దివ్యమంత్రశక్తి దేజరిల్లెడునట్టి
వేదవేత్తనైన వింతరీతి
చేతబడులు చేయు చెడ్డవానిగనెంచు
మూఢనమ్మకంబుగాఢమయ్యె. (23)
చిలుకజోస్యమనుచు, జేతిరేఖలటంచు
ఎఱుకసానిసోది కిష్టపడుచు
నమ్ముచుండ్రి జనులు నానారకాలుగా
జ్ఞానశూన్యులగుచు జగమునందు. (24)
పెరిగిపోవుచుండె కరముగ ప్రజలకు
జాతకముల పిచ్చి భూతలాన
జరగబోవునదియు జరుగక మానునా?
కలిని జాతకముల దెలిసినంత. (25)
వాస్తువెఱ్ఱి ముదిరె వసుధా తలంబందు
జనగణంబునకును జాస్తిగాను
వాస్తుకు సరిజేయువంకతో నిండ్లెన్నొ
పగులగొట్టుచుండ్రి తెగువజేసి. (26)
వాస్తు గూర్చిచెప్పు ప్రముఖుల మాటలు
వినిన యంతమదికి వింతదోచు
ఇలను వాస్తుచెప్పు నిద్దరి మాటలు
ఒకటి గానియట్టి యొరవడయ్యె. (27)
ఏదినిజమొ కాని దేమిటోజగతిని
తెలియజాలనట్టి తీరులోన
ప్రజకు జెప్పుచుండ్రి వాస్తు శాస్త్రజ్ఞలు
స్వార్ధబుద్ధి తోడ జంకులేక. (28)
పూనకంబులనుచు, జ్ఞానబోధలటంచు
ప్రజను మభ్యపెట్టి ప్రతిదినంబు
వలయు ధనమునంత ప్రబలమౌ రీతిగా
దండుకొనుట వారిదారియయ్యే. (29)
అమ్మవారుబూను నవనినితనకంచు
కల్లబొల్లివైన కదలనెన్నొ
చెప్పి మోసగించుస్త్రీల మాటలనమ్మి
మునిగిపోవుచుండ్రి జనులు సతము. (30)
శాస్త్రవృద్ధి యింతజరిగిన జగతిలో
పూనకములనమ్మ జ్ఞానమగున?
ఎందుకిట్లు ప్రజలు నిట్టిమౌఢ్యంబున
తిరుగుచుండినారో తెలియలేము. (31)
గాలిపట్టెననుచు, ధూళిసోకెనటంచు
భూతప్రేతములును బూనెనంచు
అర్థహీనమైన నామౌఢ్యమున జనుల్
భీతినందుచుంట వింతగాదె. (32)
ఇంకమీదనైన నిట్టిదుశ్చర్యలన్
ఆపుజేయకున్ననవని ప్రజకు
మేలు జరుగుటన్న మించిన కార్యమౌ
దీని మఱువ దగదు దేశమంత. (33)
ఇట్టినీలినీడలింకెంతమాత్రము
వసుధ జనులపైన వాలకుండ
విజ్ఞులైనవారు విజ్ఞానమందించి
ఇలను జనుల మేలుకొలుప వలయు. (34)