మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-7

0
2

అధ్యాయం 7 – దీవాన్‌గా పదవీ స్వీకార సమయంలో మైసూర్‌లో నెలకొని ఉన్న పరిస్థితులు:

50 ఏండ్ల బ్రిటిష్ పాలన:

[dropcap]మై[/dropcap]సూర్ రాష్ట్రం 1831 – 1881 మధ్య 50 సంవత్సరాలు బ్రిటిష్ వారి ప్రత్యక్ష పరిపాలనలో ఉంది. వంశపారంపర్య రాచరిక పరిపాలన ప్రస్తుత రాజ కుటుంబానికి 25 మార్చి 1881న బ్రిటిష్ ప్రభుత్వం బదలాయించింది. అప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో రహదారులు, దాదాపు 50 మైళ్ల రైల్వే మార్గాలు నిర్మించింది. విద్యా సంస్థలు సహా ఆధునిక పరిపాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇతర అంశాలలో కూడా రాష్ట్రాన్ని బ్రిటిష్ పద్ధతిలో శాంతి భద్రతల నియంత్రణ కిందకు తీసుకువచ్చినట్లు చెప్పవచ్చు.

1876-78లో మైసూర్‌లో తీవ్రమైన కరువు ఏర్పడింది. ఇది రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ప్రకృతి నిర్మిత, మానవ నిర్మిత వనరులకు అపార నష్టం కలుగజేసింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా, భౌతికంగా దెబ్బతీసింది. మైసూర్ రాష్ట్రంలో రాచరిక పాలన ప్రారంభం అయిన తర్వాత మొదటి దీవాన్‌గా పని చేసిన శ్రీ సి రంగాచార్లు గారి మాటల్లో చెప్పాలంటే.. “కరువు రాష్ట్రంపై 160 లక్షల రూపాయల అదనపు భారాన్ని మోపింది. ప్రభుత్వానికి రూ. 80 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది.”

దీనికి అదనంగా 10 లక్షల జనాభాను మైసూర్ ప్రావిన్స్ కోల్పోయింది. రాబోయే కొన్నిసంవత్సరాల వరకు రాష్ట్ర వనరులను నిర్వీర్యం చేసింది. ఈ మహా కరువు మిగిల్చిన వినాశకరమైన ప్రభావాల కారణంగా, 1881లో పరిపాలనా బదిలీ సమయానికి బ్రిటీష్ పాలకులు రాష్ట్రంలో తీసుకువచ్చిన అభివృద్ది ప్రయోజనాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు అందని పరిస్థితి ఏర్పడింది.

భారతీయ దీవాన్‌ల కింద 30 ఏండ్లు సాగిన పరిపాలన:

1881 నుండి పదవీ బాధ్యతలు నిర్వహించిన భారతీయ దివాన్లు, మహారాజులు, మహారాణుల పాలన కింద క్షీణించని సామర్థ్యంతో విధులను కొనసాగించారు. అదే సమయంలో ప్రగతిశీల దృక్పథంతో రాష్ట్రంలోని కొన్ని విభాగాల్లో వారు మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టి వాటి పనితీరును మెరుగుపరచినారు.

దీవాన్ శ్రీ సి వి రంగాచార్లు (1881 – 1883)

భారతీయ పాలకుల పరిపాలనలో చెప్పుకోదగ్గ కొన్ని ఫలితాలు.. 1881లో దీవాన్ సి.రంగాచార్లు గారి పదవీ కాలంలో మైసూర్ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధ్య సభను ఏర్పాటు చేయడం, శివసముద్రం జలపాతం వద్ద కావేరి జల విద్యుత్ పథకం, మరికనవే జలాశయం నిర్మాణం చేయడం, సర్ కె శేషాద్రి అయ్యర్ దివాన్ గా ఉన్న సమయంలో కావేరి, కబిని, హేమావతి లోయల్లో నది పొడవునా కొన్ని ప్రాంతాలకు నీటిపారుదల కాలువల పొడిగింపు వంటివి పేర్కొనవచ్చు.

