అధ్యాయం 3 – బొంబాయి ప్రభుత్వంలో నేను నిర్వహించిన పనులు:
ఏడెన్ మంచి నీటి, మురుగు నీటి వ్యవస్థ:
1906 సంవత్సరంలో ఏడెన్ పోర్ట్ వద్ద ఉన్న సైనిక స్థావరానికి మంచి నీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయడానికి ఒక ఇంజనీర్ సేవల అవసరం ఏర్పడింది. ఏడెన్ అప్పుడు రక్షణ సంబందిత వ్యవహారాలలో నేరుగా భారత ప్రభుత్వ మిలిటరీ శాఖ వారి అధీనంలో ఉండేది. పౌర పరిపాలనా వ్యవహారాలు బొంబాయి ప్రభుత్వ పరిధిలో ఉండేవి. అప్పటి బొంబాయి ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల కార్యదర్శి లార్డ్ మోర్లీ పురమాయింపులతో, బారత ప్రభుత్వం ఏడెన్ శానిటరీ ఇంజనీరింగ్ సంబందిత సమస్యలు పరిష్కరించడానికి ఒక సీనియర్ ఇంజనీరింగ్ అధికారిని నియమించమని బొంబాయి ప్రభుత్వాన్ని కోరింది. భారత ప్రభుత్వం కోరిన సేవలు అందించమని, ఏడెన్ శానిటరీ ఇంజనీరింగ్ విషయంలో సలహా ఇవ్వడానికి, ఒక నివేదిక తయారు చేయడానికి తక్షణమే ఆ స్థలానికి వెళ్ళమని బొంబాయి ప్రభుత్వం నాకు ఆదేశాలు జారీ చేసింది. ఏడెన్‌లో నాకు అప్పజెప్పిన పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- ఏడెన్ మురుగు నీటి పారుదలకు సంబంధించి ఏడెన్ సైనిక స్థావరం ఎగ్జిక్యూటివ్ కమిటీకి సలహా ఇవ్వాలి. (ఏడెన్ రాజకీయ ప్రతినిధి పురమాయింపుతో ఏడెన్ మంచి నీటి సరఫరా అంశం తరువాత జోడించారు)
- ఏడెన్ మిలిటరీ కంటోన్మెంట్ తరపున కమిటీలో ఒక సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించి ఏడెన్‌లో రోడ్ల వర్గీకరణ, నిధుల పంపిణీ, వాటి నిర్వహణ ఖర్చులు తదితర సంబందిత అంశాలపై బొంబాయి ప్రభుత్వానికి నివేదించాలి.
కొన్ని ప్రాథమిక సర్వేలు, అధ్యయనాల అనంతరం నేను రెండు సంక్షిప్త నివేదికలు సమర్పించాను. ఒకటి మంచి నీటి సరఫరా కోసం. మరొకటి ఏడెన్ పోర్ట్ మురుగునీరు పారుదల కోసం. ప్రభుత్వం ముందుగా మురుగు నీటి పారుదల పనులు చేపట్టారు. ఆగష్టు 1906లో సమర్పించిన ఏడెన్ మురుగు నీటి పారుదల పనులపై సమర్పించిన నివేదికలో నేను ఈ విధంగా సూచించాను.
“సగటు మరణాల రేటు అనుబంధం II ఇప్పటికే సూచించినట్లుగా, తవాహిలో జనాభాలో ప్రతీ వెయ్యి మందికి 22, అడెన్ పట్టణంలో 48, షేక్ ఒత్మాన్ (భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్రపు చీలిక) లో 122; మూడు స్టేషన్ల సగటు 58 గా నమోదు అయ్యింది. ఇటీవలి సంవత్సరాలలో ఏడెన్ పోర్ట్‌కు దూరంగా ఉన్న ప్రాంతాలలో విస్తరించిన ప్లేగు వ్యాధి కారణంగా ఏర్పడిన అవాంతరాలు, కరువుల వలన పేద ప్రజలు పెద్ద సంఖ్యలో సైనిక స్థావరం పరిసరాలలోకి రావడంతో మరణాల రేటు, నమోదు చేయబడిన గణాంకాలు సాధారణ జనాభా శాతంగా చూపిస్తూ తప్పుదారి పట్టిస్తున్నాయని గుర్తించారు. ఇటువంటి అసాధారణ పరిస్థితుల దృష్టి కోణం నుంచి చూసినప్పుడు ఈ మరణాల రేటుతో నివారణ చర్యలు చేపట్టడం చాలా ఎక్కువ అని పేర్కొనవచ్చు. పోలిక కొరకు పరిశీలించినప్పుడు.. గత 20 ఏళ్లలో ఇంగ్లండ్, వేల్స్‌లో నమోదు అయిన మరణాల రేటు ప్రతీ వెయ్యి మందికి దాదాపు 18. ఇటీవలి సంవత్సరాలలో బొంబాయి ప్రెసిడెన్సీలో మరణాల రేటు సుమారుగా ప్రతి వెయ్యి మందికి 40 ఉంది. భారతదేశం అంతటా మరణాల రేటు 30 నుండి 35 ఉంది.”
