మూడో జన్మ

3
2

[dropcap]”యూ[/dropcap] డర్టీ ఓల్డ్ ఇడియట్!”

చెంప ఛెళ్ళుమంది.

మసక చీకటిగా వున్న విశాలమైన ఆఫీసు గది ఒక్కసారిగా మరింత అంధకారమై మళ్ళీ మెరుపు వెలుగుతో వెలిగినట్లనిపించింది.

పెద్ద మహాగనీ టేబుల్ వెనుక నున్న మెత్తటి లెదర్ కుర్చీలోంచి ముందుకు వంగి పెర్‍ఫ్యూంలు వెదజల్లే ఆమె పెదాలను చుంబించబోయిన గౌతమ్‍రావ్ బాధగా చెంపలు తడుముకున్నాడు.

షాక్!

ఆ పిల్ల అందంగా వుంది – ముప్ఫై ఏళ్ళు దాటవేమో. కళ్ళల్లో ఆకర్షణ వుంది. బిగువైన శరీరం. యవ్వనంలో వచ్చే హొయలూ…

తన పర్సనల్ సెక్రటరీ సోనూ!

ఆఫీసులో అందరూ వెళ్ళిపోయేదాక ఆగమని, ఆగేటట్లు చేయాలని ఏదో పని చెప్పాడు.

గత మూడు సంవత్సరాల టాక్స్ వివరాలు, జిఎస్‍టి వివరాలు అన్నీ కాపీ తీసి ప్రింటవుట్ తీసి తీసుకురమ్మన్నాడు.

ఆమె వచ్చేసరికి ఏడు గంటలు దాటింది.

అప్పటికే షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేశాడు. గార్లిక్ బ్రెడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ వేడిగా పాకెట్లలో తెప్పించి వుంచాడు.

“సోనూ! వైనాట్ ఎ పెగ్ విత్ మీ!”

‘షాంపెయిన్’ ఎంతో ఖరీదైన ఫ్రెంచ్ మద్యం!

ఆమె వద్దనలేదు.

“ఛీర్స్” అనగానే, చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుని ఎర్రటి పెదాల మీద… తన పెదాలు ఆనించబోయాడు.

అప్పుడే చెంప చెళ్ళుమంది.

“యూ ఆర్ సో ఓల్డ్! ఇంత వయసు వచ్చి ముడతలు పడి వికారంగా వున్నా, ఇంకా రొమాన్స్ కావాలా సార్? సీ యువర్ ఫేస్ ఇన్ ఎ మిర్రర్! హీడియస్! అయాం నాట్ ఎటాల్ టర్నెడ్ ఆన్ బై యూ!! సారీ!”

విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తలుపు దగ్గర ఆగి అంది

“మీకు కోపం రానక్కర్లేదు. నేను రిజైన్ చేయటం లేదు. కానీ జాబ్ తీసేశారో అందరికీ మీ గురించి చెప్పవల్సి వుంటుంది. జాగ్రత్త. టేక్ కేర్! సార్, ఇంత వరకు మంచిగా  వున్నారు. అందుకని వదిలేస్తున్నాను. ఐ థింక్ యు కెన్ అండర్‌స్టాండ్!”

తలుపు మెత్తగా మూసుకుంది.

ఐదు వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం తనది. జి. ఆర్. రియల్ ఎస్టేట్స్ అధినేత తను.

భార్య పోయి అయిదేళ్ళయింది. ఒక్కగానొక్క కొడుకు ఇంకా బిజినెస్ మానేజ్‍మెంట్ చదివి, కంపెనీని నడిపే నేర్పు తెచ్చుకోవాలి. కూతురు పెళ్ళి చేసుకుని చెన్నైలో కాపురం వుంటోంది.

ఇలా ఎప్పుడూ జరగలేదు. ఆమె ధిక్కారం అతనిని బాధించలేదు. కానీ “యూ ఆర్ సో ఓల్డ్” అన్న మాట త్రిశూలం పోటులా గుండెని తాకుతోంది. లేచి బాత్‌రూమ్ లోకి నడిచి అద్దం ముందు నిలబడ్డాడు.

హీడియస్!

పూర్తిగా పల్చబడిన తల. ఓ అరడజను గడ్డిపోచల్లాంటి రంగు వేసిన వెంట్రుకలు, నిజంగానే, వంద ముడుతలు పడిన ముఖం. ఎంత ఫేషియల్ చేసి, బ్యూటీ కేర్ తీసుకున్నా, ఇంకా మెడ దగ్గర ముసలి ముడుతలతో వయసు తెలిసిపోత్తుంది.

‘హిడియస్!’

అంటే తాను అందంగా వుంటే వయస్సు తగ్గివుంటే ఒప్పుకునేదా!

‘వయసు ఒక సంఖ్య మాత్రమే!’

‘మీ వయసు మీ ఊహలో వుంది!’

‘మనసు యవ్వనంలో వుంచుకోండి.’

‘మీరు అనుకునేదే మీరు!’

ఇలాంటివన్నీ అబద్ధాలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఏమో కానీ ముసలితనం, ముసలితనమే. ఇది దేహం చేసే ఒక వైపు ప్రయాణం. ఎంత ప్రయత్నించినా దాచలేని వృద్ధాప్యం… తిరిగి రాని వయసు… తరిగిపోవడమే కాకుండా, అసహ్యాన్ని పెంచి, ఆకర్షణని వికర్షణ చేసే భయంకరమైన వృద్ధాప్యం ఇది.

హీడియస్!

తన ముఖం ముడుతలలో, కాంతిహీనమైన కళ్ళల్లో, వంగిపోయే నడుంలో, బహుశా మొత్తం తన స్వరూపంలోనే కొట్టొచ్చినట్లుందేమో! అందుకనే తన కోట్ల సంపదా, మెరిసే వజ్రపుటుంగరాలు, రోలెక్స్ వాచీ, హార్లీ స్ట్రీట్ లండన్‍లో కట్టించిన సూట్లూ… ఏవీ తన వయసును దాచలేవు.

