[box type=’note’ fontsize=’16’] గతం నుంచి బయటకు రాలేక, వర్తమానంలోకి రాలేక అద్భుతమైన లోకం లోకి తీసుకుపోయిన నవల గురించి వివరిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
[dropcap]‘మూ[/dropcap]డో సీత’ అని భువనచంద్ర గారు ప్రారంభించగానే మొదటిగా మొదటి సీత రామాయణంలో భారతీయులందరికీ సొంతమైన మనందరి ‘సీత’ గుర్తొచ్చింది. బాపు గారి అందమైన రెండు జెళ్ళ సీత రెండో సీత అనుకొన్నా. ఓహో ఇప్పుడు మూడో సీత కాబోలు అని మొదలెట్టాను.
గోదావరి జిల్లాలోని పెద్దపుల్లేటి కుర్రు అనే ఊర్లో ముగ్గురు సీతలు ఉన్నారు అన్నమాట. ఒక సీతకి పెళ్లి అవుతున్నప్పుడు ‘అప్పుడే పెళ్లి ఏమిటి’ అని మూడో సీత ఒక చిన్నపాటి విప్లవం లాంటిది చేస్తున్నప్పుడు ఈ కథ ప్రారంభమవుతుంది. కానీ ఈ మొదటి సీత పెళ్లి జరిగిపోయింది ఒక శఠగోపంగాడితో. రెండో సీత ఎస్.ఎస్.ఎల్.సి వరకు మూడో సీతని భరించిన పిచ్చి ముద్దు. లేనిపోని గొప్పలు చెప్పుకొని తృప్తిపడే బాపతు.
ఇక మన ‘మెగాస్టార్’ సీత ఎంత పాపులర్ అంటే తండ్రి లాయర్ సుబ్బారావు గారి ఇల్లు ఎక్కడ అని అడిగితే – ఎవరైనా ఒక్క క్షణం ఆలోచిస్తారేమో గాని అల్లరి పిల్ల సీత ఎక్కడ – అంటే ఠక్కువ చెప్పేస్తారు, అంత పాపులర్ మరి. పైకి రాక్షసి, పెంకి, ఘాటైన మిరపకాయ బజ్జీలా (తనకి చాలా ఇష్టం, బాగా లాగించేస్తుంది కూడా) కనిపిస్తుంది కానీ ‘సీత’ కూడా అక్షరాల అందమైన ఆ ఊరిలో ఆకుపచ్చని రామచిలకలా మెరిసిపోతూ వుంటుంది. ఆశ్రమంలో కొలువై ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిలా ఉంటుంది.
ఇంతకీ ఈ గడుగ్గాయి వయస్సు ఎంత? ఈ కథ చదువుతున్న యువతరం, మధ్యవయస్కులు, 60 ఏళ్ళ వాళ్ళు ఆలోచిస్తూ ఆలోచిస్తూ సీత చెప్తున్న ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్ళిపోతే కచ్చితంగా కాకపోయినా, దాదాపుగా తెలుస్తుంది అప్పుడు తన వయసు 70 ఉండవచ్చని. 65, 70 మధ్య ఉన్న స్త్రీలందరూ తమ తమ బాల్యంలోకి వెళ్లి ఆనందంగా ఆ రోజుల్ని తలుచుకొని ఆ అనుభవాలని, జ్ఞాపకాలని తలుచుకుంటూ ముసి ముసి గా నవ్వుతూ ఉంటారు అన్నది మాత్రం నిజంగా నిఝం.
సీత తన జీవితంలో జరిగిన ఘట్టాల్ని నిర్భీతిగా నిజాయితీగా నిఖార్సుగా, హిపోక్రసీ లేకుండా మన ముందుంచింది. అవేవీ వింతగా కనిపించవు. ఎందుకంటే అవి మనకు చిన్నప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగినవే.
