Site icon Sanchika

మూగవేదన

[నంద్యాల సుధామణి గారు రచించిన ‘మూగవేదన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]ప్పుడే బ్యాంక్ నుంచి వచ్చిన ఆనంద్, షూజ్ విప్పి షూరాక్ లో పెడుతూ “పిల్లలేరీ? ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లారా?” అన్నాడు భార్య భావన వైపు చూస్తూ.

‘లోపలికొచ్చి మీరే చూడండి’ అన్నట్టు బెడ్ రూమ్ వైపు చేయి చూపుతూ ఏ భావం లేకుండా చూసింది భావన. కానీ, ఆమె కళ్లలో కొంత ఆందోళన కనిపించింది ఆనంద్‌కు.

పిల్లలు ఆడుకుంటున్నారేమోలే ననుకుని కాళ్లు, మొహం కడుక్కొని, టవల్‌తో మొహం తుడుచుకుంటూ, పడకగదిలోకి అడుగుపెట్టాడు ఆనంద్. పిల్లలిద్దరూ మంచం మీద ఒళ్లెరక్కుండా పడుకుని వుండటం, వాళ్ల నుదుర్లపై తడిగుడ్డలు వేసి వుండటం చూసి అదిరిపడ్డాడు.

“ఏమైంది భావనా! పిల్లలకు జొరం వొచ్చిందా? పొద్దున బానే వున్నారే! ఇంతలో ఏమైంది? నాకు ఫోన్ చెయ్యలేదెందుకు?” అంటూ ఆత్రుతగా మంచం పైన కూర్చున్నాడు. అతని కళ్లలో ఆందోళన, భయం, దిగులు ఒక్క పెట్టున ఉప్పొంగాయి.

“పెద్ద అమ్మలూ.. చిన్న అమ్మలూ.. ఏమైందిరా నాన్నా మీకు?” అంటూ ఇద్దరి తలల పైనా చేయి వేసి చూశాడు ఆనంద్.

ఇద్దరికీ ఒళ్లు పేలిపోతోంది జ్వరంతో.

“ఏమైందమ్మా? ఎందుకింత జొరం? పొద్దున బాగానే వున్నారు కదా?” అని ఆందోళన పడ్డాడు.

“ఇంత జొరం వొస్తే నాకెందుకు ఫోన్ చెయ్యలేదు. ..” కుర్చీలో కూర్చుని పిల్లల తలలపై ఐస్ నీటిలో తడిపిన గుడ్డలు వేస్తున్న తల్లి వైపు చూసి అడిగాడు ఆనంద్ బాధ నిండిన స్వరంతో.

“మరీ అంత కంగారు పడొద్దురా.. ఆనంద్ .. జ్వరం తగ్గి పోతుందిలే… ఆడుకుంటారని నీవు కొని తెచ్చావు చూడు.. వాటితో నిన్నా మొన్నా బాగానే ఆడుకున్నారు. ఈ రోజు అవి ఒకటి తర్వాత మరొకటి చనిపోయాయిరా.. అవి ప్రాణాలు వొదలడం కళ్లతో చూసి పిల్లలు తల్లడిల్లి పోయారురా.. ‘చందూ కావాలి.. నందూ కావాలి..’ అని పెద్దదీ, ‘నా చిట్టీ, బుజ్జీ చచ్చి పోకూడదు.. అవి నాకు కావాలి’ అని చిన్నదీ పొద్దున్నించీ ఒకటే ఏడుపు.

మళ్లీ వొస్తాయిలే అమ్మా .. ఇప్పుడు దేవుడి దగ్గరకెళ్లినాయి. దేవుడితో కాసేపు ఆడుకొని మళ్లీ మీ దగ్గరికే వొచ్చేస్తాయి. మీరు హాయిగా ఆడుకుందురులే.. అని ఎంత చెప్పినా వినరే.. ఒకటే ఏడుపు! హఠం! అన్నాలు కూడా సరిగ్గా తినలేదు పిల్లలు.

ఎంత మరిపించినా వినలేదురా.. సాయంత్రం నుంచి ఒళ్లు వేడి చేయడం మొదలైంది. ఎట్లాగూ ఈ రోజు నువ్వు త్వరగా వొస్తున్నావు కదా.. ఇంతలో కంగారుపెట్టడం ఎందుకని నీకు ఫోన్ చెయ్యలేదు” వివరంగా చెప్పుతూనే పెద్దపిల్ల సుప్రజ ఒళ్లంతా తడిగుడ్డతో తుడుస్తోంది ప్రమీలమ్మ. సుప్రజ, హిమజ ఇద్దరూ ఐదేళ్ల వయసు కవల పిల్లలు.

