Site icon Sanchika

మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-1

అధ్యాయం 1 – ప్రభుత్వ సర్వీస్ లోకి తొలి ప్రవేశం:

[dropcap]పూ[/dropcap]నా సైన్స్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి 1884లో బొంబాయి ప్రభుత్వ ప్రజా పనుల శాఖ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరమని నియామక ఉత్తర్వు అందింది. అప్పుడు నా వయస్సు 23 ఏండ్లు. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యే పట్టభద్రులకు ఇటువంటి నియామక ఉత్తర్వులు తప్పక వచ్చేవి. నేను నవంబర్ 1883లో ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాను. మార్చ్ 1884 ప్రభుత్వ సర్వీస్‌లో చేరిపోయాను.

నన్ను తొలుత నాసిక్ జిల్లాకు పంపించారు. పూనాలో నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. వారు ప్రభుత్వ సర్వీస్‌లో చేరడానికి అవసరమైన సలహాలు, అన్ని రకాల సహాయాలు అందించారు. పూనాలో పేరు పొందిన ప్రజా నాయకుడు శ్రీ మహాదేవ్ గోవింద రనడె గారు నాసిక్‌లో ఉన్న నా పై అధికారి డిప్యూటీ కలెక్టర్ గారికి ఒక లేఖ రాసి నాకు ఇచ్చారు. అట్లాగే మరి కొందరు పూనా మిత్రులు కూడా నాసిక్ జిల్లా మామ్‌లాత్‌దార్ గారికి నన్ను బాగా చూసుకోవలసిందిగా కోరుతూ లేఖలు రాసినారు.

నాసిక్ జిల్లాలో ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే ప్రజా పనుల శాఖ అధికారులు మనసు మార్చుకొని నన్ను నాసిక్‌కు పక్కనే ఉన్న ఖందేశ్ జిల్లాకు బదిలీ చేసినారు. ఖందేశ్ జిల్లా ముఖ్య పట్టణం ధూలియా. మొదట నన్ను కొన్ని రోజులు ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న శ్రీ డబ్ల్యూ.ఎల్.స్ట్రెంజ్ (W L Strange) గారి కింద పని చేసిన తర్వాత ఆయనను రిలీవ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. స్ట్రెంజ్ గారికి శాఖలో మంచి అధికారిగా పేరు ఉన్నది. వారు నాకు శాఖలో పని విధానం, రోజువారీ చేయవలసిన పనిపై చక్కటి అవగాహన కలిగించారు. శాఖలో ఇమిడి పోవడానికి ఆయన సాహచర్యం ఎంతగానో తోడ్పడింది. కొన్ని వారాల సహచర్యం అనంతరం స్ట్రెంజ్ గారిని నాసిక్ జిల్లాకు బదిలీ చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు ఒక్కడినే ఆయన వదిలి వెళ్ళిన కార్యాలయం వ్యవహారాలు, పనులు చూసుకున్నాను. నా పరిధిలో ఉండే సాగునీటి కాలువల తనిఖీ, కొనసాగుతున్న ఆనకట్టలు, కాలువల మరమ్మతు పనుల పర్యవేక్షణ మొదలైనవి నా రోజువారీ పనుల్లో ఉండేవి. పై అధికారులు, జిల్లా కలెక్టరు నుంచి వచ్చే ఆదేశాల మేరకు నా కింద పని చేసే అధికారులు పర్యవేక్షిస్తున్నపింజ్రా నది నీళ్ళను మళ్లించే కుడి, ఎడమ కాలువల పనులను కూడా కొన్ని సార్లు తనిఖీ చేసి నివేదికలు పంపడం జరిగేది.

శాఖలో చేరిన కొన్ని నెలల సాధారణ పని అనుభవం తర్వాత ఖందేశ్ జిల్లా సాగునీటి శాఖ కార్య నిర్వాహక ఇంజనీర్ గారు పింజ్రా నది నుంచి దత్తాత్రి గ్రామానికి నీటిని తరలించే కాలువపై ఒక పైప్ సైఫన్ (Pipe Syphon) ని నిర్మించమని ఆదేశాలు జారీ చేశారు. దత్తాత్రి గ్రామం ఖందేశ్ జిల్లా కేంద్రం ధూలియా నుంచి పశ్చిమ దిక్కున సుమారు 35 మైళ్ళ దూరంలో ఉంటుంది. కాలువ హెడ్ వర్క్స్ నుంచి దత్తాత్రి గ్రామం మధ్యన పింజ్రా నదిలో కలిసే ఒక వాగును దాటించడానికి ఈ పైప్ సైఫన్ నిర్మాణం చేయవలసి వచ్చింది. గతంలో, బహుశా బ్రిటిష్ కాలానికి పూర్వం ఈ వాగు వద్ద రాతి ఆక్విడక్ట్ ఒకటి ఉండేది. అయితే వరదలకు ఈ అక్విడక్ట్ కొట్టుకుపోయినందున దాని చోట ఒక పైప్ సైఫన్‌ను ప్రతిపాదించినారు. సైఫన్ నిర్మాణానికి అవసరమయ్యే పైపుల కొనుగోలు ప్రక్రియను నా కంటే ముందు ఈ పనికి సంబందించిన వ్యవహారాలు పర్యవేక్షించిన ఇంజనీర్ పూర్తి చేసి ఉన్నారు. సాగునీటి శాఖ జిల్లా అధికారి, స్థానిక సబ్ డివిజినల్ అధికారి ఆదేశాల మేరకు ఈ పనిని నేరుగా నాకు అప్పజెప్పడం జరిగింది. 1884లో వానాకాలం మొదలయ్యే కంటే కొన్ని రోజుల ముందే సైఫన్ నిర్మాణ స్థలాన్ని సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకున్నాను. సైఫన్ నిర్మాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేశాను. సైఫన్ నిర్మాణంలో మొదట చేయవలసిన పని వాగులో ఇసుక మేటను తొలగించి పైపులను వేయడానికి నది గర్భంలో ఉన్న రాళ్ళను తొలగించి కందకం తవ్వాలి. ఆ తర్వాత పైపులను ఆ కందకంలో పరచాలి. నది గర్భంలో రాళ్ళను తొలగించే జరుగుతున్నప్పుడు అడపాదడపా వర్షం కురిసేది. నదిలో నీటి ప్రవాహాలు పెరిగి కందకంలో మళ్ళీ ఇసుక మేటలు వేసేది. రాళ్ళు తొలగించే పని మళ్ళీ మొదలవ్వాలంటే కందకంలో వర్షం వల్ల పేరుకు పోయిన ఇసుక మేటలను తొలగించ వలసి వచ్చేది. రెండు మూడు రోజులకు ఒకసారి ఇటువంటి పరిస్థితి ఏర్పడేది. నాకు ఇటువంటి పనికి కొత్త. ఈ కష్టాల గట్టెక్కడానికి నా పక్కనే ఉన్న మరొక సబ్ డివిజినల్ అధికారిని సంప్రదించాను. వర్షాల కారణంగా తరచూ ఇసుక మేటలను మళ్ళీమళ్ళీ తొలగిస్తూ నది గర్భంలో రాళ్ళను తొలగించవలసి ఉంటుందని, ఈ పనికి అనవసరంగా అధిక వ్యయం చేయవలసి వస్తుందని, వానాకాలం ముగిసే దాకా కందకం తవ్వకం పనులు నిలిపి వేయాలని ప్రభుత్వానికి ఒక నివేదికకు పంపమని సలహా ఇచ్చాడు. బాగా ఆలోచించిన తర్వాత ఆయన సలహా మేరకు అనవసరపు అధిక వ్యయాన్ని తగ్గించడానికి సైఫన్ నిర్మాణ పనులు వానా కాలం ముగిసే వరకు ఆపివేయడానికి, వానాకాలం ముగిసే వరకు నా కార్యాలయం ఉన్న ధూలియాకు వెళ్ళడానికి అనుమతించమని నాసిక్, ఖందేశ్ జిల్లాల సాగునీటి శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్‌లకు అన్ని విషయాలను వివరిస్తూ లేఖలు రాశాను. వానాకాలం ముగిసిన తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారిన వెంటనే సైఫన్ నిర్మాణ పనులు చేపడతానని కూడా ఆ లేఖలో పేర్కొన్నాను. నా లేఖకు జవాబుగా నేను ఊహించని విధంగా ఒక తాఖీదును అందుకున్నాను. అందులో సైఫన్ నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదని ఆదేశించారు. ఆ మెమోలో చివరి వాక్యాలు ఇట్లా ఉన్నాయి

తన శక్తి సామర్థ్యాలను గుర్తించక, పై అధికారుల ఆదేశాలను పాటించక అసిస్టెంట్ ఇంజనీర్ తన ఉద్యోగ జీవితాన్ని చెడుగా ప్రారంభిస్తున్నారు”

ఈ తాఖీదు నన్ను చాలా నిరాశ పరచింది. అయినా బాగా ఆలోచించి ఈ సవాలును స్వీకరించాలని అనుకున్నాను. మెమోలో పేర్కొన్నట్టు సైఫన్ నిర్మాణ పనులు ఆపివేయనని, మరే విధమైన ఊహించని అడ్డంకులు ఎదురు కానట్టైతే నిర్మాణం పూర్తి చేసిన తర్వాతనే ధూలియాకు తిరిగి వస్తానని కార్య నిర్వాహక ఇంజనీర్‌కు హామీ ఇస్తూ లేఖ రాశాను. సాధ్యమైనంతగా అనవసరపు అధిక వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేస్తానని, అయితే అనివార్యంగా అంచనా వ్యయాని కంటే కొద్దిపాటి ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే వాటిని ఆమోదించవలసిందిగా కూడా ఆ లేఖలో కార్య నిర్వాహక ఇంజనీర్ గారిని కోరినాను.

స్థానిక తాపీ పనివారు, భిల్ జాతి కార్మికుల సహకారంతో రెండు నెలల నిరంతర కృషితో నది గర్భంలో రాళ్ళను తొలగించి పైపులను కందకంలో పరచ గలిగినాను. చివరకు సైఫన్ నిర్మాణ పనులు పూర్తి అయినాయి. కాలువ నీరు నదిని దాటి ఈ కొస నుంచి ఆ కొసకు చేరినాయి. కాలువ ద్వారా దత్తాత్రి గ్రామానికి నిరంతర నీటి సరఫరా పునరుద్థరించాము.

సైఫన్ నిర్మాణ పనులు జరుగుతున్న రెండు నెలలు గుర్రంపై పింజ్రా నదిని దాటి ప్రతీ రోజు పని స్థలానికి తప్పక వెళ్ళేవాన్ని. రాత్రికి నా స్థావరానికి తిరిగి చేరుకునేవాడిని. ఒక రోజు ఉదయమే నేను రోజు వెళ్ళే సమయంలోనే పింజ్రా నదిని దాటి నా పని స్థలానికి చేరుకున్న కొద్ది సేపటికి ఎగువన కురిసిన వర్షానికి పెద్ద వరద నదిలోకి రావడం ప్రారంభం అయ్యింది. ఈ వరద పరిస్థితి దాదాపు మూడు నాలుగు రోజులు కొనసాగింది. నా తాత్కాలిక నివాస స్థావరంగా ఉన్న అధికారిక వసతి గృహానికి వెళ్లడం సాధ్యపడలేదు. సమీప ప్రాంతంలో నదిని దాటాడానికి ఎక్కడా ఒక వారధి కూడా లేదు. సైఫన్ నిర్మాణ స్థలం వసతి గృహానికి సుమారు రెండున్నర మైళ్ళ దూరంలో ఉంది. మధ్యలో పింజ్రా నది దాటాలి. నదిని దాటలేని ఈ పరిస్థితిలో మొదటి రోజు రాత్రి దగ్గరలో ఉన్న నంద్ వాన్‌లో గడిపాను. రెండో రాజు ఈ సైఫన్ నిర్మాణం వలన ప్రయోజనాన్ని పొందే దత్తాత్రి గ్రామంలోనే ఉన్నాను. దత్తాత్రి గ్రామ ప్రజలు నాకు వసతి కల్పించారు. చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. మూడో రోజు మాత్రం భిల్ జాతి పని వాళ్ళ సహాయంతో, నిర్మాణంలో వినియోగిస్తున్న బల్ల చెక్కల సహాయంతో నదిని ఈదుకుంటూ అయినా దాటి వసతి గృహానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నా గుర్రాన్ని ఇతర సామాగ్రిని పని వాళ్ళే నదిని దాటించి ఒడ్డుకు చేర్చారు.

సైఫన్ నిర్మాణ పనులు సంతృప్తికరంగా పూర్తి చేసినానని నేను భావిస్తున్నాను. పని పూర్తి అయిన తర్వాత ఒక సవివరమైన నివేదికను రూపొందించి కార్యనిర్వాహక ఇంజనీర్ గారికి పంపించాను. ఆయన సంతృప్తి చెంది గతంలో తాను మెమోలో నా మీద రాసిన రిమార్క్స్‌ను రద్దు చేస్తున్నానని నాకు లేఖ రాసినారు.

ఆ తర్వాత కార్యనిర్వాహక ఇంజనీర్ గారి సహాయకుడిగా సబ్ డివిజన్ పరిధిలో ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్న అనేక పనుల పురోగతిని పరిశీలించడానికి తనిఖీకి వెళ్ళే వాడిని. కొన్ని నెలల అనంతరం మరో రెండు పెద్ద కాలువల పనులు నాకు అప్ప జెప్పినారు. ఇవి ఖందేశ్ జిల్లా ఆగ్నేయ దిశలో చివరన ఉన్న ఒక ప్రత్యేకమైన సబ్ డివిజన్ పరిధిలో ఉండేవి. ఇవి సాధారణమైన పనులు కావడంతో పెద్దగా ఆసక్తిని కలిగించలేకపోయినాయి. ఈ కాలువల నిర్వాహణ కోసం కేటాయించిన నిధులు కూడా వాటిని సమర్థవంతంగా పని చేయించడానికి సరిపోయేవి కావు. ఈ కార్యాలయం నుంచే సెలవులో ఉన్న నాసిక్, ఖందేశ్ జిల్లాల సాగునీటి శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ బాధ్యతలను కూడా కొన్ని నెలల పాటు నిర్వహించే అవకాశం వచ్చింది. ఈ కాలంలో నాసిక్ జిల్లాలో ఉన్న మాలెగావ్ నా కార్య స్థలంగా ఉండేది.

నా తర్వాతి పని ధూలియా పట్టణానికి తాగు నీటి సరఫరా వ్యవస్థను రూప కల్పన చేయడం. ఇందులో నీటిని నిల్వ చేయడానికి ఒక చిన్నజలాశయాన్ని కూడా ప్రతిపాదించాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క సవివరమైన నివేదికను, చిత్ర పటాలను, డిజైన్లను, అంచనా వ్యయాన్ని తయారు చేసి ఖందేశ్ జిల్లా కార్యనిర్వాహక ఇంజనీర్ గారికి సమర్పించాను. ఆయన త్వరగానే ఈ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతిని సాధించినాడు. ధూలియా పట్టణ తాగునీటి అవసరాల కోసం ప్రతిపాదించిన జలాశయం నిర్మాణ బాధ్యతలను కూడా నా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. జలాశయం నిర్మాణ పనులను పురోగతిలోకి తీసుకు రాగలిగినాను. ఈ లోపు నాకు మరొక ప్రాజెక్టు రూపకల్పనకు అవకాశం వచ్చింది. ధూలియా తాగునీటి జలాశయం పనులను ఇంజనీరింగ్ పట్టభద్రుడు, సమర్థుడైన మరొక ఇంజనీర్‌కు అప్పజెప్పి ఖందేశ్ జిల్లాకు వాయవ్య దిశలో సాత్పూరా పర్వత శ్రేణుల పాదాల వద్ద జలాశయం నిర్మాణానికి ఎటువంటి సహాయకులు లేకుండానే ఒక్కడినే సర్వే చేసి ప్రాజెక్ట్ నివేదిక రూపొందించడానికి బయలుదేరాను.

నేను నా ప్రభుత్వ సర్వీస్ తొలి రోజుల్లో నా మొదటి కార్యనిర్వాహక ఇంజనీర్‌గా శ్రీ హెచ్ జి పల్లీసర్ గారు ఉన్నారు. నేను జిల్లాలో చేరిన 11 నెలల తర్వాత ఆయన నాకు ఒక లేఖ రాశారు. ప్రభుత్వ సర్వీస్ క్రమబద్ధీకరణ జరగాలంటే, భవిష్యత్‌లో పదోన్నతులు పొందాలంటే తప్పని సరిగా శాఖాపరమైన పరీక్షలు రాయాలని, ఇప్పటిదాకా పరీక్షలకు ఎందుకు దరఖాస్తు చేయలేదని ఆ లేఖలో ప్రశ్నించినాడు. ఆయన నాకు ఈ లేఖ రాసినందుకు సంతోషించినాను. ఆ రోజుల్లో ఇంజనీరింగ్ సర్వీస్‌లో చేరిన ప్రతి ఒక్కరూ.. అతను యూరోపియన్ అయినా భారతీయుడు అయినా.. శాఖాపరమైన పరీక్షలు రాసి పాస్ అయితేనే ప్రభుత్వ సర్వీస్ క్రమబద్ధీకరణ జరిగేది. పదోన్నతి పొందడానికి అర్హత వచ్చేది. ఇవి రెండు రకాల పరీక్షలు. ఒకటి ప్రాక్టికల్ ఇంజనీరింగ్ పరీక్ష. రెండవది స్థానిక భాషలో ప్రావీణ్య పరీక్ష. ఇది రాత, మౌఖిక పద్ధతిలో జరిగేది. కొత్తగా ప్రభుత్వ సర్వీస్‌లో చేరే కొత్త ఇంజనీర్లకు పరీక్ష రాసేందుకు తగినంత అనుభవం పొందడానికి రెండు మూడేళ్లు పట్టేది. పూనాలో చదువుకున్న కారణంగా స్థానిక మరాఠీ భాషా పరీక్ష గురించి నాకు ఇబ్బంది లేదు. కానీ శాఖాపరమైన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ పరీక్ష గట్టెక్కగలనా అన్న సంశయం నాకు ఉండేది. అయితే మా కార్యానిర్వాహక ఇంజనీర్ నన్ను ప్రోత్సహించి శాఖాపరమైన పరీక్షకు దరఖాస్తు చేయమని సలహా ఇచ్చారు. పరీక్ష పాస్ అయ్యేందుకు తగినంత ఇంజనీరింగ్ అనుభవం నాకు లేదని భావించి దరఖాస్తు చేయలేదు. ఈ చిన్నవయసులో ఇటువంటి ఆవిశ్వాసపూరిత మనస్తత్వాన్ని ఏర్పరచుకోవడం పట్ల ఆయన నన్ను సున్నితంగా మందలించినారు. ఆయన మందలింపుతో జ్ఞానోదయం అయి వెంటనే పరీక్షకు దరఖాస్తు చేసినాను. ఈ పరీక్ష నిర్వహించడానికి ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు అయ్యింది. అందులో మా చీఫ్ ఇంజనీర్ కూడా ఒక సభ్యుడు. ఈ కమిటీ నన్ను ప్రాక్టికల్ ఇంజనీరింగ్, స్థానిక భాషలో ప్రావీణ్యత పరీక్షలో పాస్ చేసినారు. దానితో నా సర్వీస్ క్రమబద్ధీకరణ జరిగిపోయింది. అంతే కాకుండా రెండవ శ్రేణి అసిస్టెంట్ ఇంజనీర్‌గా పదోన్నతి కూడా పొందినాను. 10 నెలల అనంతరం ఖాళీలు చాలా ఉన్నందున మొదటి శ్రేణి అసిస్టెంట్ ఇంజనీర్‌గా రెండవ పదోన్నతి పొందినాను. ప్రభుత్వ సర్వీస్‌లో చేరిన 20 నెలలలోనే నేను మొదటి శ్రేణి అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నాను. మొదటి శ్రేణి అసిస్టెంట్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందిన తర్వాత నా జీతం నెలకు 500 రూపాయలు.

ఖాందేష్ జిల్లాలో మలేరియా పరిస్థితుల కారణంగా తరచుగా అనారోగ్యం బారిన పడేవాడిని. కాబట్టి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాను. సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీర్ దయ చూపి నన్నుఆ జిల్లాలోని రోడ్లు భవనాలు శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కింద పని చేయడానికి పూనాకు పోస్ట్ చేశారు. ఈ బదిలీ తేదీ వరకు, నేను నీటిపారుదల, నీటి సరఫరా పనులపై పని చేసాను. ఈ బదిలీ వలన సివిల్ ఇంజినీరింగ్ వృత్తిలో కొత్త బ్రాంచ్‌లో అనుభవం పొందే అవకాశం నాకు లభించింది. నేను కొద్దికాలం పాటు గణేష్ ఖిండ్‌లో పూనా ప్రాంతీయ ప్రభుత్వం అధీనంలో ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యాలయ భవనాలు, సబర్బన్ ప్రాంతాలు, పరిసరాల్లోని రోడ్లతో సహా ఇతర నిర్మాణంలో ఉన్న పనుల పర్యవేక్షణ బాధ్యతలను కూడా నిర్వర్తించాను. ఇక్కడ కూడా పూనా జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నా సమర్థతను అనేక విధాలుగా పరీక్షించిన తర్వాత నా పని విధానంపై సంతృప్తి చెందినట్టు అనిపించింది.

నేను పూనా జిల్లాలో రెండేళ్ళ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత 1893లో బొంబాయి ప్రభుత్వం నుండి సింధ్ రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న సుక్కూర్‌లో పని చేయడం కోసం ఒక ఇంజనీర్ అధికారి సేవలు అవసరమని, ఆసక్తి ఉన్న వారి పేర్లు సూచించమని ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ నగరం తాగు నీటి సరఫరా వ్యవస్థను నిర్మించడానికి నియామకం పొందిన ఒక యూరోపియన్ ఇంజనీర్ అకస్మాత్తుగా మరణించినందున అతని స్థానంలో పని చేయడానికి ఒక అధికారిని ప్రభుత్వం కోరుతున్నది. నేను ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నానని పూనాలోని నా ముఖ్య అధికారి శ్రీ ఇ. కె. రీనాల్డ్ భావించారు. నాకు ఆ స్థానంలో నియమించడానికి అవకాశం ఇస్తున్నట్లు అతను లేఖ వ్రాసాడు. తన లేఖకు త్వరగా సమాధానం ఇవ్వమని అడిగాడు. ఆ లేఖలో ఆయన తన విలక్షణమైన ఉదార స్వభావాన్ని ప్రదర్శించినారు. ఆ లేఖ పూర్తి పాఠాన్ని ఇక్కడ పునర్ముద్రించడం సముచితమని భావిస్తున్నాను.

పూనా, 22 మార్చి 1893.

నా ప్రియమైన విశ్వేశ్వరాయ,

ఒక ప్రత్యేక పని కోసం మంచి పనిమంతుడైన అసిస్టెంట్ ఇంజనీర్ గురించి తెలుసా అని నన్ను అడిగారు. ఆ పని ఏమిటంటే.. సింధ్ రాష్ట్రంలోని సుక్కూర్ నగరానికి నీటి సరఫరా, మురుగు నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయడం. మీ నెల జీతానికి అదనంగా నెలకు 200 రూపాయలు చెల్లించడంతో పాటూ ఇంటి భత్యం కోసం 45 లేదా 50 రూపాయలు చెల్లిస్తారు. ఇది మీకు సమ్మతమేనా? నేను మీ సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో మీ పేరును ఒకసారి ప్రస్తావించాను. కానీ ఇది సముచితమైనదని మీరు ఒప్పుకుంటారో లేరో నేను చెప్పలేను. సుక్కూర్ వాతావరణం మీకు సంతోషకరంగా, ఉత్తేజకరమైనదిగా ఉండకపోవచ్చు. సుక్కూర్‌లో పని చేసినందుకు మేము అదనంగా చెల్లించే రూ. 200 మీ కష్ట నష్టాలకు న్యాయమైన పరిహారంగా భావించి మేము ఇస్తున్న ఈ అవకాశాన్ని పరిగణించ వచ్చునా అన్నది ఒక ప్రశ్న. మరొక విధంగా ఆలోచిస్తే, మీరు చాలా వరకు ఎవరి అజమాయిషీ లేకుండా స్వతంత్రంగా పని చేసుకోవచ్చు. పని కూడా ఆసక్తికరంగా, చాలా బోధనాత్మకంగా ఉంటుంది. భవిష్యత్తులో మీ పేరుకు, మీ కీర్తి ఇనుమడించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియజేయండి.

మీ భవదీయుడు,

(సం.) ఇ. కె. రీనాల్డ్

స్నేహితులు, శ్రేయోభిలాషులతో ఈ విషయం చర్చించిన తరువాత, నేను రీనాల్డ్ గారి ప్రతిపాదనను అంగీకరించి ఫిబ్రవరి 1894లో సుక్కూర్‌లో విధుల్లో చేరాను.

సుక్కూర్ మున్సిపల్ బోర్డు అధ్యక్షుడు ఒక సైనిక అధికారి కూడా. వీరి ఆధ్వర్యంలోనే నేను పని చేయాల్సి వచ్చింది. ఆయన షికార్పూర్ జిల్లా కలెక్టర్‌గా కూడా ఉన్నారు. సుక్కూర్ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్నందున వీరి అధికార పరిధి పట్టణం మీద కూడా ఉండేది. సింధు నది నుండి నీటిని పట్టణ నీటి సరఫరా వ్యవస్థ వరకు తీసుకు రావాలంటే నది ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఒక కొండ పైన ఉన్న జలాశయంలోకి ఎత్తి పోయాల్సి వచ్చింది. ఈ కొండని స్థానికంగా ‘డిన్‌బర్గ్ కాజిల్ హిల్’ అని పిలుస్తారు. సింధు నది నీరు ఎప్పుడూ బురదగా రంగు మారి ఉంటుంది. అందువలన నగరానికి నీరు పంపిణీ చేయడానికి ముందు వడగట్టి శుద్ధి చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో నీటి వడపోతకు అవసరమయ్యే ఫిల్టర్ బెడ్స్ నిర్మాణానికి డబ్బు ఖర్చు చేసేంత సంపన్న పరిస్థితుల్లో సుక్కూరు నగర మున్సిపాలిటీ లేదు. ప్రత్యామ్నాయంగా, పెర్కోలేషన్ ద్వారా ఊట నీటిని సేకరించేందుకు నది ఒడ్డుకు దగ్గరలోనే నది గర్భంలో ఒక వృత్తాకార బావిని తవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ బావి నుండి సరఫరా తగినంతగా లేనందువలన బావి దిగువ నుండి నది లోపలికి కొంత దూరం వరకు సొరంగం తవ్వవలసి వచ్చింది. ప్రవహించే నది కింద తవ్విన ఈ సొరంగం ద్వారా స్వచ్ఛమైన నీరు తగినంతగా బావిలోకి వచ్చాయి. ఈ నీటిని పైపుల ద్వారా నది ఒడ్డున ఉన్న పంపింగ్ స్టేషన్ యొక్క సంప్ వెల్ లోకి సరఫరా చేయడం జరిగింది. ఆ నీటిని ‘ఎడిన్‌బర్గ్ కాజిల్ హిల్’ పైన నిర్మించిన జలాశయంలోకి స్వచ్ఛమైన నీటిని ఎత్తి పోయడం జరిగింది. ఈ జలాశయం వెలుపలి గోడపై ఒక శిలా ఫలకాన్ని అమర్చారు. దీనిపై నిర్మాణ తేదీని, నీటి పనులకు సంబంధించిన ప్రధాన ప్రభుత్వ మరియు మున్సిపల్ అధికారుల పేర్లను నమోదు చేయడం జరిగింది. సుక్కూర్ నీటి సరఫరాకు సంబంధించి నా పని ఆగస్ట్ 1895లో పూర్తయింది. ఆ తర్వాత నేను కొద్ది రోజులు సెలవుపై వెళ్ళాను. ఆ రోజుల్లో సింధ్ రాష్ట్రం బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. కాబట్టి నేను స్టేషన్ నుండి సెలవుపై బయలుదేరిన తర్వాత బొంబాయి గవర్నర్ సుక్కూర్ వద్ద వాటర్ వర్క్స్ పథకాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో గవర్నర్, హిస్ ఎక్సలెన్సీ లార్డ్ శాండ్ హర్స్ట్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ఈ పనులకు సంబందించి మీరు చదివిన చరిత్ర అంతా చాలా ఆసక్తికరంగా ఉన్నది. ఈ పనులు పూర్తి చేయడానికి అత్యంత సమర్థుడైన ఇంజనీర్ సేవలు మీరు పొందేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని అర్థం అవుతున్నది.”- (టైమ్స్ ఆఫ్ ఇండియా, 16 డిసెంబర్ 1895.)

సుక్కూర్ మునిసిపాలిటీ కూడా ఈ విషయంలో ఒక ప్రత్యేకమైన తీర్మానాన్ని ఆమోదించింది.

శ్రీ విశ్వేశ్వరాయ గారు ఈ మున్సిపాలిటీకి అందించిన విలువైన సేవల గురించి మేము అత్యంత కృతజ్ఞతాపూర్వకంగా నమోదు చేయదలుచుకున్నాము. వారు శ్రద్ధతో, సామర్థ్యంతో సంతృప్తికరంగా ఈ పనిని పూర్తి చేశారు. సుక్కూర్‌లో నెలకొని ఉండే క్లిష్ట వాతావరణంలో కూడా ఉత్సాహంతో తన వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసి, సాపేక్షంగా చాలా తక్కువ సమయంలోనే తాగు నీరు సరఫరా వ్యవస్థను పూర్తి చేశారు.”

పై తీర్మానాన్ని నాకు పంపుతూ, బొంబాయి ప్రభుత్వం వారి G.R. నం. 278 E-1099, తేదీ 2 ఆగస్ట్ 1896 లో ఈ కింది విధంగా వారి స్వంత ప్రశంసలు జోడించినారు.

హిస్ ఏక్సిలెన్సి కౌన్సిల్ ఛైర్మన్ సుక్కూర్ మంచి నీటి సరఫరా పనుల్లో శ్రీ విశ్వేశ్వరాయ అందించిన సేవలను ప్రశంసించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలియజేస్తున్నాము.”

సెలవు నుండి తిరిగి వచ్చినప్పుడు నన్ను గుజరాత్‌లో సూరత్ జిల్లాకు బదిలీ చేశారు. సూరత్ నగరం కోసం తాగు నీటి పనుల పథకం నిర్మాణంలో ఉంది. పనులు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిపాదిత పనుల్లో తపతి నదిలో వృత్తాకారంలో వడపోత బావుల నిర్మాణం కూడా ఉంది. ప్రవహించే నీరు రాకుండా బావులకు పైన సీలు వేయడం జరిగింది. ఇసుక ఫిల్టర్ బెడ్ ద్వారా స్వచ్ఛమైన నీరు దిగువన పెర్కోలేషన్ ద్వారా సేకరించి పైపుల ద్వారా నది ఒడ్డున ఇంజిన్ సంప్ లోకి బాగా చేరవేయడానికి డిజైన్ ను జిల్లాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిద్ధం చేశారు. నదీ గర్భంలో బావులు నిర్మించే పనిని నాకు అప్పగించారు. ఈ తరుణంలో సూరత్ మంచి నీటి సరఫరాకు సంబందించి నా సాధారణ విధులకు అదనంగా కొన్ని నెలల పాటు సూరత్, బ్రోచ్ జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేసే అవకాశం నాకు లభించింది. సూరత్ జిల్లాలో సుమారు 11 నెలల పని చేసిన తర్వాత నన్ను మళ్లీ సెంట్రల్ డివిజన్ ప్రజా పనుల శాఖ ప్రధానాధికారికి (చీఫ్ ఇంజనీర్ లేదా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇన్‌ఛార్జి) సహాయకుడిగా పూనాకు బదిలీ చేసినారు. ఆ రోజుల్లో దక్కన్, సెంట్రల్ డివిజన్ లోని కొన్ని ప్రాంతాల్లో కరువు ఉన్నందు వలన కరువు నివారణ కోసం ఉద్దేశించిన నీటిపారుదల ప్రాజెక్టులకు అధికారి కూడా బాధ్యత వహించాను. నేను ఈ హోదాలో సుమారు 18 నెలలు పని చేశాను. జిల్లాల నుంచి ఇంజనీర్లు పంపిన ప్రతిపాదనల పరిశీలించడం, కొన్ని సందర్భాల్లో విమర్శలు మరియు ప్రాజెక్టుల పునర్ పరిశీలనలు, కొత్త పథకాల అభివృద్ధికి సూచనలు చేయడం నా పనిగా ఉండేది. ఈ పనులన్నీ సెంట్రల్ డివిజన్‌కు ఇంచార్జ్ చీఫ్ ఇంజనీర్ లేదా సూపరింటెండింగ్ ఇంజనీర్ పర్యవేక్షణలో అతని పేరు మీద జరిగేవి.

***

Exit mobile version