“హీడియస్! ఐయామ్ ఓల్డ్! బ్లడీ ఓల్డ్” గౌతమ్‌రావ్ ఒక్కసారిగా నవ్వాడు. ఆ నవ్వు ముందు నిర్లిప్తంగా, ఆ తర్వాత క్రమంగా ఏమీ చేయలేని నిస్సహాయతతో చేసే విచిత్రమైన వికటాట్టహాసంలా వుంది. ఆ తర్వాత అది రోదనగా మారింది.

***

రాత్రికి ఇంటికి వచ్చేసరికి భరించలేని భయంకరమైన ఒంటరితనం గౌతమ్‌రావ్‌ని ఆవహిస్తుంది. అందుకనే అటు వెళ్ళలేదు.

‘ప్రశాంతంగా వుండే ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు!’ ఎక్కడిదో ఆ డైలాగ్ అతనికి మరింత విసుగు తెప్పించింది.

డ్రైవర్‍ని వుద్దేశించి అన్నాడు – “ఇంటికి వద్దు మునెప్పా! సెంచురీ క్లబ్‍కి పోనీ!”

సెంచురీ క్లబ్‍ మూడో అంతస్తులో కార్డ్స్ ఆడుతున్నారు. ఆ గది పక్కన బార్ వుంది. అక్కడ కూచుందామనుకున్నాడు.

కావాలాన్ కొరియన్ సింగిల్ మాల్ట్ విస్కీ, నాలుగు ఐస్ ముక్కలు, గ్యాస్‌తో పొంగే సోడా వాటర్‍తో కలిపి, తీసుకువచ్చి వినయంగా అతని ముందు పెట్టాడు బేరర్.

చిన్న ముక్కు, కళ్ళు, ఎర్రని ముఖవర్చస్సు.ఈశాన్యభారతప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి.

అతనికి గౌతమ్‍రావ్ తాగే విస్కీ ఏమిటో ముందే తెలుసు.

“గుడీవినింగ్ సర్”

“గుడ్ ఈవెనింగ్ లింగ్‍వాన్. కొంచెం పల్లీలు తెచ్చియ్యి. అంతే”

“ఓ.కె. సర్” అని కొంచెం ఆగి, “మీతో మాట్లాడానికి ఒకాయన ఎపాయింట్‍మెంట్ అడుగుతున్నాడు సర్. చాలా ముఖ్యమయిన విషయం అట. షల్ ఐ కాల్ హిమ్?” అంటూ బంగారు రంగు విజిటింగ్ కార్డు తీసి బ్లూ వీల్ ట్రేలో పెట్టాడు.

‘ధనూ. కె. మీనన్. అమృత రెజునివేటింగ్ సర్వీసెస్’.

బహుశా కేరళ కాయకల్ప చికిత్స ఏమో! లేక సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ స్టార్టప్ గురించి పెట్టుబడి కోసమో కానీ ఇక్కడ క్లబ్‍లో ఎందుకు.

“నో” అనబోయి, మళ్ళీ తమాయించుకుని, “ఓ.కె. పిలువు!” అన్నాడు.

కార్డు మీద ఎర్రని చిన్న అక్షరాలతో వుంది.

‘మీరు ఎప్పటికీ యవ్వనంలో వుండిపోతారు.’

హీడియస్!

ఇతనికి తన సమస్య ఎలా తెలుసు?

లోపలికి ఒక పొడుగాటి తెల్లటి వ్యక్తి సూట్‍లో, ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని వచ్చాడు.

“గుడీవినింగ్ మిస్టర్ గౌతమ్‌రావ్, సర్, థాంక్స్ ఫర్ యువర్ టైమ్! I am honoured.”

“క్లుప్తంగా చెబితే బావుంటుంది. పొద్దున్నుంచి పని చేసి, అలసిపోయి వున్నాను. ఇక్కడికి రిలాక్సింగ్ కోసం వస్తే…”

“మీరు నాతో మాట్లాడినందుకు విచారించరు. ముందు నా ప్రొపోజల్ వినండి. ఒకే ప్రశ్న. మీరింకా ఎంత కాలం బతుకుతారు?”

గౌతమ్‌రావ్‍కి ముందు ఆశ్చర్యం, తరువాత కోపం వచ్చాయి.

అతన్ని మాట్లాడనీకుండా ఆ వ్యక్తే అన్నాడు – “ఓ మనిషి జీవన కాలం అంచనా అంటే సాధారణంగా ప్రస్తుతం 75 మైనస్ యువర్ ఏజ్. అంటే మీరింకా 15 సంవత్సరాలు బతకడం సాధ్యం. ఆ తర్వాత మీ అదృష్టమే. ఈ మధ్యలో ఏక్సిడేంట్స్, కాన్సర్ లాంటివి రాకపోతే. ఆ తర్వాత కొన్నేళ్ళు బహుశా అదృష్టం వుంటే… గడపచ్చు. చెప్పలేం”.

గౌతమ్‍రావ్ ఏదో అనబోయి ఆగాడు. ‘మందులు, కాయకల్ప చికిత్స చెప్పబోతున్నాడేమో, వీడికి తన సెక్స్ లైఫ్ ఎలా తెలుసు?’

ఆ వ్యక్తి, ధనూ మీనన్, గొంతు సవరించుకొని అన్నాడు

“జీవితం అంటే గణాంకాలే. Statistics. మీరు మీ వయసుని బట్టి ఎదుర్కునే సమస్యలని పరిష్కరించడానికి మేం ఒక పరిష్కారం కనుగొన్నాం. ఈ ప్రెజెంటేషన్ చూడండి. మీలాంటి కుబేరులకి మాత్రమే ఇది దొరుకుతుంది. చాలా రహస్యంగా చేయబడే ప్రోగ్రామ్ ఇది.”

ఆ తర్వాత వరుసగా పవర్ పాయింట్ స్లైడ్స్‌లో అతను చూపించసాగాడు.

ఒక అందమైన దృఢకాయుడి శరీరం బల్ల మీద పడుకుని వుంది. ఆ తర్వాత ఒక ముసలి వ్యక్తి శరీరం ఆ థియేటర్‍లోకి తీసుకువచ్చారు. ఆ గది నిండా వైర్లు, కెమెరాలు, కంప్యూటర్ మానిటర్లు వున్నాయి.

