Site icon Sanchika

మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-17

[భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను అనువదించి అందిస్తున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]

అధ్యాయం 17 – దేశ భద్రతకు సవాళ్ళు

[dropcap]ఈ[/dropcap] దశ వరకు ఈ పుస్తకం నా వ్యక్తిగత పనికి సంబందించిన వివరాలు, నా అనుభవాలను చాలా వరకు సంక్షిప్తంగా వివరించింది.

నేను 66 సంవత్సరాల క్రితం బొంబాయిలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరడంతో నా సర్వీస్‌ను ఎలా ప్రారంభించానో ఇంతకు ముందు అధ్యాయాల్లో చెప్పాను. ఈ చాలా సుదీర్ఘ కాలంలో జాతీయ ప్రాముఖ్యత గల సమస్యలను అధ్యయనం చేయడానికి నాకు అనేక సందర్భాలు తరచుగా ఎదురౌతూ ఉండేవి. ప్రపంచంలోని మరింత ప్రగతిశీల దేశాలతో భారతదేశం ఆర్థిక స్థితిగతులను తులనాత్మకంగా అధ్యయనం చేయడం, స్థానిక, విదేశీ రాజనీతిజ్ఞులు, ఆలోచనాపరులు, రచయితలతో చర్చించడం జరిగింది.

నా ఈ సుదీర్ఘ సర్వీస్ అనుభవంలో నేను గ్రామీణ ప్రజల శ్రేయస్సుపై ఎక్కువ శ్రద్ధతో పని చేయడానికి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా బొంబాయి ప్రావిన్స్‌లో నీటిపారుదల శాఖలో కాలువలపై పని చేస్తున్నప్పుడు, మైసూర్ రాష్ట్రంలో పరిపాలనా సంబంధిత పనులు నిర్వహిస్తున్న కాలంలో ఈ అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. అలాగే, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు లేదా ప్రాంతాలను సందర్శించడానికి, వారి స్థానిక అవసరాలను అధ్యయనం చేయడానికి అనేక ఆహ్వానాలు అందినాయి. నీటిపారుదల, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, పబ్లిక్ లేదా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్థికం, జాతీయ లేదా ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర సమస్యల వంటి వివిధ విషయాలపై సలహాలు ఇవ్వడానికి నాకు ఆహ్వానాలు అందినాయి.

ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాలు, ప్రశ్నలు నా దృష్టిని ఎక్కువగా ఆకర్షించాయి. నేను విడిగా ప్రచురించిన రెండు పుస్తకాలలో (1. Reconstructing India 2. Planned Economy for India.) ఈ సంగతులు వివరంగా చర్చించాను.

 

భారతదేశం భవిష్యత్తుకు సంబంధించిన వివిధ ఆచరణాత్మక సమస్యలపై నాలో ఉన్న కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలను ఈ అధ్యాయంలో, తరువాతి రెండు అధ్యాయాలలో నమోదు చేయాలని నేను ఇప్పుడు భావిస్తున్నాను.

భారతదేశం ఇప్పుడు పరాధీన పరిస్థితి నుండి బయటపడి ఒక స్వతంత్ర, సర్వ సత్తాక గణతంత్ర దేశంగా అవతరించింది. భారతదేశం ప్రస్తుత స్వాతంత్ర్యం వేగవంతమైన అభివృద్ధికి, పురోగతికి కొత్త అవకాశాలు తెచ్చింది. వీటితో పాటు తాజా సవాళ్లను, అదనపు బాధ్యతలను కూడా దేశం ముందుకు తెచ్చింది. తగిన ముందు జాగ్రత్త చర్యల ద్వారా చాలా ప్రమాదాలను నివారించవచ్చు. సవాళ్లను ఎదుర్కోవచ్చు. బాధ్యతలను నెరవేర్చవచ్చు. అయితే ఇటీవలి కాలంలో తయారు చేసిన అణు, హైడ్రోజన్ బాంబులు వంటి వినాశకర ఆయుధాలు మొత్తం ప్రపంచానికి ముప్పుగా పరిణమించాయి. ప్రస్తుతం అంచనా వేయగలిగినంత వరకు వీటిని సమర్థవంతంగా నియంత్రించగలిగే వ్యవస్థ ఏదీ ప్రపంచంలో లేదు. కాబట్టి ఈ ముప్పు ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించడం కొనసాగుతున్నది.

