా అందరికీ ఒకే పడవలో ప్రయాణించడం కష్టం కాబట్టి నేను యోకోహామా నుండి కెనడాకు వెళ్లాల్సి వచ్చింది. కెనడాలో చేరిన మొదటి నౌకాశ్రయం విక్టోరియా. ఆ ఓడరేవులో అటవీ ఉత్పత్తుల వ్యాపారం గణనీయంగా జరిగుతుంది. భారీ కలప దుంగలు నదిలో తేలుతూ వస్తాయి. వాటిని విక్టోరియా సమీపంలో సేకరించి ఎండబెట్టడం కోసం నది ఒడ్డున నిల్వ చేస్తారు. ఎండబెట్టిన కలపతో వ్యవహరించేందుకు వారు ఆధునిక యంత్రాలను చాలా విస్తృతంగా వినియోగిస్తున్నారు. మానవ శ్రమ లేకుండా పూర్తిగా యంత్రాల సహాయంతోనే పని జరుగుతున్నది. ఎండబెట్టిన మొత్తం కలప కర్మాగారాన్ని ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు మాత్రమే నిర్వహిస్తున్నారు. భారీ దుంగలను యంత్రాల ద్వారా అవసరమైన ఆకారాల్లో కోసి రైల్వే ట్రక్కుల్లోకి ఎక్కిస్తారు. ఇందులో చాలా వరకు యంత్రాల ద్వారా ఆటోమేటిక్‌గా జరిగేవి. రైల్వే ట్రక్కులు కలప ఉత్పత్తులను సుదూర మార్కెట్లకు తీసుకువెళతాయి. దాదాపు 3,000 మైళ్ల దూరంలో ఉన్న న్యూయార్క్ వరకు తరచుగా రైలు ద్వారా రవాణా చేస్తారు.

మేము అమెరికాలో సిమెంట్, కాగితపు వంటి కొన్ని పరిశ్రమలను అధ్యయనం చేసాము. మేము ఆటోమొబైల్ పరిశ్రమతో పరిచయం పొందడానికి డెట్రాయిట్‌కు వెళ్లాము. మా విదేశీ పర్యటనల సందర్భంగా ఆయా దేశాలకు భారత ప్రభుత్వం నుండి మా పరిచయ లేఖను నేను కలిగి ఉన్నందున కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని తయారీదారులు, ప్రభుత్వ అధికారులు నన్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించేవారు. అన్ని విధాలా సహకరించారు. నేను ‘షికాగో కామర్స్’ పేరుతో వెలువడే ఒక పత్రికకు చాలా సంవత్సరాల క్రితం నుంచి చందాదారునిగా ఉన్నాను. షికాగోలో ఆ పత్రికను విలువైనదిగా భావించే కొంతమంది వృత్తిపరమైన నిపుణులు సహృదయతతో నాకు అతిథి సత్కారాలు చేశారు. ఇది 1919 చివరి నెలల్లో జరిగింది. 1908లో నా మునుపటి ఒట్టావా సందర్శనలో నేను కొంత మంది స్నేహితులను సంపాదించుకున్నాను. నేను ఒట్టావా నగరాన్ని రెండవసారి సందర్శించినప్పుడు వీరు నాకు విశేషమైన సహాయ సహకారాలు అందించారు.