దీవాన్ శ్రీ కె శేషాద్రి అయ్యర్ (1883 – 1900)

బెంగళూరు, మైసూర్ నగరాల్లో పౌర సదుపాయాలు మెరుగు పడినాయి. నగరాల పరిధిని విస్తరించినారు. రూ. 25 లక్షలు పెట్టుబడి మూలధనంతో 1881లో 50 మైళ్ల పొడవున్న రైల్వే మార్గాలు, 1910-11 నాటికి రూ. 250 లక్షల ఖర్చుతో 411 మైళ్లకు చేరుకున్నది. ఈ 30 సంవత్సరాలలో రాష్ట్రంలో రహదారుల పొడవు కూడా రెట్టింపు అయ్యింది. 1907లో శ్రీ వి పి మాధవరావు గారు దీవాన్‌గా ఉన్నప్పుడు మైసూర్ రాష్ట్రంలో శాసన మండలిని ఏర్పాటు చేసినారు.

దీవాన్ శ్రీ వి పి మాధవరావు (1906 -1909)

మైసూర్ ప్రతినిధుల సభలో చేసిన నా మొదటి ప్రసంగంలో నేను ప్రస్తావించిన ఆనాటి కాలానికి సంబంధించిన కొన్నివాస్తవ గణాంకాలు నాకు పూర్వం పని చేసిన దీవాన్‌ల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తాయి. 1871లో 50,55,402 గా ఉన్న రాష్ట్ర జనాభా, 1876-78 లో సంభవించిన కరువు కారణంగా 1881 లో 4,86,188కి పడిపోయింది. 1911 నాటికి మళ్లీ 58,06,193 కి పెరిగింది. ఇది 1871లో ఉన్న జనాభా కంటే 15 శాతం ఎక్కువ. కరువు సమయంలో రాష్ట్రాన్ని విడిచిపెట్టిన కొంతమంది ప్రజలు పరిస్థితులు మెరుగుపడిన తర్వాత స్వరాష్ట్రానికి తిరిగి రావడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. 1881లో 13 శాతంగా లెక్కించిన పట్టణ జనాభా, 1911లో 11 శాతానికి పడిపోయింది. బహుశా పట్టణాలలో ప్రజలకు తగినంతగా ఉపాధి అవకాశాలు అభివృద్ధి కాకపోవడం కారణం కావచ్చు.

దీవాన్ శ్రీ టి ఆనందరావు (1909 – 1912)

వ్యవసాయంపై ఆధారపడిన జనాభా 1881లో 33 లక్షలు ఉంటే 1911 నాటికి 42 లక్షలకు పెరిగింది. వ్యవసాయానికి సంబంధించి కాఫీ తోటలను మినహాయించి సాగులో ఉన్న భూమి 1881-82లో 42,13,505 ఎకరాలు ఉంటే అది 1911-12 నాటికి 74,38,463 ఎకరాలకు పెరిగింది. అంటే 79 శాతం సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. పరిపాలన బదలాయింపు తర్వాత వ్యవసాయం వృద్ధి విస్తృతంగా ఉంది కానీ తీవ్రంగా లేదు.

రాష్ట్రం మొత్తం ఆదాయం గత శతాబ్దం ప్రారంభం నాటికి రూ. 50 లక్షలు ఉంటే అది 1880-81 లో రూ. 101 లక్షలు, 1910-11 లో రూ. 247 లక్షలకు పెరిగింది. ఇందులో బంగారు గనుల నుండి వచ్చిన ‘అదృష్ట ఆదాయం’ కూడా కలిసి ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు కూడా రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. అనగా 1880-81 లో రూ.101 లక్షలు ఉంటే అది 1910-11 లో రూ. 223 లక్షలకు పెరిగింది.

అన్ని వనరుల నుండి విద్యా రంగంపై ఖర్చు అందరు ఆశించినట్టుగా పెరిగింది. 1880-81లో రూ. 3,91,028 ల నుండి 1910-11లో రూ.18,79,135 లకు పెరిగింది. ఒక వ్యక్తి మీద పెట్టె సగటు ఖర్చు రూ. 0-1-6 నుండి రూ. 0-5-4 లకు పెరిగింది. రాష్ట్రంలో పాఠశాలకు వెళ్లే జనాభా 1880-81లో 53,782 ఉంటే అది 1910-11 లో 1,38,153 కు పెరిగింది. అంటే దాదాపు 2.6 రెట్లు పెరిగింది.