ఇప్పుడు వృద్ధుడి శరీరం, యువకుడి శరీరం పక్కపక్కనే పడుకోబెట్టారు నర్సులు.

ఆ తరువాత ఇద్దరు డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ డ్రెస్‌లో వచ్చి వృద్ధుడి తల వెనుక భాగంలో ఏదో సర్జరీ లాంటిది చేశారు. ఆ తల నుంచి యువకుడి శరీరానికి ఒక వైర్ అమర్చారు.

ఆ తర్వాతి స్లైడులలో యువకుడు లేచి కూర్చున్నాడు. వృద్ధుడి శరీరం అచేతనం అయింది. మానిటర్‍లలో వృద్ధుడి ఇఇజి, ఇసిజి చలనం ఆగి, యువకుడి శరీరానికి అమర్చి వున్న మానిటర్ గ్రాఫ్‍లలో ఇఇజి, ఇసిజి తర్ంగాలు నీలంగా మెరుస్తూ ప్రవహించసాగాయి.

చివరగా చిన్న ఏనిమేషన్. యువకుడు లేచి నిలబడగానే, అతని ముఖంలో చిరునవ్వు, ఒక గ్రాఫిక్ లాంటి బొమ్మలో అతని మర్మాంగం నిటారుగా నిలబడినట్లు… కార్టూన్.

‘మెమోరీ ట్రాన్స్‌ప్లాంట్’

కొత్త శరీరంలోకి. మీరెలాగైనా బతికారు ఎన్నో సంవత్సరాలు. మేం మీ ఆత్మనీ, జ్ఞాపకాలనీ మరొక యువకుడి మెడడులో ప్రవేశపెట్టే టెక్నాలజీ సాధించాం! మీరు మరో ఏభై ఏళ్లుంటారు యవ్వనంతో!

“బ్లూ టూత్ లాగానా! కంప్యూటర్ టు కంప్యూటర్ యుఎస్‍బి కేబుల్ లానా? మైగాడ్!”

ఈసారి సింగిల్ మాల్ట్ విస్కీ కిక్ పూర్తిగా దిగిపోయింది గౌతమ్‌రావ్‍కి.

Ka… va… lan. కావాలా అనే తెలుగు మాట లాంటి పేరుగల కొరియన్ విస్కీ ఈ దృశ్యానికి సరిపోతోంది!

“మీరు మళ్ళీ యవ్వనవంతులవుతారు. కొత్త శరీరం, పాత మెమొరీతో మరొక ముప్ఫై ఏళ్ళు ఆనందంగా జీవించవచ్చు. ఆలోచించుకోండి. ఇది మేం కనిపెట్టిన కొత్త ఇన్వెన్షన్”

“మరి నా బిజినెస్, సంపదా, పేరూ ఇల్లూ… నా ఉనికీ?”

“ఎందుకు? జీవితంలో సెటిల్ అయ్యారు. కానీ శరీరం శుష్కించిపోతోంది. అవయవాలు పని చేయవు. తినలేరు, తాగలేరు. అమ్మాయిలతో గడపలేరు. దానికి ఫలితంగా తాగుతారు, ఏవేవో వ్యాపారంలో హాబీలూ, వైపరీత్యాలు… డబ్బు సంపాదించడమే వ్యసనంగా బతుకుతారు.ఇంకేం ఆశ వుండదు కాబట్టి. మేం మీకు కొత్త జీవితం చూపిస్తాం.అయితే మీ ఆస్తి మీకే ఉంటుంది. నేను చెప్పబోయేది వినండి” అతను చెప్పసాగాడు.

అతను చెప్పిన ప్రకారం ఆస్తి అంతా బిట్ కాయిన్ రూపంలో మార్చుకుని ఏదో దూర దేశం వెళ్ళిపోవాలి. వాళ్ళకి వంద కోట్ల రూపాయలు. తనకి మిగిలినవి.

తను చనిపోయినట్లు దేహం ఇంటికి వెళ్ళిపోతుంది. తన వాళ్ళు తను పోయాననే అనుకుంటారు. ఒక రహస్య హాస్పిటల్‍లో తనకు ఎనస్థీషియా ఇచ్చి యుథానాసియా లాంటి మరణం ఇస్తారు. ఎక్కడో ఏక్సిడెంట్‌లో బ్రెయిన్ డెడ్ అయిన యవ్వనవంతుని శరీరం దొరకగానే ఫోన్ వస్తుంది. ఆ సమయానికి వెళ్ళి హాస్పటల్‍లో చేరాలి, అంతే.

ఆ తర్వాత కొత్త జీవితం.

“కొడుకూ, కూతురూ, మనవళ్ళూ, బిజినెస్?”

“గౌతమ్‍రావ్‌ గారూ, మీరు మరణాన్ని జయించి తిరిగి యవ్వనవంతులవుతారు. అవన్నీ అవసరమా! కావాలంటే ఎప్పుడో వెళ్ళిచూడవచ్చు దూరం నుంచి”

ఇందాకటి ఆ పిల్ల ఛీత్కారం, నవ్వు గుర్తుకు వచ్చాయి.

హీడియస్!

గౌతమ్‌రావ్ పిడికిలి బిగుసుకుంది. ఎప్పుడూ ఓడిపోలేదు తను. ఆ పిల్ల తనదవుతుంది. ఆ అనుభవంతో తానూ,పారవశ్యంలో ఆ పిల్లా మూలుగుతుంటే అది చాలు… తనకి.

విజయం తనదే. తాను సాధించిన ఐశ్వర్యానిదే!

“ఓ.కె. డన్. రేపు రండి ఆఫీసుకి. వివరాలు మాట్లాడుదాం…”

***

చాలా ప్రశ్నలకి సమాధానాలు వాళ్ళు చెప్పలేదు.

బ్రెయిన్ డెడ్ అయినవాడి శరీరం మళ్ళీ ఎలా పని చేస్తుంది? తన మెమొరీ వాడి బ్రెయిన్‍లో పెట్టినప్పుడు వాడు బతకాలి గదా! వాడు చనిపోతే మళ్ళీ ఎలా బతుకుతాడు?

ఇవన్నీ ఆలోచించే సమయం, విచక్షణ లేవు గౌతమ్‍రావ్‍కి.