కొంతమంది నిపుణుల చిత్తశుద్ధి, సమగ్రతకు సంబందించి ఒక చిన్న అనుభవం నన్ను బాగా ఆకట్టుకుంది. షికాగోలో నేను ఒక నిపుణుడి నుండి ఒక సాంకేతిక పత్రం తయారు చేసి ఇవ్వమని కోరాను. అతను ఒక నిర్దిష్ట తేదీన సాయంత్రం వరకు పూర్తి చేసి అతని మహిళా కార్యదర్శితో పంపిస్తానని పేర్కొన్నాడు. పత్రం తయారు చేసి ఇచ్చినందుకు అతనికి నేను 8 డాలర్లు చెల్లించాలన్నది మా మధ్య కుదిరిన ఒప్పందం. అయితే పత్రాన్ని ఒప్పుకున్న నిర్ణీత సమయంలో అందించాలని నేను ప్రత్యేకంగా కోరాను. కొనుగోలు చేసిన పత్రం సంతృప్తికరంగా ఉంటే, అనుకున్న సమయానికి అందిస్తే అదనంగా ఒక డాలర్ చెల్లిస్తానని కూడా వాగ్దానం చేసాను. అనుకున్న తేదీన దాదాపు సాయంత్రం 5 గంటలకు నేను అతని ఆఫీసుకు వెళ్ళాను. ఆ సమయంలో అతను తన కార్యాలయంలో లేడు. కానీ అతని కార్యదర్శి వద్ద నేను కోరిన పత్రంతో ప్యాకెట్ సిద్ధంగా ఉంది. పత్రం సంతృప్తికరంగా ఉందని భావించి అదనపు డాలర్‌తో పాటు 8 డాలర్లు చెల్లించాను. నేను అతనికి ఇచ్చిన నా సాధారణ వాగ్దానాన్ని మరచిపోలేదని అతను భావించి ఉంటాడని, ఈ విషయంలో నా మీద ఎటువంటి ఫిర్యాదు ఉండకపోవచ్చునని నా నమ్మకం. మరుసటి రోజు ఉదయం నేను షికాగో నుండి బయలుదేరతానని అతనికి తెలుసు. అయితే నేను ఎక్కడ ఉన్నానో ఆ వ్యక్తికి తెలియదు. అతను నా జాడ తెలుసుకోవడానికి అవసరమైన విచారణలు చేసి, మరుసటి రోజు ఉదయం నేను నా బయలుదేరే ముందు అదనపు డాలర్‌ను తిరిగి ఇవ్వడానికి నేను బస చేసిన హోటల్‌కి వచ్చాడు. అతని చిత్తశుద్ది, వినమ్రత నాకు ఆశ్చర్యం కలిగించింది. నేను నా చిరునామాను అతని వద్ద వదిలిపెట్టలేదని, అదనపు డాలర్ తిరిగి వాపస్ ఇచ్చేందుకు నేను ఎక్కడ ఉంటున్నానో తెలుసుకోవడానికి రెండు మూడు హోటళ్లలో విచారణ చేయవలసి వచ్చిందని అతను మా మీద ఫిర్యాదు చేశాడు. సాధారణంగా చాలా మంది వ్యాపారులు చేసే విధంగా అందిన డబ్బులను ఎందుకు ఉంచుకోలేదని నేను అడిగాను. అతను దానిని అంగీకరించనప్పటికీ నేను అదనపు డాలర్‌ను నా సంతృప్తి కోసం అందించానని అతనికి గుర్తు చేసాను. అది నా సంపాదన కాదని, దానిపై తనకు హక్కు లేదని అతను సమాధానం ఇచ్చాడు. “నిజమే, అదనపు డాలర్ ను ఎందుకు ఉంచుకోలేకపోయారు? అలా చేస్తే మిమ్మల్ని అడ్డుకునేది ఏమీ లేదు కదా” అన్నాను. అతను తన నుదిటిని తాకి, “నేను అలా చేస్తే, నా మనశ్శాంతి దెబ్బతింటుంది.” అన్నాడు.

ఈ క్రమంలో అమెరికాలో ఈ పర్యటన మరికొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి.

నేను హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడిని కలుసుకున్నప్పుడు, ఆ ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన సబ్జెక్ట్‌లు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. “హార్వర్డ్ యూనివర్శిటీ ఏ సబ్జెక్టులలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంది?” అనే ప్రశ్న వేసాను. “మేము అన్ని గుర్రాలను ఒకే రకమైన నైపుణ్యంతో పరుగెత్తిస్తాము” అని అధ్యక్షుడు విలక్షణ సమాధానం ఇచ్చాడు.