వేగంగా పెరుగుతున్న జనాభా ముప్పు:

భారతదేశ జనాభా గౌరవప్రదమైన జీవితం గడపడం కోసం సంపద ఉత్పత్తిలో లేదా ఆదాయంలో మెరుగుదల లేకుండా వేగంగా పెరుగుతూనే ఉంది. ఇటీవల న్యూయార్క్ నుంచి అందిన సమాచారం ప్రకారం 1943లో ప్రపంచ జనాభా 2,316 మిలియన్లు అని అంచనా వేసారు. ఇది 1900 సంవత్సరంతో జనాభా అంచనాతో పోలిస్తే 700 మిలియన్ల పెరుగుదలను నమోదు చేసింది. చైనా, జపాన్ దేశాల మాదిరిగానే భారత్‌లోనూ జనన, మరణాల రేటు ఎక్కువగా ఉంది. అవిభక్త భారతదేశ జనాభా 1931లో 353 మిలియన్ల నుండి 1945 నాటికి 403 మిలియన్లకు పెరిగింది. దేశ విభజన తర్వాత, భారత దేశ జనాభా 337 మిలియన్లు. ఇటీవలి అంచనాల ప్రకారం దేశ జనాభా సుమారుగా సంవత్సరానికి 3.25 మిలియన్లు పెరుగుతున్నది.

వార్తా పత్రికలలో 1943లో కలకత్తా వీధుల్లో ఆకలి చావుల వార్తలు, చిత్రాలు భారతదేశ ప్రజలను చలింపజేశాయి.

1943లో బెంగాల్ లో సంభవించిన భయంకరమైన కరువు చిత్రం

దీనితో దేశంలో అందుబాటులో ఉన్న ఆహార నిల్వలను మించి జనాభా పెరిగిపోయిందని స్పష్టమైంది. ఈ పరిస్థితిని నివారించడానికి మూడు లేదా నాలుగు విరుగుడు చర్యలు ఉన్నాయి. వీటిని స్వీకరించడం వలన సంక్షోభ పరిస్థితులను, మానవ విపత్తులను నివారించవచ్చు. లేదా వాటిని రాబోయే 50 నుండి 75 సంవత్సరాల వరకు వాయిదా వేయవచ్చు. ఈ మానవ సంక్షోభాన్ని ఆహార పంటలను ఎక్కువగా పండించడం ద్వారా లేదా జనాభాను నియంత్రించడం కోసం నాగరిక దేశాలలో అనుసరించే కుటుంబ నియంత్రణ చర్యలను అనుసరించడం ద్వారా నివారించవచ్చు. లేకుంటే ఈ కరువు పరిస్థితుల నుంచి దేశం విముక్తి పొందజాలదు.

‘మరింత ఆహారాన్ని పండించండి’ ప్రచారం:

ప్రభుత్వం ఇప్పుడు ‘మరింత ఆహారాన్ని పండించండి’ అనే ప్రచారాన్ని కొనసాగిస్తోంది. దేశంలోనే తమకు వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఆహార పంటలను పండించాలని ప్రజలను కోరుతోంది.

ప్రభుత్వం గత ఐదేళ్లలో సంవత్సరానికి సగటున 2.9 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను కూడా దిగుమతి చేసుకున్నారు. 1948-49లో అతి ఎక్కువగా దిగుమతి చేసుకున్న పరిమాణం 4 మిలియన్ టన్నులు. ప్రభుత్వ తాజా నిర్ణయం దిగుమతులను క్రమంగా తగ్గించడం. 1952 నాటికి ఆహార ధాన్యాల దిగుమతిని పూర్తిగా నిలిపివేయడం ప్రభుత్వ లక్ష్యం. అసాధారణ పరిస్థితుల వల్ల తమ ప్రణాళికలు విఫలమైతే తప్ప, ఆ సమయానికి దేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేలా చర్యలు తీసుకున్నామని వారు బలంగా నమ్ముతున్నారు.