దీనికి సంబంధించి నేను చేసిన ప్రతిపాదనల గురించి కొంత అవగాహన కలగడానికి ఏడెన్ మురుగు నీటి పారుదల నివేదికలో క్రింది పేరాల నుండి పొందవచ్చు:
“మూడు జిల్లాల మురుగునీటి పారుదల సమస్యలను శాశ్వతంగా తొలగించడానికి మురుగునీటి పైపుల వ్యవస్థ ద్వారా మాత్రమే సంతృప్తికరమైన పరిష్కారాన్ని సాధించగలం.”
“ప్రాజెక్టు మొత్తం వ్యయం 4 లక్షల పౌండ్లకు మించదు. వడ్డీతో సహా రుణ చెల్లింపులకు, ఇతర పనికి సంబందించిన ఖర్చులకు వార్షిక ఛార్జీ దాదాపు రూ. 30,000. షేక్ ఒత్మాన్ ద్వారా మురుగునీటిని వాలు ప్రవాహం ద్వారా సముద్రంలోకి తీసుకు వెళ్లవచ్చు. ఖర్చుతో కూడుకున్న పనులేవీ అవసరం లేదు కాబట్టి ఏడెన్ జనాభాపై పడే తలసరి భారం తులనాత్మకంగా చాలా మితంగా ఉంటుంది.”
ఏడెన్ నీటి సరఫరా సమస్యకు సంబంధించిన పరిస్థితులను నేను ఒక నివేదికలో ఈ క్రింది విధంగా వివరించాను:
“నీటి సరఫరా అవసరాలకు మొత్తంగా వర్షపాతంపై ఆచరణాత్మకంగా ఆధారపడటం సాధ్యం కాదు. మిలటరీ, ఇతర వాణిజ్య సమూహాలు వినిగించే నీటిలో ఎక్కువ భాగం స్వేద జలం ఉంటుంది. ఘనీభవించిన స్వేద జలం తయారీలో అనేక సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. ఈ సరఫరా ఎక్కువ తక్కువగా ఉప్పు నీటి ద్వారా భర్తీ చేయబడుతుంది. ప్రధాన భూభాగం నుండి ఆక్విడెక్ట్ ద్వారా ఏడెన్‌కు తీసుకువస్తారు. ఈ బాధ్యత అంతా కూడా సైన్యానిదే. అదే విధంగా ప్రైవేట్ డీలర్ల ద్వారా భూభాగం మీదకు చొచ్చుకు వచ్చిన సముద్రపు చీలిక భాగం అవతల నుండి బండ్ల ద్వారా తీసుకువచ్చిన ఘనీభవించిన స్వేద జలంపై ఆధారపడేది.”
“వంద గ్యాలన్ల ఘనీభవించిన స్వేద జలాన్ని 3 రూపాయలకు విక్రయించేవారు. మరికొందరు తెలివైన నీటి వ్యాపారులు 1 రూపాయి నుండి రూపాయి ఎనిమిది అణాల చొప్పున అమ్మేవారు. భారత ద్వీపకల్పంలోని సైన్యం సహా ప్రజలు ఏటా నీటి వినియోగంపై సుమారుగా రూ. 7 లక్షలు ఖర్చు పెడతారని అంచనా వేసినారు.”
“స్వచ్ఛమైన మంచి నీటి సరఫరా ఒక తప్పనిసరి అవసరం. కానీ ఈ సరఫరాకు నీటి తావు ప్రధాన భూభాగంలో, బహుశా మన అధీనంలో లేని పరాయి భూభాగంలో వెతకాల్సిన పరిస్థితి. ఈ విషయంలో నేను ప్రత్యేకమైన పరిశోధనలు ఏమీ చేయలేదు. అయితే సాధారణ అనుభవ జ్ఞానం ఆధారంగా చెప్పాలంటే, మంచి నీటి సరఫరా వ్యవస్థను సంతృప్తికరంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రాథమిక అంచనా వ్యయం గణనీయంగా ఉంటుందని అనిపించింది.”