ఒక్కసారి కూతురుకి ఫోన్ చేశాడు. ఆ తర్వాత అమెరికాలోని కొడుకుకి ఫోన్ చేశాడు. వారిద్దరి పేర రాసిన కొంత ఆస్తి, కంపెనీలు విల్లు తన లాయర్ విశ్వమూర్తిని పిలిచి ఇచ్చేశాడు. మిగిలిన డబ్బులో మూడు వందల కోట్లు క్రిప్టో మనీ లోకి మార్చాడు. బిట్ కాయిన్ సీక్రెట్ ఎకౌంట్ లోంచి వంద కోట్లు అమృత రెజునివేటింగ్ సర్వీసెస్‍కి ట్రాన్స్‌ఫర్ చేశాడు.

మొబైల్ ఫోన్ లోని ఏప్‍లో ఒక్క క్లిక్ చాలు. ఈ జీవితం ముగిసి మరొక జీవితంలోకి ప్రవేశించడానికి.

***

ఒక్క ఉదుటన మెలకువ వచ్చింది గౌతమ్‍రావ్‍కి.

అస్పష్టంగా ఎదురుగా కనిపిస్తూ – ఫోకస్‍లోకి వస్తున్న తెల్లని గోడలు – నీలిరంగు దుస్తులు, క్యాప్‍లు ధరించిన నర్సులు, కొంచెం డెట్టాల్ లాంటి హాస్పిటల్ వాసన, మానిటర్‍ల బీప్ బీప్ ధ్వనులు.

“ఓ.కె., ఓ.కె. తెలివి వచ్చింది. లేచి కూర్చోండి. ఏం పరవాలేదు”

పొడుగ్గా తెల్లగా బలిష్టంగా వున్న డాక్టర్ లాంటి డ్రస్‌లో వున్న వ్యక్తి అతన్ని భుజాలు పట్టుకుని లేపి కూర్చోబెట్టాడు.

“నేను డాక్టర్ ప్రభుని, అమృతా రెజునివేటింగ్ సర్వీసెస్. మీరు కొత్త శరీరంలోకి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. ముందు డ్రెస్ వేసుకోండి!”

ఒక నర్స్ అతనిని లేచి నిలబెట్టి హాస్పిటల్ గౌన్ ధరింపజేసింది. చేతికి అండర్ వేర్, సూట్ షర్ట్ ఇచ్చింది.

“నడవండి, ఏం కాదు”

గౌతమ్‍రావ్‍కి ఇప్పుడు అంతా స్పష్టంగా కనిపిస్తోంది. తను హాస్పిటల్‍లో మెమెరీ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుని కొత్త శరీరంలోకి ప్రవేశించాడు! సందేహం లేదు. బలంగా ఉంది. చేతులు దృఢంగా వున్నాయి. నడిచి అడుగులు వేశాదు. తూలడం లేదు. కొత్త శక్తి, కొత్త బలం, అవే జ్ఞాపకాలు.

“నేను గౌతమ్‍రావ్‍నేనా? థాంక్యూ డాక్టర్”

“మీ పేరు ఈ రోజు నుంచి గౌతమ్‍రావ్‍ కాదు. కాగితాలు, గుర్తింపు పత్రాలు వున్న ఫోల్డర్ ఇదిగో. మీ పేరు ఈ రోజు నుంచి మారిపోయింది. కొత్త జీవితం. కొత్త దేశానికి…”

గదిలోకి నల్ల సూట్లు ధరించిన వ్యక్తులు, సుమారు నలభై సంవత్సరాల మధ్య వయసు గల వాళ్ళు ప్రవేశించారు.

“సక్సెస్! మిస్టర్ గౌతమ్. మీరు ఇప్పుడు ముప్ఫై ఏళ్ళ యువకుడి జీవితంలోకి, శరీరంలోకి ప్రవేశించారు. మీ పేరు ఇప్పుడు ఉజ్జ్వల్ రావ్. మీకు గుర్తుండడం కోసం రావ్ తగిలించాం. ఉజ్జ్వల్, మీ ఎకౌంట్ నెంబర్, ఐడి కార్డులు, టికెట్లు అన్నీ లీగల్ – మీరు మరో జీవితం ఆరంభించండి. Enjoy!”

గౌతమ్… ఇప్పుడు… ఉజ్జ్వల్‌రావ్ తన వంక చూసుకుని, “డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడ?’ అని అడిగాడు.

***

ఆ తర్వాత కొన్ని నెలలు, సంవత్సరాలు కొన్ని క్షణాల్లా దొర్లిపోయాయి.

హోటల్ తాజ్ సముద్ర, కొలంబో, శ్రీలంక.

హోటల్ పెనిన్సులా, కౌలాలంపూర్.

హోటల్ రిసార్ట్స్, పటాకా, థాయ్‍లాండ్.

అందమైన యువతులు, శరీరాలు, మత్తు మందులు, శరీరమంతటినీ పులకింపజేసే బాడీ మసాజ్‌లు…

బీచ్‌లలో సాయంకాలాలు, పబ్‍లలో రాత్రులు.

తనకిష్తమైన మద్యాలు, వృద్ధాప్యం వల్ల తినలేని, తినకూడని మధురమైన పదార్థాలు, వంటకాలూ… మళ్ళీ అన్నీ చవిచూశాడు. అన్నీ తాగాడు. అన్నీ అనుభవించాడు.

ఇది అద్భుతం. నిలువుటద్దంలో తన ముఖం తాను చూసుకుంటే బలిష్టమైన కండలు తిరిగిన దేహం, గిరిజాల జుట్టూ, కొనదేరిన ముక్కు, అందమైన నేత్రాలతో, రోమన్ శిల్పంగా వున్నాడు.

రెండు సంవత్సరాలైన తరువాత – తాజ్ హోటల్ నాలుగో అంతస్తులో బాల్కనీలో సముద్రం కేసి చూస్తూ నిలుచున్నాడు. ఇలాంటి ఏకాంతం, తనలో మళ్ళీ ఎప్పటివో జ్ఞాపకాలు తిరిగి మెదడులో నిక్షిప్తమైనవి గుర్తుకొస్తుంటాయి.