భువనచంద్ర గారు కేవలం ఒక అల్లరి పిడుగు కథ మాత్రమే చెప్పారు నవ్వుకోవడానికి అనుకుంటే పొరపాటే. అందమైన తెలుగు పల్లెటూరి వాతావరణం, పండుగలు, పెళ్లిళ్లు, గాడి పొయ్యిలు, సరదాలు, వివిధ వృత్తులు కుటుంబాలన్నీ కలిసిమెలిసి జీవించడం, కక్షలు కార్పణ్యాలు లేకుండా బ్రతకడం, నాటకాలు వంటి కళారూపాలు, దెయ్యాలు పూనకాలు, పుకార్లు, సుడి దేవరా బొమ్మని తయారుచేసి పంబలి వాళ్ల చేత మాంథాత కథ చెప్పించటం లాంటి విద్యలు, సాహిత్య సంగీత ప్రక్రియలు,1960 నాటి రాజకీయాలు ఆర్థిక పరిస్థితులు (ఆర్థిక లెక్కలు, కొలతలు, దూరాల లెక్కలు) – ఒకరకంగా ఆనాటి తెలుగువారి జీవిత చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం తెలియాలంటే ఈ మూడో సీత కథని చరిత్రకారులు తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో. సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవహారిక విద్య సాంఘిక రంగాల్లో ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవో తెలుసుకోవాలంటే మూడో సీత నవల చదవాలి. కౌముది వెబ్ మ్యాగజైన్ లో 2017 జనవరి సంచిక నుండి జూన్ 2018 వరకు సీరియల్‌గా వచ్చిన నవల.
బ్రాహ్మల అమ్మాయే గాని ఎలాంటి అంటూ సొంటూ లేకుండా అన్నమయ్య చెప్పినట్టు బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అన్న సూత్రం అక్షరాల పాటిస్తున్నట్లు ఉంటుంది మూడో సీత. సుందరాచారి కొలిమి దగ్గరికి వెళ్లి అతను నేర్పుగా పలుగులు, కొడవళ్ళు, నాగలి కర్రులు చేసే విధానాన్ని గమనిస్తుంది. వాళ్ళ కొడుకు శేషాచారి తనకి బెస్ట్ ఫ్రెండ్ కూడాను. కుమ్మరి నర్సింలు ఇంటికెళ్లి సారె తిప్పాలని కూడా ఉత్సాహ పడుతుంది. వడ్రంగి నాగాచారి ఇంట్లో బాడితే పట్టుకొని చెక్కుతానని పట్టు పడుతుంది.
హైస్కూల్లో చదివేటప్పుడు క్లాస్మేట్స్ వేసుకొని నాజూకైన స్టైల్ చెప్పులు చూసి మోజు పడింది, కానీ త్వరలోనే అవి పుటుక్కున తెగిపోయే సరికి చెప్పులు కుట్టే సుబ్బన్న దగ్గరే ఇష్టంగా ఆకు చెప్పులు కుట్టించుకుంటుంది. శ్రీశ్రీ చెప్పిన సమస్త వృత్తుల సమైక్య చిహ్నాల్లో శ్రమైక జీవన సౌందర్యం గుర్తించిన చిన్నారి సామ్యవాది పెద్దయ్యాక ఎలా తయారవుతుందో చూడాలి. చిన్నప్పుడే అన్యాయాన్ని తొడగొట్టి ఎదిరించి చాచి కొట్టింది.
సామ్యవాదమే కాదు (స్త్రీవాదం పుట్టకముందే) ఆడ మగ పెంపకంలో తేడాలెందుకు, ఆడుకునే ఆటల్లో వివక్ష ఎందుకు అని గట్టిగా ప్రశ్నిస్తుంది వాళ్ళమ్మ భాగ్యలక్ష్మిని.
చట్టిముక్కు జోగారావు, కిర్రు చెప్పుల మధు, మెల్ల కళ్ళు పార్వతీశం, డొంకాడ వెంకట్రావు, మద్దిమత్తెన సుభాష్ బోసు తన ప్రాణ స్నేహితులు కదా – వాళ్లతో పాటు చెట్లెక్కి, తోటమాలిని బురిడీ కొట్టించి, మామిడి కాయలు కోస్తే, కబడ్డీ ఆడితే, చెరువులో ఈత కొడితే తప్పేమిటి? చెరువులో ఉన్న గేదె మీద ఎక్కితే అది బెదిరి పరుగుతీస్తే అందులో ఉన్న మజా మగపిల్లాడికి ఒకరకంగా ఆడపిల్లకు మరో రకంగా ఉంటుంది ఏమిటి? సైకిల్ మీద ఊరంతా తిరిగితే ఏమిటిట? పది సార్లు పచారీ షాప్‌కి అమ్మ పంపితే ఓ కాణీ కమిషన్ కొట్టేస్తే దాంతో ఫ్రెండ్స్‌కి పెసరట్లు కొనిస్తే తప్పేంటి కామ్రేడ్స్!