‘ఆహారాన్ని ఎక్కువగా పండించండి’ అన్న ప్రచారం ప్రభావశీలంగా ఉండాలంటే ప్రతి గ్రామంలోని గణాంకాలను సమగ్రంగా నిర్వహించడం ద్వారా అమలులోకి తీసుకురాగలుగుతాము. అందుకు అనుసరించాల్సిన పద్ధతులు ఇవి:

(అ) సాగులోఉన్న ఆహార పంటల విస్తీర్ణం (ఎకరాలు);

(ఆ) మునుపటి పంట కాలంలో ఉత్పత్తులు, పరిమాణాలు, విలువల అంచనాలు;

(ఇ) ప్రతి ప్రాంతంలో నిల్వ ఆహార ధాన్యాల నిర్వహణ అంచనాలు.

ఈ గణాంకాలను సేకరించి, నమోదు చేసిన రికార్డులను సరిగ్గా నిర్వహించినట్లయితే, గ్రామ జనాభా క్రమంగా గణాంకాలపై దృష్టి పెట్టి ఆలోచించడం నేర్పుకుంటుంది. ప్రయోజనపూర్వక జీవితాన్ని గడపడానికి దోహదం చేస్తుంది.

భారతదేశం అనిశ్చిత వర్షపాతం నెలకొని ఉన్న దేశం. కనుక దాదాపు ప్రతి సంవత్సరం ఏదో ఒక మూలలో లేదా ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు లేదా కరువు పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

కొన్ని సంవత్సరాలలో, 1943లో బెంగాల్‌లో ఏర్పడినట్లుగా, ఆయా ప్రాంతాలలో కరువు ప్రభావిత ప్రాంతం విస్తృతంగా ఉండవచ్చు. ఇది తీవ్రమైన విపత్తుకు కారణం కావచ్చు. ఇప్పటికే నిర్మించిన నీటిపారుదల జలాశయాలలో నీటిని నిల్వ చేయాలి. వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా మరిన్ని జలాశయాలను నిర్మించాలి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. ఆచరించదగిన మరొక చర్య ఏమిటంటే.. మునుపటి అధ్యాయంలో పేర్కొన్న గ్రామీణ పారిశ్రామికీకరణ పథకం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినట్లయితే, తమ ప్రాంతంలోనే ఎక్కువ ఆహారాన్ని పండించడానికి గ్రామ కమిటీలే బాధ్యత వహిస్తాయి.

లేదా పారిశ్రామిక, ఇతర ఉత్పత్తులను పంచడం కోసం ప్రణాళికలు రూపొందించాలి. దాని వలన స్థానిక జనాభా తమ ప్రాంతంలో లేదా దేశం వెలుపల నుండి అవసరమైన అదనపు ఆహారాన్ని కొనుగోలు చేయడానికి తగినంత ఆదాయం సంపాదించవచ్చు.

రెండు సంవత్సరాల ఆహార సరఫరా – గ్రామీణ పారిశ్రామికీకరణ పథకంలో కూడా ప్రతి గ్రామ సమూహ ప్రాంతంలో రెండు సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాలను నిల్వ చేసే బాధ్యతను అభివృద్ధి కమిటీలకు అప్పగించాలని ప్రతిపాదించారు. ప్రతి కుటుంబం రెండు సంవత్సరాలకు సరిపడే ఆహార ధాన్యాలను నిల్వ చేయాలని ఈ పథకం ఉద్దేశం కాదు. కానీ ఆ ప్రాంతంలో నిర్వహించే మొత్తం ఆహార ధాన్యాల నిల్వ దాని మొత్తం జనాభాకు రెండేళ్ల అవసరాలకు సరిపడేంతగా ఉండాలి. యాభై అరవై సంవత్సరాల క్రితం, ఈ దేశంలోని గ్రామాలలో సంపన్న భూస్వాములు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ కరువుల సమయంలో, సాధ్యమైన చోట, వారి మధ్యలో నివసిస్తున్న మరింత నిరుపేద జనాభాకు ఆహారం అందించే బాధ్యతను సాధారణంగా స్వీకరించేవారు.

జనాభాను నియంత్రించడం – జనాభా ప్రమాదకరమైన వేగంతో పెరుగుతోంది. దానిని నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకోకపోతే దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు సంక్షోభానికి లేదా ఆకలి చావులకు గురి అయ్యే సందర్భాలు చాలా తరచుగా ఏర్పడతాయి. చాలా మంది పిల్లలను కలిగి ఉండటం వల్ల ఆరోగ్యకరమైన కుటుంబాలను సాకే, స్థిరమైన, సౌకర్యవంతమైన గృహ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని ప్రజలు కోల్పోతారని అనుభవం నిరూపిస్తున్నది.

నాగరికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో వ్యక్తులు పెద్ద కుటుంబాలను తప్పించుకుంటే ఉన్నత జీవన ప్రమాణాలతో మరింత సౌకర్యవంతంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించగలరు. ముందుచూపుతో, సరి అయిన ప్రణాళికతో తమ జీవితాలను క్రమబద్ధీకరించుకునే దేశాలలో కుటుంబ నియంత్రణ (జనాభా నియంత్రణ) ఆలోచన వ్యాప్తి వ్యక్తిగతంగా దంపతులు వారి కుటుంబాల పరిమాణాన్ని నియంత్రించుకోవడానికి, పేదరికం ఉంచి, బాధల నుంచి దూరం కావడానికి వీలు కల్పించింది.

ప్లాన్డ్ పేరెంట్ హుడ్ అసోసియేషన్ – గత కొంతకాలంగా ఇటువంటి ఒక తల్లిదండ్రుల సంఘం అమెరికాలో ఉనికిలో ఉంది. దీనిని ‘ప్లాన్డ్ పేరెంట్ హుడ్ అసోసియేషన్’ అని పిలుస్తారు. జననాలను నియంత్రించడం ద్వారా జనాభా పెరగుదలను పరిమితం చేయడానికి ఈ సంఘం ప్రచారాన్ని కొనసాగిస్తున్నది.

మన దేశంలో కూడా ఇటీవలి సంవత్సరాలలో సంస్కారవంతులైన భారతీయ స్త్రీలు అధ్యక్షత వహించిన పెద్ద మహిళా సదస్సులు జరిగాయి. వారు కూడా దేశంలో జననాల నియంత్రణ అవసరాన్నినొక్కి చెపుతూ కుంటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ పద్ధతులను అవలంబించకపోతే కరువు సంవత్సరాలలో తీవ్ర ఆహార కొరత ఏర్పడి దేశ జనాభాలో, ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉన్న పేద జన సమూహాలను సంక్షోభాలకు గురిచేయవచ్చు. అమెరికాలో పని చేస్తున్న ప్లాన్డ్ పేరెంట్ హుడ్ అసోసియేషన్ వారు అనుసరిస్తున్న సూత్రాలు, పద్ధతులను వ్యాప్తి చేయడానికి ప్రభుత్వం చాలా చేయగలదు. జననాల నియంత్రణ అంశాన్ని పర్యవేక్షించడానికి, కుటుంబ నియంత్రణ పద్ధతులను, సమస్యలను ప్రజలకు బోధించడానికి, విస్తృతమైన ప్రచారం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ దవాఖానాలను తెరవాలి.

సమర్థవంతమైన దేశ రక్షణ వ్యవస్థ:

దేశ రక్షణ కోసం తగినంతగా సిద్ధం కాకపోతే ఇతర దేశాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది. విదేశీ దాడుల నుండి దేశాన్ని రక్షించడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉండే రక్షణ వ్యవస్థ అవసరం. రక్షణ వ్యవస్థ మూడు ప్రధాన అంగాలు.. సైన్యం, నౌకా దళం, వాయు దళం అనేక అంశాలలో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. వాటికి అవసరమైన ఆధునిక ఆయుధాలను అందించాలి. సమర్థవంతమైన రక్షణ కోసం బలగాలకు సరైన అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం కోసం దేశంలోనే పుష్కలమైన ఏర్పాట్లు చేయాలి. దీనికి శిక్షణ పొందిన సైన్యాధికారులు, నిపుణులు, తగినంత ఆయుధ సంపత్తి సమకూర్చడం అవసరం. నేడు యంత్రాలు, ఆయుధ సంపత్తి దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ ధైర్యంగా ముందుండాలి. తన స్వేచ్ఛను, సార్వభౌమత్వాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించే దేశాలతో పోరాడటానికి సంసిద్ధంగా ఉందని చూపించాలి. భారతదేశ ప్రజలు తమలో తాము అహింసావాదులు కావచ్చు. కానీ దురాక్రమణకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించడానికి వారు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. అనేక ప్రపంచ దేశాల ఆయుధ శక్తి యెదుట మనం రక్షణ రహితంగా ఉండటం అంటే వాస్తవంగా దురాక్రమణకు ఆహ్వానం పలికినట్టే.

