[box type=’note’ fontsize=’16’] “పాతికేళ్ళ కింద వచ్చిన ఈ యాత్రా చరిత్రను పునర్ముద్రించడం సాహసమేనని చెప్పాలి.ఈ యాత్రా కథనం డైరీ పద్ధతిలో కాకుండా ముచ్చట్లు చెప్పుకునే రీతిలో సరదాగా, ఆసక్తి కలిగించే విధంగా కొనసాగడం విశేషం” అంటూ ‘మూడు నగరాలు’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కె.పి. అశోక్‌కుమార్. [/box]
[dropcap]దే[/dropcap]శాలు తిరిగే షౌకు వున్నవాళ్ళకు, ఆఫీసువాళ్ళే పిలిచి విదేశాలు తిరిగి పనులు చక్కబెట్టుకు రమ్మంటే అంతకు మించిన అవకాశం వేరొకటి వుంటుందా? స్వామికార్యం స్వకార్యం రెండూ ముగించుకుని రావచ్చు. అది దాసరి అమరేంద్ర విషయంలో చూడవచ్చు.
కంపెనీ ఉత్తరాలు, రిటర్న్ టికెట్టు చూపి ఇబ్బంది లేకుండా జర్మన్ ఎంబసీ నుండి అమరేంద్ర వీసా సంపాదిస్తారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఒకటి వీసా ఇస్తే, మిగతా దేశాలన్నీ మరింత సులువుగా ఇచ్చేస్తాయట. వెళ్ళే దేశాల గురించి ఒక అవగాహన ఉన్నా, వెళ్ళడానికి రెండు మూడు వారాల ముందు నుండి ఆ దేశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, వివిధ వ్యక్తులతో మాట్లాడడం వలన ఏయే ప్రదేశాలు చూడాలి, ఎలాంటి విషయాలు పరిశీలించాలనే వాటి పట్ల రచయిత ఒక స్పష్టమైన అవగాహనను ఏర్పరుచుకుంటారు. దాంతో అక్కడ రోజూ తొమ్మిది గంటలు ఆఫీసు పనికి, పది గంటలు తిరగడానికి కేటాయించుకుంటారు.
ఉదయం తొమ్మిది గంటలకు ఢిల్లీ వదిలిన విమానం తొమ్మిది గంటల ప్రయాణం తర్వాత, రోమ్, అక్కడి నుండి గంటన్నరలో ఫ్రాంక్‌ఫర్ట్, అక్కడి నుండి మరో గంట ప్రయాణించిన తర్వాత మ్యూనిక్ చేరుకుంటారు. ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఎక్కిన జర్మన్ విమానం, ఇండియన్ ఎయిర్‌బస్‌తో పోలిస్తే, చిన్నదైనప్పటికీ ఎంతో అందంగా, పరిశుభ్రంగా వుందని గ్రహిస్తారు. యూరోపియన్ దేశాల్లోని భూగర్భ రైలు మార్గాల గురించి విని ఉన్నప్పటికీ, వాళ్ళ సమయపాలన, పనితీరు, శుభ్రత, వేగం గురించి జర్మన్ మెట్రో ద్వారా కలిగిన అనుభవం వల్ల తెలుసుకోగలుగుతారు. బయట తిరుగుతుంటే ప్రతీ ఇల్లు అప్పుడే కడిగి పెయింట్ వేసినట్టు తళతళ మెరుస్తూ వుంది. మాసిన గోడ కాగడాతో వెతికానా దొరకలేదని ఆశ్చర్యపడతారు.
జర్మన్‌లకు కార్లంటే మోజు. మ్యూనిక్ రోడ్లలో ఎక్కడా ఒక్క పోలీస్ అయినా కనిపించడు. అయినా అందరూ నియమ నిబంధనలతో ప్రవర్తిస్తూంటారు. కారు హారన్ ఎక్కడా వినిపించదు. లారీలు, ట్రక్కులు అన్ని వెపులా తలుపుపు బిగించుకుని ప్రయాణిస్తాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాళ్ళకు బాగా తెలుసు. అక్కడ ఆఫ్రికన్లు, ఆసియన్లు అతి తక్కువ అని, తాను గమనించిన జర్మన్ విశేషాలను తెలియజేస్తారు.