పండుగలు:
వినాయక చవితి అంటే ప్రకృతి పండుగ. పంటల దేవుడు వినాయకుడు. పత్రి, ఆకులు ఆయనకిష్టం. చేలకు మేలు చేసే ఎలుక ఆయన వాహనం. అలాంటి పండుగంటే పిల్లలకి హుషారు ఉత్సాహం వచ్చేస్తుంది కదా! సీత తన ఫ్రెండ్స్‌తో కలిసి గోనెసంచి భుజాన వేసుకొని జబర్దస్త్‌గా బయల్దేరుతుంది. వినాయకుడికి ఇష్టమైన వెలగ ఉమ్మెత్త గన్నేరు గోరింట, రేగ్గాయలు, పరిక్కాయలు, పులిచేరు పళ్ళు, పూలు పత్రితో పాటు, కనిపించిన అందమైన ఆకులన్నీ కోసేది. ఎందుకు అంటే వినాయకుడికి ఇష్టం అని దబాయించేది. పూజ పిండివంటలు కొత్తబట్టలు అంతా బాగానే ఉంది. కానీ సీతకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సాయంత్రం ‘చంద్రదర్శనం,నీలాపనిందలు’. ఇది గట్టిగా పట్టుకునేది. తను చేసే అల్లరి పనులు బయటపడితే దబాయించేది – ‘అన్ని అబద్ధాలే వినాయక చవితి రోజు చంద్రుని చూసిన ఫలితం నీలాపనిందలు’- అని. దసరా వేషాలవాళ్ళ వెంట మగ పిల్లలతో పాటు తిరిగితే తప్పు ఏమిటి అన్నది మూడో సీత మరో సూటి ప్రశ్న తల్లి భాగ్యలక్ష్మికి.
కేశవరావు వాళ్ళ నాన్న కణాతు బొంగుల్ని సన్నటి బద్దలుగా చీల్చి బాణాలకు వీలుగా తయారు చేసే వాడు. రంగులు కొట్టుకోవడం… ఎన్ని సరదాల దసరా! ఆ రోజుల్లో మాస్టార్లు పిల్లలతో పాటు ఇంటింటికి, “అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్ల వాళ్ళకు చాలు పప్పు బెల్లాలు” అని తిరగటం, పెద్దలు వచ్చి తినుబండారాలు, డబ్బులు ఇవ్వటం జరిగేది. జమ్మి చెట్టు శమీ పూజ, కుమారీ పూజ, పిండి వంటలు, కొత్త బట్టలు, ఉత్సాహమే ఉత్సాహం!
తర్వాత దీపావళి. సూరేకారం, గంధకం, రజను తెచ్చుకొని కాగితం ముక్కలు కొలతలు, గొట్టాలు తయారు చేయాలి. ఇవి మతాబులకి అన్నమాట. కింద వైపు పట్టడానికి బంకమన్ను పుట్టమన్ను కావాలి. జిల్లేడుమండల్ని బొగ్గుగా చేయాలి. ఆ పొడిని వస్త్రం కాయితం పట్టాలి. ఆ వచ్చిన బొగ్గు పొడిలో పాళ్ళ ప్రకారం సూరే కారం గంధకం కలపాలి. ‘ఫైరింగ్ టెస్ట్’ తప్పక చేయాలి. అందరూ కలిసి సమిష్టిగా ‘తయారు చేసుకోవడం’లో ఉన్న ఆనందం ఇప్పుడు వేల రూపాయలు తగలేసి శివకాశి నుండి తప్పించుకుంటే ఉంటుందా!
ఆ రోజుల్లో పల్లెటూర్లలో ఇంకా కరెంటు రాని పరిస్థితి. ఇక రేడియో రానేలేదు. నిజానికి వెయ్యేళ్ళలో రాని మార్పులు కేవలం గత 65 ఏళ్లలో జరిగాయి. భువనచంద్ర గారన్నట్టు “కట్టెల పొయ్యి నుంచి ఎలక్ట్రిక్ ఓవెన్ దాకా వచ్చిన మార్పులకి నేనే కాదు మీలోనూ ఎందరో సాక్షులు. మూడో సీత కల్పిత వ్యక్తి కాదు. కొంచెం అహం, కొంచెం పెంకితనం సీతకి పుట్టుకతో వచ్చిన గుణాలు. అద్భుతమైన గ్రాహక శక్తే కాదు పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకోవటం కూడా భగవంతుడు ఇచ్చిన అపురూపమైన వరం”.