తల్లి చెప్పింది విని ఒక్కసారి షాక్‌కు గురైనట్టు అనిపించింది ఆనంద్‌కు.

భావన వైపు దిక్కుతోచనట్టుగా చూశాడు. ఆమె అతన్ని కళ్లతోనే అనునయించింది.

అతనికి ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. దుఃఖం ఒక్క పెట్టున ముంచుకొచ్చేస్తోంది. తను చేసిన తప్పేమిటో అర్థమయ్యేకొద్దీ తన మీద తనకే అసహ్యం వేస్తోంది.

తక్షణం చేయాల్సిన కర్తవ్యం గుర్తొచ్చింది.

వెంటనే తన స్నేహితుడు డాక్టర్ ప్రమోద్ కు ఫోన్ చేశాడు ఆనంద్.

“ప్రమోద్! పిల్లలిద్దరికీ హై టెంపరేచర్ వొచ్చిందిరా. నా వల్లేరా.. నేను చేసిన ఒక ఫూలిష్ పని వల్లనేరా.. అవన్నీ నిదానంగా చెప్తా. నీ నర్సింగ్ హోమ్‌కు తీసుకొచ్చేస్తున్నా. నా పిల్లల్ని నువ్వే కాపాడాలిరా..” దుఃఖంతో బొంగురుపోయింది ఆనంద్ గొంతు.

అవతలి వైపు నుంచి ప్రమోద్ ఓదారుస్తూ ధైర్యం చెబుతున్నాడు.

“సరే.. అక్కడికి వచ్చి మాట్లాడతాలే!” అని ఫోన్ పెట్టేశాడు ఆనంద్.

“భావనా! అమ్మా! పదండి ప్రమోద్ దగ్గరికి వెళ్లిపోదాం..” అంటూ కారు తాళాలు తీసుకుని బయటికి నడిచాడు ఆనంద్ .

“ఎందుకంత కంగారు పడతారు? ఈ కాస్త జ్వరానికి ప్రమోద్ గారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? పొద్దునకల్లా తగ్గిపోతుంది ఆనంద్.. క్రోసిన్ సిరప్ వేశాను లెండి ఇద్దరికీ. తగ్గకపోతే పొద్దున వెళ్దాం లేండి.”

అంటున్న భావనను వారిస్తూ..

“వొద్దు భావనా! తండ్రినై వుండీ నేను పిల్లల భావనలను, మనసులను దెబ్బతీసేలా, బాధ్యత లేకుండా ప్రవర్తించాను. నేను చేసింది చాలు! వాళ్లకు కనీసం మంచి వైద్యం అయినా చేయించనీ.. ఇప్పటికే నన్ను నేను క్షమించుకోలేక పోతున్నాను. ఇంకేం మాట్లాడకు! పద పోదాం!” అన్నాడు.

కాసేపట్లో భావన, ప్రమీలమ్మ ఆసుపత్రికి తీసికెళ్లాల్సిన సామానును సిద్ధం చేశారు. తామిద్దరూ దుస్తులు మార్చుకొని రెడీ అయి చెరొక పిల్లనూ ఒడిలో పడుకోబెట్టుకొని కారులో కూర్చున్నారు.

కారులో నిస్తేజంగా అమ్మ ఒళ్లో పడుకుని “బుజ్జీ.. చిట్టీ.. రండమ్మా.. ఎక్కడికి పోయినారమ్మా.. నన్ను విడిచీ.. ఊ.. ఊ.. ఊ.. ఊ.. నేను బాగానే చూసుకున్నా కదా.. మరి నా మీద మీకు కోపం ఎందుకమ్మా? ఊ.. ఊ.. ఊ.” అంటూ ఏడుస్తూ కలవరిస్తోంది హిమజ.

హిమజ నుదుట చిన్న ముద్దు పెట్టి “త్వరలో వొచ్చేస్తాయమ్మా.. దేవుడితో కొన్ని రోజులు ఆడుకొని నీ దగ్గరికి వొచ్చేస్తాయిలే.. మరి దేవుడు కూడా వాటితో ఆడుకోవాలి కదా..” అంటూ గొణిగింది భావన నిట్టూర్పు విడుస్తూ.