మ్యూనిక్ నుంచి పారిస్‌కి వెళ్ళిన రచయిత అక్కడ ఫ్రెంచ్ పౌరులుగా ఉన్న ఇండియన్స్‌తో భాషా సమస్యను ఎదుర్కుంటారు. పారిస్ నగరం గుండా ప్రవహించె సైన్ నది మీద ఉన్న ఎన్నో అందమైన వంతెనలు, ఓ పక్క ఐఫిల్ టవర్, మరో పక్క బృహత్తర ఆకాశ హర్మ్యాలున్న ఒక బిజినెస్ సెంటర్, పారిస్‌లోని నాటర్‌డామ్ చర్చి, పారిస్ థియేటర్ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్, చివరకు ఒక సెక్స్ షాప్‌ని కూడా సందర్శిస్తారు. ఆఫీస్ పనులను కూడా చక్కబెట్టుకుంటారు. రాత్రి పారిస్‌లొ రైలు ఎక్కి, ఉదయం లండన్‌లో దిగడానికి ప్లాన్ చేసుకుంటే, షాపింగ్ హాడావిడిలో రైలు తప్పిపోతుంది. దాంతో అక్కడే ఒక హోటల్‍లో విశ్రమించి, ఉదయం రైల్లో ప్రయాణించి ఇంగ్లీష్ ఛానెల్ దాటుతారు. రైలు దిగి ఓడ ప్రయాణం చేసి, మళ్ళీ అక్కడ రైలు ఎక్కి లండన్ నడిబొడ్దున దిగుతారు. అక్కడ వై.ఎం.సి.ఎ.లో దిగి ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్ షాపింగ్‌కి ఉత్తమమని తెలిసి బోలెడంత షాపింగ్ చేస్తే, ట్రావెలర్స్ చెక్కులు తీసుకోమంటారు. అప్పుడు అవి మార్చడానికి అంతా తిరిగి వచ్చేసరికి, ఆ డిపార్ట్‌మెంట్ స్టోర్ మూసివేస్తారు. చేసేది లేక అక్కడ ఉన్న చిన్న చిన్న షాపులలో అవీ ఇవీ కొనుక్కుని వస్తారు. తర్వాత లండన్ సైట్ సీయింగ్ బస్సులో ఎక్కి, ఆ మూడు గంటల్లో చూడదగ్గ ప్రాంతాలన్నీ, బస్సులో నుండి చూసేస్తారు. హైడ్ పార్క్ స్పీకర్స్ కార్నర్ లాండి బహిరంగ వేదికను, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌ను సందర్శిస్తారు. ఈసారి రూట్ మార్చి లండన్ – న్యూ హేవెన్ – డిప్పీ – పారిస్ చేరుకుంటారు. అక్కడి నుండి ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా ఢిల్లీ. మొత్తానికి ఆఫీసు పనిని, సైట్ సీయింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుని తిరుగుముఖం పడతారు.
చివరగా విదేశీ ప్రయాణాల గురించి, విదేశీయుల గురించి మనలో ఏర్పడిన అపోహలను తొలగించుకోవాలని, చివరన ఇచ్చిన వివరణ వ్యాసం బాగుంది. ఈ యాత్రా కథనం డైరీ పద్ధతిలో కాకుండా ముచ్చట్లు చెప్పుకునే రీతిలో సరదాగా, ఆసక్తి కలిగించే విధంగా కొనసాగడం విశేషం. పాతికేళ్ళ కింద వచ్చిన ఈ యాత్రా చరిత్రను పునర్ముద్రించడం సాహసమేనని చెప్పాలి.
***
(మ్యూనిక్ – పారిస్ – లండన్)
దాసరి అమరేంద్ర
ఆలంబన ప్రచురణలు, హెచ్.ఐ.జి 85, బాలాజీనగర్, కుకట్‌పల్లి, హైదరాబాద్ 500072.
పేజీలు:96, వెల: రూ.80
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు