[box type=’note’ fontsize=’16’] “నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది ఏడవ ఖండిక ‘అస్పృశ్యత’. [/box]
[dropcap]మూ[/dropcap]ఢాచారములు – ‘నీలి నీడలు’ ఖండకావ్యంలోని ఏడవ ఖండిక.
***
విశ్వమందున విజ్ఞానవిషయమునను
పూర్వకాలంబునుండి యపూర్వరీతి
అగ్రగామియటంచును ననుదినంబు
ప్రస్తుతివహించి వెలిగెను భారతంబు (1)
దివ్యమైనట్టి మనదేశ భవ్యచరిత
ఎంతగొప్పదో తెలియదలంతుమేని
భరతవిజ్ఞానమొకనాడు శరణమనుచు
చక్కగా పొంది వెలుగు దేశాలెసాక్షి (2)
చాలదేశములును జ్ఞానవిషయమున
కన్నుదెఱవనట్టికాలమందె
వివిధదేశములకు విజ్ఞానభిక్షను
అందజేసినట్టియవనిమనది. (3)
ఎంతవిజ్ఞానయుతమైననేమిఫలము
భరతదేశపువాసిని పాడుజేయు
మౌఢ్యభావాలుగల యట్టిమనుజులిలను
చెడ్డయాచారసరళితో సాగుచుండ. (4)
మైసమ్మయంచును, మద్దిరామమ్మంచు
సత్తెమ్మయంచును, సైదులనుచు
సమ్మక్కయంచును, సారక్కయంచును
ఎల్లమ్మయంచుపోలేరటంచు
తిరుపతమ్మంచును ధరపైడితల్లంచ!
అంకమ్మయంచు గంగమ్మయనుచు
ఉగ్రకాళియటంచు మప్పలమ్మంచును
వీరులకొలుపంచుమారియంచు
గ్రామదేవతలంచును నీమమునను
పూజలను చేయ సమయాన పుష్కలముగ
గొఱ్ఱెలను, మేకలను, కోళ్ల గోయుచుండి
జంతుబలులను జేయుట సహజమయ్యె. (5)
జీవములడుల్చి కరముగదేవతలకు
వండి వడ్డించిపెట్టినదండిగాను
మంచి జరుగును మనకంచు మనుజగణము
అవని దలపోయుచుండుటయజ్ఞతకద. (6)
మనదు స్వార్థమ్ము కొఱకు నైమహినిబరగు
మూగజీవాల వధియించి ముష్కరులయి
భారతంబున జనులుండ ప్రముఖముగను
ప్రాణికోటికి జీవించు భాగ్యమున్నె? (7)
సాటి ప్రాణుల కరముగ జంపుహక్కు
నరునికెవరిచ్చినారలిద్ధరణి యందు
ప్రాణములు దీయుటన్నది ప్రజ్ఞయగున?
తలచనధమాధమంబది దనుభచర్య. (8)
అంటురోగాల బోగొట్టనడవితల్లి
కొండదేవత తానుగాగోరెననుదు
నరబలులనిచ్చు నాచారసరళియుండె
అజ్ఞతకు మారుపేరగు నడవి జనుల. (9)
లంకెలబిందెలకొఱకని
జంకేమాత్రమును లేక జగతిని మనుజుల్
గొంకక జంతుల బలినిడి
చంకలుగొట్టుచును నుండ సబబే యరయన్. (10)
వేదవేదాంగ విదులు నేవిప్రవరులె
విజ్ఞతనువీడి యజ్ఞులైవింతరీతి
మేథములయందు నల్లనిమేకలిలను
చంపు చుంట జాతికి తలవంపుగాదె?(11)
దేవతలకును, నరులకు, దివ్యమైన
జన్నములకును మూఢతన్ జంతువులను
బలిమి బలిజేయుచుండుటీ భారతాన
హేయమౌచర్యయగుగాదె? హీనమవదె? (12)
తమదుస్వార్ధమ్ము కొఱకునైధాత్రి ప్రజకు
వివిధ ప్రాణులజంపుట వేడుకయ్యె
నెపములెన్నింటినో చెప్పినేర్పుమీర
నాశమొనరించుచుండిరీ దేశకీర్తి. (13)
మా మతముగొప్పదంచును
మా మతమే గొప్పదంచు మరిమరి ప్రజలున్
భూమిని జగడములాడుచు
సేమంబను మాట మరచి చెలగుదురెపుడున్. (14)
మమత సుంతలేని, మానవత్వములేని
మతములెన్నియున్నకుతలమందు
మాట మంచియున్నె? మనుగడ ప్రజకున్నె?
శాంతి దాంతులున్నె? సౌఖ్యమున్నె? (15)
మతము పేరుజెప్పి మంటలన్ రేపెడు
దుండగీళ్ళు కలరు మెండుగాను;
పెచ్చుమీరి జనులు ప్రేమభావాలకు
చేటుగూర్చుకెంచ, క్షేమమగునె? (16)
మతము మత్తుగాదు, మౌఢ్యయుతముగాదు
సమతమమతకిరవు శాంతినెలవు
అట్టిమతము ప్రజకుననుసరణీయంబు
అదియె సంఘమునకు ముదముగూర్చు. (17)
కొన్నికులములందు, కొన్ని జాతులయందు
కొన్ని ప్రాంతములందు కొన్ని యెడల
ఒక వంశమందునో ఒక్క గ్రామమునందో
ఒక కుటుంబమునందో, యెక్కస్త్రీని
పెండ్లిపేరంటాలు పేరేమి లేకుండ
బలవంతముగనామె బ్రతుకునంత
దేవదాసిగగాని, దివ్యబస్విగగాని
జోగినిగనుగాని క్షుద్రబుద్ది
చేసి, ముందుగ నామెను శ్రీశునకును
పిదప చెందును సంఘపు పెద్దకనుచు
అంతమీదట నందరికౌనటంచు
నిర్ణయము చేయచుండుట నీతియగున? (18)
ఒక్కయువతని బల్మినిదిక్కులేని
దానిగనుజేసి యటమీద దగనిరీతి
సంఘమునకంత వర్తించుచానగాను
అవనిజేయగ జనులకు హక్కుగలదె? (19)
దివ్యమైనట్టి భారతదేశమందు
ఎందరెందరో యువతులు నిట్టిదుష్ట
సంప్రదాయపు టాచారసరళిలోన
నలిగిపోవుచునుండిరో తెలియవశమె. (20)
మంత్రములను జెప్పి మనుజుల ప్రాణాలు
తీయుచుందురనుచు హేయముగను
తెలివిమాలినట్టి తలపులజేతురు
తప్పుత్రోవబట్టి ధాత్రిప్రజలు. (21)
‘క్షుద్రశక్తుల’వెంతో క్షోభలంగూర్చును
‘కాష్మోర’ జనులను గాల్చివేయు
‘చేతబడి’ సతతంబు భూతలంబందున
చిత్రహింసలుబెట్టి చెలగుచుండు
ప్రజలదౌప్రాణాలు పలువిధాలుగ దీయు
ఆ ‘బాణమతి’కరంబడ్డులేక
మంత్రప్రయోగాలు, తాంత్రికశక్తులు
ప్రజలను కష్టాలపాలుజేయు
అనుచు సతతంబు జనులెల్లనజ్ఞలగుచు
మౌఢ్యభావాన నమ్ముచు మహినివాని
భయముతోడను జాస్తిగా వణకుచుండి
బ్రతుకులను నీడ్చుచుండిరి వెతలబడుచు. (22)
దివ్యమంత్రశక్తి దేజరిల్లెడునట్టి
వేదవేత్తనైన వింతరీతి
చేతబడులు చేయు చెడ్డవానిగనెంచు
మూఢనమ్మకంబుగాఢమయ్యె. (23)
చిలుకజోస్యమనుచు, జేతిరేఖలటంచు
ఎఱుకసానిసోది కిష్టపడుచు
నమ్ముచుండ్రి జనులు నానారకాలుగా
జ్ఞానశూన్యులగుచు జగమునందు. (24)
పెరిగిపోవుచుండె కరముగ ప్రజలకు
జాతకముల పిచ్చి భూతలాన
జరగబోవునదియు జరుగక మానునా?
కలిని జాతకముల దెలిసినంత. (25)
వాస్తువెఱ్ఱి ముదిరె వసుధా తలంబందు
జనగణంబునకును జాస్తిగాను
వాస్తుకు సరిజేయువంకతో నిండ్లెన్నొ
పగులగొట్టుచుండ్రి తెగువజేసి. (26)
వాస్తు గూర్చిచెప్పు ప్రముఖుల మాటలు
వినిన యంతమదికి వింతదోచు
ఇలను వాస్తుచెప్పు నిద్దరి మాటలు
ఒకటి గానియట్టి యొరవడయ్యె. (27)
ఏదినిజమొ కాని దేమిటోజగతిని
తెలియజాలనట్టి తీరులోన
ప్రజకు జెప్పుచుండ్రి వాస్తు శాస్త్రజ్ఞలు
స్వార్ధబుద్ధి తోడ జంకులేక. (28)
పూనకంబులనుచు, జ్ఞానబోధలటంచు
ప్రజను మభ్యపెట్టి ప్రతిదినంబు
వలయు ధనమునంత ప్రబలమౌ రీతిగా
దండుకొనుట వారిదారియయ్యే. (29)
అమ్మవారుబూను నవనినితనకంచు
కల్లబొల్లివైన కదలనెన్నొ
చెప్పి మోసగించుస్త్రీల మాటలనమ్మి
మునిగిపోవుచుండ్రి జనులు సతము. (30)
శాస్త్రవృద్ధి యింతజరిగిన జగతిలో
పూనకములనమ్మ జ్ఞానమగున?
ఎందుకిట్లు ప్రజలు నిట్టిమౌఢ్యంబున
తిరుగుచుండినారో తెలియలేము. (31)
గాలిపట్టెననుచు, ధూళిసోకెనటంచు
భూతప్రేతములును బూనెనంచు
అర్థహీనమైన నామౌఢ్యమున జనుల్
భీతినందుచుంట వింతగాదె. (32)
ఇంకమీదనైన నిట్టిదుశ్చర్యలన్
ఆపుజేయకున్ననవని ప్రజకు
మేలు జరుగుటన్న మించిన కార్యమౌ
దీని మఱువ దగదు దేశమంత. (33)
ఇట్టినీలినీడలింకెంతమాత్రము
వసుధ జనులపైన వాలకుండ
విజ్ఞులైనవారు విజ్ఞానమందించి
ఇలను జనుల మేలుకొలుప వలయు. (34)