ముందుమాట:
[dropcap]నా[/dropcap] ఉద్యోగ జీవితపు అనుభవాలను సంక్షిప్తంగా, సాధికారికంగా నమోదు చేయడమే ఈ పుస్తకం ప్రాథమిక లక్ష్యం.
పుస్తకం చివరలో చేర్చిన మూడు విభాగాలు ఈ తరహా రచనల విషయంలో ఒక కొత్త పోకడగా, ఒక అసాధారణమైన అంశంగా పాఠకులకు తోచవచ్చు. ఈ మూడు విభాగాలు పుస్తకం ప్రధాన అంశాలతో సంబంధం లేని అంశాలు కాబట్టి ఈ రకమైన భావన పాఠకులకు కలిగే అవకాశం ఉన్నది. ఈ విషయంపై కొంత వివరణ ఇవ్వవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. సుదీర్ఘమైన ఉద్యోగ జీవితంలో నాకు అనుభవంలోకి వచ్చిన, నేను నేర్చుకున్న అంశాలను సంక్షిప్తంగా వివరించి జాతీయ స్థాయిలో అమలు పరచాలన్న లక్ష్యంతోనే ఈ మూడు విభాగాలను పుస్తకంలో చేర్చాను. ఇవి సమగ్రంగా లేకపోయినా రేఖామాత్రంగా నైనా ఈ దేశం దృష్టికి తీసుకురావాలని భావించాను.
అసాధారణమైన మార్పులు, మరి కొన్ని విప్లవాత్మకమైన మార్పులు ఇటీవలి కాలంలో మనం గమనిస్తున్నాము. ఇవి ఇకముందు కూడా కొనసాగవచ్చు కూడా. భారత ఉపఖండం విభజనకు గురి అయ్యింది. ఉప ఖండపు ప్రధాన భూభాగమైన భారతదేశం ఒక సర్వ సత్తాక గణతంత్ర రాజ్యంగా ఉనికిలోకి వచ్చింది.
పనిలో నాణ్యత, సమర్థత, పని పట్ల శ్రద్ధ, జీవన స్థితిగతులు.. వీటన్నిటిని దృష్ట్యా పరిశీలిస్తే భారతదేశానికి ఇతర అభివృద్ది చెందిన దేశాలకు కొట్టొచ్చినట్టు కనిపించే వ్యత్యాసాలు ఉన్నాయి. అమెరికా ఇందుకు ఒక ప్రస్ఫుటమైన ఉదాహరణ.
నా జీవిత కాలంలోనే భారత దేశం జనాభా రెండింతలు పెరిగింది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం అయినప్పటికీ వేగంగా పెరుగుతున్న దేశ జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నది. మన దేశం సమర్థత అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నది. స్వాతంత్ర్య ఫలాలు అందాలంటే ప్రజల అలవాట్లు, అక్షరాస్యత, ప్రపంచ పరిణామాలపై అవగాహన, పనిలో సమర్థత మరియు ఉత్పాదకత తదితర అంశాలలో ప్రచండమైన మార్పు రావాలి. ప్రజలు ఎక్కువ పని చేయాలి. ఎక్కువ ఉత్పత్తిని సాధించాలి. ప్రపంచ దేశాలతో పోటీ పడి నెగ్గుకు రావాలంటే, భారతదేశ భవిశ్యత్తు ఆశాజనకంగా ఉండాలంటే భారత ప్రభుత్వ ఆర్థిక విధానాలలో సమూల మార్పులు చోటు చేసుకోవాలి.
భారతదేశం యధాతథ స్థితిలో కొనసాగడానికి, ప్రణాళికా రహిత దేశంగా మనుగడ సాగించడానికి, అభివృద్ది చెందని దేశంగా మిగిలిపోవడానికి ఇంకెంత మాత్రం వీలు లేదు. విశాలమైన జనాభా కలిగిన భారతదేశం ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో సంభవిస్తున్నపురోగతి పట్ల విజ్ఞానం కొరవడడం, నూతన వ్యాపారపరమైన మెళకువలు అలవర్చుకోలేకపోవడం, నిర్మాణాత్మక దృక్పథం, సృజనాత్మక శక్తి లేకపోవడం వలన భారతదేశం భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.
ఈ పుస్తకం రాత ప్రతిని చదివి పుస్తకాన్ని మరింత బాగా వెలువడటానికి విలువైన సలహాలు, సూచనలు చేసిన ముగ్గురు నలుగురు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మోక్షగుండం విశ్వేశ్వరాయ
15 ఏప్రిల్ 1951