పొద్దున్నే దీపం వెలిగించి, “దేవుని హారతి కళ్ళకద్దుకోండి డాడీ” అంటూ కూతురు నందిని ఎదురుగా కనిపిస్తుంది.

“టెల్ సమ్ బెడ్ టైమ్ స్టోరీస్” మనుమలు అడుగుతున్నట్లు…

“ఆరోగ్యం జాగ్రత్త డాడీ” ఫోన్‍లో కొడుకు గొంతు… ఎలా వున్నాడో ఇప్పుడు.

వీళ్ళు శరీరంతో బాటు జ్ఞాపకాలు కూడా చెరిపేస్తే బావుండేదేమో కదా.

అప్పుడు సంతోషం ఏముంది? చనిపోయి పునర్జన్మ ఎత్తడం లాంటిదే కదా. పోగొట్టుకున్నది వస్తే కదా ఆనందం. ఆ అనుభూతి లోనే థ్రిల్. ఇప్పుడు తాను తన కూతురు, కొడుకు కంటే కూడా యవ్వనవంతుడు. వాళ్ళెలా వున్నారో అనే ఆపేక్ష, బెంగ పోలేదు. ఇదీ ఒక రకమైన బాధే కదా!

మరో నిముషంలో మరొక జ్ఞాపకం తన మెదడులో మళ్ళీ అస్పష్టంగా వస్తుంటుంది.

ఒక చిన్న ఊరు, హైవే పక్కన. ఆరు చక్రాల ట్రక్ డ్రైవ్ చేస్తూ తాను. తనకి ఆ డ్రైవింగ్ ఎలా తెలిసింది?

ట్రక్ దూరంగా ఒక పార్కింగ్ మైదానంలో ఆపి, నడుచుకుంటూ తాను, ఒక చిన్న డాబా, దాని ముందు ముళ్ళ కంచె, వెనుక గులాబీ, మందారపూల మొక్కల వెనుక ఒక చిన్న డాబా ఇల్లు.

అస్పష్టంగా ఆమె. వంట ఇంట్లో వంట చేసుకుంటూ వుంది.

ఒక పిల్లవాడు హాల్లో మూడు చక్రాల సైకిల్ మీద గిరగిరా తోసుకుంటూ తిరుగుతూ…

మళ్ళీ ఆ దృశ్యం అస్పష్టమై… ఒకసారి ఆమెతో మాట్లాడుతూ వున్న దృశ్యం… మళ్ళీ ఒకసారి బెడ్‍రూమ్‌లో తన మీద చేయి వేసి… కళ్ళలోకి చూస్తున్న కాటుక కళ్ళు, నుదుటి మీద సిందూరం బొట్టూ మరింత దగ్గరగా, నల్లటి శిరోజాలు విరబోసుకున్న ఆమె తనని చుంబిస్తూ, తన మీద….

మైగాడ్… ఆ దృశ్యం మసకబారినా శరీరంలో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి, మిగిలిన అన్ని అనుభూతులకంటే గాఢమైనది.

మరొకసారి తాను ఎడారి రోడ్డులో ట్రక్ నడు నడుపుతూ…

రహదారి పక్కన ధాబాలో అర్ధరాత్రి మిరుమిట్లు గొలిపే వెలుగు… ఇంతలో తన తల మీద దృఢంగా తగిలిన దెబ్బ… దూరంగా తన ట్రక్, తన జీవితంలో తాను నమ్ముకున్న అనుచరి లాంటి ట్రక్ బోర్లాపడి మంటలలో దగ్ధం అయిపోతూ…

తర్వాత చీకటి.

అప్పుడప్పుడూ, ఈ జ్ఞాపకాల మధ్య తన అంటే గౌతమ్‌రావ్ కూతురూ, మనుమడు, కొడుకూ మాట్లాడటం… ఇవీ గుర్తుకు వచ్చేవి.

ఇవి తెలిసినవే. భరించగలిగేవి. ఆ ట్రక్, ఆ యిల్లు, యువతీ అవీ బాధాకరమైన స్మృతి చిత్రాలు.

రెండేళ్ళకి మళ్ళీ బయలుదేరాడు.

అమృత రెజువినేటింగ్ సర్వీసెస్ ఆఫీసు దగ్గర టాక్సీలో దిగి లోపలికి నడిచాడు. తన ల్యాప్‌టాప్, ప్రపంచ విజ్ఞానాన్ని అంతటిని నింపుకున్న కరవాణి ఐఫోన్ చేతిలోనే వుంది.

ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎంతనైనా ఖర్చు చేయచ్చు.

***

“నిజం చెప్పండి, మీరు ఎవరి శరీరంలో నా జ్ఞాపకాలని ప్రవేశపెట్టారో? అతనికి నిజంగా ఏక్సిడెంట్ జరిగి బ్రెయిన్ డెడ్ అయిందా? ఆ జ్ఞాపకాలు నన్ను ఇప్పటికీ బాధిస్తున్నాయి”

సిఇవో కొద్దిగా ఆసక్తి వున్నట్లు నటించి, “ఐయామ్ సారీ సర్!” అని కాలింగ్ బెల్ నొక్కాడు.

యువ డాక్టర్ ఒకరు, నర్స్ ఒకామె వచ్చారు.

“ఈయనకి, న్యూరోఆక్సీమాబ్ డోస్ 400 ఎంజి, న్యూరోసిటమ్ మాత్రలు డబుల్ ది డోస్ చేసి ప్రిస్క్రిప్షన్ ఈయండి!”

“సార్, ఆ మందుల డోస్ పెంచాము. మిమ్మల్ని ఈ జ్ఞాపకాలిక బాధించవు!”

“నో! నో! నో! నాకీ జీవితం విసుగనిపిస్తోంది. ఆ ట్రక్ డ్రైవర్ శరీరంలో నేను జీవిస్తున్నాను. అతని భార్య ఎలా వుందో, అతని కొడుకు ఎలా వున్నాడో అనిపిస్తుంది. ఈ సంఘర్షణలో నేను నలిగి పోతున్నాను. మిస్టర్ ధనూ, నన్ను ఆమె దగ్గరకి తీసుకెళ్ళండి. చూడాలని వుంది. నా కొత్త జీవితానికి అర్థం ఆమెనే! ప్లీజ్! నాకీ సాయం చేయండి. “

సిఇవో అమృత రెజునివేటింగ్ సర్వీసెస్ ధనూ బల్ల మీద చేతితో చరిచి గట్టిగా అరిచాడు.