హిమజ చిట్టీ, బుజ్జీ కోసం కలవరించడం చూసి విచలితుడయ్యాడు ఆనంద్.

కాస్సేపటికి కారు నర్సింగ్ హోమ్ దగ్గరికి చేరుకుంది. కారులోంచి పిల్లలిద్దరినీ నర్సులు స్ట్రెచర్ మీద లోపలికి తీసుకెళ్లి, రూమ్‌లో బెడ్స్ పైన పడుకోబెట్టారు. అడ్మిట్ చేసుకున్నారు.

డాక్టర్ ప్రమోద్ పిల్లలను పడుకో బెట్టిన గదిలోకి రాగానే ప్రమీలమ్మకు నమస్కారం చేశాడు. భావనను చూసి పలకరింపుగా నవ్వాడు.

“అసలేమైందిరా..” అడిగాడు ఆనంద్‌ను డాక్టర్ ప్రమోద్ పిల్లలను పరీక్షించడం మొదలు పెడుతూ..

క్లుప్తంగా తాను చేసిన పొరబాటు గురించి చెప్పి.. “పిల్లలకేమీ కాదు కదా.. ప్రమోద్.. లేక లేక పుట్టిన పిల్లలురా.. ఎలాగో నువ్వే కాపాడాలిరా.. అంతా నీ చేతిలో వుంది రా..” రుద్ధమైన కంఠంతో అన్నాడు ఆనంద్ .

“అంత భయమేమీ లేదు ఆనంద్. చిన్న జ్వరానికే ఇంత ఆందోళనా? సెలైన్ పెడుతున్నాము. జ్వరం తగ్గడానికి ఇంజక్షన్ ఇస్తున్నాను. పసిపిల్లలు.. మృత్యువును దగ్గర్నుంచి చూసి షాక్ అయ్యారు అంతే.. మైల్డ్ సెడేషన్ కూడా ఇచ్చాను. నిద్రపోతే ఆ షాక్‌లో నించి కొంచెం తేరుకుంటారు. నెమ్మదిగా మరిచిపోతారు. ఒక్క గంటలో జ్వరం తగ్గుతుందిలే. పొద్దునకల్లా మామూలయిపోతారు పిల్లలు. దిగులుపడకు. నేను రాత్రి తొమ్మిది తర్వాత కలుస్తా.. ఇప్పుడు వేరే కేసులున్నాయి. మీకేమైనా అవసరమైతే సుశీలకు చెప్పండి” అంటూ నర్సును పరిచయం చేసి వెళ్లిపోయాడు డాక్టర్ ప్రమోద్.

వెళ్తూ.. వెళ్తూ వెనక్కి తిరిగి..

“ఇదేంటి ఆంటీ.. వీడు ఇంత పిరికిగా తయారయ్యాడు? పిల్లలకు కాస్త జ్వరం వొస్తే ఇంత కంగారా? ఎంత ధైర్యంగా వుండేవాడు? పైగా మా కాలేజీలో పెద్ద క్రికెట్ ప్లేయరు. ఇలా అయ్యాడేంటి? భావన మావాణ్ని బాగా భయపెట్టేసినట్టుందే..” అన్నాడు భావన వైపు చూసి చిలిపిగా నవ్వుతూ..

“నేనేం భయపెట్టేయ లేదు ప్రమోద్ గారూ.. పిల్లలు పుట్టాక ఎందుకో చాలా సెన్సిటివ్ అయ్యారు ఈయన. కారణం యేమిటో మాకూ అర్థం కావడం లేదు.. మీరే తెలుసుకుని మాకు చెప్పాలి” నవ్వుతూ అంది భావన ఆనంద్ వైపు ఓరగా చూస్తూ.

ఆనంద్ తనకా మాటలేమీ పట్టనట్టుగా గోడకు వేలాడుతున్న వెంకటేశ్వరస్వామి పటాన్ని తదేకంగా చూస్తూ వున్నాడు. ప్రమీలమ్మ చిన్నగా నవ్వుతూ వుండిపోయింది.

ప్రమీలమ్మా, భావనా పిల్లలిద్దరి మంచాల పక్కనా కూర్చుని, సెలైన్ ట్యూబ్‌లు పెట్టిన వాళ్ల చేతులు కదిలించకుండా పట్టుక్కూర్చు న్నారు. ప్రమీలమ్మ ఏదో స్తోత్రం ఆపకుండా చదువుతూనే వుంది.

భావన సాయిబాబా హారతి పాట ఫోన్‌లో చిన్న వాల్యూమ్‌లో వింటూ, తనూ పాడుతోంది.

మరో కుర్చీలో కూలబడ్డాడు ఆనంద్.

మూడు రోజుల క్రింద జరిగిన సంఘటనలన్నీ గుర్తొస్తున్నాయి అతనికి.

***

మూడు రోజుల కిందట ఓ రోజు బ్యాంక్ నుంచి ఇంటికి వొస్తుంటే.. ఒక నాలుగు చక్రాల బండి పైన రంగురంగుల కోడిపిల్లలను పెట్టుకుని అమ్ముతున్నాడొకతను. తను మోటర్ సైకిల్‌పై వొస్తూ ఆ బండి ముందు ఆగాడు.

“ఏం చేస్తారు వీటితో?” ఆశ్చర్యంగా అడిగాడు ఆనంద్.

“ఖరీద్ లీజియే సాబ్.. బచ్చే అచ్ఛీ తరహ్ ఖేలేంగే సాబ్.. మంచిగ ఆడుకుంటరు. పెద్ద ఖరీదు కూడా ఏం గాదు.. వందకు నాలుగు. యా బొమ్మలు ఇంత సస్తాగా వొస్తాయి సెప్పండి?” అన్నాడు వ్యాపారధోరణిలో.

“వీటిని ఎట్లా పెంచాలి? వీటికేం తిండి పెట్టాలి?” అన్నాడు ఆనంద్ ఆసక్తిగా.

“కుఛ్ నహీ ఖాసక్తే సాబ్.. తల్లి చాటున పెరగాల్సినవి. నాకు ఇంట్లో జరగక రంగులేసి అమ్ముకుంటున్నాను సాబ్. ఇవి రొండ్రోజుల కిందనే పుట్టినాయి. నీళ్లు పెడ్తే గిన కొన్ని తాగుతాయేమో.. అంతే! పిల్లోండ్లు ఆడుకుంటారు సాబ్.. వాటి ఎనకాల వురుకుతూ.. మూడు రోజులు బతికితే ఎక్కువ! ఫిర్ మర్ జాయేంగే..! చెత్తబుట్టలో యేసేయడమే! పర్ పిల్లగాండ్లు మస్తుగ ఎంజాయ్ చేస్తరు సాబ్..” ఉత్సాహంగా చెప్పుతూ పోతున్నాడు అమ్మే అతను.

ఆనంద్ కు ‘పిల్లలు ఎంజాయ్ చేస్తారు’ అనే మాట తప్ప ఏదీ మనసుకెక్కలేదు.

‘అవును.. కీ ఇస్తే ఆటలాడే బొమ్మల తోనే మైమరచిపోయి ఆడే తన పిల్లలు ఈ కోడిపిల్లలతో పరుగులు పెడుతూ ఆడుకుంటారు.. ఇందులో తప్పేముంది? జాగ్రత్తగా చూసుకుంటే కోడిపిల్లలు అలా పెరిగిపోతాయి.. చిన్నప్పుడు తమ ఇంట్లో కూడా కోడిపిల్లలు పెరిగేవి కదా.. అయినా అమ్మకు వీటినెలా పెంచాలో బాగానే తెలిసివుంటుంది’ అనుకున్నాడు ఆనంద్.

ఎరుపూ, పసుపూ, రోజా రంగూ, ఆకుపచ్చ రంగుల్లో వున్న నాలుగు కోడిపిల్లలను ఎంచుకున్నాడు ఆనంద్. చిన్నచిన్న రంధ్రాలు చేసిన పలుచని అట్టపెట్టెలో పెట్టి, పైన అటూ ఇటూ రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆనంద్‌కు అందించాడు అమ్మకందారు.

పిల్లలకు విశేషమైన కానుకను తీసుకెళ్తున్నట్టు ఆనందంతో తుళ్లిపడుతున్నాడు ఆనంద్ .