నేను అమెరికాలోని మధ్య ప్రాంతంలో ఉన్న మరొక విశ్వవిద్యాలయానికి వెళ్లాను. సంభాషణ సమయంలో అక్కడి విద్యార్థులకు వారి విద్య కోసం ఏటా ఎంత ఖర్చవుతుందని అధ్యక్షుడిని అడిగాను. “మేము తక్కువ ఆర్థిక స్తోమత ఉన్న విద్యార్థులను విశ్వవిద్యాలయంలో పని చేయడానికి, సంపాదించుకోవడానికి ప్రోత్సహిస్తాము.” అని అతను బదులిచ్చాడు. విద్యార్థి దశలో అలా డబ్బు సంపాదించుకున్న వారిలో తానూ ఒకడినని చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్నను మరెవరి వద్ద పునరావృతం కాకుండా జాగ్రత్త పడేలా ఆయన నన్ను సున్నితంగా హెచ్చరించారు.

1920లో నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రయత్నించాను. ఈ విషయమై వాషింగ్టన్ లోని ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ అధిపతిని కలుసుకున్నాను. సంభాషణ సమయంలో నేను అతనిని భారతదేశ ఆర్థిక పరిస్థితిని గురించి కొన్ని ప్రశ్నలు వేసాను. “భారతదేశ ఆర్టిక పరిస్థితి మెరుగుపడటానికి ఏమైనా సూచనలు ఉన్నాయా?” అని నేను అతనిని అడిగాను. అతను సాకులు చెప్పడం ప్రారంభించాడు. సుదూర భారతదేశంలోని పరిస్థితులను అంచనా వేయడం ఎంత కష్టమో నాకు చెప్పాడు. నేను అతనితో ఇలా అన్నాను, “నేను మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే మీరు బహుశా ఈ దేశంలో సమర్థవంతమైన ఆర్థికవేత్త అని ఇక్కడి ప్రజలు నాకు చెప్పారు. భారతదేశం వంటి పెద్ద దేశం ఆర్థిక స్థితి మీకు తెలియదని మీరు ఎలా వేడుకుంటున్నారు?” ఆ సమయంలో నా దగ్గర ఒక తెలివైన గైడ్ ఉన్నాడు. అతనిని ఒక పక్కకు తీసుకుపోయి ఇలా అన్నాడు: “ఈ వ్యక్తిని తన దేశానికి తిరిగి వెళ్లమని చెప్పండి. దాని రాజ్యాంగాన్ని జాతీయ ప్రభుత్వంగా మార్చడానికి ప్రయత్నించమని చెప్పండి. జాతీయ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా వద్దకు రమ్మని చెప్పండి. అప్పుడు నేను అతనికి సరైన సలహా ఇవ్వగలను.”

నేను అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్నప్పుడు ప్రపంచ వ్యవహారాలపై, ముఖ్యంగా పరిశ్రమలపై అప్పటి అమెరికా వాణిజ్య కార్యదర్శి శ్రీ హెర్బర్ట్ హూవర్‌తో (ఈయన ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కొలరాడో నదిపై నిర్మించిన బౌల్డర్ డ్యాం ఈయన పేరు మీదనే హూవర్ డ్యాంగా మారింది) చర్చించాలని అనుకున్నాను. ఆయనతో నా సంభాషణ ద్వారా ప్రయోజనం పొందాలని నేను అనుకున్నాను.

హెర్బర్ట్ హూవర్

మునుపటి అమెరికా సందర్శనలో నేను వాషింగ్టన్‌లో కొందరు స్నేహితులను ఏర్పరచుకున్నాను. అందులో ఇద్దరికి శ్రీ హూవర్‌తో పరిచయం ఉంది. వారి సహాయంతో హూవర్‌ను కలిసి అతనితో అభిప్రాయాలను పంచుకోవాలని కోరుకున్నాను. జాతీయాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై నేను శ్రీ హూవర్‌తో సుదీర్ఘ సంభాషణ చేశాను. ‘రీ కన్‌స్ట్రక్టింగ్ ఇండియా’ అనే పుస్తకాన్ని రాయాలని నేను ఆలోచిస్తున్నందున ఈ చర్చలు ఆ పుస్తక రచనకు ఉపయోగపడతాయని భావించాను. తర్వాత కాలంలో ఈ పుస్తకం లండన్‌లో ప్రచురణ అయ్యింది. అతను అమెరికలో పరిశ్రమల అభివృద్ధిపై చాలా ఆసక్తిని కనబరుస్తున్నాడని నేను తెలుసుకున్నాను. తమ దేశంలో పరిశ్రమలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో ఆయన నాకు వివరించారు. భారతదేశంలో ఏమి తప్పు జరుగుతున్నదని మీరు అనుకుంటున్నారు? భారతీయులు ఎందుకు వెనుకబడి ఉన్నారు? అని నేను అతనిని అడిగాను. “మీకు మీ జీవితంలో ఎటువంటి హడావిడి లేదు,” అని అతను బదులిచ్చాడు. అంటే, భారతీయులు నిదానంగా వెళతారని, ఉదాసీనంగా ఉంటారని, జీవితాన్ని తేలికగా వెళ్ళ దీసేవారని అర్థం.

ఆ తర్వాత నేను లండన్‌కు తిరిగి వచ్చి దాదాపు పది నెలలపాటు అక్కడే ఉండి ‘రీ కన్‌స్ట్రక్టింగ్ ఇండియా’ అనే పుస్తకాన్ని రాశాను. దీనిని 1920లో లండన్ లోని మెసర్స్ పి ఎస్ కింగ్ అండ్ సన్ లిమిటెడ్ వారు ప్రచురించారు. ఇండియా ఆఫీస్ లైబ్రరీ వారు నాకు కావాల్సిన సమాచారాన్ని అందజేయగలరు కాబట్టి లండన్ లోనే పుస్తక రచన పూర్తి చేయడం సౌకర్యంగా ఉండింది.

లండన్ లో ఎం వి రాసిన పుస్తకం

లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ లోని ఇండియా సెక్షన్‌లో భారతీయ సమస్యలపై చర్చ జరిగింది. అందులో పాల్గొనమని నన్ను కూడా ఆహ్వానించారు. భారత ఆంతరంగిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ ఎడ్విన్ ఎస్. మోంటాగు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఎడ్విన్ ఎస్. మోంటాగు, భారత ఆంతరంగిక కార్యదర్శి

నేను తదనంతరం శ్రీ మోంటాగుతో ముఖాముఖిలో సంభాషణలో పాల్గొన్నప్పుడు, భావనగర్‌కు చెందిన సర్ ప్రభాశంకర్ డి. పట్టాని ఖాళీ చేసిన భారత ఆంతరంగిక వ్యవహారాల కార్యదర్శి గారి అధ్యక్షతన పనిచేస్తున్న మండలిలో సభ్యత్వం స్వీకరించమని అతను నన్ను కోరినాడు. సర్ ప్రభాశంకర్ గారు కూడా ఆయన స్థానంలో నన్ను నియమించేందుకు ప్రయత్నించారు. నేను వేసుకున్న ప్రణాళికల ప్రకారం ఏదైనా ఉపయోగకరమైన పని చేయడానికి భారతీయుడికి అవకాశాలు చాలా పరిమితంగా ఉన్న కారణంగా ఆ సభ్యత్వం నాకు సరిపోదని భావించాను.

సర్ ప్రభాశంకర్ డి పట్టాని

‘రీ కన్‌స్ట్రక్టింగ్ ఇండియా’ పుస్తక ప్రచురణ అయిన అనంతరం లండన్ నుంచి నేను బొంబాయికి తిరిగి వచ్చాను.