“ఇంపాజిబుల్ మిస్టర్ గౌతమ్‌రావ్/ఎలియాస్ ఉజ్జ్వల్! అది మన ఒప్పందంలో లేదు. ఇక మనం ఈ సంభాషణని ముగించవచ్చు అనుకుంటున్నాను.”

“నో. నో. నో… నాకా ఎడ్రస్ ఇవ్వండి చాలు!” గట్టిగా అరిచాడు.

ఇద్దరు బౌన్సర్లలా వుండే దృఢకాయులు, గన్స్‌తో లోపలికొచ్చారు.

“మిస్టర్ ఉజ్జ్వల్. మీరు అడిగేది చేయలేం. అతి రహస్యమైన వ్యాపారం మాది. బిలియన్ డాలర్ల పెట్టుబడి. ఆదాయం కూడా బిలియన్స్ లోనే. మీరిలా అడిగితే మీకు ప్రమాదం తప్పదు. అది నా చేతిలో లేదు.”

బౌన్సర్‌లు ఇద్దరు ఉజ్జ్వల్ ఎలియాస్ గౌతమ్‌రావ్‍ని సమీపించి, హఠాత్తుగా చేతులు విరిచి పట్టుకుని గన్ నుదుటికి ఆనించారు.

“గెట్ అవుట్! నడు బయటికి!”

***

అంధకారం.

కిటికీలోంచి వచ్చే వెలుగు చార ఒక్కటే పగలు, రాత్రి తేడా తెలియడానికి సాయం. రూమ్‍లో ఒక పక్కన చిన్న టాయ్‍లెట్. ఉదయం బ్రెడ్, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీలు ఒక ప్లేటులో తలుపులో వున్న చిన్న తలుపు లోంచి ఇవ్వడం.

ఇలా ఎన్ని గంటలో గడిచిన తర్వాత తలుపు తెరుచుకుంది.

ఉజ్జ్వల్/గౌతమ్‌రావ్‌కి ఇప్పటికే శక్తి క్షీణించి మానసిక ధైర్యం కోల్పోయాడు.

లోపలికి వచ్చిన వ్యక్తి వృద్ధుడు. సూట్‍లో, తెల్లటి గడ్డాలు మీసాలతో, అతని వెనుక వైపు సాయుధ బాడీ గార్డులు.

“ఉజ్జ్వల్! మీరు అడిగే ప్రశ్నలు, ప్రవర్తన మన ఒప్పందంలో లేవు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాది బిలియన్ డాలర్ల వ్యాపారం. ఇక్కడ నుంచి మరో లెవెల్‍కి వెళ్ళబోయే సమయం! మీరు చేసే అల్లరి వల్ల మా బిజినెస్ ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకే ఈ జైలు!” కొద్దిగా నవ్వాడు.

“నేను ధనూ కంటే ఉన్నతమైన అధికారిని ఈ కంపెనీలో. నాపైన ఇంకా ఎందరున్నారో తెలియదు. అధునాతన టెక్నాలజీలు వాడి, అన్ని దేశాలల్లోనూ ప్రపంచవ్యాప్తంగా వున్న కార్పోరేషన్ మాది. మీరు ఎవరికీ రాని ఒక కొత్త జీవితం పొందారు. అది ఎంజాయ్ చెయ్యండి. మెదడులో భ్రమలు, బాధలు ఉంటే మందులు ఇస్తాం. ఓ.కే. మీ డబ్బు క్రిప్టోలలో వుంది. ఇంకా ఎన్నో మిలియన్ల డాలర్ల విలువ వుంది. మీకిష్టం వచ్చిన చోట నివసించవచ్చు. ఏమంటారు?”

ఉజ్జ్వల్‍కి తల తిరిగినట్లనిపించింది.

ఈ చీకటి గదిలో వుండడం కంటే ఏదయినా మంచిదే.

“ఓ.కే. సర్! నన్ను ఇక్కడ్ని నుంచి విడిపించండి. నా జీవితం నేను చూసుకుంటాను… ఒప్పందం ప్రకారమే నడుచుకుంటాను.”

“నీ మందులు డోస్ పెంచాం! తీసుకో!” అతని చేతిలో ఒక ప్యాకెట్ పెట్టారు. “ఇవి క్రమం తప్పకుండా మీకు పంపిస్తాం. వాడండి!”

ఆ తర్వాత బయట ప్రపంచంలోకి, స్వేచ్ఛలోకి అడుగుపెట్టాడు ఉజ్జ్వల్.

“ఇతనికి అతని బట్టలు, బ్యాంక్ ఎకౌంట్ పుస్తకాలు, అతని కంప్యూటర్ ఇచ్చి పంపించేయండి!” అని ఆజ్ఞాపించాడు ఆ వ్యక్తి.

ఉజ్జ్వల్/గౌతమ్ మళ్ళీ బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. కొన్నిసార్లు పిచ్చి ధైర్యం కంటే, ఇంగిత జ్ఞానం మెరుగు అనిపిస్తుంది అని తెలుసు అతనికి.

***

ప్రతి పది సంవత్సరాలకీ ప్రపంచం తీరు తెన్ను మారిపోతుంది. మనం ఊహించలేనంతగా కల్పించగలిగినా, అంతకంటే వేగమైన ఊహాతీతమైన పరిణామాలు జరుగుతాయి. గ్రహాంతరవాసులు దాడి చేస్తారనుకుంటే భూమిలోనే ఉపద్రవాలు కొత్తవి పుట్టుకొస్తాయి. కొత్త వైరస్‌లు, మహమ్మారులుగా వచ్చి మానవులపై దాడి చేస్తాయి.

విప్లవాలు వచ్చి ప్రపంచ దేశాల్లో సమసమాజం ఏర్పాడుతుంది అనుకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థే గెలిచి, ధనవంతులకీ బీదవారికి వ్యత్యాసం పెరిగి అపర కుబేరులు, అష్ట దరిద్రులుగా మానవజాతి విడిపోతుంది.