తామెన్ని ఏళ్లు ఎదురుచూస్తే పుట్టారీ పిల్లలు? ఎందరు డాక్టర్లు? ఎన్ని టెస్టులు? ఎన్ని మందులు? ఎంత నరకం అనుభవించింది భావన! పిల్లల కోసం ఎన్ని అవమానకర సన్నివేశాలను భరించారు తామిద్దరూ. ఎన్ని లక్షలు ఖర్చుపెట్టి ట్రీట్‌మెంట్ తీసుకుంటే తనకు లక్ష్మీపార్వతుల్లాంటి ఈ పిల్లలు పుట్టారు? వాళ్ల కోసం.. చేస్తున్న ఉద్యోగం కూడా మానేసింది భావన. మాతృత్వాన్ని సంపూర్ణంగా అనుభవించాలని అమ్మ తోడ్పాటుతో పిల్లల పనులన్నీ తనే సొంతంగా చేసుకుంటుంది.

***

పిల్లలు రంగులద్దిన కోడిపిల్లలను చూసి సంతోషంతో గెంతులేశారు.

“నాన్నా.. బలే మంచి బొమ్మలు తెచ్చావు నాన్నా..” అని సంబరపడిపోయారు.

వాటి వెంట పరుగులు పెట్టి ఆడుకున్నారు. చెరి రెండింటినీ పంచుకున్నారు. నందూ.. చెందూ.. అని సుప్రజ, చిట్టీ, బుజ్జీ అని హిమజ పేర్లు కూడా పెట్టుకున్నారు.

వాటిని ఎత్తుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు. ఒళ్లో పడుకోబెట్టుకున్నారు. వాటికి ఉయ్యాలలు కట్టి ఊపారు. ప్లేటులో అన్నం మెతుకులు పెట్టి తినమని బతిమలాడారు. కప్పులో నీళ్లు పోసి తాగమని వేడుకున్నారు. స్నేహితులకు చూపించారు.

తమ పక్కలో పడుకోబెట్టుకోని నిద్రపుచ్చాలని వాటికి జోలపాటలు పాడారు.

మొదటిరోజు వాటితో సరదాగానే గడిచింది. రెండో రోజు అవి కొంచెం బలహీనపడ్డాయి. పరుగులు మందగించాయి. మూలమూలల్లో ముడుక్కొని పడుకోవడం మొదలుపెట్టాయి. మూడో రోజు ఒక్కటొక్కటిగా ప్రాణాలు విడిచాయి.

తల్లి కోడి, గింజలో, పురుగులో యేవో నమిలి ఆ సారాన్ని వాటి నోటిలో విడిస్తే దాంతో కడుపు నింపుకోని, అమ్మ రెక్కల్లో దాక్కుని ఆత్మరక్షణ చేసుకొని, అమ్మ శరీరపు వెచ్చదనంతో బలం తెచ్చుకుంటూ, అమ్మ వెంట తిరుగుతూ, అమ్మ రెక్కల్లో ఒదిగి విశ్రాంతి తీసుకోవాల్సిన పసిగుడ్డులు అవి!

అవి పరిగెత్తుతూ వుంటే పిల్లలు తమను ఆడుకోవడానికి పిలుస్తున్నాయని అనుకున్నారు. అమ్మ కనబడక, దిక్కుతోచక వెతుక్కుంటున్నాయని పిల్లలకు తెలియదు. పెద్దవాళ్లకు తెలిసినా అర్థం కానట్టు నటించారు. అక్కడికీ ఇంకుఫిల్లర్ లాంటి దాంతో పాలు, నీళ్లు పోయడానికి ప్రయత్నించింది భావన. కానీ అవి సరిగా తాగలేక పోయాయి.

“అమ్మా.. నువ్వెక్కడున్నావమ్మా.. మమ్మల్ని వొదిలి ఎక్కడికెళ్లి పోయావమ్మా.. ఆకలేస్తుందమ్మా.. వీళ్లెవరో మమ్మల్ని ప్రేమగానే చూస్తున్నారు కానీ.. మాకు నువ్వే కావాలమ్మా.. అమ్మా.. పరుగులు పెట్టీ పెట్టీ కాళ్లు నొప్పులమ్మా.. నీరసంగా వుందమ్మా.. మన క్కొక్కొక్కొ భాష వీళ్లకు అర్థం కాదమ్మా.. మేమెంత చెప్పినా నవ్వుతారు కానీ, మా బాధను అర్థం చేసుకోరమ్మా! అమ్మా.. నువ్వొచ్చి మమ్మల్ని తీసుకుపో అమ్మా.. ప్లీజ్ అమ్మా…” అని అవి తల్లిని తలచుకుని తలచుకుని ఏడ్చి వుంటాయనిపించింది ఆనంద్‌కు.