సైనిక సిబ్బందికి శిక్షణ – రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి జపాన్ అనుసరించిన విధానం సైనిక సిబ్బందికి అత్యున్నత శిక్షణను ఇవ్వడం. అత్యున్నత స్థాయి సైనిక శిక్షణ దేశ రక్షణకు అత్యవసరం. అప్పుడే దేశం తనను తాను రక్షించుకోవడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటుంది. ప్రతి గ్రామ సమూహం దాని జనాభాలో కొద్ది శాతం (రెండు నుండి ఐదు శాతం వరకు) యుద్ధ సమయంలో పోరాడటానికి శిక్షణ పొంది ఉండాలి. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఈ శిక్షణ పొందిన సమూహాలు ఏదైనా యుద్ధ రంగాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

ఈ యాంత్రిక యుగంలో సైన్యానికి బలం దాని అధికారుల బుద్ది, తెలివితేటల్లో ఉంది. మరింత మంది ఉన్నత విద్యావంతులైన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అధికారులను నియమించాలి. యోగ్యత, సామర్థ్యం కోసం నిర్దేశించిన పరీక్షలకు లోబడి, భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి, అన్ని వర్గాల యువకులకు త్రివిధ పోరాట దళాల్లో దేనిలోనైనా ప్రవేశానికి సమాన అవకాశం కల్పించాలి.

సైన్యం, నౌకా, వైమానిక దళాల్లో నియమితులైన అధికారులకు శిక్షణ ఇవ్వడానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కళాశాలలు దేశంలోని అన్ని ప్రాంతాలలో నెలకొల్పాలి. ఈ అంశాలపై ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న సమాచారం సరిపోదు. విశ్వవిద్యాలయం స్థాయి పాఠ్యాంశాల్లో సైనిక శాస్త్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

ఆయుధాలు, ఆయుధ యంత్రాల తయారీ – సైన్యాధికారులకు పోరాట శిక్షణ తదుపరి ఆయుధాల ఉత్పత్తి, ఆయుధ తయారీ యంత్రాలు ప్రాధాన్యతాంశాలుగా ఉంటాయి. ఇందుకు అవసరమైన పరిశ్రమలు, పరిశోధనలు స్థిరంగా నిర్వహించకపోతే ఈ పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి సైన్యానికి అందించడం కష్టం.

సైనిక శక్తి సాధించడానికి అతి ముఖ్యమైన వస్తు వనరులు ఏమిటంటే.. వ్యవస్థీకృత, అభివృద్ధి చెందిన ఆయుధ పరిశ్రమ, అందుబాటులో ఉన్న ముడి పదార్థాలపై సరైన అవగాహన కలిగి ఉండడం. సరికొత్త మోడల్ యుద్ధనౌకలు, యు-బోట్లు, ట్రక్కులు, విమానాలు, ఇతర ఆయుధాల తయారీ అనేవి రక్షణ సన్నాహాలకు సంబంధించిన అతి ముఖ్యమైన పని. ఇది ఆధునిక సైన్యానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ఈ దేశంలో రక్షణ సంబంధిత పరిస్థితులు, సమస్యలు, రక్షణ యంత్రాలపై ప్రత్యేక అధ్యయనం, అన్ని రకాల ఆయుధ తయారీ పరిశ్రమలు, సైనిక వనరులను అభివృద్ధి చేయడానికి స్వతంత్ర చర్యలు అవసరం.

రక్షణ ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం ఆసక్తి గల ప్రజలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నడి చాలా తక్కువ. భవిష్యత్తులో వీటి పరిధి, శక్తి గురించి ప్రజలకు అందుతుందని ఆశిద్దాము. తద్వారా వారు సముచితమైన ఆసక్తిని కనబరచడానికి, అత్యవసర పరిస్థితుల్లో పోరాట శక్తులకు సహకరించడానికి సిద్ధంగా ఉండడానికి అవకాశం ఉన్నదని భావించవచ్చు. రక్షణ కోసం సిద్ధం కావడం చాలా గొప్ప బాధ్యత. ఇది దేశానికి జీవన్మరణ సమస్య అయినందున, దేశభక్తి, అత్యున్నత సమగ్రత, ఆచరణాత్మక శక్తి ఉన్న సిబ్బంది మాత్రమే ఇటువంటి వ్యవహారాలకు అధిపతులుగా ఉండాలని ఆశిస్తున్నాము.

అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలలో చాలా ముఖ్యమైన వాటిని ప్రజలకు అవగాహన కలిగించడం కోసం వాషింగ్టన్‌లో చాలా కాలం పాటు ప్రదర్శించారు. 1946 చివరి రోజుల్లో వాషింగ్టన్‌లో ఏర్పాటు అయిన ఈ ప్రదర్శనలో అమెరికా ఆయుధ సంపత్తిని నేను చూశాను. అంతేకాకుండా, సైన్యం, నౌకాదళం, వైమానిక దళంకు సంబందించిన సాధారణ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచారు. సైనిక రహస్యాలుగా పరిగణించిన సమాచారాన్ని మాత్రమే దాచిపెట్టారు.

అణు, హైడ్రోజన్ బాంబులు:

అమెరికా, సోవియట్ రష్యాలో అభివృద్ధి చేసిన అణు బాంబు ప్రపంచ ప్రజల భద్రతకు మరొక తీవ్రమైన ముప్పుగా పరిగణించాలి. నాగరిక ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా ఈ విషయంపై రహస్యంగా పరిశీలన జరుగుతున్నది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లోని హిరోషిమా, నాగసాకి నాగరాలపై అణు బాంబు ప్రయోగం వలన ఉత్పన్నమైన ప్రభావాలను బట్టి చూస్తే ఈ ఆయుధం మానవాళికి ఎటువంటి మేలు చేయదని స్పష్టం అయ్యింది.

అమెరికా అణు బాంబు దాడిలో ద్వంసం అయిన హీరోషిమా నగరం
అమెరికా అణు బాంబు దాడిలో ద్వంసం అయిన నాగసాకి నగరం

అమెరికా, సోవియట్ రష్యా రెండూ ఈ ఆయుధాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడానికి అంగీకరించే వరకు అణు బాంబు భవిష్యత్తు గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. రెండు దేశాలు అంగీకరిస్తే చిన్న దేశాలు వారి ఆదర్శాన్ని అనుసరిస్తాయి. అవి అటువంటి అవగాహనకు రాకపోతే, అణు ఆయుధం భవిష్యత్‌లో మానవ నాగరికతకు, మానవ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది.

అమెరికా అణు బాంబు
హైడ్రోజన్ బాంబు

గత ఏడాదిలోనో లేదా రెండు సంవత్సరాల క్రితమో మరింత వినాశక శక్తి కలిగిన, మరింత వేగంగా ప్రభావం చూపే ఆయుధం – హైడ్రోజన్ బాంబును కనిపెట్టారని ప్రపంచానికి తెలిసింది.

కొత్త ఆర్థిక సిద్ధాంతాలు సృష్టించిన సమస్యలు:

సోషలిజం – సమాజంలోని కొన్నిసంపన్న వర్గాలకు, శ్రామిక వర్గానికి మధ్య ఉన్న భిన్నాభిప్రాయలు ఆందోళనకు మరొక మూలంగా పరిణమించాయి. ఇది కొత్త వర్గ ఆధారిత సిద్ధాంతం వ్యాప్తి కారణంగా పెరిగింది.

కొందరికి విలాసాలు, చాలా మందికి బతకడానికి కనీస అవసరాలకు కూడా అందని ఆదాయ వ్యత్యాసాలు ఉండే సమాజాన్ని తుడిచిపెట్టేయాలని ఈ ఆర్థిక వ్యవస్థ కోరుతున్నది.

ఆస్తిని కలిగి ఉన్న కొంతమంది సంపన్నులపై వీరి నుండి అందే వేతనాలపై ఆధారపడే కార్మికులకు తీవ్రమైన అసంతృప్తి వ్యాపించింది.