ఎలక్ట్రిక్ కార్లు, డ్రైవర్ లేనివి, ఉన్నవీ, అయస్కాంతపు దారులపై ఎగురుతూ ప్రయాణం చేసే మ్యాగ్‌లెవీ సిస్టమ్ రైళ్ళు వస్తే… శిలాజాల నుంచి వచ్చిన ఇంధనాల కొరత ఏర్పడి వాతావరణ కాలుష్యం నివారించడానికి సౌరశక్తిని వినియోగించి, పనిచేసే ఎయిర్‍పోర్టులు, విమానాలు, కంప్యూటర్లు, విరివిగా వచ్చాయి.

అయినా కాలుష్యం తగ్గలేదు. బీద దేశాలు బొగ్గుని ఉత్పత్తి చేసి వాడటం, పెట్రోలు, డీసెల్‍ని వాడటం పూర్తిగా తగ్గించలేకపోయాయి.

2070.భూమి అంతా ‘హరితగృహం’ (గ్రీన్‍ హౌస్) అయిపోయింది. మీథేన్, కార్బన్‍డైయాక్సైడ్ వాయువులు ఆకాశంలో పొరలుగా ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

ఒకసారి వరదలు, ఒకసారి టోర్నడోలు. ఒకసారి కరువు. భూమిలో ఆహారం అందించే పంటలు ఏదో రకంగా నాశనం అవుతున్నాయి.

కానీ ధనవంతుల దగ్గర క్రిప్టో కరెన్సీలు, గ్రహాంతర నౌకలు, లెక్క లేనంత సంపద, కొత్త విధాలైన వ్యాపారాలు…

ఉజ్జ్వల్‍ రావ్ ఇప్పుడు అరవై ఏళ్ళ వయసులోకి మళ్ళీ వచ్చాడు.

స్పెయిన్ దగ్గర ‘లా పాల్మా’ ద్వీపంలో దూరంగా కనిపించే నీలి సముద్రం, తెల్లని నురగలు, గాలికి తలలూపే పామ్ చెట్లు, వేసవి కాలపు మధ్యధరా సముద్రం ఎండకి ఎర్రగా మారిన ఒంటిరంగూ.

ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ‘లీ సోలై’ విల్లాలో ఉంటున్నాడు.

జీవితంలో యవ్వనం కావాలని కోరుకున్నాడు. వచ్చింది. కొడుకునీ, కూతురిని చూడడం వృథా. మళ్ళీ బంధాలూ, అనుబంధాలూ, బాధలూ, కన్నీళ్ళు.

‘వాళ్ళెలాగైనా తనను గుర్తు పట్టరు. పట్టినా, తన కొత్త రూపాన్ని ప్రేమించరు’

ఉజ్జ్వల్ తను ఎవరి శరీరంలో వున్నాడో ఆ వ్యక్తి భార్య కోసం, బిడ్డ కోసం వెళ్ళాలని తపించినా, ఆత్మలతో, శరీరంతో వ్యాపారం చేసే ఆ ‘మాఫియా’ లేక ‘నయా వ్యాపారస్థులు’ వీలుపడనీయలేదు.

వీలుపడనీయరు. ఆ జ్ఞాపకాలు తరిగిపోయాయి.మరుగున పడ్డాయి.తనకిచ్చిన మందుల ప్రభావం తో.

కాని ఎప్పుడో ‘సబ్‍కాన్షస్’ అంతరాత్మలోనో, తెల్లవారి REM నిద్రలోనో అవి దృశ్యాలుగా బాధపెడుతుంటాయి.

ఒక ‘కంపారీ’ తాగి, మళ్ళీ మందులు వేసుకుని పడుకుంటాడు. బ్యాంకులో, తరగని, ఎప్పటికీ పెరిగే క్రిప్టోలున్నాయి. డబ్బుకీ, సుఖానికీ కొరత లేదు.

కానీ ఈ కొత్త శరీరం కూడా మళ్ళీ వృద్ధాప్యం లోకి వస్తోంది. ‘లా పాల్మా’ ద్వీపవు క్రెడిట్ స్విస్ బ్యాంక్ ఖాతా పెరుగుతూనే వుంది.

కానీ… ఆ మధ్యధరా సముద్రపు వాతావరణం మాత్రం మారిపోతూనే వుంది.

ఏ రెండు మూడు గంటలో తప్ప, పగటి ఆకాశం ‘స్మాగ్’ లాంటి నల్లని కాలుష్యంతో నిండి వుంటుంది.

ఒకోసారి, స్తబ్ధంగా వుండే సముద్రం కూడా పొంగి ముందుకు వస్తోంది. కొన్నిచోట్ల ముఖ్యంగా భారతదేశంలో తీరప్రాంతాలలో జలప్రళయాలు, కెనడా లాంటి చలి దేశాల్లో కూడా భరించలేని ఉష్ణోగ్రతలూ, వేసవి కాలాలు. వాతావరణం మారింది.

మహా ధనవంతులు కొందరు ఇప్పటికే ప్రైవేట్ గ్రహాంతర నౌకలలో దూరగ్రహాలకి వెళ్తున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఎలా వెళ్తున్నారో తెలియదు. అప్పుడప్పుడూ పూర్వం ఎప్పుడో చనిపోయారనుకున్న ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.

…వాళ్ళిప్పుడెలా జీవించి వుంటారు? వుంటే 130 సంవత్సాల వయసు వుండాలి. ఎలా? ఎందుకుండదు? తనలాగే మరో శరీరాల్లోకి, పేరు మార్చుకోకుండా వున్నారేమో?

సీసైడ్ బార్‍లో, కంపారీ తాగుతూ టీ.వీ.వార్తలు చూస్తున్నాడు.

త్వరలో స్పెయిన్‍లో జలప్రళయ సూచనలు. కాలుష్య మరణాలు ఎక్కువయి అందరికీ ఆక్సిజన్ సిలిండర్లూ, మాస్క్‌లూ కంపల్సరీ చేసింది ప్రభుత్వం.

