[box type=’note’ fontsize=’16’] “సీడీల కాలంలో కష్టపడి పనిచేసే వాళ్ళు, వంద కోట్ల టర్నోవర్ గల ఒక సామ్రాజ్యంగా నిలబెట్టారు. ఇక సినిమాలే తీయాల్సి వచ్చేసరికి ఎందుకో ఆసక్తి తగ్గింది” అంటూ మాలీవుడ్ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]
[dropcap]ప్రాం[/dropcap]తీయ సినిమాలు పుట్టుకతో కొత్త వేదికలు వెతుక్కుంటున్నాయి. సినిమాలు ప్రదర్శించడానికి థియేటర్లే అవసరం లేదని కొత్త ఫార్మాట్లు సృష్టించుకుంటున్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, భేషజాలకీ అర్భాటాలకీ పోకుండా, ప్రాంతీయంలో ఉప ప్రాంతీయాన్ని కూడా ఉన్నంతలో ఒక బుల్లి పరిశ్రమగా మార్చుకుంటున్నాయి. ఇలాటి ఒక మాలీవుడ్ పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో మీరట్ కేంద్రంగా అలరారుతోందని చాల తక్కువ మందికి తెలుసు. మాలీవుడ్ అంటే మలయాళ సినిమా పరిశ్రమ అనే తెలుసు. కానీ మీరట్ మూవీస్ కూడా మాలీవుడ్ పేరుతోనే దర్జాగా వెలిగిపోతున్నాయి. గల్లీగల్లీలో ఇంటింటా సీడీల రూపంలో సినిమాలు చేరిపోతున్నాయి. సీడీ కొను, మన సినిమా చూడు- పద్ధతిన వసూళ్ళ పద్దులు రాసుకుంటున్నాయి. రాసుకుంటూ రాసుకుంటూ ఒక్క ఉదుటున ప్రాణ సంకటంలో కూడా పడ్డాయి సీడీలే దెబ్బతీయడంతో!
మీరట్‌కో పరిపుష్టమైన చరిత్ర, భాషా, కళలూ, సంస్కృతీ వున్నాయి. కాబట్టి వీటిలోంచి స్థానిక సినిమాలు పుట్టించవచ్చని, వాటితో మీరట్ చుట్టు పక్కల గ్రామీణ ప్రేక్షకులతో కొత్త మూవీ మార్కెట్‌ని సృష్టించవచ్చనీ ఆలోచన చేసినవాడు నటుడు, మిమిక్రీ కళాకారుడు కమల్ ఆజాద్. 2000 సంవత్సరంలో ఇతను తన జోకుల్ని ఆడియో సీడీల ద్వారా సరఫరా చేయడం మొదలెట్టడంలో మాలీవుడ్‌కి పునాది పడింది. దీనికి ముందు 1990లలో ఆడియో టేపులలో కామెడీ ప్రోగ్రాములు విడుదల చేసేవాడు లోకల్ హర్యాన్వీ భాషలో. ఈ లోకల్ హర్యాన్వీ భాషని మీరట్‌తో పాటు, మరికొన్ని పశ్చిమ యూపీ జిల్లాలు, ఢిల్లీ పరిసరాల్లో నేషనల్ కేపిటల్ రీజియన్, రాజస్థాన్ సరిహద్దూ మొదలైన ప్రాంతాల ప్రజలు మాట్లాడతారు.