ప్రస్తుతం ఉత్పత్తి సాధనాలు ఆస్తులను కలిగి ఉన్న వర్గాల ఆధీనంలో ఉన్నాయి. కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతుందని, సంపదను ఉత్పత్తి చేస్తున్న వారి శ్రమకు తగిన పూర్తి ప్రతిఫలాన్ని పొందడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఆస్తి కలిగి ఉన్న సంపన్న వర్గాలు కార్మికులకు ఉపాధి కల్పించగలరు. ఒక సంస్థ ద్వారా పొందే లాభాల్లో అత్యధిక భాగం వారు స్వంతం చేసుకుంటున్నారు. తద్వారా యజమానులు, కార్మికుల మధ్య తీవ్ర అసమానతల సృష్టికి, జీవన ప్రమాణాల్లో తేడాలకు కారణం అవుతున్నది. పరిశ్రమలోని అనేక శాఖలలో పోటీకి బదులుగా పెట్టుబడిదారీ వర్గాల ద్వారా పెద్ద కంపనీల యాజమాన్యాల ఆధ్వర్యంలో పరిశ్రమల నిర్వహణ, వారి గుత్తాధిపత్యం పెరిగిపోయిందని కూడా ప్రబలమైన ఫిర్యాదులు ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు.

వేతనాల ద్వారా సంపాదించే ఆదాయం తప్ప అన్ని రకాల వ్యక్తిగత ఆస్తులను తొలగించాలని; ఆస్తి, భూమి వారసత్వం వంటి అన్ని రకాల ఆర్థిక వనరుల నుండి వచ్చే ఆదాయం; వడ్డీ, లాభాలను తొలగించాలని సోషలిజం ప్రతిపాదిస్తుంది.

భూమి, ఉత్పత్తి సాధనాలు, వాటి యాజమాన్యం సమాజ పరం చేయాలని, సంపద పంపిణీ విధానాలు సమాజమే పరస్పర సహకార పద్దతిలో నడపాలని సోషలిజం ప్రతిపాదిస్తుంది.

నా దృష్టికి వచ్చిన మరొక ప్రకటన: ‘సోషలిజంలో సొంత లాభానికి ఒక పరిమితి ఉంటుంది. అదేమంటే, వినియోగ వస్తువుల పరిమిత పరిమాణం, లేదా తనకోసం తాను పని చేసే వ్యక్తి కొనుగోలుదారుగా ఎంత పెట్టుబడిని వెచ్చించవచ్చుననే పరిమాణం బట్టి ఈ పరిమితి ఉంటుంది.’

సోషలిజం వివిధ రకాలుగా, వివిధ రూపాల్లో ఉంది. ఏదో ఒక రకమైన సోషలిస్ట్ అభిప్రాయాలను కలిగి ఉన్న వ్యక్తులు ప్రస్తుత సమయంలో ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పరిశ్రమలు, వ్యాపారం లేదా పరిపాలనపై నియంత్రణ కలిగి ఉన్నారు.

కమ్యూనిజం – కొందరికి విలాసవంతమైన జీవితం, చాలా మందికి పేదరికం సమాజంలో ఉన్న ఒక వాస్తవికత. ఇది సమాజంలో ‘ఉన్న వారికి’, ‘లేని వారికి’ మధ్య వర్గ భావనను సృష్టిస్తున్నది. సోషలిజం కమ్యూనిజం తాలూకు వివిధ రూపాలలో వ్యక్తం అవుతుంది.

సమాజంలో పెట్టుబడిదారి లేదా ఆస్తి కలిగిన వర్గాలు పరిమితంగా ఉంటారు. అసంఖ్యాకంగా ఉన్న శ్రామికవర్గం వారి యజమానులను ధిక్కరించడం, సమ్మె అస్త్రాన్ని ప్రయోగించి వారి నుండి రాయితీలను పొందడం నేర్చుకున్నారు.

ప్రతి ప్రజాస్వామ్యంలో వయోజన ఓటు హక్కు ఉన్నందున, అమెరికా వంటి దేశాల్లో కూడా ప్రభుత్వాలు శ్రామికవర్గం వారి ఓట్లను పొందడానికి వారికి రాయితీలు కల్పించే ధోరణిని ప్రదర్శిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తున్నది.

పెట్టుబడిదారీ విధానం నుండి కమ్యూనిజంలోకి పరివర్తన చెందడానికి నాలుగు దశలు ఉన్నాయని.. అవి పెట్టుబడిదారీ విధానం, శ్రామికవర్గ నియంతృత్వం, సోషలిజం, కమ్యూనిజం అని పేర్కొన్నారు.