“ఏడెన్‌లో మంచి నీటికి ఉన్నమంచి డిమాండ్, దాని కోసం ప్రజలు అధిక ధరలు చెల్లించలిగే స్తోమత కలిగి ఉన్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఒక సహేతుకమైన నీటి సరఫరా పథకం సాధ్యమైతే అయితే అది కచ్చితంగా ప్రభుత్వానికి లాభదాయకంగా ఉండబోతుంది.”
“ఏడెన్‌కు 60 మైళ్ళ దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో వర్షపాతం బాగానే ఉంటుంది. కొండల వాలు మీదుగా వర్షపు నీరు పరుగెత్తి ఒక కాలువ లాగా మారి కొంత దూరం ప్రవహిస్తుంది. అయితే ఇది బాగా ప్రవహించే నదుల వలె సముద్రంలో కలువకుండానే లాహెజ్ దగ్గరలో నది గర్భంలోనే ఇసుకలో ఇనికిపోతుంది. ఈ పరిస్థితిలో ఒక ప్రతిపాదన ఏమిటంటే.. నదీ గర్భంలో నీటిని పెర్కోలేషన్ ద్వారా సేకరించి సుమారు 18 మైళ్ళ పొడవున పైపుల ద్వారా ఏడెన్‌కు ఎత్తిపోయడం. ఈ పథకాన్ని అమలు చేసి ఉంటే చాలా సంతృప్తికరంగా ఉండేది. అయితే ఏడెన్ అధికార వర్గాలు మాత్రం ఈ పథకాన్ని ఆర్థికంగా పరిమిత వ్యయంతో నిర్మించాలని కోరుకున్నారు. వారికి పైపుల ద్వారా నీటి సరఫరాపై అనుమానాలు ఉండేవి. లాహెజ్‌లో లేదా సమీపంలో నివసించే తెగల ఆరాచక వ్యవహారాల వలన పైపుల ద్వారా సరఫరాకు ఆటంకాలు కల్పించే ప్రమాదం కూడా ఉందని వారు భావించారు.”
ఇదివరకే చెప్పినట్లుగా, నేను మురుగు నీటి పారుదల, మంచి నీటి సరఫరా కోసం రెండు వేర్వేరు నివేదికలను సమర్పించాను. ఏడెన్ రాజకీయ ప్రతినిధి మేజర్ జనరల్ ఇ.డి. బ్రాత్ సిఫార్సు చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దానిలో ఈ రెండూ కూడా చాలా అవసరం అంటూ ఈ విధంగా పేర్కొన్నారు:
“మురుగునీటి పారుదల సమస్యపై సలహా ఇవ్వడానికి నియమించబడిన శ్రీ విశ్వేశ్వరాయ ఒక విలువైన నివేదికను రూపొందించారు. దానిని ఆయన లేఖ నెం. 452 ద్వారా జనవరి 20, 1907 న ప్రభుత్వానికి పంపారు. మెరుగైన మురుగునీటి పారుదల వ్యవస్థ అవసరం ఉన్నప్పటికీ, పైపుల ద్వారా మంచినీటి సరఫరా కూడా తక్షణం అవసరం.”
బొంబాయి ప్రభుత్వం 30 జూన్ 1909వ తేదీన చేసిన మరో తీర్మానంలో మంచి నీటి సరఫరా పథకం కోసం వివరణాత్మక ప్రణాళికలు, వ్యయ అంచనాలను రూపొందించాలని, లాహెజ్‌లో బావి నిర్మాణం, అవసరమైన భూమిని సేకరించడం, భవిష్యత్తు రక్షణకు సంబంధించి లాహెజ్ సుల్తాన్‌తో చర్చలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు తర్వాత నాకు చేరినాయి.
నేను ఏడెన్‌ను సందర్శించిన సమయంలో నిర్దిష్ట వివాదాస్పద అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీలో నన్ను కూడా సభ్యునిగా పని చేయమని అడిగారు. భారత ప్రభుత్వం, బొంబాయి ప్రభుత్వం మధ్య ఏడెన్ రోడ్లపై చేసే ఖర్చుకు సంబంధించిన అంశాలపై ఏర్పడిన భిన్నాభిప్రాయాలను పరిష్కరించడం ఈ కమిటీ బాధ్యత.