ఈ రోజుల్లోలా మూడేళ్లు నిండీ నిండకుండానే కాన్వెంట్లో పడేయటం లేని రోజులవి. ఎంచక్కా ఐదేళ్ళు నిండాక పలక బలపంతో బళ్ళో కి వెళ్లడం ఒక పండుగ లాగా వుండేది. పాకబడి, మేడబడీ, ఆ తర్వాత ఫస్ట్ ఫారంలో చేరడానికి ఎంట్రన్స్ రాయడం. అప్పుడు గానీ ఇంగ్లీష్ మొదలయ్యేది కాదు. పెన్ను కూడా అప్పుడే కొని ఇచ్చేవారు తల్లిదండ్రులు. హై స్కూల్ లోకి వచ్చాక ఇంకో కొత్త కల్చర్.అదే ‘వాల్ రైటింగ్’. “దడిగాడువానసిరా” వంటివి. మనకి నచ్చని మేస్టార్ మీద గాని స్టూడెంట్ మీద గాని ఆకాశరామన్న పేరున గోడమీద ఎడంచేత్తో రాసేసి కసి తీర్చుకోవచ్చు అన్నమాట. వాల్ రైటింగ్ చాలా పవర్ఫుల్. ఒకసారి సీత కూడా తన ప్రమేయం లేకపోయినా అన్యాయంగా వాల్ మీదకీ తన పేరు ఎక్కిపోయింది. ఉడికి పోయింది. ధర్మం జయిస్తుంది అన్న సత్యాన్నినమ్మింది ధైర్యంగా. తన కోపాన్ని శాపాన్ని అందరికీ సమానంగా పంచింది మనసులో కసిగా. చివరికి తన నిర్దోషిత్వం నిరూపింబడింది. ఎవడు రాసాడో తెలివిగా కనుక్కుంది. శిక్షించింది. పక్కవాళ్ళకి అర్థం కాకుండా ‘క’ భాష లాంటి పాండిత్యం కూడ రావాలి సమయస్ఫూర్తిగా.
మూడో సీత ఫ్రెండ్స్ అందరూ దాదాపు మొద్దబ్బాయిలే. అందరూ కలిసి నడుస్తున్నప్పుడు ఒకరు పాఠం చెబుతుంటే మిగిలిన వారు వింటూ ఉండేవారు. దీనివల్ల అందరికీ వచ్చేసేవి పాఠాలు. అయినా పరీక్షల్లో కాపీ కొట్టడానికి సీత ఆపద్బాంధవురాలిగా ఉండనే ఉంది
సీత మరో ఫ్రెండు ‘నూకలు కూడా లేని సత్తినాణా’. (సత్యనారాయణకి సంక్షిప్త రూపం). సంచీలో ఇంటి నుంచి తెచ్చుకున్నవి తిండి బెల్లులో అందరూ పంచుకుని తినే కామ్రేడ్ల సంస్కృతి ఆనాడు ఉండేది. అలాంటిది ఒకనాడు ఎవరికీ పెట్టకుండా, ఎత్తుగా కనిపిస్తున్న సంచీని గట్టిగా పట్టుకొని ఉన్నాడు వాడు. ఎక్కడైనా పెడతాడేమోనని అందరూ కాచుకొని చూస్తే వాడు అస్సలు వదలడే. బడి వదిలిన తర్వాత వాడిని వెంబడించి తెలివిగా పట్టుకుని సీత. తీరా చూస్తే వాళ్ల చేతిలో పండిన మినుములే. వాటిని అమ్మి నూకల తెమ్మని వాళ్ళమ్మ చెప్పిందట. ఇంట్లో బియ్యం లేక రెండు రోజుల నుంచి అన్నం తిన లేదట. గోగు ఆకుల్లో పండు మిరప తొక్కు పప్పు నంజుకు తిన్నాం అని వాడు ఏడుస్తూ చెప్పగానే భోరున ఏడ్చింది సీత. అప్పట్నుంచి రోజు పెద్ద క్యారేజి తెచ్చేది తనతో పాటు వాడి కోసం కూడా. ఎస్. అవును. ఎస్ ఫర్ సీత.