అప్పటికే కసాయివాడి కత్తికి ఎరగా మారి పిడికెడు కూరగా మనుషుల కడుపులో కెళ్లిన.. లేదా వెళ్లబోతున్న నిస్సహాయురాలైన ఆ కోడి తల్లి ఏమనుకొని వుంటుంది? ఎంత శపించి వుంటుంది?

ఆ కోడిపిల్లల వేదనను తన మనసులో భావించిన కోడితల్లి ఎంత రంపపుకోతను అనుభవించి వుంటుంది? అతని మనసు కాసేపు ఆ కోడితల్లి మనసై పోయింది.

“నా చిట్టి పాపలూ! ఎక్కడున్నారమ్మా మీరు.. నా పిల్లలను ఈ పాడు మనుషులు ఎన్నింటినో గుడ్లుగా వుండగానే తినేశారమ్మా! మిమ్మల్ని ఎలాగో నేను పిల్లల రూపంలో చూసుకున్నాను. కానీ, అంతలోనే మిమ్మల్ని నా నుంచి విడదీసి, లేలేత మీ రెక్కలకు కర్కశమైన, మంట పుట్టించే రంగుల్ని అద్ది బండిలో తీసుకెళ్తుంటే నేనెంత ఏడ్చానో మీకు తెలియదు తల్లీ.. మనం మనుషుల చేతిలో కీలుబొమ్మలం అమ్మా.. వారు ఇష్టంగా తినే ప్రాణమున్న తిండిపదార్థాలం తల్లీ మనం! మనల్ని ఇట్లా పుట్టించిన భగవంతుడిని తలుచుకోండమ్మా.. అందరం పోయి ఆయన్నే అడుగుదాం పదండి!

‘మా జీవితం దారప్పోచ కంటే.. హీనం.. మా జీవితం దూదికణం కంటే తేలిక.. మా ప్రాణాలు ఇలా దుమ్మూధూళీ కంటే అల్పం.. ఎందుకు చేశావు తండ్రీ.. మేం చేసిన పాపం ఏమిటి? అని అడుగుదాం పదండి!

మీ అమ్మే నిస్సహాయురాలు.. మీ నాన్న కూడా అంతే! ఏ క్షణమైనా దోసెడు కూరగా మారుతాడు. పులావ్‌లో ముక్కలుగా మారిపోతాడు. మీ అమ్మ, నాన్న మిమ్మల్నేం కాపాడుకుంటారమ్మా.. తమను తామే కాపాడుకోలేని నిస్సహాయులమ్మా మీ అమ్మ.. నాన్న! మనం చంపబడి, ఈ మనుషుల ఆకలి తీర్చినందుకు స్వర్గానికే పోతామమ్మా! అక్కడికి పోయి.. ఈ మనుషులు జంతువులపై చేసే దురాగతాల నన్నింటినీ ఆ దేవుడికి చెబుదాం పదండి.. అంతకంటే మనం చెయ్యగలిగింది ఏముంది తల్లీ?

మనల్ని తినడమే కాకుండా మీలాంటి పసికందులను ఆట వస్తువులుగా కూడా మారుస్తున్న వీళ్లు నరరూప రాక్షసులు కాదా!

జంతువులారా! అందరం కలిసి మనల్ని పీడిస్తున్న మనుషులను శపిద్దాం రండి! మేకలు, గొర్రెలు, ఆవులూ, బర్రెలూ, గుర్రాలూ, కౌజుపిట్టలూ, పావురాలు, టర్కీలూ, చేపలూ, రొయ్యలూ మీరూ మాతో కలవండి” పిలుపు నిచ్చింది కోడితల్లి.