సోవియట్ రష్యాలో ప్రజాస్వామ్య సోషలిస్టులు అతివాద సోషలిస్టు సిద్ధాంతాలను చాలా కాలంగా అనుసరిస్తున్నారు. మాస్కో అంతర్జాతీయ కమ్యూనిస్టు కేంద్రంగా మారింది. రష్యా తన కొత్త కమ్యూనిజంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వ్యక్తులకు, సంఘాలకు స్ఫూర్తినిస్తున్నట్టు కనిపిస్తున్నది.

1936 నాటి సోవియట్ రాజ్యాంగం ఉత్పత్తి సాధనాల మీద సామూహిక యాజమాన్యాన్ని ప్రతిపాదించింది.

సోవియట్ రష్యా ఆదర్శంగా తీసుకున్న ఆర్థిక ప్రజాస్వామ్యంలో ఉత్పాదకత ఉజ్జాయింపు కొలతకు అనుగుణంగా అనులోమ నిష్పత్తిలో వ్యక్తిగత చొరవకు ప్రతిఫలమివ్వడమనే విధానం కొనసాగుతున్నదని పేర్కొంటున్నారు. కానీ ఈ విధానం సోవియట్ ప్రజలను సంతృప్తి పరచిందా లేదా తెలుసుకోవడానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

సోషలిజం, కమ్యూనిజం గురించి పైన పేర్కొన్న వివరణలు అందుబాటులో ఉన్న అత్యంత విశ్వసనీయ వనరుల నుండి సేకరించాను. ఈ రెండు సిద్ధాంతాలు చాలా కాలంగా ప్రపంచంలో ఎక్కడైనా స్థిరమైన పద్దతిలో ఆచరణలో ఉన్నట్టు సమాచారం లేదు. రష్యాలో ఆచరణలో ఉన్నదే కమ్యూనిజంగా గుర్తింపు పొందింది.

సోవియట్ విధానాలకు యూరప్, అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఈ పరస్పర విరుద్ధమైన ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలు లేదా తాత్వికతలు ప్రపంచాన్ని ఇప్పుడు రెండు శిబిరాలుగా విడదీసింది.

కొందరు వ్యక్తులు కమ్యూనిజాన్ని ఒక విముక్తి సిద్ధాంతంగా భావిస్తారు; మరి కొందరేమో ప్రపంచానికి ఒక ముప్పుగా భావిస్తారు.

చాలామంది ఆధునిక జీవితంలోని తప్పులను సరిదిద్దుకోలేకపోతున్నారు. ప్రజల జీవన పోరాటమే కమ్యూనిజం ఎదుగుదలకు దారితీస్తున్నది.

ఈ అధ్యాయంలో చెప్పిన దానిని బట్టి భారతదేశ ప్రజలు మాత్రమే కాదు మొత్తం మానవ జాతి గడచిన 50 సంవత్సరాలు కొత్త ప్రమాదాలు, భయాందోళనల బాటన నడిచిందని తెలుస్తుంది. దానికి వారు సిద్ధపడలేదు. విజ్ఞాన శాస్త్రంలో వేగవంతమైన పురోగతి, మారుతున్న ప్రపంచ ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలతో తలెత్తిన ఇబ్బందులకు శాశ్వతమైన పరిష్కారాలను ప్రస్తుత సమయంలో ఊహించలేము.

ఇప్పుడు మన ముందున్న ఏకైక ఆచరణాత్మక చర్య.. పరిశోధనలను నిరంతరాయంగా కొనసాగించడం, ప్రపంచ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉండడం. రెండు రకాల నిపుణుల కమిటీలు.. ఒకటి శాస్త్రీయ అంశాలపై, మరొకటి ఆర్థిక, ఇతర ధోరణులపై నిరంతర పరిశోధనను కొనసాగించడానికి నిర్వహించవలసి ఉంటుంది. పైన పేర్కొన్న సమస్యలను అధిగమించడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, దేశ రక్షణ కోసం అవి ఎంత మేరకు పనికి వస్తాయో అంతా వరకే కావచ్చు.. ఈ నిపుణుల కమిటీలు నిరంతరాయంగా పని చేస్తూ ఉండాలి.

***

Exit mobile version