సురభి నాటకాలు:
పెద్ద ఖాళీ స్థలంలో సరుగుడు వాసాలు వెదురు బొంగులతో ఇల్లు. పైకప్పులు రేకులతో పెద్ద హాలు. రేకుల గోడలు గేట్లు. బెంచీలు. రెండు నెలల మరి ఊర్లో సందడే సందడి. సతీసావిత్రి, హరిశ్చంద్రుడు, తారాశశాంకం, రాయబారం నాటకాలు. బళ్ళమీద లౌడ్ స్పీకర్‌లో ప్రచారం. పగలంతా పనులు చేసుకోవటం రాత్రికి వాళ్లే పాత్రధారులు. వాళ్లు ఉన్నన్నాళ్ళు సినిమా కలెక్షన్లు నిల్. నాటకాలు చూసి పిల్లలందరూ ఇళ్ళల్లో ప్రాక్టీసు చేయటం, కాంతారావు రాజనాల లాగా చీపురుపుల్లలతో యుద్ధాలు….. అందమైన బాలానందాలు.
చిల్లు కానీలు గుర్తున్నాయా? చిన్నప్పుడు చిల్లుకానీలు పాతిపెడితే డబ్బులు చెట్లు వస్తాయని, రోజూ నీళ్లు పోయడం గుర్తుందా ? అంతకుముందు దమ్మిడీలు.రూపాయికి 16 అణాలు. 2 అణాలు ఒక బేడ. 2 బేడలు ఒక పావలా.
మరి మానికలు వీసాలు? సెంటీమీటర్లు, గ్రాములు, సెకండ్లు గా మారిపోవటం! ఆచారాలు సంప్రదాయాలు మారిపోవటం, కాలక్రమేణా మార్పు సహజం అన్నట్టు చాలా సహజంగా చెప్తారు భువనచంద్ర. అలవోకగా చదివేసి నిజమే సుమా అని పూర్తి చేసేసి అలా గమ్మున ఉండిపోతాం. గతం నుంచి బయటకు రాలేక, వర్తమానంలోకి రాలేక అద్భుతమైన లోకం లోకి తీసుకెళ్ళి పోతారు.
మరో సున్నితమైన విషయం ‘పెద్దమనిషి’ అవడం. అసలే ఇక్కడ సీత. కానీ మనసు చాలా సున్నితం. (రచయిత చూద్దామా పురుషుడు.) సీత స్నేహితురాళ్ళం దరూ పెద్దమనుషులు అయిపోతున్నారు తన కూతురు గెడకర్ర లాగా పెరిగిపోతోంది అని భాగ్యలక్ష్మి దిగులుబడిపోతుంది. ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తారా రచయిత అని ఆతృతగా చూస్తాం. సీత మానాన సీత హాయిగా క్లాస్ బుక్స్‌తో పాటు లైబ్రరీలో పుస్తకాలు కూడా చదువుకుంటూ ఉంటుంది. ఒకసారి క్లాస్ పిల్లలందరినీ టీచర్లు “తమ్మిలేరు” ఎస్కర్షన్‌కి తీసుకెళ్తారు. అక్కడ భోజనాల దగ్గర సీత పెద్ద మనిషి అవ్వడం గమనించిన లేడీ టీచర్‌లు చాలా జాగ్రత్తగా బండిని తెప్పించి ఇంటికి తీసుకు వచ్చారు అని సింపుల్‌గా చెప్పడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటాయి. వాళ్ళ అమ్మ పెద్ద పండగ లాగే చేసింది. చిన్నప్పటి నుండి ప్రతిదానికి వత్తాసు ఇచ్చే ప్రియమైన తండ్రి వచ్చాడు. పరిగెత్తబోయిన సీతని వారించింది అత్త. ఆయన కళ్ళల్లో నీరు…… ఎందుకు! కూతురు తలపై చేయి నుంచి మౌనంగా ఏదో దీవించారు. ఎంత చక్కని సున్నితమైన వర్ణనాచిత్రం!