(4) నా నాల్గవ విదేశీ ప్రయాణం 1926లో. భారత ప్రభుత్వం నన్ను బ్యాక్ బే పునరుద్దరణ విచారణ కమిటిలో ఇంజనీర్ సభ్యునిగా నియమించింది. ఈ కమిటీ ఏర్పాటుకు దారితీసిన కారణాలు, కమిటీ చేసిన పని గురించి ఒక అధ్యాయంలో ఇప్పటికే వివరించాను. లండన్‌లో కమిటీ పని ముగిసిన తర్వాత, నేను ఉక్కు తయారీ, కలప స్వేదనం సమస్యలను అధ్యయనం చేయడానికి యూరప్, అమెరికాలోని ప్రదేశాలకు ప్రయాణాలు చేపట్టాను. ఈ పని మైసూర్ ఐరన్ వర్క్స్ ప్రయోజనాల దృష్ట్యా చేపట్టాను. అప్పటికే నేను మైసూర్ ఐరన్ వర్క్స్ మేనేజ్మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాను. ఈ పర్యటనలో నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భద్రావతి (మైసూరు రాష్ట్రం) నుండి బొగ్గు ఇంధనంతో ఉత్పత్తి అయిన దుక్క ఇనుమును విక్రయించడానికి ప్రయత్నించాను. నేను ఇంతకు ముందు ఒకటి లేదా రెండు బహిరంగ సమావేశాలలో చెప్పినట్లుగా, అమెరికన్లు ఉత్పత్తి చేయగలిగిన ఖర్చు కంటే అమెరికాలో బొగ్గు దుక్క ఇనుమును మేము చౌకగా విక్రయించగలిగాము. నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, స్వీడన్‌లో బొగ్గు ఇంధనంతో నడుపుతున్న ఇనుము, ఉక్కు పరిశ్రమల వివరాలను సేకరించాను.

ఈ పర్యటనలో ఒక సంస్థకు చెందిన కన్సల్టింగ్ ఇంజనీర్లను గమనించాను. వారు బెర్లిన్, చుట్టుపక్కల సుమారు 80 కలప స్వేదనం ప్లాంట్ల సాంకేతిక అవసరాలను నెరవేరుస్తున్నారు.

(5) నేను ఐదవసారి భారతదేశం నుండి 1935లో ఆటోమొబైల్ పరిశ్రమ డిజైన్లు, పని వివరాలు అధ్యయనం చేయడానికి వెళ్ళాను. ఈ సంగతులు మునుపటి అధ్యాయంలో పేర్కొన్నాను. నేను యూరప్, అమెరికాలో దాదాపు ఆరు నెలల పాటు ప్రముఖ ఫ్యాక్టరీలలో ఆటోమొబైల్స్ తయారీని అధ్యయనం చేసాను.

యూరప్‌లో నా మొదటి సందర్శన కోవెంట్రీ, ఆక్స్‌ఫర్డ్, బర్మింగ్హామ్, డెర్బీ, ఇతర ప్రదేశాల్లో ఆటోమొబైల్ కర్మాగారాలలో జరిగింది.

బర్మింగ్హామ్‌లో నేను లార్డ్ ఆస్టిన్‌ని కలిశాను. ఆయన నా పట్ల చాలా దయతో వ్యవహరించారు. బొంబాయిలో పరిశ్రమ స్థాపన కోసం అంచనాలు సిద్ధం చేయించారు. చివరికి అతను భారతీయ పరిస్థితులకు అమెరికన్ మధ్య తరహా కారు సరైన రకం అని నాకు సలహా ఇచ్చాడు. మనకు చిన్న కారు కావాలంటే, తన సొంత (ఆస్టిన్) రకం, చాలా అనుకూలంగా ఉంటుందని అతను చెప్పాడు.

బ్రిటిష్ ప్రారిశ్రామికవేత్త లార్డ్ హెర్బర్ట్ ఆస్టిన్

నేను అధ్యయనానికి యూరప్ ఖండంలో ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు వెళ్ళాను. టురిన్ సమీపంలోని ఐక్స్-లెస్-బైన్స్ అనే వాటర్ స్టేషన్లో ఒక నెల ఉన్నాను.