కోలార్ బంగారు గనులతో సహా చిన్నాపెద్ద పరిశ్రమలు కొన్ని, షిమోగాలో మాంగనీస్ గనులు, పత్తి మిల్లులు కొన్ని రాష్ట్రంలో ఉనికిలోకి వచ్చాయి. కానీ వీటిలో చాలా వరకు స్థానిక సంస్థలతో, ప్రజలతో సంబంధం లేనివి. వాటి ద్వారా ప్రజల పురోగతికి, రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం పెరగడానికి గాని లేదా సహకార రంగం అభివృద్దికి గాని దోహదపడినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

దీవాన్‌గా నాకు అప్పగించిన మైసూర్ రాష్ట్రం:

శ్రీ టి ఆనంద రావు, C.I.E. దీవాన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 1912లో, హిస్ హైనెస్ మహారాజు గారు దీవాన్ పదవిని చేపట్టమని నన్ను కోరినారు. పరిశ్రమలు, విద్య, ఇతర రంగాలలో అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో నేను అందించగల సేవలకు అవకాశాలను పొందాలని నేను ఆత్రుతగా ఉన్నప్పటికీ, అటువంటి ఉన్నత పదవిని చేపట్టాలని నేను కోరుకోలేదు. మైసూర్ చీఫ్ ఇంజనీర్ పదవిని స్వీకరించడానికి ముందు నేను రాష్ట్రంలో సాంకేతిక విద్య, పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి అవకాశాలను కోరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూడా, దీవాన్ పదవిని స్వీకరించమని కోరినప్పుడు, నన్ను అభివృద్ధి శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కౌన్సిల్‌లో సభ్యునిగా నియమిస్తే సరిపోతుందని, తద్వారా రాష్ట్రంలో విద్య సంస్థలను, పరిశ్రమలను ప్రోత్సహించడానికి, ఇతర ప్రయోజనకరమైన కార్యకలాపాలు నివహించడానికి అవకాశాలు కల్పించాలని మాత్రమే H E H మహారాజు గారికి సూచించాను.

మైసూర్ మహారాజు శ్రీ కృష్ణరాజ వడియార్-IV (1894 – 1940)

అయితే హిస్ హైనెస్ మహారాజా వారు మాత్రం నేను దీవాన్ పదవిని అంగీకరించాలని పట్టుబట్టారు. చివరికి ఆ పదవి ద్వారా నేను ఆశించిన సేవా కార్యక్రమాలను నిర్వహించే విషయంలో రాజా వారిచ్చిన హామీ మేరకు దీవాన్ పదవి స్వీకరించడానికి నా అంగీకారం తెలియజేశాను. నేను మైసూర్ దీవాన్‌గా పదవిని స్వీకరించిన తర్వాత మైసూర్ ఇంజనీర్స్ అసోసియేషన్ వారు 1912, నవంబర్ 30న ఒక అభినందన సభ ఏర్పాటు చేసినారు. శ్రీ వి పి మాధవరావు గారు సభకు అధ్యక్షత వహించినారు. సభలో వక్తలు నాకు సమర్పించిన అభినందనలకు ప్రతిస్పందనగా నేను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను ఇక్కడ ఉటంకించదలుచుకున్నాను. ఇవి నా భావాలకు నిజమైన వ్యక్తీకరణ అని భావిస్తున్నాను.

“మీ ప్రసంగాలలో, నేను ఇంకా ఉన్నతమైన పదవులు, గౌరవాలను, పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేసినట్టు నేను గమనించాను. నేను కోరుకున్నదంతా పని చేయడానికి అవకాశాలు మాత్రమేనని, నా వ్యక్తిగత అభివృద్ధి గురించిన ఆలోచనలు ఇటీవలి సంవత్సరాలలో నా ఆలోచనలను ఏ మాత్రం ప్రభావితం చేయలేదని నేను చెప్పకపోతే అది నా వినయానికి, వినమ్రతకు ప్రతిబింబంగా పరిగణించలేమని నేను భావిస్తున్నాను. H E H మహారాజు గారు ఇప్పుడు దయతో నాకు అప్పగించిన ముఖ్యమైన విధులతో, నేను ఎప్పటి నుండో ఆశిస్తున్నట్టు, పని చేయడానికి నాకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని భావిస్తున్నాను.”