సీత తన 13వ ఏటనే, థర్డ్ ఫారంలోనే లైబ్రరీలో కొడవటిగంటి, శరత్ బాబు నవలలతో పాటు వేయిపడగలు కూడా చదివేసింది. ఆ రోజుల్లో యద్దనపూడి వాసిరెడ్డి మాదిరెడ్డి కోడూరి ద్వివేదుల ఇలా రచయిత్రులు ప్రభంజనంలా దూసుకొచ్చారు. బలిపీఠం చక్రభ్రమణం వంటి నవలలు వంటింటి ఆడవాళ్ళని సైతం చదువరులుగా మార్చివేయడం ఆనాడు రచయిత్రులు సాధించిన ఒక విజయం అని చెప్పుకోవాలి. స్త్రీల వ్రత కథలు, పతివ్రతల కథలు వంటింటిచిట్కాలు పరిధి దాటి లోకాన్ని చదవటానికి నాటి స్త్రీలు ఇష్టపడుతున్నారు – ఇదో గుర్తించాల్సిన మార్పు. సీత చదవడంతో ఆగకుండా వాటిని ఆకళింపు చేసుకుంది. గాంధీని కస్తూరిబాని, అహింసా సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంది. టిఫిన్ కొట్టు అతను భార్యను కొట్టి తరిమేశాడని తెలిసి ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సహాయనిరాకరణ చేస్తామని బెదిరించి దారికి తెచ్చింది.
రెండో సీత పెళ్ళి యద్దనపూడి హీరో లాంటివాడితో జరిగి పోయింది. మొదటి సీత పెళ్లి లోలా పెద్ద అభ్యంతరాలేం కనపడలేదు మూడో సీతకి. అందుకే ఆ పెళ్లి సరదాలనీ బాగా ఎంజాయ్ చేసింది. ఈ రోజుల్లోలా మేరేజ్ హాల్ నుండి అన్నీ బుకింగ్స్ లాగా కాకుండా ఆనాటి పెళ్లి పద్ధతులు అన్నిటినీ వర్ణిస్తారు భువనచంద్ర గారు.
చివరాఖరికి సీత ఎస్సెల్సీ పాసైంది. స్కూల్ ఫస్ట్ మాత్రమే కాదు, స్టేట్ సెకండే, కాదు హైయెస్ట్ స్కోర్ కూడా. “ఏదో సంబంధం వస్తే పెళ్లి చేసెయ్యాలి అనుకున్నా సీత నువ్వు ఇంకా చదవాలి చదివి గొప్ప దానివైతే ఆవిడ సీత తల్లి అని అందరూ అంటే వినాలి” అని అమ్మ చేత అనిపించుకుంది. తండ్రి చేయి ఎప్పటిలా ఆశీర్వచనంగా తల మీద ఆనింది.
కానీ మాదో విన్నపం సార్! ముళ్ళపూడి వారి బుడుగు ఎప్పటికీ అదే వయసులోనే ఉండి పోయి మా మనసులో శాశ్వతంగా నిలిచిపోయాడు. మొక్కపాటి వారి పార్వతీశం మొదటి భాగంలో మనల్ని అలరించినంతగా రెండోభాగంలో వయసు వచ్చాక అంతగా నవ్వించలేకపోయాడు. మూడో భాగంలో మరింత వయసు వచ్చాక…..!!! గిరీశంని కూడా ‘డామిట్’ అని గురజాడ వారు అక్కడే ఆపేశారు. ఎంతగా ఇష్టపడ్డా పొడిగించలేదు. మీరు మూడో సీతనీ యౌవన సీతగా తీసుకు వస్తామన్నారు. మేమూ ఎదురు చూస్తున్నాం. కానీ ఈ “తెలుగూస్” అచ్చమైన ఆడపడుచు రాక్సీ(రాక్షసి- షార్ట్ కట్), గోల్డ్ మా మూడో సీత లక్షణాలకి ఎక్కడా లోపం రాకుండా, మా మనసులకి లోటు కలక్కుండా – వీలైతే మరింత అల్లరి పిల్లగా – అబ్బాయిలని బాగా ఏడిపించి (ఇప్పటి 65,70 ల వారి బాల్యాన్ని గుర్తు చేసినట్టుగా) వారి యౌవన రోజుల్ని, ఎన్టీవోడు, నాగ్గాడు, కిష్టి గాడు సినిమాలు, ఘంటసాల బాలు పాటలు, వాణిశ్రీ కొప్పు, విప్పి చెప్పీ చెప్పని ప్రేమ తాలూకు మధురూహలు, ఇంకా బోల్డన్ని కబుర్లు గుర్తు చేస్తారని ఆశిస్తూ,
అభినందనలతో…