టురిన్ లోని ‘ఫియట్’ కారు తయారవుతున్నఫ్యాక్టరీని కూడా నేను సందర్శించాను. ఫియట్ కార్ ఫ్యాక్టరీలో ఒక ప్రత్యేక రవాణా సౌలభ్యాన్ని గమనించాను. అది ఏమిటంటే.. ఫ్యాక్టరీ అనేక అంతస్తుల ఎత్తైన భవనంలో ఉంది. కారు తయారీ సామాగ్రిని గ్రౌండ్ ఫ్లోర్ నుండి పై అంతస్తులకు ట్రక్కుల ద్వారా పైకి లేపిన స్పైరల్ ట్రామ్‌వే పైకి తీసుకువెళ్లారు. కదులుతున్న ట్రామ్‌వే సామాగ్రి నింపిన ట్రక్కులను పై అంతస్తుల్లోకి చెరవేస్తాయి. కర్మాగారం కార్యకలాపాలు స్పైరల్ ట్రామ్‌వే కు రెండు వైపులా జరుగుతాయి.

ఆ తర్వాత నేను అమెరికాకు వెళ్లాను. న్యూయార్క్‌లో ఉన్నప్పుడు రష్యాలో ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో అమెరికా వచ్చిన ఒక రష్యన్ ఇంజనీర్‌ని కలిశాను. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తనతో పాటు 40 మంది రష్యన్ ఇంజనీర్లు ఉన్నారని, వారు కూడా అమెరికా తరహాలో రష్యాలో పూర్తి స్థాయి ఆటోమొబైల్‌ను తయారు చేయాలనే ఉద్దేశంతో సాంకేతిక, ఇతర సంబందిత సమాచారాన్ని సేకరించడానికి అక్కడ ఉన్నారని అతను నాకు చెప్పాడు.

నేను తరువాత శ్రీ చార్లెస్ ఇ సోరెన్సెన్ ను కలిశాను. ఆయన ఫోర్డ్ ఫ్యాక్టరీ మేనేజర్‌గా సుప్రసిద్దుడు. డెట్రాయిట్‌లో జనరల్ మోటార్స్ కార్పొరేషన్‌ను నియంత్రించే ఇద్దరు నిపుణులు.. శ్రీ డబ్ల్యూ ఎస్ నడ్సన్, శ్రీ కిట్టెరిడ్జ్ లను కూడా కలిశాను. నేను డెట్రాయిట్‌లో దాదాపు ఒక నెల గడిపాను. భారతదేశంలో మంచి ఆటోమొబైల్ ఫ్యాక్టరీని ఎలా ప్రారంభించవచ్చో పరిశోధించాను. అంచనాలు తయారు చేయించాను. వాటిని అమెరికాలోని అనేక ప్రదేశాలలో.. ఎక్కువగా డెట్రాయిట్, న్యూయార్క్ నగరాల్లోని ఆటోమొబైల్ సంస్థల అధిపతుల చేత తనిఖీ చేయించాను. నా ఈ ప్రయత్నమంతా భారతదేశంలో ఎలా నిరర్థకంగా ముగిసిందో నేను ఇంతకు ముందు ఒక అధ్యాయంలో ప్రస్తావించాను. చాలా కాలంగా దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమను ప్రారంభించేందుకు భారత ప్రభుత్వం అనుమతించ లేదు. భారత ప్రభుత్వం వారు 1934-35లో పరిశ్రమకు అనుకూలంగా ఉన్నారు. అంతే కాదు నా ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపనకు వారు అనుకూలంగా ఉన్న సమయంలో బొంబాయి వ్యాపారవేత్తల మధ్య ఐక్యత లేదా సహకారం లోపించింది.