1990ల తర్వాత ఆడియో టేపులు అంతరించి సీడీలు రావడంతో, 2000 నుంచి కమల్ ఆజాద్ సీడీల్లో జోకులు విడుదల చేయడం మొదలెట్టాడు. సీడీలతో జోకుల మార్కెట్ ఊపందుకోవడంతో టీ – సిరీస్, మాసర్ బేర్ వంటి సంస్థలు రంగప్రవేశం చేసి మార్కెట్‌ని ఆక్రమించాయి. మరెందరో కళాకారులు పుట్టుకొచ్చారు. ఇక కమల్ ఆజాద్ ఇలా కాదని, సీడీ ఫార్మాట్‌ని పూర్తి స్థాయిలో వీడియో రూపంలో వాడుకోవాలని టీ – సిరీస్‌తో కలిసి కామెడీ వీడియోలు తీయసాగాడు. దీంతో అప్పటి వరకూ వున్న గ్రామీణ హర్యాన్వీ శ్రోతలు కాస్తా ప్రేక్షకులై పోయారు. 40 నిమిషాల ఆ వీడియో కామెడీలని తమ భాషలో సినిమాలుగానే భావించుకుని, ప్రాంతీయ భావోద్వేగాలతో గుండెలకి హత్తుకోసాగారు. తమ భాష మాట్లాడుతున్న నటులకి ఫ్యాన్స్ అయిపోయారు. ఓ పక్క బాలీవుడ్ హిందీ సినిమాలు ఆడుతూనే వున్నాయి. ఐతేనేం వీడియో కామెడీలు కొనుక్కుని ఇంట్లో తనివితీరా ఎంజాయ్ చేయడం మొదలెట్టారు.
ఒక్కో సీడీ పాతిక రూపాయల నుంచీ 40 రూపాయలుంటుంది. వీటితో జోకుల మార్కెట్‌ని కాస్తా కామెడీ నాటకాల మార్కెట్‌గా విస్తరించాడు కమల్ ఆజాద్. ఈ కామెడీ నాటకాలు కాస్తా కామెడీ సినిమాల మజిలీకి చేరాయి.
2006 కల్లా మాలీవుడ్ సీడీ సినిమాల మార్కెట్ సుమారు 100 కోట్ల రూపాయలకు చేరిందని పరిశీలకులు అంచనా వేశారు. హిందీ సినిమాల డివిడిల అద్దెల కంటే, చవకగా మాలీవుడ్ సినిమాలు సీడీల్లో అమ్మకాలకి వుంచడమే వ్యాపార విజయ రహస్యమని తేల్చారు. 2007 నాటికి మీరట్‌లో మాలీవుడ్ 5 వేల మంది కళాకారులు, కార్మికులు, సాంకేతికులతో కిటకిట లాడుతోంది. మాలీవుడ్ వృద్ధిరేటు ఎంత వేగంగా వుందంటే 2005 కల్లా 300 సీడీ సినిమాలు నిర్మించే స్థాయికి చేరుకుని, 2007 కల్లా 2000 సీడీ సినిమాలు తీసే ఘనత సాధించింది.
2004లో ‘ధకడ్ ఛోరా’ అనే సీడీ సినిమా పెద్ద హిట్టయ్యింది. మాలీవుడ్‌కి ఇది మైలురాయి అని చెప్పుకుంటారు. బాలీవుడ్‌కి ‘షోలే’ ఎంతో, మాలీవుడ్ కి ‘ధకడ్ ఛోరా’ అంత. ఇందులో నటించిన హీరోయిన్ ‘మిస్ మీరట్’ సుమన్ నేగీ బాలీవుడ్ హీరోయినై పోయింది. హీరో ఉత్తమ్ కుమార్ మాలీవుడ్ సల్మాన్ ఖాన్ ఐపోయాడు. మీరట్‌లో మాలీవుడ్ ఫిలిం అసోషియేషన్ కూడా వుంది. దీని అధ్యక్షుడు సందీప్ కుమార్. ‘ధకడ్ ఛోరా’ మాలీవుడ్ తడాఖా ఏంటో చూపిందని ఈయన మీసం తిప్పుతాడు. అప్పటివరకూ వీడియో హేండీ కామ్స్‌తో షూట్ చేసేవారు. ‘ధకడ్ ఛోరా’ బ్లాక్ బస్టర్ తర్వాత అడ్వాన్సుడు వీడియో కెమెరాలు వాడడం మొదలెట్టారు. కర్మ్ వీర్, ఆపరేషన్ మజ్ను, బుధూ రామ్, పారో తేరే ప్యార్ మే, మేరీ లడ్డూ, రాంఘర్ కీ బసంతీ మొదలైనవి అడ్వాన్సుడు వీడియో కెమెరాలతో తీసే హోదాని పొందాయి.