“మన గుడ్లను, మన పిల్లలను, మనల్ని తినేసి, మనపై జులుం చేసే ఈ మానవజాతి సమూలంగా నశించిపోనీ! బలం వుంది కదా అని అన్ని జంతుజాలాల జీవితాలపై స్వారీ చేసే ఈ మనుషులు భయంకరమైన ఎండలు కాసి మలమలా మాడిపోనీ! సునామీలు వొచ్చి ఈ మానవజాతి అంతా జలసమాధి అయిపోనీ! మా పిల్లల పట్ల వీళ్లు ఎంత అమానుషంగా ప్రవర్తించారో.. వాళ్ల పిల్లలకూ అలాంటి గతే పట్టనీ..! వాళ్లూ మాలాగా పుట్టి మనుషులూ, జంతువులకూ ఆహారమైపోనీ.. అప్పుడు తెలుస్తుంది.. మా బాధ యేంటో.. ఈ మనసు లేని మానవజాతి నుగ్గూ నూచమయి పోనీ.. అప్పుడే జంతువులన్నీ సుఖంగా వుంటాయి” నినదించింది కోడి తల్లి.

‌“అవును.. ఔనౌను.. మానవజాతి మాడి మసైపోవాలి.. మనలను ఇలా చంపుకొని తింటున్న మనిషి ఇంక బతకకూడదు. అడవులు అన్నీ మండిపోవాలి. ఇళ్లన్నీ తగలబడి పోవాలి. కొండలన్నీ పిండైపోవాలి. నదులన్నీ పొంగిపోవాలి” జంతువులన్నీ గోలగోలగా గొంతు చించుకున్నాయి.

“మా పిల్లలు తాగాల్సిన మా పాలన్నీ పిండుకొని తాగుతూ, మిమ్మల్ని కొట్టి బానిసలుగా తమ అదుపులో పెట్టుకునే మానవజాతి ఈ భూమ్మీద నిలబడ కూడదు. క్షయించిపోనీ.. ఈ జాతి…” తిట్టిపోస్తున్నాయి మరికొన్ని జంతువులు.

“వొద్దు.. వొద్దు.. వొద్దు.. అలా శపించవద్దు.. మమ్మల్ని క్షమించు కోడితల్లీ.. జంతువుల్లారా.. మీరంతా కూడా మమ్మల్ని మన్నించండి. మీ బాధను, దుఃఖాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు నేను చెయ్యను. తప్పు జరిగిపోయింది. తప్పు తెలుసుకున్నాను. అందరికీ ఇలాంటి పనులు తప్పని చెబుతాను.. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇంక తిట్టకండి.. వొద్దు..వొద్దు..” అంటూ కలవరించసాగాడు ఆనంద్ .

“ఏమైంది ఆనంద్? అలా వొణికిపోతున్నారు? ఏదేదో మాట్లాడేస్తున్నారేంటి? మీకు ఒంట్లో బాగుంది కదా? ఇంతలోనే అంత నిద్ర పట్టిందా? ఏదైనా పీడకల వొచ్చిందా? ఏమిటి మరీ ఇంత సింగినాదం బాబూ.. పిల్లలకు కాస్త ఒళ్లు వేడి చేస్తే ఇంత కంగారా?” అంటూ అతని నుదుటి మీద చేయి వేసి చూసింది భావన.

“నీకు తెలీదు భావనా! చాలా పెద్ద తప్పు చేశాం మనం. ఇంకెప్పుడూ ఇలా జంతువుల స్వేచ్ఛను హరించను. నాకు బుద్ధి వొచ్చింది. ఈ క్షణం నించీ నేను నాన్ వెజ్ తినడం మానేస్తున్నాను. పిల్లలకు కూడా పెట్టొద్దు. నువ్వూ.. అమ్మా.. తింటామంటే మీ ఇష్టం! మాంసాహారం మానడమే కాదు.. నేను వీగన్‌గా మారిపోతాను. అంటే జంతువుల నుంచి వొచ్చే ఏ ఆహారమూ తీసుకోను. పాలు, పెరుగూ, నెయ్యీ అన్నీ మానేస్తాను. కేవలం ప్యూర్ వెజిటేరియన్ ఆహారం మాత్రమే తింటాను” అన్నాడు ఆనంద్ దృఢనిశ్చయంతో.

“ఊరుకోండి ఆనంద్. మరీ అంతంత కఠినమైన నిర్ణయాలు ఆవేశంలో తీసేసుకోకండి. మరీ ఎమోషనల్ అయిపోయారు ఆనంద్. అలా మాట్లాడొద్దు ప్లీజ్..” అన్నది భావన అతని వీపు మీద చేతితో తట్టుతూ.