ఫోర్డ్ కంపనీ జెనరల్ మేనేజర్ చార్లెస్ ఇ సోరెన్సేన్

నేను అమెరికా నుండి తెచ్చిన ప్రాజెక్ట్ నివేదికను భారతదేశంలో రెండుసార్లు ముద్రించారు. ఈ నివేదిక, నా వ్యక్తిగత విజ్ఞప్తుల ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బొంబాయి ప్రభుత్వం శ్రీ వాల్చంద్ హీరాచంద్, అతని సహచరులకు బొంబాయి ప్రావిన్స్‌లో ఆటోమొబైల్ ప్లాంట్‌ను స్థాపించడానికి తాత్కాలికంగా కొన్ని రాయితీలు ప్రకటించింది. పరిశ్రమ స్థాపనకు అవసరమయ్యే సాంకేతిక పరిశోధనలలో, బ్రిటిష్ లేదా అమెరికన్ ఆటోమొబైల్స్ తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకోవడంలో శ్రీ వాల్చంద్‌కు సహాయం చేయడానికి బొంబాయి ప్రభుత్వం అప్పటి పరిశ్రమల డైరెక్టర్ శ్రీ పి బి అద్వానీ ని ప్రత్యేక విధుల్లో నియమించారు. ఈ పెద్ద మనుషులిద్దరూ అమెరికా లోని డెట్రాయిట్‌కు వెళ్లారు. అమెరికాకు చెందిన మరియు శ్రీ హెన్రీ ఫోర్డ్‌తో, అతని జనరల్ మేనేజర్, శ్రీ సోరెన్సెన్ తోనూ వ్యక్తిగత పరిచయాలను ఏర్పరచుకున్నారు. వారు ఫోర్డ్ ప్లాంట్ ఇంజనీర్లతో కొన్ని వారాల పాటు గడిపారు.

ఫోర్డ్ మోటార్ కంపనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్

భారతదేశంలో ఒక ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక అంశాలపై అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనం తర్వాత, ఫోర్డ్ సంస్థ గతంలో ప్రతిపాదించిన పథకం సాంకేతికంగా, ఆర్థికంగా మంచిదని సంతృప్తి చెందిన తర్వాత శ్రీ వాల్చంద్ హీరాచంద్, శ్రీ అద్వానీ అంతకు ముందు తయారు చేసిన అసలు పథకం అమలు సాధ్యమేనని బొంబాయి ప్రభుత్వానికి, నాకు టెలిగ్రాం ద్వారా తెలియజేసారు. భారత సంస్థకు సాంకేతిక సహాయం అందించే విషయంలో అద్వానీ ఫోర్డ్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఒప్పించారు. తరువాత దశలో, శ్రీ హెన్రీ ఫోర్డ్‌కు, కెనడియన్ ఫోర్డ్ మోటార్ కంపెనీతో ఒప్పందం ఉందని, దీని ప్రకారం బ్రిటిష్ కామన్వెల్త్ దేశాలలో అమ్మకం, తయారీకి సంబంధించిన అన్ని హక్కులు కెనడియన్ ఫోర్డ్ మోటార్ కంపెనీకి దాఖలు పరచామని గుర్తు చేశారు. అద్వానీతో ఒప్పందం చట్ట పరంగా సమస్యలు సృష్టిస్తాయని సలహా ఇచ్చారు. చర్చల అనంతరం కెనడా ఫోర్డ్ మోటార్ కంపనీ తమకు పెట్టుబడిలో 51 శాతం యాజమాన్య వాటా, నియంత్రణలో హక్కు ఉంటే తప్ప ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఇది ఆమోదయోగ్యం కానందున శ్రీ అద్వానీ డెట్రాయిట్ లోనే ఉన్న క్రిస్లర్ కార్పొరేషన్‌ను సంప్రదించారు. ఆ సంస్థ కూడా బొంబాయిలో ఆటోమొబైల్ ప్లాంట్ స్థాపన అనేది ఒక ఆచరణాత్మక ప్రతిపాదన అని సాంకేతిక, ఆర్థిక కోణం నుండి సంతృప్తి చెందిన తర్వాత ప్రతిపాదిత భారతీయ కర్మాగారానికి సంబంధించిన సాంకేతిక సమాచారం, పరిజ్ఞానాన్ని అందించడానికి ఆ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదిరింది. శ్రీ వాల్చంద్ హీరాచంద్ కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించారు. ఈ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీని స్థాపించడం జరిగింది.