కొల్హాపూర్ నగరానికి మంచి నీటి సరఫరా:
నీటిని సరఫరా చేసే జలాశయం యొక్క మట్టి కట్ట రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సలహా ఇవ్వడానికి నేను కొల్హాపూర్ వెళ్ళాను. కొల్హాపూర్ సంస్థాన రాజకీయ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ డబ్ల్యూ. బి. ఫెర్రిస్ బొంబాయి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
అందులో “నీటి సరఫరా చేస్తున్న జలాశయం మట్టి కట్ట ప్రమాదభరితంగా లీక్ అవుతోంది. మట్టి కట్ట మొత్తం వాలులో పెద్ద ఎత్తున మట్టి జారిపోయింది. లోపభూయిష్ట నిర్మాణం కారణంగా మట్టి కట్టకు తీవ్రమైన నష్టం వాటిల్లనున్నదని, డ్యాం సుస్థిరతకు ప్రమాదం వాటిల్లనున్నదని స్పష్టంగా హెచ్చరిస్తున్నది.” అతను తన లేఖలో ఇంకా ఈ విధంగా రాసినారు. “ప్రస్తుతం కొల్హాపూర్ నగరానికి నీటి సరఫరా పూర్తిగా నష్టపోకుండా ఉండేందుకు ఏమి చేయాలనే విషయంలో హిస్ హైనెస్ మహారాజా వారికి ఉత్తమ పరిష్కార మార్గం తెలిసి ఉండటం చాలా ముఖ్యమైనది. మాకు చాలా మంది కౌన్సెలర్లు ఉన్నారు, కానీ సలహా ఇవ్వడానికి వారిలో ఈ విషయంపై సరి అయిన అవగాహన లేదు. అందువల్ల అనుభవజ్ఞుడైన యూరోపియన్ ఇంజనీర్ సేవలను అందించేందుకు ప్రభుత్వం ఉత్సుకత చూపిస్తుందని మహారాజా వారు చాలా ఆత్రుతగా ఉన్నారు. సమగ్ర పరిశీలన, అధ్యయనం అనంతరం అతనికి ఏమి అవసరమో మరియు ఎలా చేయాలో ఇంజనీర్ చెబుతాడు.”
కొల్హాపూర్ సంస్థాన రాజకీయ ప్రతినిధి లేఖ అందుకున్నతర్వాత బొంబాయి ప్రభుత్వం నన్ను కొల్హాపూర్ సంస్థానానికి పంపించారు. అక్కడి స్థానిక ఇంజనీర్లు కూడా విశ్వసనీయంగా నాకు సహకరించారు. మట్టి కట్టను పునరుద్దరించడానికి నేను చేసిన సూచనల ప్రకారం మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేసినారు. తరువాత మూడు సందర్శనలలో మట్టి కట్టను పూర్తిగా పునరుద్ధరించినారని నేను సంతృప్తి చెందాను. మట్టి కట్ట భద్రత మెరుగుపడింది.
దీని తరువాత, లెఫ్టినెంట్ కల్నల్ డబ్ల్యూ.బి. ఫెర్రిస్ ఒక లేఖ కాపీని నాకు పంపారు. ఈ లేఖలో కొల్హాపూర్ సంస్థాన దివాన్ తమ సంస్థాన దర్బారు తరపున శ్రీ విశ్వేశ్వరాయ సేవలను తమకు అందించినందుకు బొంబాయి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయమని కోరినాడు.
“సకాలంలో అతను అందించిన సూచనలు, సలహాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. శ్రీ విశ్వేశ్వరాయ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన పనులు క్షుణ్ణంగా జరిగినందుకు మేము సంతోషిస్తున్నాము. గత నెలలో అసాధారణంగా కురిసిన భారీ వర్షాలకు తట్టుకుని మట్టి కట్ట నిలబడింది. జలాశయం ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా నీటితో నిండిపోయిందని, డ్యామ్ సురక్షితంగా ఉందని దయచేసి బొంబాయి ప్రభుత్వానికి తెలియజేయండి.” అని ఆ లేఖలో దీవాన్ పేర్కొన్నాడు. దర్బార్ లేఖను బొంబాయి ప్రభుత్వానికి పంపుతూ కల్నల్ ఫెర్రిస్ “కొల్హాపూర్ దర్బార్ వ్యక్తం చేసిన కృతజ్ఞతలు ప్రభుత్వానికి శానిటరీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శ్రీ విశ్వేశ్వరాయ గారికి తెలియజేయండి.” అని ఒక అభ్యర్థన చేసాడు.