గతంలో మైసూర్ దీవాన్ పదవి ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులను మాత్రమే వరించేది. ఇంజినీరింగ్ సర్వీస్‌లో ఉన్న నా నియామకం పట్ల అధికార వర్గాలలో కొంత ఆశ్చర్యాన్ని కలిగించిందని నేను గమనించాను. అయితే అది మైసూర్‌లో సాధారణ ప్రజలలో మాత్రం ఏ ఉత్సుకతను కలిగించలేదు. ప్రజల నుండి ఎటువంటి వ్యాఖ్యానాలు వెలువడలేదు.

నేను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు రాష్ట్రంలో పూడ్చుకోవలసిన గొప్ప లోపాలు, ప్రజల తక్షణ అవసరాలు నా దృష్టిని ఆకర్షించినాయి. అవి:

  • తక్కువ స్థాయి విద్య,
  • చొరవ, లక్ష్య శుద్ది లేకపోవడం, సంఘటిత శక్తి లేకపోవడం
  • నాయకులలో అభివృద్ధి ప్రణాళికలు రచించే సామర్థ్యం లేకపోవడం,
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం
  • ఆ స్థితిని అధిగమించేందుకు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఎటువంటి ప్రయత్నాలు లేకపోవడం

కాబట్టి, నా ముందున్న ఏకైక లక్ష్యం.. అభివృద్ది ప్రణాళికలు తయారు చేయడం, అవగాహన కల్పించడం, వాటి అమలుకు ప్రోత్సహించడం. అభివృద్ధే లక్ష్యంగా విద్య, పరిశ్రమలు, వాణిజ్యం, ప్రజలు బాగా పని చేయడానికి, బాగా సంపాదించడానికి, జీవించడానికి పనులను చేపట్టడం, రాష్ట్రంలో పౌర సదుపాయాలను మెరుగుపరచడం నా ముందున్న కర్తవ్యాలు. సమయం వృథా పరచకుండా నా ఆలోచనలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజల దృష్టికి తీసుకు వచ్చాను. వారి జీవితంలోని ప్రధాన లోపాలను, అధ్వాన్న జీవన పరిస్థితులు, వాటి మెరుగుదల, పురోగతి కోసం జపాన్, పశ్చిమ యూరోప్, అమెరికా దేశాల్లో నేను గమనించినటువంటి అభివృద్ధి మార్గాలను అన్వేషించడం అవసరం అని బోధించే ప్రయత్నం చేశాను.

అక్టోబర్ 1913లో దీవాన్‌గా ప్రతినిధుల సభలో చేసిన నా మొదటి ప్రసంగంలో ఈ క్రింది అంశాలను సూచించాను:

“ప్రజా పనులను చేపట్టడం, రైల్వే మార్గాలు, ట్రామ్వేలు లేదా ఇతర ప్రజోపయోగ పనులు నిర్మించడం ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఈ పనుల కోసం నైపుణ్యం కలిగిన ఏజెన్సీలను బయటి నుండి దిగుమతి చేసుకోవచ్చు. ఖర్చుపై న్యాయమైన రాబడికి హామీ ఇవ్వగలిగితే విదేశీ మూలధనాన్ని పొందవచ్చు. భారతదేశంలో లేదా ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభ కలిగిన నిపుణులను ప్రజా సేవకు పిలిపించడం కూడా సులభం, ఎందుకంటే ఉపాధి అవకాశాలను కోరుకునే అలాంటి ప్రతిభావంతులు భారత్ దేశంలో, ఇతర దేశాలలో పుష్కలంగా ఉన్నారు. తాము వ్యక్తిగతంగా లబ్ధి పొందుతూ, మనకు కూడా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉన్న బయటి ఏజెన్సీల సహాయాన్నిస్వాగతించాలి. అయితే పూర్తిగా బయటి నైపుణ్యాలతో నిర్వహించబడే పెద్ద సంస్థల వలన మన ప్రజల సామర్థ్యం పెరగదు. లేదా దేశ నైపుణ్య స్థాయిని పెంచవు. మైసూర్ అని పిలిచే ఆర్థిక, భౌగోళిక ప్రాంతంలో ప్రజల తెలివితేటలు, నైపుణ్యం, సహజ వనరులు, అందుబాటులో ఉన్న మూలధనం ఒకదాని మీద మరొకటి చర్య, ప్రతిచర్య కనబరచకపోతే.. మొత్తంగా చూస్తే వీటి ప్రభావంతో దేశం శాశ్వత పురోగతిని సాధిస్తుందని కూడా చెప్పలేము.”

“మన ప్రస్తుత పరిస్థితిలో తీవ్రత కలిగిన కొన్ని అంశాలు ఉన్నాయి. మనకు వీటి పట్ల ఆత్రుతతో కూడిన జాగరూకత అవసరం. గత 30 సంవత్సరాలలో దేశం పురోగమించింది. ఇందులో సందేహం లేదు. కానీ భారత ఉప ఖండం సాధించిన సాధారణ పురోగతిలో భాగంగానే ఈ పురోగతి సాధ్యం అయ్యింది తప్ప మొత్తంగా మన తరపు నుంచి వ్యవస్థీకృత కార్యాచరణ లేదా ప్రణాళికాబద్దంగా జరిగింది కాదు.”

“ప్రతి పదహారు మందిలో ఒకరు మాత్రమే చదవగలరు, రాయగలరు. సాధారణ పని పరిస్థితుల్లో కూడా వ్యవసాయదారులు పూర్తి స్థాయిలో పనుల్లో నిమగ్నం కావడం లేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న సంవత్సరాలలో అయితే కొన్ని నెలల పాటు బతుకు తెరువు పట్ల ఏ ఆశ, ఉపాధి లేకుండా ఉండే స్థితి మన దేశంలో ఉన్నది. మన జనాభాలో ముప్పావు వంతు మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది గ్రామాలలో నివసిస్తున్నారు. తమ సాంప్రదాయిక వృత్తి కార్యకలాపాలు తప్ప వారికి మరే ఇతర పని సాధ్యం కాదు. వారికి మరే ఇతర ఆకాంక్షలు లేకుండా అందులోనే మగ్గిపోతున్నారు. మన రైతాంగం చిన చిన్న భూకమతాలకు యజమానులు. మన వాణిజ్యం చిన్నచిన్న వ్యాపారులు, చేతి వృత్తుల వారిచే నిర్వహించబడుతున్నది. ఈ వ్యవహారం తమకు తాము తమ బతుకు తెరువు కోసం సాగిస్తున్నవాణిజ్య కార్యకలాపాలే తప్ప పెద్ద ఎత్తున దేశ పురోగతికి దోహదం చేసేవి కావు. సంస్థాగతమైన కార్యకలాపాలు, సహకార వ్యవస్థ వల్ల ఒనగూరే ప్రయోజనాలు సమాజంలోని అగ్ర శ్రేణి నాయకత్వానికి కూడా అవగతం కాలేదు.”

“అధికార బదలాయింపు తర్వాత 1876-78 నాటి దుర్భరమైన కరువు సృష్టించిన అనుభవంతో మొదటి దివాన్ గారు కూడా అప్పుడున్న ఇటువంటి పరిస్థితులను అధిగమించే ఆలోచనలు చేసినారు. 1881లో ఈ అసెంబ్లీలో చేసిన తన ప్రసంగంలో పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక అభివృద్ధి ఆవశ్యకతను శ్రీ సి. రంగాచార్లు గారు గట్టిగా నొక్కి చెప్పారు. వ్యవసాయం, వస్తు తయారీ పరిశ్రమలను సమానంగా ప్రోత్సహించకపోతే ఏ దేశం కూడా అభివృద్ధి చెందదని ఆయన వ్యాఖ్యానించారు.” అని ఆయన అబిప్రాయం వ్యక్తం చేసినారు.”

“మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు. అదే సమయంలో 200 మిలియన్ల మంది ప్రజలున్న మన దేశం ఇంకా సుదీర్ఘ నిద్రలో ఎక్కువ కాలం కొనసాగడానికి వీలు లేదు. 2,000 సంవత్సరాల క్రితం నుంచి అనుసరిస్తున్న వారి పూర్వీకుల సంప్రదాయ వృత్తులను అనుసరించడం ద్వారా దయనీయమైన ఆదాయాన్ని సంపాదించడం జరుగుతున్నది. ఒక్క కరువు లేదా ఇతర విపత్తులు సంభవించినా అవి దేశాన్ని నలిపివేస్తున్నాయి. ఈ చిన్నపాటి ఆదాయాలు ప్రజల జీవనాన్ని నిలబెట్టడానికి సరిపోదు.” అని కూడా అతను అభిప్రాయపడ్డారు.

“ఈ రోజు వింటున్నఈ మాటలు 30 ఏండ్ల కింద కూడా విన్నాము. అప్పుడు ఎంత నిజమో ఈరోజు కూడా అంతే నిజం. మార్పు కోసం ప్రయత్నించకపోతే 30 సంవత్సరాల తర్వాత కూడా ఇవే మాటలు వినవలసి వస్తుంది.”

“మనం మన ప్రజల జీవితాలను, సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలి. వారిలో స్వయం సహాయక శక్తి , చొరవ, మార్పును ఆహ్వానించడానికి, కొత్త వస్తువులను సృష్టించడానికి ధైర్యం, సహకార స్ఫూర్తి, సంఘటిత శక్తిని పెంపొందించుకోవడానికి ప్రోత్సహించాలి.”

“ప్రస్తుతం, ఎంత అహేతుకంగా ఉన్నప్పటికీ, ప్రజల మధ్య పరస్పర సహకార స్పూర్తిని పెంపొందడానికి ఎకనామిక్ కాన్ఫరెన్స్ అని పిలువబడే సంస్థ ద్వారా అవకాశాలు కల్పిస్తే, పాశ్చాత్య దేశాలలో విద్యా రంగంలో అమలు అవుతున్నకార్యకలాపాలు, పరిశ్రమల్లో యంత్రాల గర్జనలు, వాణిజ్యంలో నెలకొని ఉన్న తీవ్రమైన పోటీని చూసిన వారేవరైనా ఈ ఉద్యమ లక్ష్యాలతో సహకరించకుండా, సానుభూతి చూపించకుండా ఉండలేరు.”

“ఆర్థిక సదస్సు అనే సంస్థ నగరాలు, పట్టణాలలో సహకారాన్ని ఉత్తేజపరిచేందుకు ఉద్దేశించబడింది. క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్నది సంస్థ లక్ష్యం. కానీ జనాభాలో పదింట తొమ్మిది వంతుల మంది ప్రజలు ఇప్పటికీ గ్రామాలలో నివసిస్తున్నారు. వీరిని ఉత్తేజపరిచేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం అవసరమని నాకు అనిపిస్తోంది.”

“గ్రామం ఆర్థికాభివృద్ది ప్రయత్నాలకు అనుకూలమైన యూనిట్‌గా ఉంటుంది. ప్రతీ సంవత్సరం పథకాన్ని లేదా కార్యక్రమాన్ని అమలు చేసే ముందు, తర్వాత ముగింపులో పురోగతిని మదింపు వేయడానికి గ్రామ యూనిట్ అనుకూలమైనది. ప్రతి గ్రామం ప్రతీ సంవత్సరం కొద్దిగానైనా అభివృద్ధిని నమోదు చేస్తే అన్ని గ్రామాల సామూహిక ఫలితం పెద్దదిగా ఉంటుంది. అన్ని గ్రామాల్లో ప్రజల విజ్ఞానం, చొరవ ఒక్కలాగా ఉండే అవకాశం లేదు. కాబట్టి అభివృద్ది ఫలితాలు కూడా భిన్నంగానే ఉంటాయి. ఈ భిన్నత్వంలో తేడా అక్షరాస్యతలో 5 నుండి 10 శాతానికి మించకూడదు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏ గ్రామమైనా ఒకటి లేదా రెండు బాగా నిర్వహించబడే మాతృభాష వార్తా పత్రికలను తప్పనిసరిగా తెప్పించుకొని చదవడం అవసరం. గ్రామంలో ప్రతి కుటుంబం రెండు సంవత్సరాల పాటు కరువును తట్టుకునేందుకు సరిపడా ధాన్యం లేదా డబ్బును నిల్వ ఉంచేలా ప్రేరేపించాలి.”

“గ్రామాలు సంవత్సరానికి ఒకసారి వారి ఆర్థిక వృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన గణాంకాలు ప్రచురించాలని గ్రామాధికారులను ఆదేశించవచ్చు.”

దీవాన్‌గా నేను సర్వీసులో ఉన్న ఆరేళ్లలో నిర్దిష్ట ప్రమాణాలతో ప్రణాళికాబద్దమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. ప్రతి అంశంలోనూ ఫలితాలు సాధించాలి అన్నలక్ష్యంతోనే పని చేశాము. విద్యా రంగ అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికి, జాతీయ ప్రాధాన్యతలకు, కార్యక్రమాలకు సంబంధించిన ఏ అంశాన్ని విస్మరించలేదు. మాకు అందుబాటులో ఉన్న వనరులు అనుమతించినంత మేరకు ప్రతిదానిపై దృష్టి పెట్టాము.

మైసూర్ దీవాన్ గా మోక్షగుండం విశ్వేశ్వరాయ (1912 – 1918)

దురదృష్టవశాత్తు మొదటి ప్రపంచ యుద్ధం ఆగస్ట్ 1914లో నేను మైసూర్ దీవాన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన 21 నెలల తర్వాత ప్రారంభమైంది. అది డిసెంబర్ 1918లో నా దీవాన్ పదవీ కాలం ముగియడానికి కొద్ది కాలం ముందు వరకు కొనసాగింది.

హిస్ హైనెస్ మహారాజు తన సైన్యాన్ని, మొత్తం రాష్ట్ర వనరులను బేషరతుగా బ్రిటిష్ సామ్రాజ్య రక్షణ కోసం వినియోగించారు. ఆసియా ఖండంలో బ్రిటిష్ వారి తరపున పోరాడుతున్న భారతీయ సైన్యం అవసరాల కోసం హిస్ హైనెస్ రూ. 50 లక్షలు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి సమకూర్చినారు.

20 ఆగస్ట్ 1914 నాటి లేఖలో ఈ విరాళాన్ని ప్రకటిస్తూ ఆనాటి బ్రిటిష్ వైస్‌రాయ్‌కి రాసిన లేఖలో H E మహారాజా వారు ఈ విధంగా రాసినారు. “నేను పూర్తి చిత్తశుద్ధితో నా ప్రజల భక్తి, విధేయతలను, మన ఉమ్మడి ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన ఏ త్యాగానికైనా మా సంసిద్ధతను H E వైస్‌రాయ్ గారికి హామీ ఇస్తున్నాను.”

మహారాజా వారి లేఖకు బదులిస్తూ H E వైస్రాయ్ అత్యంత ప్రసంశనీయమైన వాక్యాలతో లేఖను ముగించారు. “నా ప్రియ మిత్రమా! ప్రస్తుతానికి ఇలాంటి విపత్కర సమయంలో అద్భుతమైన దేశభక్తిని ప్రదర్శించిన మీ ఆలోచనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ఆనందాలు వెదజల్లే వెచ్చని కాంతిని నా హృదయంలో నింపుతున్నది.”

లార్డ్ హార్డింగ్, వైస్రాయ్ (1910 -1916)

అయితే, యుద్ధం అనేక ముఖ్య రంగాల అభివృద్దిపై కలుగజేసిన దుష్ప్రభావం గమనించదగినది. ముఖ్యంగా పరిశ్రమల స్థాపనా రంగంలో అభివృద్ధి కుంటుబడింది లేదా మొత్తానికే ఆగిపోయింది.

తదుపరి అధ్యాయాలలో ఈ విషయమై కొన్ని వివరాలను ప్రస్తావించాను. యుద్ధ పరిస్థితులు విధించిన పరిమితుల నేపథ్యంలో మేము చేసిన ప్రయత్నాలను, లేదా సాధించిన విజయాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ ప్రస్తావనలు కొంత సుదీర్ఘంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ అవి ఆనాటి క్లిష్ట పరిస్థితుల గురించి, యుద్ధం కొనసాగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అభివృద్ధి కొరకు చేసిన కృషి గురించి సరైన అవగాహన కలిగించడం కోసం అవసరమని నా భావన.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here