“పోనీ మాంసం తినడం మానుకుందామంటే అందరం మానేద్దాం. కానీ పాలూ, పెరుగులు ఎట్లా మానుతావురా? ఇంక తినడానికేముంటాయి?” అతన్ని అనునయిస్తూ అన్నది ప్రమీలమ్మ.

“ఆలోచిస్తే ఎన్నో మార్గాలున్నాయి! ఎన్నో తినొచ్చు. నా నిర్ణయం మారదమ్మా. ఇప్పటికి మనం జంతువులపై చేసిన జులుం చాలు! ఇకనైనా వాటి పాలను వాటి పిల్లలకు వొదిలేద్దాం! సోయామిల్క్, కొబ్బరిపాలు, బాదంపాలు వంటి వాటిని వాడుకుంటాను. ఇక జంతు సంబంధ ఆహారాలేవీ తినను అమ్మా.. నేను మిమ్మల్నెవ్వరినీ మానుకోమని చెప్పడం లేదు. నేను మాత్రం ఇంక ఏ జంతువునూ నా తిండి కోసం పీడించను” స్థిరనిశ్చయంతో పాటు పశ్చాత్తాపంతో కన్నీళ్లు తిరగగా అతని గొంతు వణికింది. ఇలా చాలాసేపు తను చేసిన తప్పును గురించి పరితాపం చెందుతూనే వున్నాడు ఆనంద్ .

జ్వరం తగ్గిన సుప్రజ మంచం మీద లేచి కూర్చుంది.. హిమజ దిండుకు ఆనుకుని కూర్చుంది.

“నాన్నా.. నాన్నా.. చెందు, నందు చచ్చిపోయాయి నాన్నా.. అమ్మ గోడ అవతల పిచ్చి చెట్లలోకి విసిరేసింది వాటిని. నేనూ, హిమజా కూడా అట్లాగే చచ్చిపోతామా నాన్నా..? మమ్మల్ని కూడా అమ్మ అట్లా పడేస్తుందా నాన్నా..” అని సుప్రజ అంటూ వుంటే..

“ఛ ఛ ఛ.. అవేం మాటలు తల్లీ.. అలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా..” అని నోరు చేత్తో మూసేశాడు ఆనంద్.

తండ్రి చేతిని తన వేళ్లతో తొలగిస్తూ.. “నువ్వూ, అమ్మా, నాన్నమ్మ అందరూ చచ్చిపోతారా.. నాన్నా.. చనిపోయేటప్పుడు తల ఇట్లా ఊపుతారా.. చందూ అట్లాగే వూపింది నాన్నా..” అంటూ తన తల వూపుతూ చూపించింది సుప్రజ.

“ఇంకా చాలు తల్లీ.. నేను వినలేను. చూడలేను. కళ్లు మూసుకుని పడుకోండి.” అంటూ పిల్లలిద్దరినీ చెరొకసారీ తన రెండుచేతులతో గుండెకు హత్తుకుంటూ కళ్లు మూసుకుని మనసులో ఏవో నిర్ణయాలు వేగంగా తీసేసుకుంటున్నాడు ఆనంద్.

‘జంతువులను, పక్షులనూ సంరక్షించాలి. పక్షులకు బాల్కనీలో, కాంపౌండ్ గోడ మీద ఆహారం, నీళ్లు పెట్టాలి. బ్లూ క్రాస్ లాంటి సంస్థలకు సహాయం చెయ్యాలి. కుక్కల కోసం గేటు బయట నీళ్లు, ఆహారం పెట్టాలి. గోశాలలకు సహాయం అందించాలి. కాలనీలో చెట్లు బాగా పెంచాలి. కోతులను తరిమి వేయకుండా వాటికి తిండి పెట్టాలి. ఏ జంతువులూ ఆకలితో వుండకూడదు. అడవిలోని జంతువులను కూడా కాపాడుకోవాలి. పాములను చంపకూడదు. మానవుల్లాగా జంతువులూ సంతోషంగా, సుఖంగా బతకాలి. జంతు హింస లేని ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించాలి..’ ఇలా పరిపరి విధాలుగా సాగుతున్నాయి ఆనంద్ ఆలోచనలు.

అతని హృదయంలో జంతువుల పట్ల ప్రేమ కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. పశ్చాత్తాపం అతని హృదయాన్ని గంగాజలంలా కడిగి వేస్తోంది.

Exit mobile version