నీలి నీడలు – ఖండిక 7: మూఢాచారములు

0
3

దేవతలకును, నరులకు, దివ్యమైన
జన్నములకును మూఢతన్ జంతువులను
బలిమి బలిజేయుచుండుటీ భారతాన
హేయమౌచర్యయగుగాదె? హీనమవదె? (12)

తమదుస్వార్ధమ్ము కొఱకునైధాత్రి ప్రజకు
వివిధ ప్రాణులజంపుట వేడుకయ్యె
నెపములెన్నింటినో చెప్పినేర్పుమీర
నాశమొనరించుచుండిరీ దేశకీర్తి. (13)

మా మతముగొప్పదంచును
మా మతమే గొప్పదంచు మరిమరి ప్రజలున్
భూమిని జగడములాడుచు
సేమంబను మాట మరచి చెలగుదురెపుడున్. (14)

మమత సుంతలేని, మానవత్వములేని
మతములెన్నియున్నకుతలమందు
మాట మంచియున్నె? మనుగడ ప్రజకున్నె?
శాంతి దాంతులున్నె? సౌఖ్యమున్నె? (15)

మతము పేరుజెప్పి మంటలన్ రేపెడు
దుండగీళ్ళు కలరు మెండుగాను;
పెచ్చుమీరి జనులు ప్రేమభావాలకు
చేటుగూర్చుకెంచ, క్షేమమగునె? (16)

మతము మత్తుగాదు, మౌఢ్యయుతముగాదు
సమతమమతకిరవు శాంతినెలవు
అట్టిమతము ప్రజకుననుసరణీయంబు
అదియె సంఘమునకు ముదముగూర్చు. (17)

కొన్నికులములందు, కొన్ని జాతులయందు
కొన్ని ప్రాంతములందు కొన్ని యెడల
ఒక వంశమందునో ఒక్క గ్రామమునందో
ఒక కుటుంబమునందో, యెక్కస్త్రీని
పెండ్లిపేరంటాలు పేరేమి లేకుండ
బలవంతముగనామె బ్రతుకునంత
దేవదాసిగగాని, దివ్యబస్విగగాని
జోగినిగనుగాని క్షుద్రబుద్ది
చేసి, ముందుగ నామెను శ్రీశునకును
పిదప చెందును సంఘపు పెద్దకనుచు
అంతమీదట నందరికౌనటంచు
నిర్ణయము చేయచుండుట నీతియగున? (18)

ఒక్కయువతని బల్మినిదిక్కులేని
దానిగనుజేసి యటమీద దగనిరీతి
సంఘమునకంత వర్తించుచానగాను
అవనిజేయగ జనులకు హక్కుగలదె? (19)

దివ్యమైనట్టి భారతదేశమందు
ఎందరెందరో యువతులు నిట్టిదుష్ట
సంప్రదాయపు టాచారసరళిలోన
నలిగిపోవుచునుండిరో తెలియవశమె. (20)

మంత్రములను జెప్పి మనుజుల ప్రాణాలు
తీయుచుందురనుచు హేయముగను
తెలివిమాలినట్టి తలపులజేతురు
తప్పుత్రోవబట్టి ధాత్రిప్రజలు. (21)

‘క్షుద్రశక్తుల’వెంతో క్షోభలంగూర్చును
‘కాష్మోర’ జనులను గాల్చివేయు
‘చేతబడి’ సతతంబు భూతలంబందున
చిత్రహింసలుబెట్టి చెలగుచుండు
ప్రజలదౌప్రాణాలు పలువిధాలుగ దీయు
ఆ ‘బాణమతి’కరంబడ్డులేక
మంత్రప్రయోగాలు, తాంత్రికశక్తులు
ప్రజలను కష్టాలపాలుజేయు
అనుచు సతతంబు జనులెల్లనజ్ఞలగుచు
మౌఢ్యభావాన నమ్ముచు మహినివాని
భయముతోడను జాస్తిగా వణకుచుండి
బ్రతుకులను నీడ్చుచుండిరి వెతలబడుచు. (22)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here