ఒకప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌కి ఢిల్లీకో ఇతర నగరాలకో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరట్‌లోనే స్టూడియోలు వెలిశాయి. ఎడిటింగ్, డబ్బింగ్, రీరికార్డింగ్ అన్నీ ఇక్కడే పూర్తిచేసుకునే మౌలిక సదుపాయాలు కల్పించుకుంది. పశ్చిమ యూపీ పరిసరాలే లొకేషన్లు. ఉత్తరాఖండ్‌లో కూడా షూటింగ్ చేస్తారు. కొన్నిసార్లు ఢిల్లీ, ముంబాయిల నుంచి రచయితల్ని, టెక్నీషియన్లనీ పిలిపించుకుని క్వాలిటీ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తారు. ఇతర రంగాల వాళ్ళు కూడా ‘కలాపోసన’ చేద్దామని మాలీవుడ్ కొచ్చేస్తున్నారు. అడ్వొకేట్ చౌదరీ యోగేంద్ర సింగ్ ఇలా వచ్చిన వాడే. ఈయన లక్షన్నర పెట్టుబడి పెట్టి ‘ఖేల్ కిస్మత్ కే నామ్’లో నటించాడు.
మాలీవుడ్ అనుసరించేదంతా బాలీవుడ్‌నే. మాలీవుడ్ ఇతర ప్రాంతీయ సినిమాల్లాగా స్థానిక అస్తిత్వాల్ని చాటే వాస్తవిక సినిమాలతో మొదలు కాలేదు. స్థానిక అస్తిత్వాల ప్రాంతీయ సినిమాలే తర్వాత ప్రపంచీకరణ గాలివాటులో పక్కా ముదురు పాకం కమర్షియల్ మసాలాలుగా మారిపోయిన నేపధ్యంలో, సరీగ్గా ఈ గాలివాటు కాలంలోనే 2000లో మాలీవుడ్ జన్మ పోసుకుంది కాబట్టి, దీనికి అస్తిత్వాల బాధ పట్టలేదు. పుట్టడం పుట్టడమే కమర్షియల్ కామెడీలై పుట్టింది.
కాబట్టి బాలీవుడ్ సరళిలోనే అలాటి సినిమాలు తీయడం వైపుగా మళ్ళింది. బాలీవుడ్‌లో సీక్వెల్స్ తీస్తున్నారని మాలీవుడ్ కూడా ‘ధకడ్ ఛోరా-2’ సీక్వెల్ తీసింది. ఎక్కడ డబ్బుంటే అక్కడ బయటి వాళ్ళూ చేరతారు. బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు కూడా మాలీవుడ్‌లో చేరుతున్నారు. బాలీవుడ్‌లో పాతికేళ్ళున్న దర్శకుడు మహ్మద్ హనీఫ్ ఇక్కడే సెటిలై పోయి, లోఫర్, అంగార్ హీ అంగార్, ప్యార్ కీ జంగ్ అనే సినిమాలు తీశాడు. మరో బాలీవుడ్ దర్శకుడు ఎస్ యూ సయీద్ ‘రాం ఘర్ కీ బసంతీ’ తీశాడు. దివంగత బాలీవుడ్ రచయిత, కమెడియన్ కాదర్ ఖాన్ కూడా ‘ కుంబా’ అనే కామెడీలో నటించాడు. చాలా మాలీవుడ్ సినిమాల్లో ప్రసిద్ధ బాలీవుడ్ సింగర్స్ అల్కా యాజ్ఞిక్, ఉదిత్ నారాయణ్‌లు కూడా పాటలు పాడారు.