బొంబాయి ప్రభుత్వంలో నేను నిర్వహించిన ఇతర పనులు:
15 మే 1907 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్ E-1325 ప్రకారం, బొంబాయి ప్రెసిడెన్సీలో ఉన్న మూడు డివిజన్ లకు సుమారు ఆరు నెలల పాటు సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా నన్ను నియమించారు. అంతకు ముందు వీటి బాధ్యతలు నిర్వహిస్తుండిన దక్షిణ డివిజన్, ప్రాజెక్ట్స్ డివిజన్ ఇన్ఛార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ హెచ్ ఎఫ్ బీలే సెలవుపై వెళ్లడంతో నాకు ఆ బాధ్యతలను అప్పజెప్పినారు. ప్రభుత్వానికి శానిటరీ ఇంజనీర్ కార్యాలయం శాశ్వత బాధ్యతతో పాటు పర్యవేక్షణ, నియంత్రణ కోసం ఈ రెండు బాధ్యతలు తాత్కాలికంగా నాకు బదిలీ చేసినారు. దక్షిణ డివిజన్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో రక్షణ పనుల కోసం జరుగుతున్న గోదావరి మూల, కుకరి సర్వేలను, అలాగే ఇతర రక్షణ పనులకు సంబంధించిన సర్వేలు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది.
బెల్గాంలో ఉన్నప్పుడు నేను రహదారి నిర్వహణ నియమాలు జారీ చేసే అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. రోడ్ల బాధ్యతలు నిర్వహిస్తున్న చాలా మంది కింది స్థాయి అధికారులను బెల్గాంలోని ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించాను. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కూలంకషంగా చర్చించి, సవరించిన రహదారి నిర్వహణ నియమాలను సిద్ధం చేశాను. వీటిని తదనంతరం బొంబాయి ప్రభుత్వం ముద్రించి, సింధ్ మినహా ప్రెసిడెన్సీలోని మూడు శాశ్వత ప్రజా పనుల విభాగాలకు పంపిణీ చేసింది.
ఈ సమయంలోనే నేను దక్షిణ డివిజన్లోని ధార్వార్, బీజాపూర్ అనే రెండు పట్టణాల కోసం నీటి సరఫరా పథకాల ప్రాథమిక నివేదికలను సిద్ధం చేశాను. ఈ నివేదికల్లో నేను నిర్దేశించిన పద్ధతుల్లో సంబంధిత జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వివరంగా అంచనాలు తయారు చేసి పనులను తరువాత చేపట్టినారు.
బొంబాయి గవర్నర్ లార్డ్ సిడెన్హామ్ 1908 అక్టోబరులో బీజాపూర్‌ని సందర్శించినప్పుడు మునిసిపల్, జిల్లా బోర్డు సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ఆ పట్టణానికి నీటి సరఫరా గురించి ఈ విధంగా ప్రస్తావించారు.
“బీజాపూర్ భవిష్యత్తు ఈ కష్టతరమైన సమస్య పరిష్కారంపై ఆధారపడి ఉంటుందని నేను పూర్తిగా గుర్తించాను. ఇంజనీర్ శ్రీ విశ్వేశ్వరాయ అద్భుతంగా తయారు చేసిన ప్రతిపాదనల అమలు కోసం అవసరమైన మొత్తం నాలుగు లక్షల రూపాయలను సమకూర్చడం ఇప్పుడు ప్రభుత్వ పరిశీలనలో ఉంది.”
అనంతరం నీటి సరఫరా పథకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నీటి సరఫరా ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మున్సిపాలిటీ వారు నా సేవలను ప్రశంసాపూర్వకంగా గుర్తించినట్టు ప్రభుత్వం నాకు తెలియజేసింది.
ప్రభుత్వానికి శానిటరీ ఇంజనీర్‌గా ఉన్న నేను బొంబాయి ప్రెసిడెన్సీ శానిటరీ బోర్డు సభ్యుడిగా, కార్యదర్శిగా కూడా ఉన్నాను. ఈ విషయమై నేను ప్రెసిడెన్సీలో వివిధ పట్టణాల నీటి సరఫరాకు సంబంధించిన వాస్తవాలను, గణాంకాలను సేకరించి పట్టికల రూపంలో ముద్రించి బోర్డు సభ్యుల ఉపయోగార్థం జారీ చేసాను.
సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా నా సర్వీసు ముగింపు దశకు చేరుకునే సమయానికి బొంబాయి నగరంలోని వివిధ ప్రాంతాలలో అనారోగ్య పరిస్థితులపై దర్యాప్తు చేసి నివారణకు సూచనలు సమర్పించడానికి నన్ను ఒక కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆ కమిటీకి అధ్యక్షుడుగా బొంబాయి ప్రభుత్వ సర్జన్ జనరల్ వ్యవహరించారు. ఆ రోజుల్లో ప్రఖ్యాత బొంబాయి ప్రజా నాయకుడు, దేశభక్తుడు సర్ ఫిరోజ్ షా మెహతా కూడా ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.
ఫిబ్రవరి 1905 నుండి బొంబాయి ప్రభుత్వం నన్ను బొంబాయిలోని సచివాలయంలో ప్రత్యేక విధుల్లో నియమించింది. అక్కడ బొంబాయి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల వ్యవహారాలు చూడడం నా విధుల్లో ముఖ్యమైనది. దీనికి సంబంధించి మే 1905లో ప్రభుత్వ ఉత్తర్వు ఇలా పేర్కొంది.
“ప్రభుత్వానికి శానిటరీ ఇంజనీర్‌గా తన విధులకు అదనంగా, శ్రీ ఎం విశ్వేశ్వరాయ సచివాలయంలో ప్రజా పనుల శాఖలో సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారాలు చూడటానికి ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తారు.”
అక్కడ ఉన్నప్పుడు అనేక సాంకేతిక మరియు పరిపాలనపరమైన వివాదాస్పద సమస్యలను పరిష్కరించేందుకు నన్ను వివిధ కమిటీలలో పనిచేయమని కూడా అడిగారు. పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టర్, కాలేజీ ప్రిన్సిపాల్, నేను సభ్యులుగా ఒక కమిటీని నియమించారు. పూనా ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న అకడమిక్ వ్యవహారాలను సమీక్షించి కళాశాల మరియు ఇంజనీరింగ్ విద్యా భోదనా ప్రణాళికలను ఆధునీకరించడం కమిటీ ముందున్న లక్ష్యం. అప్పటి వరకు ఆ సంస్థ పేరు ‘కాలేజ్ ఆఫ్ సైన్స్’. మా కమిటీ దానిని ‘కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్’గా మార్చింది. పాఠ్యాంశాల్లో తగిన మార్పులను సూచించింది. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించి అమలు చేసింది.
మునిసిపాలిటీల కోసం నేను చేస్తున్న కృషిని ప్రభుత్వం ఉదారంగా అభినందిస్తుందని చూపించడానికి, బొంబాయి గవర్నర్ లార్డ్ సిడెన్హామ్ జనవరి 28, 1908న అహ్మదాబాద్ మునిసిపాలిటీలో చర్చకు సమాధానంగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన మాటలను ఉటంకిస్తాను:
“మునిసిపాలిటీలు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు పొందడాన్నితమ హక్కుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే కొత్త ప్రణాళికలు సాధ్యమైనంత ఉత్తమమైనవని, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణకు స్వయంగా ఆర్థిక వనరులు సమకూర్చవలసిన అవసరాన్ని మునిసిపాలిటీలు నిర్ధారించుకోవడం చాలా అవసరమని నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ విషయాల్లో మీరు అత్యంత ప్రతిభావంతుడు, అనుభవజ్ఞుడైన ఇంజనీర్ శ్రీ విశ్వేశ్వరాయ అభిప్రాయాలను, సలహాలను పొందాలని నేను సూచిస్తున్నాను. ఆయన మీకు సంతృప్తిని కలిగించే రీతిలో ప్రశంసనీయమైన సలహాలు ఇవ్వగలరు.” (టైమ్స్ ఆఫ్ ఇండియా, 30 జనవరి, 1908)
సెప్టెంబర్ 1904లో నేను బొంబాయి విశ్వ విద్యాలయం ఫెల్లోగా నామినేట్ అయ్యాను. ఫెల్లోగా నా ఎంపికను తెలియజేస్తూ బొంబాయి గవర్నర్ గారి ప్రైవేట్ సెక్రటరీ “హిస్ ఎక్సలెన్సి గవర్నర్ గారు విశ్వ విద్యాలయం నియమ నిబంధనలను రూపొందించే ముఖ్యమైన పనికి మీరు తగినంత సమయాన్ని కేటాయించగలుగుతారని ఆశిస్తున్నారు. త్వరలోనే నియామకం కానున్నసెనేట్ ఉనికిలోకి వచ్చిన వెంటనే ఇవి వారి ముందు ఆమోదానికి తయారుగా ఉంటాయి” అని పేర్కొన్నారు.
***