మరణాలు సంభవిస్తున్నాయి కాలుష్యంతో ఇండియా, చైనా, యూరప్, ఆఫ్రికాలలో… కానీ ఎవరూ పెదవి విప్పడం లేదు.

‘భూమి అంతం?’ అని స్పానిష్‍లో వున్న పతాక శీర్షికతో వున్న న్యూస్ పేపర్ చదువుతూన్నాడు ఉజ్జ్వల్.

అప్పుడే తన దగ్గర వున్న ఐఫోన్ మోగింది.

“మిస్టర్ ఉజ్జ్వల్, ఎలా వున్నారు!”

ఎప్పుడో విన్న గొంతు. ఏదో పరిచితమైన కాకి మళ్ళీ కా అన్నట్లు; రాబందు మళ్ళీ రెక్కలు టపటపా కొడుతున్నట్లు; నక్క ఊళ పెట్టినట్లు.

“మీరు నాకు తెలుసు. చాలా దశాబ్దాల కిందట! ఓ.కే.”

“ఓ.కే. ఓ.కే. మీ పేరు, ఏ విషయం చెప్పండి!”

“ఉజ్జ్వల్, ధనూ కె. మీనన్ పేరు ఏమయినా గుర్తు వస్తోందా?”

“ఎందుకు రాదు? కొత్త శరీరంలో నా ఆత్మని బంధించింది మీరే… ఈ నా ఒంటరితనాన్ని సుఖాలతో సృష్టించి ఇచ్చింది మీరే! ఇది ఒక పంజరంలా చేసింది మీరే!”

“ఏమిటి గౌతమ్‍రావ్ ఉరఫ్ ఉజ్జ్వల్ రావ్! కవిత్వం… కవిత్వం మాట్లాడుతున్నారు. మీరు వున్నారు, నేను వున్నాను. కొత్త శరీరాలు, పాత ఆత్మలు.. తెలుసుగా. కానీ వ్యాపారం అదే. కొత్త సమస్యలు కొత్త పరిష్కారాలు…

“షటప్! నాకు ఇంక జీవితం వద్దు. మళ్ళీ మరొక యవ్వనం వద్దు. సారీ! నన్ను ఈసారి సహజంగా చనిపోనీ…”

“మీరు మరిచిపోలేని ఆఫర్ చేస్తాను. ఓ.కే. వినండి!”

“వినను!”

“వింటారు. పడమటి దిక్కు కేసి చూడండి, బయటకు వచ్చి”

ఉజ్జ్వల్ బయటకు వచ్చి ఆకాశం కేసి చూశాడు.

***

ఆకాశం అంతా నీలంగా వున్నా, అక్కడక్కడా తెలిమబ్బులు తేలిపోతున్నా, పడమటి దిక్కున నల్లగా సుడులు తిరుగుతూ ధూళిమేఘాలు వ్యాపించి వున్నాయి. అవి సుడులు తిరుగుతూ, క్రమంగా ఆకాశం మధ్యలోకి వస్తున్నాయి.

“ఉజ్జ్వల్ రావ్! కాలుష్య ప్రళయం అతి దగ్గరలో వుంది. మీరు తెలివిగలవారు సార్. ఇంకా అర్థమయేటట్లు చెప్పనవసరం లేదనుకుంటాను. అతి త్వరలో, ఎలాన్ మస్క్ జూనియర్ ఏర్పాటు చేసే స్పేస్ ‘Z’ నౌక సుదూర కుజగ్రహపు కాలనీ లోకి ప్రయాణం అవుతోంది.

ఇదివరకటి నుంచి వున్న మా కస్టమర్‌గా మీకు దానిలో ప్రయాణం, టికెట్ డిస్కౌంట్‌కి ఇస్తాం. మీ దగ్గర ఆ డబ్బు కూడా వుంది. కొద్ది రోజుల్లోనే ప్రయాణం. ఓ.కే.”

ఉజ్జ్వల్ ఆలోచనకి ఆ ప్రతిపాదన అర్థం అవడానికి ఒక నిముషం పట్టింది.

“టికెట్ ఎంత?” బలహీనంగా అడిగాడు, ఇక తప్పదన్నట్లు.

“వన్‍వే, మిలియన్ డాలర్లు. మీరు మళ్ళీ తిరిగి రానక్కరలేదు. అక్కడికి వెళ్ళాక, డోమ్డ్ కాలనీలో వసతి, భోజనం, వినోదం ఖర్చులకి నెలకి వేయి బిట్ కాయిన్ల రూపంలో పదేళ్ళ పాటు తీసుకుంటాం”

“ఆ తర్వాత…”

బ్లూటూత్ ఇయర్ ఫోనులలో స్టాటిక్ చప్పుడు మాత్రమే వినిపించింది. ఆ తరువాత చిరునవ్వు.

“మీ గణాంకాల ఆధారంగా, మీరున్న శరీరపు జన్యు ప్రణాళిక ఆధారంగా మీరు పదేళ్ళ తరువాత వుండరు – అని ఖచ్చితంగా చెప్పగలం…”

ఈసారి ఉజ్జ్వల్/గౌతమ్‌రావ్ భయపడలేదు. కంగారు పడలేదు.

“ఔను. నాకర్థం అయింది. మరణం తథ్యం. వాస్తవం. కానీ నాకు మూడో శరీరం కావాలి! మళ్ళీ నన్ను మరో శరీరంలోకి ప్రవేశపెట్టడం మీకు అసాధ్యం కాదు కదా? వెల ఎంత? చెప్పండి” అరిచాడు.

స్పానిష్ ద్వీపం ‘లా పాల్మా’ ఖాళీ బీచ్‍లో ఆ అరుపు ప్రతిధ్వనించలేదు కానీ, బికినీలతో వనితలూ, ఈతదుస్తులతో నడుస్తున్న మగవారు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు.

“నాకు మూడో జన్మ కూడా కావాలి! కావాలి! ఎంత? ఎంత? ఎంత?” అని అరుస్తున్న అరవై ఏళ్ళ ఉజ్జ్వల్ అలా అరుస్తూనే వున్నాడు. సూర్యాస్తమయంలో ఏంబులెన్స్ వచ్చి అతనిని తీసుకువెళ్ళేదాకా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here