ఇదంతా మాలీవుడ్‌కి మహర్దశ. స్వర్ణ యుగం. 2009లో వచ్చి పడింది కష్టకాలం. సీడీ సినిమాల్ని పైరసీ తినెయ్య సాగింది. మాలీవుడ్ సామ్రాజ్యానికి పునాది అయిన సీడీ వేదికనే బీటలు వారింది. పైరసీ వల్ల కనీసం పెట్టుబడి వెనక్కి వచ్చే దిక్కులేకుండా పోయింది. అయినా మాలీవుడ్‌ని వదిలేసి ఎవరూ వెళ్ళిపోలేదు. ఇక థియేటర్‌లని ఆశ్రయించి సినిమాలు తీయడమే పరిష్కారంగా భావించారు. కొత్త ప్రయాణానికి సమకట్టారు. సినిమా కెమెరాలు తెప్పించుకున్నారు. ఇతర సినిమా టెక్నాలజీ అంతా సమీకరించుకున్నారు. మీరట్, భాగ్పత్, ముజఫర్ నగర్, షామ్లీ, హాపూర్ వంటి పట్టణాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుని సినిమాలు తీసి ప్రదర్శించడం మొదలెట్టారు. అయితే వీటి బడ్జెట్‌ని భరించలేక నిర్మాతలు వెనక్కి తగ్గడం మొదలెట్టారు. వేద్వాన్ అనే నిర్మాత దీనికో మార్గం కనిపెట్టాడు, 16 ఎంఎం లో నిర్మించాలని. ‘నట్ఖట్’ అలా నిర్మించి సక్సెస్ అయ్యాడు. దీంతో నిర్మాతలు మళ్ళీ రాసాగారు.
2014 కల్లా మల్టీప్లెక్స్‌కి ప్రమోటయ్యాయి మాలీవుడ్ సినిమాలు. వేద్వాన్ తీసిన ‘డియర్ వెర్సస్ బేర్’ ని ప్రదర్శించడానికి మల్టీప్లెక్స్ నిర్వాహకులు ఒప్పుకోలేదు. హర్యాన్వీ సినిమా ఎవరూ చూడరనీ, ఒక్క అట వేసి తీసేస్తే మీకే అవమానమనీ నిరుత్సాహ పరచారు. అవమానానికి సిద్ధమని చెప్పి, సినిమా ప్రదర్శిస్తే ప్రతీ రోజూ హౌస్‌ఫుల్‌తో ఆడింది. రాణీ ముఖర్జీ నటించిన బాలీవుడ్ మూవీ ‘మర్దానీ’ని తీసేయాల్సి వచ్చింది.
దీంతో ప్రదర్శనలకి థియేటర్ల సమస్య తీరింది. సినిమాలు బాగానే తీస్తున్నారు. అయితే ఏది ఎప్పుడు విడుదల అవుతుందో చెప్పలేని పరిస్థితి. తేదీలు మారిపోతూ వుంటాయి. దీనికి కారణం నిర్మాణంలో ఇదివరకటి వృత్తితత్వ్తం లోపించడమే. సీడీల కాలంలో కష్టపడి పనిచేసే వాళ్ళు. వంద కోట్ల టర్నోవర్ గల ఒక సామ్రాజ్యంగా నిలబెట్టారు. ఇక సినిమాలే తీయాల్సి వచ్చేసరికి ఎందుకో ఆసక్తి తగ్గింది. అప్పుడప్పుడు తీసే సినిమాలకి పనిచేసే వాళ్ళు కూడా బాలీవుడ్ వెళ్ళిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మాలీవుడ్ మీద దృష్టి పెట్టడం లేదని కాదు, అన్ని సహాయ సహకారాలూ అందించడానికి సిద్ధంగానే వుంది. కానీ పిల్చినా మాలీవుడ్ నుంచి ప్రతినిధులెవరూ పోవడం లేదు.
విచిత్ర పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే మాలీవుడ్‌కి ఎంతకాలం మనుగడ వుంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.