ప్రీమియర్ ఆటోమొబైల్ కంపెనీ వ్యవస్థాపకుడు వాల్ చంద్ హీరాచంద్

ఈ రకమైన మా ప్రయత్నాలన్నీ ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగినంత కాలం పరిశ్రమను స్థాపించడానికి అనుమతించలేదు. బొంబాయిలోని భారతీయ వ్యాపారవేత్తలు ప్రధానంగా ప్రభుత్వ సహకారం లేకపోవడంతో, విదేశీ సహాయంతోనో లేదా లేకుండానో పరిశ్రమను ఎలా ప్రారంభించ లేకపోయారు అనేది ఒక విషాద గాథ. ఈ సంగతులను గత అధ్యాయాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రస్తావించాను. పరిశ్రమల స్థాపన, విదేశీ వస్తువుల సరఫరాను ప్రభుత్వం ఏకపక్షంగా నియంత్రణ లేదా అధికారాన్ని అమలు చేస్తున్నంత కాలం మన భారతీయ పారిశ్రామికవేత్తలకు ఇలాంటి ప్రయోజనకరమైన పథకాలను ప్రారంభించడం చాలా కష్టం.

(6) నేను 1946 లో మరోసారి భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళి వచ్చాను. ఈసారి బొంబాయి అఖిల భారత తయారీదారుల సంస్థకు చెందిన తొమ్మిది మంది సభ్యుల ప్రతినిధి బృందానికి నాయకుడిగా వెళ్ళాను. మా ప్రతినిధి బృందం మొదటగా లండన్‌కు వెళ్లింది. మేము బ్రిస్టల్, డెర్బీలోని ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీలతో సహా గ్రేట్ బ్రిటన్ లోని అనేక టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, రసాయన పరిశ్రమలను సందర్శించాము. మేము సందర్శించిన అన్ని కర్మాగారాల్లోని ప్రముఖ వ్యక్తులు మాతో అత్యంత మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కొందరు అతిథి సత్కారాలు కూడా చేసేవారు. వారిలో చాలా మంది మాకు కావలసిన సమాచారాన్ని అందించారు.

ఇంగ్లాండ్ నుండి మేము అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్లాము. కెనడాలో కూడా మేము అనేక ముఖ్యమైన పరిశ్రమలను సందర్శించాము. నయాగరా జలపాతం వద్ద నిర్మించిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్, షికాగోలో అనేక పెద్ద ఇంజనీరింగ్ పరిశ్రమలను సందర్శించాము. మేము డెట్రాయిట్‌లో, విండ్సర్ లోని ఆటోమొబైల్ ఫ్యాక్టరీలను సందర్శించడానికి కొన్ని రోజులు గడిపాము. మేము న్యూయార్క్ సమీపంలోని విమానాల కర్మాగారాన్ని కూడా సందర్శించాము. నాకు వ్యక్తిగతంగా టి వి ఎ (టేనస్సీ వ్యాలీ అథారిటీ) ని సందర్శించాలన్న ఆసక్తి ఉండింది. నేను ఒక్కడినే విమానంలో న్యూయార్క్ నుండి స్వయంగా నాక్స విల్లే సందర్శించాను. విమానంలో తిరిగి వచ్చాను.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, కెనడా పర్యటనను పూర్తి చేసిన తర్వాత మాలో కొందరు ప్రత్యేక బృందాలుగా ఫ్రాన్స్, యూరప్ లోని ఇతర ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాంతాలను సందర్శించారు.

ప్రతినిధి బృందం చివరిసారిగా ఇంగ్లాండ్ నుండి బయలుదేరే ముందు మేము డిసెంబర్ 1946లో లండన్‌లో బ్రిటిష్ ట్రేడ్ ఫెయిర్ సందర్శించాము. మేము భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రతినిధి బృందంలోని సభ్యులందరూ 298 పేజీల నివేదికను ప్రచురించడంలో సహకరించారు. ఇందులో సభ్యుల తమ అనుభవాలను క్రోడీకరించారు. ఇందులో భారతీయ పరిశ్రమల వేగవంతమైన అభివృద్ధికి కొన్ని విలువైన, ఆచరణాత్మక సూచనలు ఉన్నాయి.

***

Exit mobile version